భారతీయ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. వ్యవసాయం, ఫార్మా రంగాలపై ఆంక్షలను ఎత్తివేయాలని మొదటి నుంచీ ఒత్తిడి చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం రష్యన్ చమురు కొనుగోళ్లను బూచిగా చూపి భారత్‌పై 50 శాతం సుంకాలను విధించి లొంగదీసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలు కనపడుతున్నాయి. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి వ్యవసాయంపైనే పూర్తిగా ఆధారపడిన భారతీయ రైతులను నట్టేట ముంచేందుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది.
న్యూఢిల్లీ అక్టోబర్ 22: అమెరికా పంటలు భారత్‌లో ప్రవేశించేందుకు మోదీ (PM Modi) సర్కారు అంగీకరించనున్నట్టు అధికార వర్గాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ వార్తాకథనం ప్రచురించింది. అదే జరిగితే భారతీయ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమా దం ఉన్నది. గతంలో వ్యవసాయ సంస్కరణల పేరిట వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల గుప్పిట్లో పెట్టేందుకు ప్రయత్నించిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఢిల్లీకి వచ్చి మరీ ప్రతిఘటించి, వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకునేలా పోరాడిన వేలాది మంది రైతులు స్వేచ్ఛా వాణిజ్యం పేరిట అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వంపై మరోసారి సమరానికి సంసిద్ధం అవుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిపే వాణిజ్య చర్చలలో మితిమీరిన రాయితీలను నరేంద్ర మోదీ ప్రభుత్వం కల్పించడానికి సిద్ధపడితే తాను మళ్లీ ట్రాక్టర్‌పైన ఢిల్లీకి రావలసి వస్తుందని ఐదేళ్ల క్రితం పంజాబ్ నుంచి దేశ రాజధానికి ట్రాక్టర్‌ను నడుపుకుంటూ వచ్చి రైతుల ఆందోళనలో పాల్గొన్న దల్జీందర్ సింగ్ హర్యావూ తాజాగా హెచ్చరించారు. వాణిజ్య ఒప్పందం ద్వారా పంటలు, ఆహార ఉత్పత్తులను అనుమతిస్తే మేము నాశనమైనట్లే అని 30,000 మందికి పైగా సభ్యులున్న శక్తివంతమైన రైతు సంఘం సభ్యుడు హర్యావూ ఆందోళన వ్యక్తం చేశారు. మక్కజొన్న, వరి పంటలను పండించడంతోపాటు పాడి ఆవులతో ఆయన పాల వ్యాపారం కూడా చేస్తారు. భారత్, అమెరికా మధ్య సంక్లిష్టంగా మారిన వాణిజ్య చర్చలు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అమెరికా నుంచి తక్కువ ధరకు వ్యవసాయ దిగుమతులు జరుగుతాయేమోనన్న ఆందోళన రైతులలో నెలకొంటుండగా ప్రధాని మోదీపై విరుచుకుపడేందుకు విపక్షాలకు కొత్త అస్ర్తాలు లభిస్తున్నాయి.
వాణిజ్య చర్చల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వం మినహాయించింది. అటువంటి ప్రయత్నాలు దేశంలో అత్యంత శక్తివంతమైన ఓటు బ్యాంకుగా పరిగణించే కోట్లాది మంది రైతులను దెబ్బతీస్తాయని ప్రభుత్వం వాదిస్తున్నది. రానున్న ఏడు నెలల్లోగా నాలుగు ప్రాతీయ ఎన్నికలను ఎదుర్కోనున్న ప్రధాని మోదీ రైతుల ప్రయోజనాలకు ముప్పు తీసుకువచ్చే ఎటువంటి విధానాలకైనా తాను అడ్డుగోడగా నిలబడతానని గతంలో ప్రకటించారు. కాగా, వ్యవసాయం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిదని, రైతులు దానికి ఆత్మ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ప్రకటించారు. రైతులకు సేవచేయడం భగవంతుడిని పూజించడంగా కూడా ఆయన అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల భారత్‌లో సగానికి పైగా శ్రామికశక్తి వ్యవసాయరంగంలోనే ఉంది. భారతీయ జీడీపీలో ఐదవ వంతు వ్యవసాయ రంగం నుంచే లభిస్తోంది.
ప్రధానిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2020లో వ్యవసాయ సంస్కరణల పేరిట కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చి రైతుల ఆగ్రహాన్ని చవిచూసిన మోదీ ప్రభుత్వం అసాధారణ రీతిలో వాటిని ఉపసంహరించుకుంది. ఇప్పుడు కూడా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అమెరికా నుంచి ఒక్క గింజ మక్కను దిగుమతి చేసుకోని భారత్‌పై ఇటీవల అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా బియ్యంపై ప్రస్తుతం 70-80 శాతం సుంకాలు అమలుచేస్తున్న భారత్ మక్కపై 15-50 శాతం, పాడి ఉత్పత్తులపై 30-60 శాతం సుంకాలు విధిస్తోంది. అదే సమయంలో అమెరికా నుంచి అత్యధికంగా 50 శాతం సుంకాలను భారత్ ఎదుర్కొంటోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయకపోతే ఈ సుంకాలు ఇలాగే కొనసాగుతాయని కూడా ట్రంప్ తాజాగా హెచ్చరించారు. వచ్చే ఆదివారం(అక్టోబర్ 26) మలేషియాలో జరగనున్న ఆషియన్ నాయకుల సదస్సులో మోదీ, ట్రంప్ సమావేశమయ్యే అవకాశం ఉంది.
అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపైనే ఏకాభిప్రాయం కుదరడం లేదని అమెరికాతో జరిగిన వాణిజ్య చర్చలతో ప్రమేయమున్న భారత అధికారులు వివరించారు. ఈ అంశంపై ఉభయ పక్షాలు తమ పట్టును సడలించుకోవడం లేదని వారు చెప్పారు. 2022లో ఆస్ట్రేలియా, 2025లో బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌తో జరిగిన వాణిజ్య చర్చలలో సైతం వ్యవసాయ రంగమే భారత్‌కు ప్రతికూలంగా మారిందని వారు చెప్పారు. అయితే అమెరికాకు చెందిన వ్యవసాయ లాబీ ట్రంప్ ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తోందని వారు తెలిపారు. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి వ్యవసాయంపై భారత్ అమెరికాకు కొన్ని రాయితీలు ఇచ్చే అవకాశం ఉందని గత నెలలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్లో జరిగిన చర్చలలో పాల్గొన్న తర్వాత న్యూఢిల్లీలో జరిగిన చర్చలతో ప్రమేయమున్న ఓ అధికారి వెల్లడించారు. ఈ ఏడాది చివరిలోగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఆశతో చర్చల వేగాన్ని పెంచేందుకు పీయూష్ గోయల్‌కు చెందిన అధికారుల బృందం గత వారం అమెరికాను సందర్శించింది.
వ్యవసాయ రంగంలో పూర్తిగా కాకపోయినా అమెరికా నుంచి కొన్ని దిగుమతులను భారత్ అనుమతించే అవకాశం కనపడుతోంది. మక్క పంట, ఇథనాల్ ఉత్పత్తుల దిగుమతులను భారత్ అనుమతించే అవకాశం ఉంది. మరి కొన్ని ఉత్పత్తులకు కోటా విధించే అవకాశం కూడా ఉంది. అయితే అమెరికాలో మక్క, సోయాబీన్ పంటల ఉత్పత్తిలో జన్యుమార్పిడి జరగడం, భారత్‌లో జన్యుమార్పిడి ఉత్పత్తిపై కఠిన నిబంధనలు ఉండడంతో ఉభయ దేశాల మధ్య వాణిజ్య చర్చలు క్లిష్టతరంగా మారాయి. 1960, 1970 దశకాలలో పంజాబ్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణలు ఆహార దిగుబడిలో భారతదేశ వ్యవసాయ రంగ రూపురేఖల్నే మార్చివేశాయి. ప్రపంచంలోనే అత్యధిక ఆహార ఉత్పత్తిదారులలో ఒకటిగా భారత్ మారింది.
అమెరికా వ్యాపార భాగస్వామ్య దేశాల మధ్య ఔషధాల ధరల విధానంపై దర్యాప్తును ట్రంప్ ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అమెరికాలో కన్నా ఇతర దేశాలలో ఔషధాల ధరలు తక్కువగా ఉన్నాయా అన్న విషయాన్ని లోతుగా దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అదే విషయం దర్యాప్తులో తేలితే ఆయా దేశాలపై వాణిజ్య ఆంక్షలు అమెరికా విధించే అవకాశం ఉంది. యూరోపియన్ యూనియన్, బ్రిటన్‌తో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు ఫార్మసీ దిగుమతులపై సుంకం 15 శాతం మించరాదు. ఒకే మందుకు అమెరికాలో కన్నా ఇతర దేశాలలో తక్కువ ధర చెల్లించడంపై ట్రంప్ గతంలో విమర్శలు చేశారు. ఇందుకు ఉదాహరణగా బరువు తగ్గే ఔషధాలను ఆయన ప్రస్తావించారు. లండన్‌లో 130 డాలర్లకు దొరికే మందు న్యూయర్క్‌లో 1,300 డాలర్లకు కొనాల్సి వస్తుందని ఓ ప్రముఖ బ్రాండ్‌కు చెందిన వెయిట్ లాస్ ఔషధం గురించి ట్రంప్ తెలిపారు.
దీర్ఘకాలంగా కొలిక్కి రాకుండా నలుగుతున్న వాణిజ్య ఒప్పందాన్ని భారత్, అమెరికా త్వరలోనే ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ఖరారైతే దిగుమతి సుంకాన్ని అమెరికా ప్రభుత్వం 50 శాతం నుంచి 15-16 శాతం తగ్గించే అవకాశం ఉన్నట్లు మింట్ ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలు ప్రధానంగా వ్యవసాయం, ఇంధన రంగాలపైనే దృష్టి సారించినట్లు పత్రిక తెలిపింది. రష్యా ఇంధన సరఫరాలపై ప్రపంచ దేశాలు ఆధారపడకూడదని కోరుతున్న అమెరికా రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయనందుకు భారత్‌పై జరిమానా సుంకాన్ని అదనంగా విధించింది. అయితే రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ క్రమంగా తగ్గించుకునే అంశం ప్రస్తుతం అమెరికాతో జరుపుతున్న చర్చలలో ప్రధాన అంశంగా మారింది. చర్చలు తుది దశలో ఉన్నాయని, ఈ నెలాఖరులో జరగనున్న ఆసియన్ సదస్సులోపలే చర్చలను ముగించి అదే సదస్సులో లాంఛనంగా ఒప్పందంపై ప్రకటన చేయడానికి ఇరుపక్షాలు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.