ప్రజల జీవితాలను మెరుగుపరిచే మార్గాలను అన్వేషించి, వాటిని అమలు పరచడమే ప్రజా నాయకుడి లక్షణం. ప్రజల జీవితాలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వెల్లివిరియాలంటే రాష్ట్ర ఆర్థిక స్థోమత అత్యావశ్యకం. వెనుకబడిన, అన్ని రకాలుగా అణగదొక్కబడిన మన తెలంగాణను స్వర్ణ తెలంగాణగా తీర్చిదిద్దుకుందామనే ఆశయంతో దశాబ్దాలుగా పోరు సల్పి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. కొత్తగా సాధించుకున్న రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి కావాల్సిన సకల వనరులను కల్పించి,ఆదాయ మార్గాలను సృష్టించి, ఆస్తులను పెంపొందించుకొని, తద్వారా రాష్ట్ర సంపదను వృద్ధి చేసుకునే దిశగా చర్యలు తీసుకున్నది తెలంగాణ తొలి ప్రభుత్వం.
తెలంగాణ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్రం. కాబట్టి రైతును రాజును చేస్తే ప్రజలు బాగుపడతారని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనతికాలంలోనే గుర్తించింది. ఆ దిశగా మేధోమథనం గావించి నీళ్ల సదుపాయం కల్పించడమే కాకుండా, అందుకు విద్యుత్తు కూడా అవసరమని భావించి ఈ రెండింటినీ సమకూర్చేందుకు గత ప్రభుత్వం తగిన చర్యలు తీసున్నది. రైతు సంక్షేమం కోసం పాటుపడింది. రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి పంట పెట్టుబడిని ప్రభుత్వమే సమకూర్చింది. దాంతో రైతుకు ధైర్యం కల్పించినట్టయింది. ఏదైనా కారణం వల్ల రైతు చనిపోతే అతని కుటుంబం ఆగమాగం కాకుండా ఉండటానికి రైతు బీమాతో ధీమా కల్పించి ఆయా కుటుంబాలకు అండగా నిలిచింది. సరైన సమయానికి విత్తనాలు, యూరియా మొదలైనవి అందుబాటులో ఉంచి ‘మీరు పుట్లకు పుట్లు పండించుకోండి. మేం ప్రతి గింజను కొంటాం’ అని విశ్వాసం కలిగించింది.
పంటలు పండాలంటే ముఖ్యంగా పుష్కలంగా నీళ్లు కావాలి. మన రాష్ట్రంలో నీళ్ల వసతి లేక దశాబ్దాల పాటు తెలంగాణ బీడువారింది. అందుకే తొలుత నీళ్ల సౌలత్ కల్పించేందుకు కేసీఆర్ సర్కార్ పూనుకున్నది. రాష్ట్రమంతటా విరివిగా సాగునీరు పారించాలని, తద్వారా వ్యవసాయ భూములన్నీ సాగులోకి తీసుకురావాలనే సత్సంకల్పంతో కాళేశ్వరం పేరిట బహుళార్ధ సాధక ప్రాజెక్టును ఆవిష్కృతం చేసింది. రోజంతా కరెంట్ ఉంటేనే కదా రైతు తన పొలంలో పనిచేసేది. ఎప్పుడో అర్ధరాత్రి కరెంటు ఇచ్చి, రైతుకు కంటి నిండా నిద్ర లేకుండా చేసే బదులు 24 గంటలూ కరెంటు ఇచ్చి రైతును ఆదుకోవాలని, అర్ధరాత్రి బాయిల కాడ జాగారం చేసే కష్టాన్ని గత ప్రభుత్వం తప్పించింది.
ప్రజా ప్రభుత్వమంటే ఇది గదా. రోజంతా కరెంటు ఇచ్చి, పుష్కలంగా నీళ్లు ఇచ్చి, పెట్టుబడికి సరిపడా డబ్బులిచ్చినందుకు గదా రైతు ఆనందపడి
సమృద్ధిగా పంటలు పండించిండు.ఆ పంటను సరైన ధరకు మార్కెట్లో అమ్ముకుంటేనే గదా ఆ రైతుకు ప్రయోజనం. పంట పొలాల దగ్గరకు వెళ్లి కాంటాలు పెట్టించి ఆ అవసరాన్ని కూడా తీర్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతును రారాజును చేసింది.
గుక్కెడు నీళ్ల కోసం చాంతాడు, బొక్కెన పట్టుకొని మైళ్ల కొద్దీ నడిచే ప్రయాసను తప్పించడానికి గత సర్కార్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసింది. అంతేగాక, గర్భిణులు, నవజాత శిశువులు, బాలింతలను కంటికి రెప్పలా కాపాడుకున్నది. అంగన్వాడీల్లో పౌష్టికాహారం ఇచ్చి తల్లీబిడ్డలను సురక్షితంగా చూసుకున్నది. మౌలిక వసతులు కల్పించడంతో పాటు కేసీఆర్ కిట్, రూ.13 వేల ఆర్థికసాయం చేయడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరిగాయి. సిజేరియన్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది.
పింఛన్లు రూ.2 వేలకు పెంచడంతో వృద్ధులు సంతోషంగా జీవించగలిగారు. రియల్ ఎస్టేట్ బాగా పుంజుకునేటట్టు చర్యలు తీసుకొన్నారు. గొర్రెల పెంపకంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చి, రాష్ట్రంలో పశుసంపదను పెంచారు. కొత్త జలాశయాలు అందుబాటులోకి రావడంతో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. తద్వారా రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చింది. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద్వారా తలసరి ఆదాయం మూడింతలు పెరిగింది. రాష్ట్ర ఆదాయ వనరులు, వ్యక్తుల ఆదాయాలు పెరగడంతోపాటు సంపద కూడా హెచ్చింది. దీంతో ప్రతి సంవత్సరం వస్తు, సేవల ఉత్పత్తి పెరిగి రాష్ట్ర జీడీపీ వృద్ధి సాధించింది.
వివిధ సంక్షేమ పథకాలను ఆరంభించి, పేదల బతుకులను చిగురింపజేసింది గత ప్రభుత్వమేనాయే. పర్యావరణ సమతుల్యత కోసం కోటానుకోట్ల మొక్కలు నాటించి అడవుల విస్తీర్ణాన్ని పెంచింది. వివిధ సంక్షేమ పథకాల వల్ల కేసీఆర్ పాలనలో పేదరికం 12 శాతం తగ్గిందని గణంకాలు తేల్చిచెప్పాయి. ఇంకేం కావాలి? ఇది గదా ప్రభుత్వం చేయవలసింది.
గత ప్రభుత్వంలో జీఎస్టీ వసూళ్లలో ఏటా రెండంకెల వృద్ధి నమోదైంది. మరి ఇప్పుడు జీఎస్టీ వసూళ్లు పెరగకపోగా, మైనస్ వృద్ధిరేటును నమోదు చేసింది. అంటే ఆర్థిక ప్రణాళికలు సరిగ్గా లేనట్టే గదా? ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. పెంచుతామన్న పింఛన్లు ఇవ్వడం లేదు. ఇదివరకు ఇచ్చే రైతుబంధు కూడా ఇవ్వట్లేదు. రైతు బీమా ఊసే లేదు. అదీగాక 500 మందికి పైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నేత కార్మికులు కూడా దురవస్థ పాలయ్యారు. కల్యాణలక్ష్మి కింద ఇస్తామన్న తులం బంగారం మాటే మర్చిపోయారు. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వవలసిన పెన్షన్ ప్రయోజనాలే ఇవ్వలేకపోతున్నారంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఉహించుకోవచ్చు. మరి ఈ రెండేండ్ల పాలనలోనే లక్షల కోట్లు అప్పు తెచ్చి ఎక్కడ వినియోగించినట్టు? ఆర్థిక వృద్ధి లేకపోగా తిరోగమన దిశలో ప్రయాణించడం సిగ్గుచేటు.
గత పాలకులు ఆస్తులు సృష్టించి, సంపద పెంచి, ప్రజలకు పంచడంలో కృతకృత్యులయ్యారు. గత పదేండ్లలో నాటి ప్రభుత్వం తెలంగాణను ఆర్థికంగా పటిష్ఠం చేసుకుంటూపోయింది. ప్రజా పాలకుని ఆలోచన విధానం, పరిపాలన దక్షతను, సమర్థతను ఈ వృద్ధి ప్రతిబింబిస్తుంది. ప్రస్తుత ప్రభుత్వ ఏలుబడిలో ఏదైనా ఒక్క వర్గం ప్రజలైనా సంతోషంగా ఉన్నారా? ఇకనైనా సక్రమంగా ఆలోచించి, తగు ఆర్థిక ప్రణాళికలు వేసి, రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపుతారని ఆశిద్దాం.
(వ్యాసకర్త: ప్రిన్సిపాల్, జయముఖి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్)
-డాక్టర్ వాణి మనోహర్