2019, ఆగస్టు 5న జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం తొలగించడంతో కశ్మీర్ లోయలో ఆందోళనలు చెలరేగాయి. నిరసన చేస్తున్న వందల మంది కశ్మీరీలను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అయితే, లద్దాఖ్‌లో మాత్రం సంబురాలు మిన్నంటాయి. లద్ధాఖ్ ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేసినందుకు గానూ ప్రధాని మోదీకి అద్భుత ఆవిష్కర్త, విద్యాసంస్కర్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ కృతజ్ఞతలు తెలిపారు.
జమ్మూకశ్మీర్ నుంచి లద్ధాఖ్‌ను వేరు చేయాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉన్నది. చైనా సరిహద్దులో లద్ధాఖ్‌ను ప్రత్యేక పరిపాలనా ప్రాంతంగా గుర్తించాలని మొదటినుంచీ సోనమ్ వాంగ్‌చుక్ డిమాండ్ చేస్తున్నారు. 2019 వరకు లద్ధాఖ్ కూడా జమ్మూకశ్మీర్‌లో భాగంగా ఉన్న విషయం తెలిసిందే. మోదీ సర్కారు తీసుకున్న చర్యతో అది కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. జమ్మూకశ్మీర్‌ను కూడా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చినప్పటికీ, అక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల పాలనకు ఆస్కారమున్నది. కానీ, లద్దాఖ్‌కు కేంద్రం ఆ అవకాశం లేదు. తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అవకాశం వారికి లేకుండాపోయింది.
దాంతో అప్పటివరకు ప్రశాంతతకు మారుపేరైన కేంద్రపాలిత ప్రాంతం క్రమంగా తర్వాతి ఆరేండ్లలో (2019-2025) మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలకు కేంద్రబిందువుగా మారింది. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న సోనమ్ వాంగ్‌చుక్ నుంచి వేరుపడిన ఓ బృందం ఇటీవల భద్రతా దళాలతో ఘర్షణకు దిగింది. ఈ నిరసనలకు నేతృత్వం వహించారని ఆరోపిస్తూ దేశ ద్రోహానికి పాల్పడ్డారని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారని అభియోగాలు మోపుతూ సోనమ్ వాంగ్చుక్ను సెప్టెంబర్ 26న పోలీసులు అరెస్టు చేశారు. లద్దాఖ్ నుంచి 1,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలుకు ఆయనను తరలించారు. కాగా, ఇదే కమలం పార్టీ గతంలో లద్దాఖ్‌లో తమ తరఫున ప్రచారం చేయాలని వాంగ్చుక్ను ఆశ్రయించింది. ఇతర రాష్ర్టాల్లోని బీజేపీ ప్రభుత్వాలు విద్యావేత్తగా ఆయన సేవలను వినియోగించుకున్నాయి.
1966లో లేహ్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వత గ్రామం ఉలేటోక్పోలో వాంగ్‌చుక్ జన్మించారు. తొమ్మిదేండ్ల వరకు తన తల్లి త్సెరింగ్ వాంగ్మో వద్దే ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. 1975లో తన తండ్రి సోనమ్ వాంగ్యాల్ జమ్మూకశ్మీర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో వారి కుటుంబం శ్రీనగర్‌కు మకాం మార్చింది. అయితే, లద్దాఖీ మాత్రమే తెలిసిన వాంగ్‌చుక్.. అక్కడ ఉర్దూ పాఠశాలల్లో ఇబ్బందులు పడ్డారు. దీంతో అతను ఉన్నత విద్యాభ్యాసం కోసం ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత శ్రీనగర్ నిట్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక 1988లో కొందరు స్నేహితులతో కలిసి లద్దాఖ్‌లో విద్యాసంస్కరణల కోసం ‘స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లద్దాఖ్- సెక్మోల్’ పేరిట ప్రత్యామ్నాయ పాఠశాలను వాంగ్‌చుక్ స్థాపించారు.
అంతకుముందు వరకు ఉర్దూ తెలియని కారణంగా 95 శాతం మంది లద్దాఖ్ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యేవారు. అయితే, ఏడేండ్ల స్వల్ప వ్యవధిలో సెక్మోల్లో ఉత్తీర్ణత ఐదు శాతం నుంచి 55 శాతానికి, ఆపై 75 శాతానికి ఎగబాకింది. ఆ తర్వాత లేహ్ సమీపంలో వాంగ్‌చుక్ మరో క్యాంపస్‌ను స్థాపించారు. రేడియో స్టేషన్ నిర్వహణ, వ్యవసాయం, మెషిన్లకు మరమ్మతులు చేయడం లాంటి ప్రాక్టికల్ పాఠాలు ఇందులో బోధించేవారు. ఇలాంటి విద్యాసంస్కరణలు చేపట్టినందుకు గానూ 1996లో జమ్మూకశ్మీర్ గవర్నర్ చేతులమీదుగా వాంగ్‌చుక్ పురస్కారం అందుకున్నారు. వాంగ్‌చుక్ మాత్రమే కాదు, ఆయన తండ్రి కూడా లద్దాఖ్ హక్కుల కోసం పోరాడారు. 1980లలో లద్దాఖ్‌లోని పలు సామాజిక వర్గాలను స్వదేశీ తెగలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ తండ్రి వాంగ్యాల్ నిరాహార దీక్ష చేశారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. నీటిని నిల్వ చేసే ఐస్ స్థూపం, జవాన్ల కోసం సోలార్ టెంట్లు లాంటి విప్లవాత్మక ఆవిష్కరణలతో వాంగ్‌చుక్ మరింత ఖ్యాతి గడించారు. 2018లో రామన్ మెగసెసే సహా అనేక పురస్కారాలను వాంగ్‌చుక్ అందుకున్నారు. బాలీవుడ్లో విజయవంతమైన ‘3 ఇడియట్స్’ సినిమాలో ఆమిర్ ఖాన్ పోషించిన పున్సుఖ్ వాంగ్డు పాత్ర కూడా వాంగ్‌చుక్ నుంచి ప్రేరణ పొందినదే. అలాంటి వ్యక్తి నేడు రాజద్రోహ అభియోగాలను ఎదుర్కొంటున్నారు.
వాంగ్చుక్కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్టు విశ్వసనీయ సమాచారం ఉందని లద్దాఖ్ పోలీస్ అధికారి ఎస్డీ సింగ్ జమ్వాల్ పేర్కొన్నారు. ఇటీవల అరెస్టయిన పాక్ నిఘా అధికారి గతంలో వాంగ్‌చుక్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆయన అంటున్నారు. ఐరాస సహకారంతో వాతావరణ మార్పులపై ‘డాన్’ మీడియా గ్రూప్ ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వాంగ్‌చుక్ పాల్గొనడాన్ని కూడా పోలీసులు ఉదహరించారు. అయితే, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో మోదీ సర్కారు కృషిని ఈ కార్యక్రమంలో సోనమ్ ప్రశంసించడం గమనార్హం.
వాంగ్‌చుక్ అరెస్టుతో లద్దాఖ్‌లో సంక్షోభం మరింత తీవ్రమైంది. వాంగ్‌చుక్ సహా ఇతర ఉద్యమకారులను బేషరతుగా విడుదల చేయాలని, కాల్పుల్లో మరణించినవారి కుటుంబాలకు పరిహారం చెల్లించాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. అంతేకాదు, మోదీ సర్కారుతో చర్చలను కూడా బహిష్కరించాయి.
అయితే, విద్యాసంస్కరణలు, పర్యావరణ పరిరక్షణలపై మొన్నటివరకు దృష్టిసారించిన వాంగ్‌చుక్ గత కొంతకాలంగా రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. 2020 గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో చైనా వస్తువులను బహిష్కరించాలని వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. హిమాలయ పర్యావరణ వ్యవస్థను సంరక్షించాలని కోరుతూ 2023లో పర్యావరణ దీక్ష చేశారు. ఆ తర్వాత లద్దాఖ్‌కు రాజ్యాంగ రక్షణ కల్పించాలని నేరుగా ఢిల్లీని ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. కార్పొరేట్ మైనింగ్ లాబీని నిరసిస్తూ ‘పష్మీనా మార్చ్’కు నేతృత్వం వహించారు. అరెస్టుకు వారం ముందు కూడా 2019 నాటి జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసినప్పుడు తన సంతోషాన్ని నెమరు వేసుకున్నారు. కానీ, ఆ తర్వాత ‘మనం ఇప్పుడు పెనం మీది నుంచి పొయ్యిలోకి పడ్డా’మని ఒక వీడియోలో పేర్కొన్నారు. లద్దాఖ్ నేతలను దేశ ద్రోహులుగా చిత్రీకరించడం ద్వారా కేంద్రప్రభుత్వం నిప్పుతో చెలగాటమాడుతున్నదని కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్ నేత కార్గిలి హెచ్చరించారు. ఉద్యమ నేతలపై కేంద్రం చేస్తున్న అణచివేతలు లద్దాఖ్‌ను టైమ్ బాంబ్‌గా మార్చే ప్రమాదం ఉందని వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో ఆందోళన వ్యక్తం చేశారు. లద్దాఖ్‌ను మరో కశ్మీర్‌గా మార్చాలని ఎందుకు అనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. ‘వాంగ్చుక్ను వాళ్లు కొనలేరు కాబట్టి, ఆయనను భయపెట్టి గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఇది ఇక ఎంతమాత్రం ప్రజాస్వామ్యం కానే కాదు’ అని గీతాంజలి చెప్పారు.
(‘అల్ జజీరా’ సౌజన్యంతో..)
-యశ్‌రాజ్ శర్మ