ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలన ఒక చీకటి యుగం. నాడు తెలంగాణ వెతలు అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా ఎవుసం కునారిల్లింది. ఉమ్మడి పాలకులు సవతి తల్లి ప్రేమను చూపడంతో చెరువులు, కుంటలు, కాలువలపై ఆధారపడి సాగు చేసుకునే తెలంగాణ రైతాంగం తల్లడిల్లింది. అప్పులపాలై వేల మంది అన్నదాతలు తనువు చాలించారు. నాటి చీకటి యుగాన్ని మరిచిపోయి కేసీఆర్ హయాంలో రైతన్నలు స్వర్ణయుగాన్ని అనుభవిస్తున్న సమయంలో కాంగ్రెస్ రూపంలో మళ్లీ ఉపద్రవం ముంచుకొచ్చింది. వస్తూనే నాటి చీకటి రోజులను మళ్లీ తీసుకొచ్చింది.
Telangana | స్వరాష్ట్రం సిద్ధించాక అధికారం పీఠమెక్కిన ఉద్యమ నేత కేసీఆర్ వెనువెంటనే వ్యవసాయంపై ప్రత్యేక దృష్టిసారించారు. మోడువారిన అన్నదాతల బతుకుల్లో వెలుగులు నింపేందుకు 25కు పైగా వ్యవసాయ సంబంధిత సంక్షేమ పథకాలకు అంకురార్పణ చేశారు. ఎవుసానికి 24 గంటల ఉచిత విద్యుత్తుతో మొదలైన ఈ పథకాల పరంపర మహాయజ్ఞంలా సాగింది. రైతుబంధు, రైతు భరోసా, కాళేశ్వరం జలాలు, చెరువులు, కుంటల పునరుద్ధరణ, పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ, రుణమాఫీ, నీటితీరువా రద్దు, ఎరువులు, నాణ్యమైన విత్తనాల పంపిణీ, సమీకృత మార్కెట్ల ఏర్పాటు, రైతు వేదికలు, గోదాముల నిర్మాణం, రైతు మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు, భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన తదితర కార్యక్రమాలను చేపట్టిన కేసీఆర్ సర్కార్ అన్నదాతల బతుకులను సమూలంగా మార్చేసింది. అంతేకాదు, గొర్రెలు, చేపపిల్లల పంపిణీ, పాడి రైతులకు ప్రోత్సాహం, సంచార పశువైద్యశాలలు, సబ్సిడీపై ట్రాక్టర్ల కొనుగోలు లాంటి కార్యక్రమాలతో వ్యవసాయ అనుబంధ రంగాల రూపమే మారింది. ఫలితంగా ఒకప్ప టి ఆకలికేకల తెలంగాణ దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగింది.
కేసీఆర్ ప్రభుత్వం అమలుచేసిన పథకాల మూలంగా 2014లో దాదాపు కోటి ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం.. 2023 నాటికి సుమారు 2 కోట్ల ఎకరాలకు చేరుకున్నది. 68 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న ధాన్యం ఉత్పత్తి.. 3 కోట్ల మెట్రిక్ టన్నులకు ఎగబాకింది. 9 ఏండ్లలో రైతాంగం బాగు కోసం కేసీఆర్ సర్కార్ రూ.4.50 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసింది. రైతుల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం.
వందల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కొత్తగా ఏమీ చేయకపోగా ఉన్న పథకాలకు ఎసరు పెట్టింది. రైతుబంధును ఎగ్గొట్టింది. రుణమాఫీకి కోతలు పెట్టింది. రైతుబీమాను అటకెక్కించింది. మొత్తంగా ఎవుసం నడ్డి విరిచేసింది. ఫలితంగా తెలంగాణ రైతాంగానికి సుస్తీ చేసింది.
అధికారంలోకి వచ్చాక రూ.41 వేల కోట్ల రైతు రుణాలున్నట్టు మొదట అంచనా వేసిన కాంగ్రెస్ సర్కార్ ఆఖరికి రూ.18 వేల కోట్లు మాత్రమే మాఫీ చేయడం అత్యంత దారుణం. రేవంత్ సర్కార్ నిర్వాకంతో రైతన్నలు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. రుణమాఫీ విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ పాలకులు రైతు భరోసాకు కూడా ఎగనామం పెట్టారు. కేసీఆర్ తీసుకొచ్చిన మరో అద్భుత పథకం రైతుబీమాను కూడా కాంగ్రెస్ ఆగం పట్టించింది. ఈ పది నెలల్లో మరణించిన ఏ ఒక్క రైతు కుటుంబానికి కూడా రైతుబీమా కింద నయా పైసా ఇచ్చిన పాపాన పోలేదు. కేసీఆర్ హయాంలో ధాన్యం కొనుగోళ్లు పండుగలా సాగేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. కోతలు మొదలైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించలేదు. బోనస్ బోగస్‌గా మారగా.. మద్దతు ధర కూడా దక్కడం లేదు.
తొమ్మిదేండ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం రైతాంగానికి ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నది. కష్టమన్నదే తెల్వకుండా రైతులు సాగు చేసుకున్నారు. కానీ, ఈ పది నెలల్లో అంతా తలకిందులైంది. నమ్మించి మోసం చేయడం తప్ప అన్నదాతలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు. రైతాంగం నోట్లో మట్టికొట్టిన రేవంత్ సర్కార్ తన అసమర్థత, చేతకానితనాన్ని నిరూపించుకున్నది. రైతుల కన్నీరు రాజ్యానికి మంచిది కాదు. కాంగ్రెస్ సర్కార్ పతనం ఖాయం. కర్షకుల కన్నీళ్లే అందుకు నాంది పలుకుతాయి.
బత్తిని మద్దిలేటి, 95509 24669
(వ్యాసకర్త: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి)