వ్యవసాయం మన దేశానికి వెన్నెముక. ఆ వ్యవసాయానికి ప్రాణం పోసే, ఊపిరులూదే వ్యవస్థ – సహకార రంగం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఎసీఎస్) రైతుల చేతుల్లో ఉన్న స్వయం ప్రతిపత్తి సంస్థలు. రైతు ఆర్థిక స్వావలంబన, గ్రామీణాభివృద్ధి, ఆహార భద్రత – ఈ మూడింటికీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మూలాధారం. ఇలాంటి సహకార సంఘాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2014-2023 మధ్య కాలం స్వర్ణ యుగం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిజమైన సహకారవాది కాబట్టి సహకార సంఘాల బలోపేతంపై దృష్టి సారించారు. సహకార చట్టం 1964 (ఆంధ్రప్రదేశ్)కు సవరణలు చేసి బలమైన చట్టాన్ని ప్రవేశపెట్టారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు బలమైన చట్టపరమైన స్వయం ప్రతిపత్తి గల చట్టాన్ని, సెక్షన్ 116-సీ అమలు చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పూర్తిగా ప్రభుత్వ శాఖల నుండి వేరు చేశారు. ఎన్నికైన బోర్డుల అధికారాలను పరిరక్షించారు. దేశంలోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు బలమైన స్వయం ప్రతిపత్తి ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ తన పాలనలో 3 శాతం వడ్డీకే పంట రుణాలు అందించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ వ్యవస్థలను బలోపేతం చేశారు. దీని ద్వారా రైతుల ఆర్థిక భద్రతకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కేంద్ర బిందువు అయ్యాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నష్టపోకుండా వ్యవసాయ రుణ మాఫీ చేసి, బ్యాంకింగ్ వ్యవస్థను కాపాడారు.
మల్టీ-సర్వీస్ సెంటర్లుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మార్చడంతో అవి సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ధాన్యం కొనుగోలు (ఎంఎస్పీ ద్వారా), సరుకుల సేవలను (పీడీఎస్) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అందించాయి. ప్రతి సంఘంలో గోదాము ఉండాలని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు చైర్మన్ గోవింద రాజుల చింతలను ఒప్పించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ఎంఎస్సీ) పథకం ద్వారా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. ప్రతి సంఘానికి సొంత భవనం, గోదాములు ఉండాలని ప్రభుత్వ స్థలాలు కేటాయించారు. ఎప్పుడూ లేని విధంగా సహకార సంఘాల రైతులకు రుణాలతో పాటు ఇతర అన్ని రకాల సేవలు అందించి సుమారు రూ.40,000 కోట్ల టర్నోవర్ నమోదు చేసుకొని రికార్డు సృష్టించింది.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కంప్యూటరైజేషన్ చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఆన్లైన్ బ్యాంకింగ్‌తో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఆధునిక గ్రామీణ బ్యాంకులుగా మారాయి. రైతుల నుండి ఎన్నికైన చైర్మన్లకు గౌరవం ఇస్తూ ప్రభుత్వం జోక్యానికి పరిమితులను విధించిన సహకారవాదిగా నిలిచిన రైతు నాయకుడు, సేవకుడు కేసీఆర్ అని అనడంలో ఎలాంటి ఔచిత్యం లేదు.
ఒక రైతుగా.. రైతు కష్టాలు తెలిసిన నాయకుడిగా రైతు ఆర్థిక అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని రైతు బంధు ద్వారా ఆర్థిక సహాయం, నాణ్యమైన విత్తనాల సరఫరా, సకాలంలో ఎరువులు పంపిణీ చేశారు. రైతు సంఘాలుగా ఉండే సహకార సంఘాలను బలోపేతం చేసి, స్వతంత్ర సంఘాలు ఆర్థికంగా బలపడే విధంగా కృషి చేసిన నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. 1964లో సహకార చట్టం ఏర్పడి, ఎన్నో సంస్కరణల ద్వారా రైతులకు బలమైన వ్యవస్థగా ఉన్న సహకార సంఘాలను ఏకపక్షంగా రాజకీయ జోక్యంతో రాష్ట్రంలోని ‘స్కాంగ్రెస్’ ప్రభుత్వం ఇప్పుడు రైతు సంఘాలను రాజకీయ సంఘాలుగా మార్చే పని పెట్టుకుంది. సహకార వ్యవస్థలపై ఈ ప్రభుత్వానికి ఎందుకు కన్ను పడిందంటే..చాలా సందర్భాలలో మనం వింటున్నాం.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని సీఎం రేవంత్ బహిరంగ ప్రకటనలెన్నో గుప్పించారు. రైతులకు రుణ మాఫీ చేస్తామని చెప్పి రైతులు ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ నుండి అక్షరాల రూ.2,000 కోట్లు బలవంతంగా తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి వడ్డీ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉంది రేవంత్ సర్కార్. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ డిఫాల్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడితే.. ప్రతి జిల్లా డీసీసీబీ బ్యాంక్ ద్వారా రూ.25 కోట్లు కట్టి, డిఫాల్ట్ కాకుండా త్రుటిలో తప్పించుకుంది. ప్రభుత్వం రైతులకు సహాయం చేయాలి.. కానీ రైతుల డబ్బే తీసుకోవడంలో అందె వేసింది హస్తం పార్టీ. కేసీఆర్ సహకార సంఘాలను అభివృద్ధి చేస్తే ఈ ప్రభుత్వం మాత్రం నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నట్టు ఉంది. సంఘాలను అభివృద్ధి చేయాలే గానీ వాటిపై పెత్తనం చెలాయించకూడదు. రాష్ట్రంలో మళ్లీ సహకార వ్యవస్థ తిరోగమనంలోకి వెళుతోంది. సంఘాలను సంఘాలుగా చూడాలే గాని రాజకీయ సంఘాలుగా కాదు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని రైతులు, రైతు సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అధికారులకు పీఐసీ విధానంలో సహకార సంఘాల్లో పదవులు కట్టబెడితే రైతులకు, సంఘాలకు ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోతుంది. సంఘాలను అవినీతిమయంగా ఏమార్చే కుట్రలకు ఈ ప్రభుత్వం తెగ ఆరాటపడుతోంది. ఇలాంటి నిర్ణయాల వల్ల సహకార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం కావడమే కాకుండా రైతుల ఆత్మాభిమానం సన్నగిల్లుతుంది. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా సహకార వారధులుగా సహకార సంఘాలను కాపాడుకునే బాధ్యతను రైతులు, రైతు సంఘాల నాయకులు తీసుకొని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని, రైతును ఎప్పటికైనా రాజుగానే చూడాలని ఒక రైతుగా, సహకారవాదిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
(వ్యాసకర్త: ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్, శామీర్‌పేట,డీసీఎంఎస్ వీ చైర్మన్, రంగారెడ్డి)
-రామిడి మధుకర్ రెడ్డి