ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఇటీవల జరిగిన భేటీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ భేటీ సందర్భంగా ఉక్రెయిన్ను లొంగదీసుకుని బేషరతుగా యుద్ధ విరమణకు జెలెన్స్కీని ట్రంప్‌తో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఒప్పించాలనుకున్నారు. కానీ, శాంతి చర్చలు అంటే యుద్ధం ఆపడం మాత్రమే కాదని జెలెన్స్కీ ఈ సందర్భంగా వారికి స్పష్టం చేశారు. యుద్ధం ఆపడం అంటే తమ హక్కులను కాపాడటమని, తమకు న్యాయం చేయడమని, తమ దేశ ప్రజలు సంతోషంగా ఉండటమని, అలాంటి శాంతిని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. అంతేకాదు, ఆత్మగౌరవాన్ని చంపుకొని శాంతి చర్చలు జరపలేమని తెగేసి చెప్పారు. జెలెన్స్కీ మాటలు విన్న నాకు నాడు తెలంగాణ జరిపిన ఆత్మగౌరవ పోరు స్ఫురణకు వచ్చింది.
తెలంగాణ అస్తిత్వంతో పాటు, జాతి ఆత్మగౌరవం కాపాడుకునేందుకు కేసీఆర్ చేసిన ఉద్యమం యాదికి వచ్చింది. అనేక సందర్భాలలో తెలంగాణ ఉద్యమం విడనాడాలని ఆనాటి ఆంధ్ర పాలక వర్గా లు, జెలెన్స్కీని అమెరికా అధ్యక్షుడు ట్రం ప్ తదితరులు బెదిరించినట్టుగా.. కేసీఆర్ పైనా అనేక ఒత్తిళ్లు, బెదిరింపులకు, వెన్నుపోట్లకు పాల్పడినప్పటికీ, అదరక బెదరక మొక్కవోని ధైర్యంతో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి వారందరినీ రాష్ట్రసాధనకై ఏకం చేసి మడమ తిప్పని ప్రజాస్వామిక యుద్ధం చేసి, ఢిల్లీ పాలక వర్గాల మెడలు వంచి తెలంగాణ సాధించిన ఆత్మ గౌరవ పోరాట యోధుడు కేసీఆర్. అయి తే, తెలంగాణ సాధనతోనే తన లక్ష్యం పూర్తయిందని అక్కడితో కేసీఆర్ ఆగిపోలేదు. సాధించిన తెలంగాణను అగ్రపథాన నిలబెట్టాలని సంకల్పించారు. అనుకున్నట్టే నిలబెట్టారు కూడా. తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదని ఎవరైతే అవమానించా రో, వారి ముందే తెలంగాణను సగర్వంగా నిలబెట్టారు. ఈ గడ్డ మీద ప్రేమ ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి.
ఇటీవల తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్.. ఏప్రిల్ చివర్లో జరగనున్న పార్టీ రజతోత్సవాలకు సంబంధించి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం తాత్కాలికమైనదని, తెలంగాణ ప్రగతి, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి శాశ్వతమని.. అదే బీఆర్ఎస్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం మనం అధికారంలో ఉండాలే గాని, పదవుల కోసం, అధికారాన్ని అనుభవించడం కోసం కాదని ఉద్భోదించారు. ముఖ్యంగా తెలంగాణను గెలిపించడం కోసం, తెలంగాణ ప్రజలను విజయతీరాలకు చేర్చడం కోసమే అధికారంలో ఉండాలని ఘంటాపథంగా తేల్చిచెప్పారు.
తెలంగాణ ఆషామాషీగా ఏర్పడలేదు. తెలంగాణ ఏర్పాటు వెనుక బలమైన ప్రజా పోరాటం, విద్యార్థి ఉద్యమం, అమరవీరుల త్యాగాలు, ఆత్మ బలిదానాలు, వీటన్నింటి కంటే ముఖ్యంగా అందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసిన కేసీఆర్ కృషి ఉన్నది. నాడు ఆయన మొండిగా నిలబడకపోయి ఉంటే ఇప్పటికీ తెలంగాణ కల సాకారం అయ్యేది కాదు. అనేక కష్టనష్టాలకోర్చిన తర్వాత స్వరాష్ట్రం ఏర్పడింది. అందుకే పోట్లాడి సాధించుకున్న తెలంగాణను పట్టుదలతో కేసీఆర్ 10 ఏండ్ల పాటు అభివృద్ధి పథంలో నడిపించారు.
తెలంగాణ సిద్ధించక ముందే స్వరాష్ట్రంలో సాధించాల్సిన ప్రగతి గురించి కేసీఆర్ మార్గదర్శకాలు రూపొందించారు. 2012లోనే కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు గురించి ప్రస్తావించడమే అందుకు తార్కాణం. గురుకుల విద్యాలయాల విధివిధానాలకు సంబంధించి అప్పట్లో కేసీఆర్ చెప్పిన విషయాలు, ఆయన మదిలోని ఆలోచనలను నేనే స్వయంగా వందల పేజీల వరకు గ్రంథస్తం చేశాను.
తెలంగాణ వస్తే పారిశ్రామిక విధానం ఎలా ఉంటుందనే విషయంపై 2011లోనే ఇండియా సీఈవో ఫోరం వాళ్లకు కేసీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ వస్తే పారిశ్రామికంగా ఏ విధంగా ఎదుగుతుందనే విషయమై దేశంలోనే టాప్ కంపెనీల సీఈవోలకు సమగ్రంగా వివరించారు. తద్వారా తెలంగాణ ఏర్పడితే పరిశ్రమలు రావనే అనుమానాలను పటాపంచలు చేశారు. నాడు చెప్పినట్టే అధికారంలోకి వచ్చాక తెలంగాణను అభివృద్ధి చేశారు. కేసీఆర్ తీసుకొచ్చిన పథకాల వెనుక ఒక లోతైన ఆలోచన, ఆర్ద్రత, ఒక అధ్యయనం, ఒక విజన్ ఉంటాయి.
తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి, ధూంధాం, బతుకమ్మ, నమస్తే తెలంగాణ, టీ న్యూస్ లాంటి ఐదు పాశుపతాస్ర్తాలను కేసీఆర్ తయారు చేసుకున్నారు. నాడు భారత స్వాతంత్య్రోద్యమంలో చరఖా, ఖాదీని గాంధీజీ ఆయుధాలుగా చేసుకున్నట్టే.. వీటిని కేసీఆర్ ఆయుధాలుగా మలుచుకున్నారు. బతుకమ్మ పండుగను ఉద్యమ పండుగగా, మన అస్తిత్వ చిహ్నంగా మార్చేశారు. తెలంగాణ తల్లిని రూపుదిద్ది
పల్లె పల్లెన ప్రతిష్ఠించి ప్రతి ఒక్కరిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు.
ఊరూరా ధూంధాం కార్యక్రమాలు ఏర్పా టు చేసి ప్రజల గుండెల్లో తెలంగాణ ఆకాంక్షను రగిలింపజేశారు. నమస్తే తెలంగాణ, టీ న్యూస్ మధ్యమాల ద్వారా తెలంగాణ వాణిని వినిపించారు. నాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన వీటన్నింటిపై నేడు రేవంత్ రెడ్డి కక్ష కట్టారు. గొంతు నులిమి చంపాలని చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ అస్తిత్వ పతాకగా నిలిచే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేశారు. బతుకమ్మను కనుమరుగు చేయాలనే కుట్రతో కొత్త తెలంగాణ తల్లి చేతుల నుంచి తొలగించేశారు. ఈ నేపథ్యంలో మన అస్తిత్వాన్ని సంస్కృతిని కాపాడుకోవాలంటే రజతోత్సవాల వేదికగా వీటిని పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈన కాచి నక్కల పాలైనట్టు.. అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ.. విధ్వంసకారుడైన రేవంత్‌రెడ్డి చేతిలో పడి ఇబ్బందులు పడుతున్నది. రేవంత్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అస్తిత్వంపై, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై, ఆత్మాభిమానంపై, చిహ్నాలపై దాడి చేస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏండ్ల పాటు కడుపున పెట్టుకొని, కష్టనష్టాలకోర్చి సాధించుకున్న ప్రగతిని వెనక్కి నెడుతున్నారు. ఆకాశమే హద్దుగా నింగిలోకి దూసుకెళ్తున్న అభివృద్ధిని రేవంత్‌రెడ్డి అధఃపాతాళంలోకి తొ క్కుతున్నారు. మతిభ్రమించి కేసీఆర్‌ను నిందిస్తున్నారు. గురుకులాలు నెలకొల్పి పే దింటి బిడ్డల భవిష్యత్తును హిమాలయ శిఖరాలకు చేర్చిన కేసీఆర్ పై మంచి, మానవత్వం మరిచిన రేవంత్ రెడ్డి అక్కసు వెళ్లగకుతున్నారు. పారిశ్రామికీకరణ ద్వారా తె లంగాణను తీర్చిదిద్ది లక్షల మంది యువతకు ఉపాధి చూపిన కేసీఆర్ గురించి నోటికొచ్చినట్టు వాగుతున్నారు.
ఈ ప్రాంతం పడ్డ కష్టాలను, ఈ గడ్డపై మమకారంతో కేసీఆర్ చేసిన కృషిని తలచుకోవాల్సిన సమయం ఇది. రేవంత్‌రెడ్డి చేతిలో ఆగమవుతున్న తెలంగాణను కాపాడుకునేందుకు మరో పోరాటానికి సమాజాన్ని సమాయత్తపర్చే అవసరమున్నది. అందుకు సరైన వేదిక రజతోత్సవాలు. తెలంగాణ విజయాల వెనుక ఉన్న కృషి, ఆర్ద్రత, విజన్, ఆలోచనలను రజతోత్సవాల వేదికగా తెలంగాణ సమాజానికి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజల పోరాటం, తెలంగాణ కోసం పడ్డ కష్టనష్టాలు, అందర్నీ సమీకృతం చేసిన కేసీఆర్ కృషి, రాష్ట్రం సాధించాక జరిగిన అభివృద్ధి, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు తదితర అంశాలకు రజతోత్సవాలు ప్రతిబింబం కావాల్సిన అవసరం ఉన్నది. పరాయి పాలకుల చెర నుంచి తెలంగాణ తల్లిని రక్షించేందుకు కేసీఆర్ సలిపిన పోరాటాన్ని రజతోత్సవాల వేదికగా యాది చేసుకోవాలి. రేవంత్‌రెడ్డి పాలనలో కూలిపోతున్న మన తెలంగాణ కలల సౌధాన్ని అక్కడి నుంచే మళ్లీ నిర్మించుకోవాలి. తెలంగాణను మళ్లీ గెలిపించుకొని, మనమూ గెలవాలి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ నాయకులు)
-దాసోజు శ్రవణ్ కుమార్