ఓవైపు అసెంబ్లీ ఎన్నికల నిరాశాజనకమైన ఫలితాలు, మరోవైపు రాజకీయంగా పెంచి పెద్దచేసిన నాయకులు కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వీడి చేసిన మోసపు గాయాలు.. అన్నింటికీ మించి కన్న కూతురిని అక్రమంగా అరెస్టు చేసి కటకటాలపాలు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇవేవీ ఉద్యమ సూర్యుడు కేసీఆర్‌ను కుంగదీయలేదు. సరికదా సరికొత్త ఉత్సాహంతో పార్టీ శ్రేణులను, కార్యకర్తలను మేల్కొల్పుతూ, ప్రోత్సహిస్తూ సాగుతున్న కేసీఆర్ బస్సుయాత్ర బీఆర్ఎస్ జైత్రయాత్రను, ప్రత్యర్థులపై దండయాత్రను తలపిస్తున్నది.
KCR | ఏడు పదుల వయసున్న కేసీఆర్.. తుంటి ఎముక గాయంతో బాధపడుతూనే తాను పోరాడి సాధించిన తెలంగాణ గడ్డపై అలుపెరగని యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రస్థానంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా, అలుపెరగకుండా బస్సుయాత్రను మహోద్యమంలా ముందుకు తీసుకెళుతున్నారు. అధికారంలోకి వచ్చిన కేవలం ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు జెండా ఎగురవేశారని కేసీఆర్ వెంట నడుస్తున్న లక్షలాది మంది జన ప్రభంజనం చెప్పకనే చెప్తున్నది.
జన హోరుతో, ప్రజా స్పందనతో మహానాయకుడు కేసీఆర్ బస్సుయాత్ర తెలంగాణలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ మహోద్యమంలా ముందుకు కదులుతున్నది. యావత్ తెలంగాణ సమాజాన్ని రాజకీయ శక్తిగా మలిచిన రాజనీతి దురంధరుడు, బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు, తెలంగాణ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర.. ప్రస్తుతం తెలంగాణలో రైతులు, యువత, మహిళలతో పాటు సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ చేసిన మోసాలేంటో స్పష్టంగా తెలియజేసేలా ఆలోచనలో పడేసింది. ముఖ్యంగా దళితు లు, రైతులు, బీసీలు, గిరిజనులు, మైనారిటీలు ఇలా పలు సామాజిక వర్గాలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఉపన్యాసాలతో ప్రజల హృదయాలను ఉప్పొంగేలా చేసిన మహా ఉపన్యాసకులు కేసీఆర్ పర్యటనతో రైతుల్లో రెట్టించిన విశ్వాసం పెల్లుబుకుతున్నది. ఏడు రోజులుగా సాగుతున్న కేసీఆర్ బస్సుయాత్రలో రైతులు వేలాదిగా పాల్గొంటుండటమే అందుకు నిదర్శనం. కాంగ్రెస్ పాలనలో కష్టాలపాలైన రైతన్నలు దారి పొడవునా కేసీఆర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.
మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో జరిగిన కేసీఆర్ రోడ్‌షోలకు అశేష జనవాహిని హాజరైంది. కేసీఆర్ రోడ్‌షోలు జరిగే ప్రాంతాలన్నీ రైతులతో కిక్కిరిసిపోతున్నాయి. పంటలు ఎండిపోయాయని, రైతుబంధు అందలేదని, రుణమాఫీ చేయలేదని రైతులు వాపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సబ్బండ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కేసీఆర్ బస్సు యాత్రలో భాగమవుతున్నారు.
గతేడాది నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అలవిగాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన బాసలను మర్చిపోయిన కాంగ్రెస్ పాలకులు తెలంగాణను ఆగమాగం చేశారు. ఫలితంగా బీఆర్ఎస్ పాలనలో పదేండ్ల పాటు సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ నేడు కరువు కోరల్లో చిక్కుకున్నది. నాడు ధాన్యపు రాశులతో కళకళలాడిన పంట పొలాలు నేడు సాగునీరు లేక ఎండిపోయి రైతుల కన్నీళ్లతో తడుస్తున్నాయి. దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఎవుసం ప్రస్తుతం నిరాదరణకు గురవుతున్నది. ఉమ్మడి ఏపీలో 58 ఏండ్ల పాటు తెలంగాణ ప్రజలను అష్టకష్టాల పాలు చేసిన కాంగ్రెస్ మళ్లీ అరిగోస పెట్టేందుకే గద్దెనెక్కింది. అందుకే గత ప్రభుత్వం అమలుచేసిన హామీలను పక్కనబెట్టడమే కాకుండా తాను ఇచ్చిన వాగ్దానాలపైనా నోరుమెదపడం లేదు. మాయమాటలతో, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను నిలువునా ముంచింది. ఆరు గ్యారెంటీలతో ప్రజలను ఏమార్చింది. నాలుగు నెలల్లోనే తెలంగాణను నాశనం చేసింది. అందుకే ఆరు గ్యారెంటీలు సహా 420 హామీలు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్‌పై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఆ పార్టీ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు.
ఆడబిడ్డల పెండ్లికి రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఆ ఊసే ఎత్తడం లేదు. ఈ ఐదు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష వివాహాలు జరిగాయి. వారిలో ఏ ఒక్కరికీ తులం బంగారం కాదు కదా, ఈసమెత్తు ఇనుము కూడా ఇవ్వలేదు. ఆడబిడ్డలకు బకాయిపడ్డ బంగారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి.
రైతుబంధు సంగతి సరేసరి. ఎప్పుడో నాట్లు వేసే సమయానికి పెట్టుబడి సాయంగా అందాల్సిన రైతుబంధు ఇప్పటికీ రైతులకు అందలేదు. రైతుబంధుపై ముఖ్యమంత్రి, మంత్రులు పూటకో మాట మాట్లాడుతుండటం విడ్డూరం. పైగా రైతుబంధు అడిగినవారిని చెప్పుతో కొట్టాలని ఓ మంత్రి పిలుపునివ్వడం సిగ్గుచేటు. యాసంగి పంట చేతికొచ్చినా అనేకమంది అన్నదాతలకు పెట్టుబడి సాయం అం దలేదు. అందుకే రైతుబంధు కోసం రూ.వేల కోట్లు కేటాయించి భరోసా కల్పించిన సంక్షేమ సర్కార్‌ను రైతులు తలుచుకుంటున్నారు.
రైతుబంధు అందించకుండా, సాగునీరు ఇవ్వకుండా రైతులను అరిగోస పెట్టిన కాంగ్రెస్ సర్కార్.. ఆఖరుకు ధాన్యం కొనుగోళ్లలోనూ అలసత్వం వహిస్తున్నది. అష్టకష్టాలు పడి పండించిన కొంచెం ధాన్యాన్ని అమ్ముకునేందుకు కర్షకులు నానా కష్టాలు పడుతున్నారు. గత ఇరవై రోజుల నుంచి కల్లాల్లోనే ధాన్యం ఆరబోసుకుంటున్నారు. ధాన్యం గింజ కొనే దిక్కు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. మరోవైపు రెండు దఫాలుగా రూ.30 వేల కోట్ల వరకు బీఆర్ఎస్ సర్కార్ రుణమాఫీ చేయగా.. అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాటమార్చింది. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని చెప్పి నేడు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామంటూ మరోసారి రైతులను మోసం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక రుణమా ఫీ ఊసే ఎత్తరనే విషయం అర్థమవుతున్నది.
ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని ఇప్పటికే అమలు చేశామని కాంగ్రెస్ అబద్ధాలు చెప్తున్నది. కానీ, ప్రతీ మహిళకు రూ.2,500, నిరుద్యోగ యువతకు రూ.4 వేల భృతి, రైతుభరోసా పేరిట రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు సాయం, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12,000, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పింఛన్లు పెంపు, ఆటో కార్మికులకు రూ.12 వేలు సాయం తదితర హామీలు ఇంకా అమలు కాలేదన్నది వాస్తవం. ఈ వాస్తవం ప్రజలకు కూడా తెలుసన్న విషయాన్ని కాంగ్రెస్ మరిచిపోయినట్టు ఉన్నది. కేసీఆర్ హయాంలో పరీక్షలు సహా అన్ని ప్రక్రియలు పూర్తయిన 30 వేలకు పైగా ఉద్యోగ నియామకాలను తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ చూడటం సిగ్గుచేటు.
కేసీఆర్ చతురతతో రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. సారే రావాలని, సారే కావాలని బస్సుయాత్రలో ప్రజలు కోరుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అత్యధిక స్థానాలు కట్టబెట్టి ఆశీర్వదిస్తామని ప్రజలే స్పష్టం చేస్తున్నారు. జన ప్రభంజనం మధ్య మహానాయకుడు కేసీఆర్ చేస్తున్న బస్సుయాత్ర చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఈ బస్సుయాత్రే విజయయాత్రగా మారడం తథ్యం. జయహో కేసీఆర్.