అగ్రవర్ణంగా పరిగణింపబడే బ్రాహ్మణ కులంలోని పేదలను దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లకు కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్నది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటుచేసి పేద బ్రాహ్మణ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. 2018-2023 వరకు ఏటా రూ.100 కోట్లు మంజూరు చేస్తూ పేద బ్రాహ్మణుల స్థితిగతులు మెరుగుపడటానికి దోహదపడింది. ఇతర వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలకు సాయపడినట్లే పేద బ్రాహ్మణులకు పలు రకాల పథకాలను ఆమలుచేసి వారి చీకటి బతుకుల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేసింది. వాటిలో విదేశీ విద్య కోసం అమలు చేసిన వివేకానంద ఓవర్సీస్ స్కీం ముఖ్యమైనది.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉండాలి. సమన్యాయం పాటించాలి. కుల ద్వేషం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం. కానీ, ప్రస్తుత అధికార పార్టీ నేతలు మాత్రం అందరి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని వేదికల మీద చెవులు కోసిన మేకలా అరిచి మరి ఉపన్యసిస్తూ అగ్ర వర్ణ పేదలను మాటలతో మభ్యపెడుతున్నారు. ఒక్క పైసా, అదీ ఎడమచేతితో కూడా విదిలించడం లేదు. పేపర్లలో ‘అన్ని కోట్లు ఇచ్చాం, ఇన్ని కోట్లిచ్చాం’ అని గొప్పగా చెబుతూ ప్రచారం చేసుకుంటున్నారు. కొట్టి ఏడ్చే వాడితో తిట్టి నవ్వే వాడితో నెగ్గడం కష్టం. ముఖ్యంగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ విషయంలో అత్యంత ఉదాసీనంగా వ్యవహరిస్తుండటం విచారకరం. ఈ పరిషత్ అమలు చేసే పథకాలను అటక మీదకు ఎక్కిస్తున్నారని వారి వ్యవహారశైలి తెలియజేస్తున్నది.
ఉదాహరణకు విదేశీ విద్యా పథకం కింద 2023లోనే మంజూరైన 300 మంది లబ్ధిదారులకు రెండున్నర సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా అందించిన దాఖలా లేదు. ఈ పథకం ప్రకారం ప్రతి విద్యార్థికి నిబంధనల మేరకు రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తారు. 2022-23లో అమెరికా తదితర దేశాలకు మాస్టర్ డిగ్రీ చేయడానికి వెళ్లిన విద్యార్థులు బ్యాంకుల్లో రూ.40 లక్షల వరకు లోన్ తీసుకున్నారు. వారి చదువు ముగిసింది. కానీ, దురదృష్టవశాత్తు అమెరికాలో ట్రంప్ విధానాలు విద్యార్థుల భవితవ్యానికి సవాలుగా మారాయి. పార్ట్ టైం జాబులు చేయనీయటం లేదు. దాదాపు 75 శాతం విద్యార్థులు నిరుద్యోగ నిర్వేదంలో ఉన్నారు. మూడు సంవత్సరాల కాలం ముగుస్తుండటంతో హెచ్-1బీ ఆధారిత ఉద్యోగాలు రాక, తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అమెరికా ప్రభుత్వ నియమాల ప్రకారం మూడు ప్రయత్నాల్లో కూడా హెచ్-1బీ వీసా రాకపోతే అక్కడ ఉండటానికి వీలుండదు. వారు తిరిగివస్తే అప్పులు తీర్చడం కష్టమవుతుంది. అందువల్ల విద్యార్థులు మరో కోర్సులో చేరుతున్నారు.
ఈ విధంగా ఉద్యోగాలు రాక, అప్పులు, ఈఎంఐలు చెల్లించలేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నరకం అనుభవిస్తున్నారు. కాబట్టి, ఈ లోపు రెండు సంవత్సరాల గ్రేస్ పీరియడ్ ముగియడంతో లోన్ తాలూకు ఈఎంఐలు ప్రారంభమయ్యాయి. దాంతో తల్లిదండ్రులు అతికష్టం మీద కడుతున్నారు. ఈ ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. కారణం బ్రాహ్మణులు ధర్నాలు చేయరు, కనీసం గట్టిగా అడగలేరు. గుండెలు మండుతున్నా, తామే కాలిపోతున్నా అంతా విధి లీల అని నిట్టూర్పులు విడిచే లక్షణం కలిగినవారు. వీళ్ల మనస్తత్వం ఎరిగిన హరీశ్‌రావు స్వయంగా చొరవ తీసుకొని ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాల ఒత్తిడి భరించలేక 2025 మార్చిలో రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి, రూ.50 కోట్లయినా ఇస్తామని మాట మార్చి, రూ.25 కోట్లు కేటాయించి, చివరకు మార్చి 21న రూ.12.5 కోట్లు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు నిధులు విడుదల చేశారు.
ఆ నిధులను అందరికీ సమానంగా పంపిణీ చేయాలని వైస్ చైర్మన్ శైలజ రామయ్యర్ నిర్ణయించారు. ప్రతి విద్యార్థికి రూ.4,30,000 అందిస్తామని చెప్పి బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో వేస్తామని హామీ ఇచ్చారు. కానీ, మూడు వారాలు గడిచిపోయాక ఆ నిధులను ఏలికలు తిరిగి వెనక్కి తీసుకోవడం శోచనీయం. ఇటీవల జూన్‌లో రూ.25 కోట్లు నిధులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అంతా సంబురాలు జరుపుకొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మనసున్న మారాజు అని కీర్తించారు. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఫొటోలకు అస్మదీయులు క్షీరాభిషేకాలు చేశారు. జూన్ పోయి ఆగస్టులోకి వచ్చేశాం. లబ్ధిదారుల ఖాతాల్లో ఇంతవరకు నగదు జమ కాలేదు. మళ్లీ ఆ ఫండ్స్‌ను వాపస్ తీసుకుంటారేమోనని విద్యార్థులు ఆందోళన పడుతున్నారు.
విదేశాల్లో విద్య కోసం వెళ్లిన బ్రాహ్మణ పేద విద్యార్థులకు అక్కడ అంట్లు తోమడానికి కూడా అనుమతి దొరకడం లేదు. అందాల పోటీలకు రూ.250 కోట్లు ఖర్చు పెట్టిన సర్కారు, కనీసం విద్యార్థులకు రూ.25 కోట్లు ఇవ్వడానికి వెనుకాడుతుండటం విచారకరం. అధికార పార్టీ బ్రాహ్మణుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తూ, వారి పట్ల గల కుల ద్వేషాన్ని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నది. బ్రాహ్మణులు కూడా నమాజంలో ఒక భాగమని పాలకులు గ్రహిస్తే మంచిది. బ్రాహ్మణులే కాదు, కులాలన్నిటి పట్ల ప్రభుత్వం సమన్యాయం పాటించాలి.
-వీవీ రామారావు