జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కారుకు-బుల్డోజర్కు మధ్య పోటీగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. నిజమే, ఈ ఉపఎన్నిక నిర్మాణానికి- విధ్వంసానికి మధ్య ఎన్నిక, అభివృద్ధికి-అబద్ధాలకు మధ్య ఎన్నిక. ఏది కావాలో జూబ్లీహిల్స్ ప్రజలకు బాగా తెలుసు. ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపుపై ఎవరికీ అనుమానం లేదు. అయితే, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం ఒక్క జూబ్లీహిల్స్కో,
హైదరాబాద్‌కో పరిమితమైంది కాదు. ఈ ఎన్నిక ఫలితం ప్రభావం తెలంగాణ అంతటా ఉంటుంది.
బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై రెండేండ్లుగా గూడు కట్టుకున్న తమ అసంతృప్తిని, అసహనాన్ని, ఆగ్రహాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో చాటిచెప్పేందుకు ఈ ఉపఎన్నిక తెలంగాణ ప్రజలకు ఓ అవకాశాన్నిచ్చింది. దీన్ని జూబ్లీహిల్స్ ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడిస్తేనే.. నెత్తికెక్కిన కాంగ్రెస్ కళ్లు నేలకు దిగుతాయి. ప్రజలకు తాము ఇచ్చిన హామీలు గుర్తువస్తాయి. తాము అధికారంలో ఉండే తర్వాతి మూడేండ్లు అయినా ప్రజాకంటక నిర్ణయాలు తీసుకోకుండా కాంగ్రెస్‌ను ఈ ఉప ఎన్నిక ఫలితం కట్టిపడేస్తుంది. అలా కాకుండా, కాంగ్రెస్ అభ్యర్థి గనుక విజయం సాధిస్తే రెండేండ్ల తమ అసమర్థ పాలనకు ఇదే ప్రజామోదం అనుకొని రేవంత్ ప్రభుత్వం ఇంకా దారుణాలకు పాల్పడే ప్రమాదముంది.
వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టారు. మాగంటి గోపీనాథ్ కూడా బీఆర్ఎస్ నుంచే విజయం సాధించారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధే అసెంబ్లీ ఎన్నికల వేళ జీహెచ్ఎంసీ ఓటర్లు గులాబీ పార్టీ వైపు నిలబడటానికి కారణమైంది. కళ్లముందు కనిపిస్తున్న అభివృద్ధిని హైదరాబాద్ ప్రజలు విస్మరించలేకపోయారు. హైదరాబాద్‌లో అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు.. ఆ తర్వాత అన్న విధంగా తయారైంది. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా రోడ్లు పూర్తయ్యాయి. ఫ్లై ఓవర్లు వచ్చాయి. అండర్ పాస్‌లను నిర్మించారు. మెట్రో అందుబాటులోకి వచ్చింది. ఇంకా విస్తరించారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ఇక ఐటీ రంగం హైదరాబాద్‌లో విస్తరించిన వేగం దేశాన్నే ఆశ్చర్యపర్చింది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు అమెరికా వెలుపల తమ అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయి.
గతంలో హైదరాబాద్‌లో ఓ రోడ్డు నిర్మాణమో, రిపేరో జరుగుతుందంటే నగరవాసులకు, ప్రయాణికులకు చుక్కలు కనిపించేవి. అలాంటిది బీఆర్ఎస్ హయాంలో రాత్రికిరాత్రే పనులు పూర్తి చేసి ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. అందుకే జీహెచ్ఎంసీ పరిధిలో జైత్రయాత్ర సాగించింది. కానీ, ఇప్పుడు హైదరాబాద్‌లో అభివృద్ధి మాయమైంది. సీఎం రేవంత్‌రెడ్డి పేద ప్రజల కోసం ఇండ్ల నిర్మాణాలకు బదులుగా కూల్చివేతలను ఎంచుకున్నారు. తాము జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇల్లు కూడా ఈ కాంగ్రెస్ పాలన పూర్తయ్యే సరికి ఉంటుందా.. ఉండదా.. అన్న భయం హైదరాబాద్ ప్రజలను వెంటాడుతున్నది. చెరువులు, నాలాలకు సమీపంలో ఇండ్లు ఉన్న ప్రజలు రోజూ హైడ్రా భయంతోనే బతకాల్సి వస్తున్నది. దీన్ని దూరం చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాల్సిందే. అందుకు మొదటి అడుగు.. బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ లేనంత వేగవంతమైన అభివృద్ధికి సాక్షిగా నిలిచిన జూబ్లీహిల్స్ నుంచి పడాల్సిందే.
(వ్యాసకర్త: కరీంనగర్ శాసనసభ్యులు,రాష్ట్ర మాజీ మంత్రివర్యులు)
-గంగుల కమలాకర్