తిరువనంతపురం, అక్టోబర్ 22: శబరిమల అయ్యప్పస్వామి ఆలయ దర్శనం కోసం కేరళకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ స్వల్ప ప్రమాదానికి గురైంది. బుధవారం కేరళలోని ‘ప్రమదం’ వద్ద హెలికాప్టర్ దిగుతుండగా, హెలిప్యాడ్ వద్ద నేల కుంగిపోయింది. దీంతో హెలికాప్టర్ టైర్లు అందులో కూరుకుపోయి, ఒకవైపునకు వంగిపోయింది. ఆ సమయంలో రాష్ట్రపతి ముర్ము హెలికాప్టర్లోనే ఉన్నారు.
అయితే, పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమవటంతో ప్రమాదం తప్పింది. వారంతా కలిసి ఒకవైపునకు ఒరిగిపోయిన హెలికాప్టర్‌ను సరిచేశారు. భద్రతా సిబ్బంది సాయంతో రాష్ట్రపతి హెలికాప్టర్ నుంచి కిందికి దిగిన తర్వాత, రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకుని అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకున్న తొలి మహిళా రాష్ట్రపతి ముర్మునే కావడం విశేషం.