రెండు మూడు రోజుల క్రితం ఒక తెలుగు సినిమా రంగ ప్రముఖుడు మాట్లాడుతూ.. సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దని, కేటీఆర్ వ్యాఖ్యలు తనను బాధించాయని సెలవిచ్చారు. అల్లు అరెస్ట్ ఉదంతం, ఆ తర్వాతి పరిణామాలు, దానిచుట్టూ జరిగిన రాజకీయ సంవాదాలు గమనిస్తే సదరు ప్రముఖుడి మాటలు విడ్డూరంగా అనిపిస్తాయి. ప్రజలకు ఏమీ తెలియదని, తాము ఎంత చెప్తే అంతే అనుకుంటారని, ప్రజల జ్ఞాపకశక్తి స్వల్పమని అనుకుంటారేమో తెలియదు. కాబట్టి తమను రాజకీయాల్లోకి లాగవద్దని ఓ ప్రకటన ఇచ్చేశారు. ఆయన ప్రకటనలోని బేలతనాన్ని కాసేపు పక్కన పెడితే, ఈ సందర్భంగా అసలు సినిమాను రాజకీయాల్లోకి లాగిందెవరన్న ప్రశ్న ఉదయించక తప్పదు. ప్రత్యేకించి ఏపీ నుంచి నేటి వరకు సినిమాను రాజకీయం లాగిందా? లేదంటే రాజకీయమే సినిమాను లాగిందా? అన్నది ప్రశ్న.
సినీ రాజకీయాల కోసం, అసలు రాజకీయాలను ఆలంబనగా చేసుకుని మనుగడ సాగించిదెవరన్న విషయం చర్చకు వస్తుంది. ఈ వ్యాసం ఎవరినో కించపరచాలనో, లేదంటే జరిగిన, జరుగుతున్న పరిణామాలకు ఏ ఒక్కరినో బాధ్యుల్ని చేయాలనో కాదు. సమకాలీనంగా జరుగుతున్న అంశాలకు సంబంధించి చరిత్ర, వర్తమాన ప్రభావాలు ఎలా ఉన్నాయని చెప్పడమే దీని ఉద్దేశం.
స్వర్గీయ మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మొదలు నేటి పవన్‌కల్యాణ్ వరకు సినీరంగ రాజకీయ ప్రవేశం గురించిన విషయాలు సినిమాను రాజకీయంలోకి లాగిందెవరో విడమరచి చెప్తాయి. తమిళనాట సినిమా నటుల ప్రభావం రాజకీయాలపై గణనీయంగా ఉండేది. తెలుగునాట ఆ సంస్కృతి ఎన్టీఆర్‌తో బలంగా ప్రవేశించిందని అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు వారి ఆత్మగౌరవ పరిరక్షణ, ఢిల్లీ పెత్తనంపై చేసిన తిరుగుబాటును ప్రజలు స్వాగతించారు, ఆదరించారు. అక్కున చేర్చుకుని అధికారం అందించారు. రాజకీయ పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే తిరుగులేని ప్రజా నాయకుణ్ణి చేశారు. అయితే ఆ విజయానికి, అధికార అందలానికి దారులు పరచిన పెట్టుబడి మాత్రం సినీ గ్లామరే. ఆయన ఎన్నుకున్న అంశాలు ఇతరులెందరు ఎత్తుకున్నా ఆయన లాంటి విజయాన్ని అంత త్వరగా సాధించలేకపోయారనేది వాస్తవం.
రాముడిగా, కృష్ణుడిగా, పౌరాణిక పాత్రలే కాక, సాధారణ గ్రామీణ యువకుడి నుంచి జమీందారుగా, తెరపై ఏ పాత్రవేసినా ఆయన చూపించిన విలక్షణత తెలుగు ప్రజల మనసుల్లో ఒక బలమైన ముద్రవేసుకొని పోయింది. ఒక మహోన్నతుడనే భావనను కలిగించింది. అదే భావన ఆయన రాజకీయ రంగప్రవేశం, విజయాలకు సోపానమైంది. సినిమాను, దాని ద్వారా వచ్చిన ప్రతిష్ఠను ప్రజల భావోద్వేగాలతో రంగరింపచేయడం ద్వారానే ఆయన ముఖ్యమంత్రి స్థానానికి చేరగలిగారనేది నిర్వివాదాంశం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఆంగికం, వాచకం మార్చుకోలేదు సరికదా ప్రసంగాల్లో, వ్యవహారికంలో నాటకీయతను మరువలేదు. ఆ తరువాతి కాలంలో ప్రజాకర్షక పథకాలతో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పరిణమించిన అంశాలతో రాజకీయంగా ఉన్నతస్థానానికి చేరుకోగలిగారు. అది వేరు సంగతి. కానీ, నేటికీ ఆయనను స్మరించుకోవలసి వచ్చినపుడు తొలుత స్ఫురించేది మహానటుడు ఎన్టీఆర్ గానే.
ఎన్టీఆరే కాదు, ఆ తరువాత చిరంజీవి, పవన్‌కల్యాణ్ పాక్షిక విజయాలు అందుకున్నా, మోహన్‌బాబు, దాసరి, జయసుధ, జయప్రద, రోజా, రామానాయుడు, మురళీమోహన్, బాబూమోహన్, కోట శ్రీనివాసరావు, కైకాల, కృష్ణంరాజు, నాగబాబు, తమిళనాట విజయకాంత్, శరత్‌కుమార్, కన్నడనాట రాజ్‌కుమార్, అంబరీష్, సుమలత ఇంకా అనేకమంది నటుల రాజకీయ ప్రవేశానికి సినిమా పెట్టుబడి అయింది.
ఎన్టీఆర్ కాలంలో ఏఎన్నార్, కృష్ణలాంటి వాళ్లు రాజకీయంగా ఏదో ఒక పార్టీకి సన్నిహితంగా ఉన్నారు. కృష్ణ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. ‘నా పిలుపే ప్రభంజనం’ వంటి రాజకీయమే ప్రధాన అంశంగా సినిమాల్ని తీశారు. మోహన్‌బాబు బీజేపీకి ప్రచారం చేశారు. చిరంజీవి సినిమా పాపులారిటీనే పెట్టుబడిగా పెట్టి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి కేంద్రమంత్రిగా ఎదిగారు. ఆపై కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. పవన్ కల్యాణ్ కూడా అదే బాటలో పయనించి తెలుగుదేశం, బీజేపీ పొత్తుతో ఉప ముఖ్యమంత్రి అయ్యారు . అనేకమంది దర్శకనిర్మాతలు వివిధ రాష్ర్టాల్లో ప్రజాప్రతినిధులయ్యారు. వారందరికీ రాజకీయ రంగంలో తొలి పెట్టుబడి సినిమా పాపులారిటీనే. అదేమీ తప్పు కాదు. వివిధ రంగాల్లోఉన్నవాళ్లు ఒకస్థాయికి చేరిన తర్వాత ప్రజా జీవితంలోకి రావడానికి రాజకీయాలను ఎంచుకొన్నపుడు ఆయారంగాల్లో వారు సాధించిన పాపులారిటీనో, ప్రజామోదమో వారికి పెట్టుబడి అయింది. అయితే ఇవేవీ సినిమా పాపులారిటీకి సాటిరావు.
రాజకీయరంగ ప్రభావం లేకుండా సినిమారంగం ఎదగగలిగేదా అంటే, నిజానికి ఏ రంగానికైనా వెన్నుదన్నుగా రాజకీయ రంగం అవస రం. ఇక్కడ రాజకీయ రంగం అంటే, రాజకీ య పార్టీలే ప్రభుత్వాలను ఏర్పరుస్తాయి, ఆయా రంగాల అభివృద్ధికి విధాన నిర్ణయాలు తీసుకుంటాయి. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి చొరవ వల్ల తెలుగు సినిమా రంగం హైదరాబాద్‌కు తరలివచ్చి వేళ్లూనుకుంది. పార్టీలేవై నా ఆయా ప్రభుత్వాలు, ముఖ్యమంత్రుల చొరవతో తదుపరి ప్రయాణం కొనసాగించాయి.
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణలో సినిమా పరిశ్రమ దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందింది. పాన్ ఇండియా సినిమాల నిర్మాణానికి హైదరాబాద్ కేంద్రమైంది. దానికి తగ్గ అన్ని హంగులనూ కేసీఆర్ ప్రభుత్వం సమకూర్చింది. ప్రపంచం దృష్టిని ఆకర్షించి కలెక్షన్ల రికార్డులను తిరగరాసిన ఒక ‘బాహుబలి’, ఆస్కార్ అందించిన ఒక ‘ఆర్ఆర్ఆర్’, జాతీయస్థాయిలో ప్రేక్షకులను సమ్మోహితులను చేసిన ‘పుష్ప’ లాంటి చిత్రాలను తెలుగు సినీ పరిశ్రమ అందించింది. కేసీఆర్ హయాంలో చిన్న వివాదాన్ని కూడా సినీ పరిశ్రమ ఎరుగదు. ప్రభుత్వ ప్రమేయం, పర్యవేక్షణ అవసరం మేరకు జరిగింది. కరోనా సమయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలిచింది. తెలుగు మహాసభల నుంచి అనేక వేదికలపై సందర్భోచితంగా సినీ ప్రముఖులను గౌరవించుకున్నది. ఇండస్ట్రీ అవసరాల్ని తెలుసుకొని శక్తిమేర తీరుస్తూ వచ్చింది. అనవసర ప్రమేయం, ఉద్దేశపూర్వక ఒత్తిడిని ప్రోత్సహించలేదు. సినీ ప్రముఖుల మరణాల సమయంలోనూ ప్రాంతీయ భేదాలు చూపకుండా తన బాధ్యతను నిర్వర్తించింది. ముఖ్యంగా రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ సినీ పరిచయాల్ని రాజకీయంగా వాడుకోలేదు. సినిమాను రాజకీయాల్లోకి లాగలేదు.
ప్రత్యేక ఉద్యమ సందర్భం నుంచి నేటి వరకు సినిమా పరిశ్రమను ప్రాంత, భాష, యాస, భావభేదం లేకుండానే తెలంగాణ చూసింది. నటులెవరు? నిర్మాతలెవరు? దర్శకులు, ఎగ్జిబిటర్లు ఎవరనే వాటితో సంబంధం లేకుండా ఆదరించింది. సినిమాను సినిమాగా చూసింది. తెలంగాణ ఉద్యమానికి కారణమైన ఏ అంశాన్నీ సినిమా పరిశ్రమకు అన్వయించలేదు. ఆ దిశగా ఎటువంటి వివాదాలకు ఆస్కారమివ్వలేదు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన నటులు, కవులు, కళాకారులు కూడాఅదే పద్ధతిని అనుసరించారు తప్ప ప్రాంత పరమైన విషయాలను అవసరానికి వాడుకోలేదు. చిత్ర పరిశ్రమ గృహ నిర్మాణానికి సొంత జాగనిచ్చిన ప్రభాకర్‌రెడ్డి మొదలుకొని విలక్షణమైన విలనిజాన్ని పండించిన త్యాగరాజు, పౌరాణిక పాత్రలకు పేరుగాంచిన కాంతారావు, మాటలు, పాటల రచయితలు చంద్రబోస్, సుద్దాల అశోక్‌తేజ, మిట్టపల్లి సురేందర్, దర్శకులు శంకర్, సురేందర్‌రెడ్డి, వంశీ పైడిపల్లి, హరీశ్ శంకర్, బలగం వేణు ఇంకా అనేకమంది ఔత్సాహిక తెలంగాణ ప్రాంత నటీనటులు తెలుగు చలన చిత్రసీమకు తమశక్తిని ధారపోశారు, పోస్తున్నారు. తెలంగాణ గడ్డపై మొక్కగా స్థాపించబడి వటవృక్షాలై ఎదిగిన సారథి, అన్నపూర్ణ, రామానాయుడు, రామోజీ స్టూడియోల అభివృద్ధి ప్రస్థానాన్ని, తెలంగాణలో చిత్రపరిశ్రమ అభివృద్ధికి తలమానికం అనే భావించింది తప్ప ఇతరులవిగా భావించలేదు.
ఇక, అల్లు అరెస్టు ఉదంతానికొస్తే రాష్ట్రంలోప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ స్పందించింది. అతడి స్థానంలో మరే నటుడున్నా అలాగే స్పందించేవాళ్లం. సంధ్య థియేటర్లో జరిగిన దుర్ఘటనలో నేరుగా ఆయనొక్కడికే సంబంధం లేకున్నా అరెస్టు చేసిన విధానాన్ని ప్రశ్నించాం. ఇది ఒక వ్యక్తి హక్కులకు భంగం కలిగిన విధానాన్ని, ప్రభుత్వ ఏకపక్ష విధానాన్ని ప్రశ్నించిన వ్యవహారంగానే చూడాలి. చనిపోయిన మహిళ పట్ల, ఇంకా దవాఖాన లో ఉన్న శ్రీతేజ్ పట్ల బీఆర్ఎస్ సానుభూతి వ్యక్తం చేసింది, పరామర్శించింది. ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేసింది. విషయ తీవ్రతను సమాజం దృష్టికి తీసుకొచ్చిన తర్వాతే ప్రభు త్వం కార్యాచరణను వేగవంతం చేసిందనేది సుస్పష్టం. కానీ, ఘటనను మాత్రమే ప్రధానంగా చూపించి నటుడిని దోషిగా చూపించి వ్యవస్థాపరమైన లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందెవరు? జాతీయ మీడియా మొదలుకొని అసెంబ్లీ వరకు సదరు హీరోను మాత్రమే దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందెవరు? ఏ రకమైన చర్చ లేకుండా అన్ని రకాల స్పెషల్ షోలు, ప్రోత్సాహకాలను రద్దు చేస్తామని మాట్లాడి పరిశ్రమ వర్గాల్లో ఆందోళనా భావాన్ని కలిగించిందెవ రు? ఎమ్మెల్యే నుంచి అన్ని స్థాయుల నా యకులు ఇదే అంశాన్ని అడ్డుగా పెట్టుకొని రాజకీయ వ్యాఖ్య లు చేసిందెవరు? చివరికి ఈ అం శంలో ప్రాంతీయ భేదాల్ని ప్రస్తావించిందెవరు?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మొన్నటి చిత్ర పరిశ్రమతో సమావేశం వరకూ ఎన్నడూ ప్రభుత్వ పెద్దల సముఖానికి రాని సినీ పెద్దలు పొలోమని సమూహంగా వచ్చారంటే దయచేసి సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దని విన్నవించుకోవడానికేనా? మరిప్పుడు సినిమాను రాజకీయంలోకి లాగిందెవరు? ఈ విషయాలన్నీ నేడు ప్రజల్లో ఉన్నాయి. వీటన్నింటికీ కాలం సరైన రీతిలోసరైన సమాధానం చెప్తుంది.
కేటీఆర్ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఏడాది కాలం నుంచి ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నిస్తూ వస్తున్నారు. లగచర్ల గిరిజన సమస్యలైనా, ఆశా వర్కర్ల సమస్యలైనా, తెలంగాణ అస్తిత్వ అంశమైనా, ప్రతి వర్గానికి అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ విషయంలోనూ ప్రతిపక్షంగా హక్కులు, నిర్బంధం గురించే మాట్లాడారు తప్ప రాజకీయం చేయలేదు. విజ్ఞులమనుకొని కువిమర్శలు చేసే పెద్ద మనుషులు ఈ విషయం గమనిస్తే మంచిది. ప్రతిపక్ష బాధ్యత నిర్వహణను సదరు వ్యక్తులు గుర్తెరిగి మాట్లాడితే మంచిది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతూ ఉంటుంది. స్థానాలు, బాధ్యతలు మారుతుంటాయనే వాస్తవం గ్రహిస్తే మంచిది.అందువల్ల అర్థం కావలసిన విష యం ఏమంటే… సినిమాను బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లోకి లాగలేదు, లాగే అవసరమూ లేదు.
(వ్యాసకర్త: కార్పొరేషన్ మాజీ చైర్మన్)
-రావుల శ్రీధర్‌రెడ్డి