ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో ప్రజాస్వామ్యయుతంగా
14 ఏండ్లపాటు సుదీర్ఘ పోరు సల్పి తెలంగాణను సాధించుకున్నాం. స్వరాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలు కేసీఆర్‌ను తొలి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.తెలంగాణ సమాజం ప్రధాన అవసరం నీళ్లు. ఆ విషయం బాగా తెలుసు కాబట్టే, ఉద్యమ సమయంలోనే మడిమ అడ్డం పెడితే మడి నిండాలని కేసీఆర్ నినాదమిచ్చారు. అందుకే తెలంగాణ ఏర్పడ్డాక కాళేశ్వరం అనే మహోజ్వల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, అదొక ప్రాజెక్టుల సమాహారం. ఒక్క మేడిగడ్డలోనే 85 పియర్లున్నాయి. అందులో రెండు పియర్లకు స్వల్ప పగుళ్లు వచ్చాయి. వాటిని పట్టుకొని నానాయాగీ చేసి, నాలుగు ఓట్లు దండుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నాటినుంచి కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. అందుకే 22 నెలల పాలనలో ఆ రెండు పియర్లకు మరమ్మతులు చేయలేదు. చేస్తామన్న నిర్మాణ సంస్థనూ చెయ్యనివ్వలేదు. కానీ, నేడు కమీషన్ల కోసం కక్కుర్తిపడి తన అనుయాయులకు పనులు కట్టబెట్టేందుకు టెండర్ పిలిచింది.
కాళేశ్వరం విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి మొత్తానికి తాను అనుకున్నది సాధించారు. రెండేండ్లపాటు టన్నులకొద్దీ బురద పేరుకుపోయిన మేడిగడ్డ రిపేర్లకు టెండర్లు పిలిచేశారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తామే రిపేర్ చేస్తామన్న నిర్మాణ సంస్థను తెలంగాణ నుంచి వెళ్లగొట్టిన వారం రోజులకే టెండర్ నోటిఫికేషన్ రావడం గమనార్హం. భారీ ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఆరితేరిన ఎల్ అండ్ టీ కంపెనీని తెలంగాణ నుంచి విజయవంతంగా తరిమికొట్టారు. హైదరాబాద్ మెట్రోను నిర్మించి, 70 ఏండ్ల లీజు హక్కు ఉన్న ఆ సంస్థ అధికారులు ఏదో అన్నారని, వారిని అరెస్టు చేస్తామని బెదిరించిన విషయం విదితమే. ఆ తర్వాత క్రమంగా ఆ కంపెనీ ప్రతినిధులకు ఊపిరాడకుండా చేసి మెట్రోను వదులుకొనేలా చేశారు.
మేడిగడ్డ బరాజ్‌ను నిర్మించింది కూడా ఎల్ అండ్ టీ కంపెనీయే అన్న సంగతి తెలిసిందే. బరాజ్‌ను రిపేర్ చేస్తామని ఆ సంస్థ గతంలోనే ప్రకటించింది. కానీ, కాంగ్రెస్ పాలకులు అందుకు అంగీకరించలేదు. కాళేశ్వరం కూలిందన్నారు. రూ.లక్ష కోట్లు నీళ్ల పాలయ్యాయన్నారు. కాళేశ్వరం అసలు పనికిరాదన్నారు. ఏడాదిన్నర పాటు ఇలాంటి దుష్ప్రచారాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, విచారణ కమిషన్ల ఘోషతో ఆటాడుకున్నారు. అసెంబ్లీలో వీరంగాలు వేశారు. తెలంగాణ మేధావులని మెడలో బోర్డు వేసుకొని తిరిగే కుహనా మేధావులతో సామాజిక మాధ్యమాల్లో ప్రవచనాలు చెప్పించారు. కండ్లు లేనివారే కాదు, కండ్లుండీ చూడలేనివారు, తెలంగాణపై ఆక్రోశం వెళ్లగక్కుతూనే తెలంగాణవారమని చెప్పుకొనేవారు సైతం కాళేశ్వరంపై ఒకటే రికార్డు ప్లే చేస్తూ వచ్చారు. ఇక ఒక వర్గం మీడియాలో కొందరు పాత్రికేయులైతే ఊగిపోయారు. ఇప్పటికీ ఊగిపోతున్నారనుకోండి. తెలంగాణకు కేసీఆర్ తీరని ద్రోహం చేశారన్నట్టుగా పుంఖానుపుంఖాలుగా విశ్లేషణలూ చేశారు. యూట్యూబ్‌లో సెన్సార్ లేకుండా మాట్లాడారు. ఎల్లంపల్లి కాంగ్రెస్ కట్టిందన్నారు. మల్లన్నసాగర్‌ను వైఎస్సార్ కట్టారన్నారు.
కాళేశ్వరంలో మేడిగడ్డ తప్ప, మిగతావన్నీ తామే కట్టామని పాలకులు చెప్పారు.కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే, దాని నిర్మాణంలోనే లక్ష కోట్లు దిగమింగారంటూ ఊదరగొట్టారు. ఎల్లంపల్లిలోకి నీళ్లొస్తే అవి కాళేశ్వరం నీళ్లు కావన్నారు. గాయత్రి, అన్నపూర్ణ, మేడారం పంపులు నడిస్తే,
అవి కాళేశ్వరంలో భాగం కావన్నారు. రంగనాయకసాగర్ దగ్గర నీళ్లు వదిలితే, అవీ కాళేశ్వరం నీళ్లు కావన్నారు. కానీ, నిజాలు ఎంతోకాలం దాగవు కదా!
మెల్లమెల్లగా కాంగ్రెస్ ప్రభుత్వం ముసుగు తొలిగిపోయింది. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. అంతకుముందు కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తేవాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేయగా, దానికి గండికొట్టి కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని ఆపేశారు. ఆఖరికి కేసీఆర్ కట్టించిన మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తెచ్చేందుకు గండిపేట వద్ద కొబ్బరికాయలు కొట్టారు. మల్లన్నసాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? అని ప్రశ్నిస్తే.. ‘అబ్బెబ్బే.. దాన్ని వైఎస్సార్ కట్టారు’ అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే వేలమంది జనాల్లో జంకూబొంకూ లేకుండా అబద్ధం చెప్పారు. ఇప్పుడిక మేడిగడ్డ వంతు వచ్చింది. మేడిగడ్డ బరాజ్ పటిష్ఠత గురించి పరీక్షలు నిర్వహించగా, 98 శాతం నాణ్యతతో పటిష్ఠంగా ఉన్నట్టు తేలినట్టు సమాచారం. ఈ విషయం బయటికి రాకుండా సర్కార్ చాలా జాగ్రత్త పడుతున్నది. ఎల్ అండ్ టీని వెళ్లగొట్టాక మేడిగడ్డ రిపేర్లకు టెండర్లు పిలవడం వెనుక ఉన్న మర్మమేమిటి? ఇప్పుడు మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు మంచినీళ్ల ప్రాజెక్టు పనులు ఎవరికి దక్కబోతున్నాయి? మేడిగడ్డ రిపేర్ పనులు ఎవరికి అప్పజెప్పబోతున్నారు? ఇవి ఆలోచించాల్సిన ప్రశ్నలు.
2014కు ముందు తెలంగాణలో 64 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అయిన ధాన్యం కాళేశ్వరం కట్టిన తర్వాత సుమారు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల కు చేరింది. కాళేశ్వరంతో ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపిస్తున్న ప్రభుత్వ పెద్దలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇది సాధ్యపడింది కాళేశ్వరం నీళ్లతో కాదా? తెలంగాణలో ఏ రైతునడిగినా ఈ ప్రశ్నకు సమాధానం చెప్తారు. కాళేశ్వరం కూలిపోతే, కాళేశ్వరం నీళ్లు రాకుం టే హైదరాబాద్‌కు మల్లన్నసాగర్ నీళ్లు తెస్తానని ఎట్లా కొబ్బరికాయ కొట్టారు రేవంత్‌రెడ్డి? రంగనాయక సాగర్ నీళ్లను మంత్రి కొండా ఎట్లా వదిలారు? గంధమల్ల సాగర్‌కు మీరెలా శంకుస్థాపన చేశారు? ఈ నీళ్లు ఎక్కడినుంచి వస్తున్నాయి? ఆకాశం నుంచి ఊడిపడుతున్నాయా? లేక మీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసి కట్టిన ప్రాజెక్టుల ద్వారా వస్తున్నాయా?.
తెలంగాణ సమాజాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ తన అసమర్థతతో కనీసం నాలుగు యూరియా బస్తాలైనా ఇవ్వలేక, నానా యాతన పెడుతూ రైతుల ఉసురుపోసుకుంటున్నది. రిపేర్ చేసి కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా మొన్నటివరకు రైతులను ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు కమీషన్ల కోసమే టెండర్లు పిలిచిందని తెలంగాణ సమాజానికి అర్థమవుతూనే ఉన్నది. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని, రేవంత్‌రెడ్డిని తెలంగాణ సమాజం ప్రజాకోర్టులో తప్పకుండా శిక్షిస్తుంది.
(వ్యాసకర్త: రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్)
-డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్