పార్టీ ఫిరాయింపుల గురించి కాంగ్రెస్ నేతల మాటలను చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నది. 1960లలో దేశంలో మొట్టమొదటిసారిగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది కాంగ్రెస్సే. ప్రభుత్వాలను పడగొట్టిందీ కాంగ్రెస్సే. ఫిరాయింపులకు విరుగుడు మంత్రాన్ని జపించిందీ కాంగ్రెస్సే. ఇప్పుడు మళ్లీ ఫిరాయింపులకు పాల్పడుతూ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ నీతి వాక్యాలు వల్లిస్తున్నది కాంగ్రెస్సే. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి తీవ్ర అన్యాయం చేస్తూనే ఉన్నది. 1969లో తొలి దశ ఉద్యమంలో 369 మందిని కాంగ్రెస్ బలి తీసుకున్నది. తెలంగాణ ప్రజా సమితిని విలీనం చేసుకొని తెలంగాణకు తీరని ద్రోహం చేసింది. 2009 తర్వాత ఉవ్వెత్తున ఎగిసిన మలి దశ ఉద్యమంలో వందల మంది యువత బలిదానాలకు కారణమైంది కాంగ్రెస్సే.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్‌పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ గుంజుకున్నది. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా ఆ పార్టీ తీరు మారలేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని తిరుగుతున్నా తమకేమీ సంబంధం లేదని హస్తం పార్టీ బుకాయిస్తున్నది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై క్షేత్రస్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. పార్టీ మారినవారు రాజీనామా చేసి, మళ్లీ గెలవాలని కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించే దమ్ము కాంగ్రెస్ నాయకత్వానికి లేదు. ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్- బీజేపీలు ఒక రహస్య ఎజెండాతో ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నాయి. ప్రధానంగా దక్షిణాదిన బీఆర్ఎస్ను రెండు జాతీయ పార్టీలు టార్గెట్ చేశాయి. తమకు ఎదురుతిరిగిన ప్రాంతీయ పార్టీల నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయి.
గడిచిన పదేండ్లలో బీజేపీ ఒక క్రమపద్ధతిలో ప్రాంతీయ పార్టీలను పతనం చేస్తూ వస్తున్నది. శివసేన, ఎన్సీపీలను ఇప్పటికే చీల్చగా; బీజేడీ, బీఎస్పీ, ఎస్పీ, ఆర్జేడీ వంటి పార్టీలను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలున్నాయి. ప్రాంతీయ పార్టీలు లేకుంటే ఏ గొడవలు లేకుండా తామే దేశాన్ని పాలించవచ్చనే భావనలో రెండు జాతీయ పార్టీలున్నాయి. అందుకే ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాయి. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ కుట్రలను యావత్ దేశం గమనిస్తున్నది. రాజకీయ చైతన్యం ఎక్కువున్న తెలంగాణ ప్రజలు ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నారన్న విషయాన్ని మరువొద్దు.
– డాక్టర్ సత్యవతి బోయినపల్లి, బీఆర్ఎస్ నాయకురాలు