అసెంబ్లీ ఎన్నికల్లో తమ పూర్వీకుల ప్రాంతమైన కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండటంతో ఆ ప్రాంతవాసులు ఎంతో సంతోషపడుతున్నారు. అక్కడి ప్రజలు కేసీఆర్ రాకను ఆహ్వానిస్తున్నారు. ఆయన వస్తే తమ ప్రాంతం బాగుపడుతుందని ఆశపడుతున్నారు. మనది ప్రజాస్వామ్య దేశం. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. కేసీఆర్‌కు కామారెడ్డి ప్రాంతంతో పేగుబంధం ఉండటంతో ఇక్కడి నుంచి బరిలో నిలుచున్నారు.
రానే రాదనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి.. వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై.. బంగారు తెలంగాణే లక్ష్యంగా శ్రమిస్తున్న కేసీఆర్ అంటే దేశంలో తెలియని వ్యక్తి ఉండరు.
ఉన్నత స్థితిలో ఉన్న కేసీఆర్ పురిటిగడ్డ రుణం తీర్చుకోవడానికి ఈసారి కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఇదే విషయాన్ని పలు వేదికల మీద స్వయంగా కేసీఆరే చెప్పారు. కేసీఆర్ వస్తుండటం కామారెడ్డి ప్రజల్లో ఆశలను రేకెత్తిస్తున్నది. ‘కామారెడ్డికి నేనొస్తున్నానంటే నావెంట అనేకం వస్తాయ్’ అని ఇటీవల నామినేషన్ వేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ మాటలు విన్న ప్రజలంతా మన ప్రాంతానికి ఇక మహర్దశ పట్టినట్టేనని ఆనందానికి గురవుతున్నారు.
రాజధానికి సమీపంలోనే ఉన్నా సమైక్య పాలనలో గజ్వేల్‌లో ఆశించిన అభివృద్ధి జరగలేదు. ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించినా ఈ ప్రాంతం రాత మారలేదు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ప్రగతి, పచ్చని పంటలు, జలాలు కనిపిస్తున్నాయి. ఎట్లుండే గజ్వేల్ ఇప్పుడు ఎట్లయ్యింది అనిపిస్తున్నది. కేసీఆర్ రెండుసార్లు గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఈ ప్రాంతానికి మహర్దశ వచ్చింది. గజ్వేల్ ప్రాంతంలో లెక్కలేనంత అభివృద్ధి ఈ పదేండ్లలో జరిగింది. గ్రామాలు చాలా అభివృద్ధి చెందాయి. వ్యవసాయరంగంలో ఈ ప్రాంతంలో అద్భుత పురోగతి కనిపిస్తున్నది. మౌలిక వసతులు సమకూరాయి. ఈ అభివృద్ధే కామారెడ్డి ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తున్నది.
నల్ల బెల్లం తయారీలో కామారెడ్డి పేరుగాంచింది. బీడీ పరిశ్రమకు నిలయం ఈ ప్రాంతం. కామారెడ్డి గంజ్ వాణిజ్యానికి పెట్టింది పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెయిరీ టెక్నాలజీ, ఫారెస్ట్ కోర్సులు ఒక్క కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీకాలేజీతో పాటు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో మాత్రమే ఉండేవి. 44వ నంబర్ జాతీయ రహదారి, రైల్వేమార్గం, వ్యాపార వాణిజ్య పరంగా రాష్ట్రంలోనే పేరుగాంచిన కామారెడ్డి ప్రాంతానికి అనేక అనుకూలతలున్నాయి. ఇక్కడ అనేక ప్రాంతాల ప్రజలు బతుకుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా మెడికల్ ఏజెన్సీలు ఇక్కడే ఉన్నాయి. అన్నిరకాల పంటలు పండుతున్నాయి. సారవంతమైన నేలలున్నాయి. చెరువులున్నాయి. దేశంలోనే ప్రముఖ కాల భైరవస్వామి ఆలయాల్లో ఒకటి కాశీలో ఉండగా..మరొకటి కామారెడ్డిలో ఉన్నది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తే కామారెడ్డి దశదిశ మారనున్నదని ప్రజలు ఆశిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణకు మద్దతుగా అప్పట్లో రాష్ట్రంలోనే కామారెడ్డి బార్ అసోసియేషన్ తొలి తీర్మానం చేసింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రజా గాయకుడు రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో తొలి ధూంధాం కార్యక్రమం కామారెడ్డి గంజ్ నుంచి ప్రారంభమై సకల జనులను ఉర్రూతలూగించింది. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసే క్రమంలో బీఆర్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్ కామారెడ్డి బ్రిగేడియర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ఉద్యమవ్యాప్తి కోసం చేపట్టే సభలు, కార్యక్రమాల నిర్వహణ కోసం విరాళాల సేకరణకు బీఆర్ఎస్ పూనుకోగా.. కేసీఆర్ కామారెడ్డిలో స్వయంగా కూలీపనిలో పాల్గొని మూటలు మోశారు. ప్రస్తుతం పట్టణంలో ఉన్న బాంబే క్లాత్ హౌస్ బట్టల షాప్‌లో, సిరిసిల్ల రోడ్లో ఉన్న దేశాయి బీడీ కంపెనీలో కేసీఆర్ మూటలు మోసి చెమటలు చిందించారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై పోలీసుల తొలి కేసులు కామారెడ్డి ప్రాంతంలోనే నమోదు కావడం విశేషం.
యనిగండ్ల అశోక్
99083 50676