కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ దార్శనికతకు తార్కాణం. ఆయన పట్టుదలకు, కార్యదక్షతకు కండ్ల ముందున్న సాక్ష్యం. తెలంగాణ ప్రజలపై, ముఖ్యంగా రైతులపై ఆయనకున్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. కరువుతో అల్లాడి నెర్రెలు బారిన తెలంగాణ భూములకు జీవం పోసిన జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు. కేసీఆర్ ఉక్కు సంకల్పం, ముందుచూపు లేకపోయి ఉంటే ఇంత భారీ ప్రాజెక్టు, అంత తక్కువ సమయంలో పూర్తికావడం వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో అసాధ్యం.
కాళేశ్వరం నిర్మాణం వెనుక తెలంగాణ ప్రజల దాహార్తి ఉన్నది. వలస పాలనలో బీడుగా మారిన తెలంగాణ నేలతల్లి గుండె కోత ఉన్నది. వలస పాలకులు గోదావరి నీళ్లను తరలించుకుపోతే కరువు కాటుకు బలైపోయిన రైతుల కుటుంబాల కన్నీటి వ్యథ ఉన్నది. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల బాధలను చూసి చలించిపోయిన కేసీఆర్ ఉక్కు సంకల్పం ఉన్నది. రైతుల కష్టాలను దూరం చేయాలంటే గోదారమ్మను ఎదురెక్కించాల్సిందే అని కేసీఆర్ నాడే నిర్ణయిం చుకున్నారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి రంగంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. గోదావరి నీటిని ఒడిసిపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేయాలని సంకల్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టును భుజాలకెత్తుకున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా తట్టుకొ ని నిలబడ్డారు. అకుంఠిత దీక్షతో, నిరంతర పర్యవేక్షణ తో ప్రాజెక్టును అనుకున్నదానికంటే వేగంగా పూర్తిచేయించారు. కాళేశ్వరం వెనుక హరీశ్‌రావు కృషి ఎంతో ఉన్నది. కేసీఆర్ కార్యదీక్షలో మంత్రిగా ఆయన ఎప్పటికప్పుడు కాళేశ్వరం పురోగతిని సమీక్షించారు. కాళేశ్వరాన్ని కేసీఆర్ ఒక సాగు నీటి ప్రాజెక్టుగానే చూడలేదు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి, రైతుల భవిష్యత్తుకు భరోసాగా నిలిచే గొప్ప యజ్ఞంలా భావించారు.
కేసీఆర్ అనుకున్నట్టే కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ వ్యవసాయరంగంలో విప్లవం వచ్చింది. నీళ్లు లేక దశాబ్దాలుగా బీడు భూములుగా ఉన్న ప్రాంతాలు పంట పొలాలతో కళకళలాడాయి. కాళేశ్వరం నీళ్లు పారే మార్గమంతా భూగర్భ జలాలు పెరిగాయి. చాలాచోట్ల ఉన్న తాగునీటి సమస్య పరిష్కారమైంది. మత్స్య పరిశ్రమ ఊపందుకున్నది. నీటి లభ్యత పెరిగి, మేత దొరికి పశుసంపద కూడా వృద్ధి చెందింది. పాడి, పంటలతో రైతుల ఆదాయం పెరిగింది. భూములకు విలువ వచ్చింది. పశుసంపద, మత్స్య సంపద పెరుగుదలతో ప్రజలు పోషకాహారం తీసుకోవడంతో జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. ఆరోగ్యం పెరిగింది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణపై ఎంతో ప్రభావం చూపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిర్మాణం మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మగౌరవానికి, స్వావలంబనకు ప్రతీక. కేసీఆర్ నాయకత్వ పటిమకు, తెలంగాణ ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న అంకితభావానికి తిరుగులేని నిదర్శనం.
తెలంగాణలో 2014లో 68 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తే, 2023 కల్లా అది 2.70 కోట్ల టన్నులకు పెరిగింది. దీనికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టే కదా?అంతేకాదు, సాగు విస్తీర్ణం రెట్టింపు అయ్యింది. మత్స్య శాఖ గణాంకాల ప్రకారం.. 2016-17లో 1.93 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అయితే, 2021లో అది 3.49 లక్షల టన్నులకు పెరిగింది. అంటే నాలుగేండ్లలో చేపల ఉత్పత్తి దాదాపు రెట్టింపు అయ్యింది. కాళేశ్వరం నీటితో ఊర్లల్లో చెరువులను నింపడం, ఎండకాలం కూడా అవి నీళ్లతో కళకళలాడటం వల్లే ఈ స్థాయిలో మత్స్య సంపద పెరిగింది. కాళేశ్వరంతో పాటు ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత తెలంగాణలో భూగర్భ జలాలు సగటున 5 మీటర్లు పెరిగినట్టు భూగర్భ జల శాఖనే ఒక నివేదికలో వెల్లడించింది.
‘కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ ప్రగతికి, భాగస్వామ్యానికి శాశ్వత చిహ్నం’ అని ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇంజినీరింగ్ సంస్థ అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ కితాబిచ్చింది. ‘కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ బాగుంది, ఇదొక అద్భుతమైన ఇంజినీరింగ్’ అని సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రశంసించింది. ‘కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు’ అని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గడ్కరీ మెచ్చుకున్నారు. కాళేశ్వరం నిర్మాణంపై డిస్కవరీ చానల్ ఏకంగా డాక్యుమెంటరీనే ప్రసారం చేసింది. కాళేశ్వరాన్ని రైతులకు ప్రయోజనం చేకూర్చే అద్భుతమైన ప్రాజెక్టుగా నాబార్డ్ కొనియాడింది. పలు రాష్ర్టాల సీఎంలు, రాజకీయ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి ఆశ్చర్యపోయారు. ఆఖరికి తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అయిన చంద్రబాబు కూడా కాళేశ్వరం ప్రాజెక్టును మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.
ఇంతటి ఘనత సాధించిన కాళేశ్వరాన్ని చూసి కాం గ్రెస్‌కు కన్నుకుట్టింది. కాళేశ్వరం నీళ్లు వచ్చినన్ని రోజు లు ప్రజలు కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకుంటారని, తెలంగాణలో తమకు రాజకీయ సమాధి తప్పదని భయపడ్డది. కాళేశ్వరంలో అవినీతి అంటూ ఎన్నికల సమయంలో అబద్ధపు ప్రచారాన్ని ప్రారంభించింది. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్ కుంగిపోవడంతో తన విష ప్రచారాన్ని విస్తృతం చేసింది. నిజానికి ఆ పిల్లర్ కుంగిపోవడం సహజంగానే జరిగిందా.. లేక కుట్రనా అన్నది ఇప్పటికీ మిస్టరీనే. లక్కీ లాటరీలో అధికారంలోకి వచ్చి న రేవంత్ రైతుల కోసం ఏం చేశాడు? మేడిగడ్డకు మరమ్మతులు చేయవచ్చని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీనే చెప్పినా కనీసం పట్టించుకోలేదు. ఓ విచారణ కమిషన్ వేసి రైతుల జీవితాలను పణంగా పెట్టి టైంపాస్ చేస్తున్నాడు. రేవంత్‌కు ప్రజలపై ప్రేమ, తెలంగాణ పట్ల బాధ్యత ఉంటే మేడిగడ్డకు మరమ్మతులు చేసేవాడు. కానీ, చేయడు. ఎందుకంటే రిపేర్ చేస్తే ‘కాళేశ్వరం బాగానే ఉంది’ అని అధికారికంగా ప్రకటించాల్సివ స్తుంది. అలా చేస్తే కాళేశ్వరంపై దుష్ప్రచారం ఉత్తదేనని తేలిపోతుంది. ప్రజల్లో తాను పలుచనైపోతాడు. అం దుకే రైతులు నష్టపోయినా సరే.. చోద్యం చూస్తున్నాడు.
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఓ మేరునగ ధీరుడు. ఆయన ఓ శిఖరం. ప్రజల గుండెల్లో ధైర్యం. రైతులకు బంధువు. ముసలోళ్లకు పెద్దకొడుకు. ఆడపిల్లలకు మేనమామ. తెలంగాణపై ఆయన ముద్ర చెరగనిది. తెలంగాణ ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానం రాజకీయాలకతీతమైనది. రాజకీయ ఆరోపణల ద్వారా ఆ అభిమానాన్ని పోగొట్టాలని రేవంత్ చేస్తున్న ప్రయత్నం కేవలం కుట్ర. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ పేరిట నోటీసులు కూడా ఆ కుట్రలో భాగమే.
కాళేశ్వరం నిర్మాణంలో హనుమంతుడిగా కార్యదక్షతను చాటుకున్న హరీష్‌రావును మొన్న విచారణకు పిలిచారు. నేడు కేసీఆర్ విచారణకు వెళ్లనున్నారు. తద్వారా వారి వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ, ‘సాక్షాత్తూ కేసీఆర్‌నే విచారణకు పిలిపించాం’ అని చెప్పుకోవడం తప్పితే కాంగ్రెస్ ఇందులో సాధించేదేమీ ఉండదన్న సంగతి తెలంగాణ ప్రజానీకానికి ఎప్పుడో అర్థమైంది. కుట్రలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ ఆమోదించరు. తెలంగాణ జీవన, ఆర్థిక గమనాన్నే మార్చేసిన కాళేశ్వరంపై అబద్ధాలు, కేసీఆర్‌పై నిందలు, విచారణ ఇదంతా ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యున్ని ఆపాలనుకోవడమే.. దీనివల్ల కేసీఆర్ ప్రతిష్ఠ తగ్గకపోగా రేవంత్ బూటకపు ప్రచారం పటాపంచలవుతుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభ మరింత తేజోవంతమై ప్రకాశిస్తుంది. ఇందులో ఎవరికీ, ఏ మాత్రం సంశయం అక్కరలేదు.