సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఆరు నెలలైనా గడవక ముందే దేశంలో ‘మినీ జనరల్ ఎలక్షన్స్’కు నగారా మోగింది. రెండు రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలతో పాటు రెండు లోక్‌సభ స్థానాలు, 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ప్రకటిస్తూ భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అందరి దృష్టీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపైనే ఉన్నప్పటికీ, మిగతా ఎన్నికలేమీ తక్కువయి కావు. రాశి కన్నా వాసి మిన్న అన్నట్టు సమయ, స్వభావరీత్యా ఆయా రాష్ర్టాల్లోని ఉప ఎన్నికలూ కీలకమైనవే! కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్ (కేరళ) లోక్‌సభ స్థానంలో ఆయన సోదరి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోటీ చేస్తున్నారు. 15 రాష్ర్టాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు, వాటి ఫలితాలతో ఆయా రాష్ర్టాల్లో ప్రభుత్వాలేం మారవు. కానీ, ఒక సంకేతం! సంకీర్ణ ప్రభుత్వాల శకంలో కూటముల బలాబలాల గణింపుకొక సందర్భం. మారుతున్న రాజకీయ పరిణామాలు, ద్విధృవ రాజకీయాల్లో జరిగే పునరేకీకరణలకు ఇదొక నమూనా! అంతస్సమీక్షకు ఓ అవకాశం!
కూటములుగా తప్ప సొంతంగా ఏ పార్టీ మెజారిటీ సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితులు లేని మహారాష్ట్ర ఎన్నికలకు సిద్ధమైంది. వచ్చే నెల 20న పోలింగ్, 23న ఓట్ల లెక్కింపు-ఫలితాల వెల్లడి అని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. దాంతో పాటు జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి, వయనాడ్ (కేరళ), నాందేడ్ (మహారాష్ట్ర) లోక్‌సభ స్థానాలకు, మరో 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధానంగా.. ఉత్తరప్రదేశ్ (9), రాజస్థాన్ (7), పశ్చిమబెంగాల్ (6), అసోం (5), పంజాబ్ (4), బీహార్ (4), కర్ణాటక (3) తదితర రాష్ర్టాల్లో ఈ నియోజకవర్గాలున్నాయి. ఒక్కోచోట ఒక్కో రాజకీయ పరిస్థితి నెలకొని ఉన్నది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పాలక ఎన్డీయే, విపక్ష ఇండియా కూటముల మధ్య అంతరం తగ్గి, పోటీ బలపడుతున్న క్రమంలో ఈ ఉప ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు పలు చోట్ల ముఖాముఖి తలపడనుండగా, వేర్వేరు రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతీయ పార్టీలు కూడా రెండు ముఖ్య కూటముల్లో భాగమై కొన్ని చోట్ల, ఏ కూటమికీ చెందక బయటినుంచి విడిగా పోటీ చేస్తున్నాయి.
కార్యక్షేత్రం యూపీ: భారత జాతీయ రాజకీయాలకు ఉత్తరప్రదేశ్‌ను దిక్సూచిగా పరిగణిస్తారు. ఇక్కడి రాజకీయ పరిణామాలు రాబోయే జాతీయ సమీకరణాలకు సంకేతంగా ఉంటాయన్నది పలుమార్లు రుజువైన సత్యం. యూపీలో 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 400 స్థానాలు సాధించాలన్న ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అన్న బీజేపీ నినాదాన్ని గట్టిగా గండికొట్టిన రాష్ట్రమిది. సమాజ్ వాది పార్టీ (ఎస్పీ) నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో ఇండియా కూటమి’ మంచి ఫలితాలు సాధించింది. పదేండ్లుగా ఇక్కడ సర్కారు నడుపుతున్న బీజేపీలో సంస్థాగతమైన అంతర్గత సమస్యలున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య నడుమ ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నది. ఉప ముఖ్యమంత్రి బహిరంగంగానే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఆయనకు ప్రధాని మోదీ-హోం మంత్రి అమిత్ షా జోడీల వెన్నుదన్నులు ఉన్నాయనే ప్రచారం పార్టీ వర్గాల్లోనూ ఉన్నది. బీజేపీ సిద్ధాంత మాతృక అయిన ఆర్ఎస్ఎస్ అండదండలు సీఎం యోగికి పుష్కలంగా ఉన్నాయని, అదే సీఎం-డీసీఎంల మధ్య స్పర్థకు కారణమనే వ్యాఖ్యానాలు మీడియాలో తరచూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నికలను ఎలా నెట్టుకువస్తారన్నది పెద్ద ప్రశ్నే! ఇక, ఇండియా కూటమిలోనూ అభిప్రాయ భేదాలున్నాయి. వాస్తవికమైన ప్రజాబలం లేకున్నా ఎక్కువ సీట్లకు బెట్టు చేసి, కూటమి ఉమ్మడి ప్రయోజనాలను కాంగ్రెస్ దెబ్బతీస్తున్నదనే బలమైన భావనతో అఖిలేశ్ ఉన్నారు. అందుకేనేమో, సంప్రదింపులు ఏమీ లేకుండానే 6 అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆయన ఏకపక్షంగా ప్రకటించేశారు.
పరీక్షాస్థలి పంజాబ్: ఇటీవల చతికిలపడ్డ ‘ఆప్’ తిరిగి పుంజుకోవడానికి పంజాబ్ ఉప ఎన్నికలు అరవింద్ కేజ్రీవాల్‌కు ఒక అవకాశం. ఆయన అరెస్టయి, బెయిల్‌పై బయటికి వచ్చిన లిక్కర్ కేసు అవినీతి ఆరోపణలు ‘పంజాబ్’ ఎన్నికలకు సంబంధించినవే కనుక తన నిర్దోషిత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిరూపించుకోవాల్సిన సవాల్! ఇక్కడ 4 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. పొరుగు రాష్ట్రం హర్యానా ఎన్నికల్లో దాదాపు అన్ని స్థానాలకు పోటీ చేసి, కనీసం ఒక్క స్థానం కూడా దక్కించుకోని ‘ఆప్’ దుస్థితిని ఇక్కడ తిరగరాయాలి. 2 శాతం ఓటు వాటా దక్కించుకున్నా ఒక్క సీటూ గెలువలేకపోవడానికి కారణం, కేజ్రీవాల్ బెయిల్‌పై బయటకు రావడంలో జరిగిన జాప్యమని పార్టీ వర్గాలు సమర్థించుకున్నాయి. ఇప్పుడు పూర్తి సమయం ఆయన అందుబాటులో ఉండటం వారికి కలిసివచ్చే అంశమే! ఇండియా కూటమి పొత్తులు ఇక్కడ ఎలా ఉంటాయి? ప్రత్యర్థి కూటమి ఎన్డీయేలో, తిరిగి జతకట్టిన బీజేపీ-అకాలీదళ్ సఖ్యత ఎంత ఫలించేనో? వేచి చూడాల్సిందే!
రాజస్థాన్ రాస్తా మారేనా?: ప్రతి తడవా ప్రభుత్వాలు మారే రాజస్థాన్ ఉప ఎన్నికల్లో ఎవరికి ఆధిక్యత లభిస్తుందనే ఉత్కంఠ రాజకీయవర్గాల్లో ఉన్నది. 10 నెలల కింద, అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచి చరిత్ర తిరగరాస్తామన్న కాంగ్రెస్ పప్పులేమీ ఉడకలేదు. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, యువ నాయకుడు సచిన్ పైలెట్ వర్గాల మధ్య సయోధ్య, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కుదరలేదు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 14, కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీ అధికారం కైవసం చేసుకున్నా.. వారిలో అంతర్గత వైషమ్యాలున్నాయి. బీజేపీ-కాంగ్రెస్ ముఖాముఖి తలపడే రాజస్థాన్‌లో 7 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఎవరిదో ఆధిపత్యం?
మమత ప్రభ తగ్గిందా, పెరిగిందా?: రావణ కాష్టంలా నిత్యం రగిలే రాష్ట్రం పశ్చిమబెంగాల్లో 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. గవర్నర్-ప్రభుత్వం మధ్య సమన్వయ లోపం నిరంతర వివాదాలకు కారణమవుతున్నది. పనికిమాలిన పంతాలకు వెళ్లి కిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ నువ్వా-నేనా అన్నట్టు పోటీని రసవత్తరం చేశాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభ తగ్గుతున్నదనే ప్రచారం బెంగాల్ బయట ఎక్కువగా వినిపిస్తున్నది. ఆమెను ఇబ్బంది పెట్టే అన్ని మార్గాలూ వెతుకుతుందనే ముద్ర పడిన బీజేపీ, సంస్థాగతంగానే కాకుండా ప్రజాదరణ పరంగా కూడా పుంజుకున్న ఛాయలు లేవు. కమ్యూనిస్టులు ఒకవైపు బలపడే యత్నాల్లో ఉన్న బెంగాల్లో ‘ఇండియా కూటమి’ భాగస్వామ్య పక్షాలైన టీఎంసీ-కాంగ్రెస్ ఏ మేరకు సయోధ్యకు వస్తాయి? కమ్యూనిస్టులతో ఎలా వ్యవహరిస్తారు? అన్నది కీలకం. ఉప ఎన్నికలను, తమ రాజకీయ ప్రయోగాలకు వాడే ప్రయత్నం చేస్తారా వేచి చూడాల్సిందే!
సిద్ధుకు పెరిగిన కష్టాలు: ఏడాది కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీది ‘40 శాతం కమిషన్ ప్రభుత్వమ’నే ప్రచారంతో కర్ణాటక కాంగ్రెస్ పైచేయి సాధించి, గెలిచి సర్కార్‌ను ఏర్పర్చింది. ఎక్కువ ప్రజాదరణతో ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కడకు గవర్నర్ అనుమతించారు, లోకాయుక్త విచారణ చేపట్టింది. పార్టీ అధినాయకత్వం సీఎంను మారుస్తుందనే ప్రచారం ఊపందుకోవడంతో.. ‘కర్ణాటకలో రెండో కృష్ణు డు ఎవరు?’ అనే ప్రశ్న సహజంగానే పుట్టింది. ‘కర్ణాటక మళ్లీ మాదే’ అంటున్నది బీజేపీ. ఈ పరిస్థితుల్లో ఇక్కడ 3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. అందులో ఒకటి, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రి అయిన, జనతాదళ్ సెక్యులర్-జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఖాళీ చేసిన అసెంబ్లీ స్థానం. మరి, కన్నడిగుల మనసేమిటో?
ఇవే కాకుండా బీహార్, కేరళ, మధ్యప్రదేశ్, సిక్కిం రాష్ర్టాల్లో రెండేసి చోట్ల, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, ఉత్తరాఖండ్ రాష్ర్టాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఉప ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికలు కొందరికి సవాల్ అయితే, మరికొందరికి అవకాశం. ముఖ్యంగా ఎన్డీయే, ఇండియా కూటములకు నేతృత్వం వహిస్తున్నవారు సయోధ్యతో సత్ఫలితాల సాధనకు, సరైన సంకేతాలు పంపుకోవడానికి ఇది సముచిత సందర్భం! జమ్ము-కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారానికి ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ హాజరయ్యారు. ఇద్దరూ ఇండియా కూటమి వారే! వారికి ఉమ్మడి రాజకీయ కార్యక్షేత్రం లేదు. ఇటువంటి సయోధ్య వేడుకలు-సంబరాలకేనా? కూటమి పక్షాల మధ్య సరైన పొత్తులు, ప్రజామోదం పొందడంలోనూ ఉంటుందా? ప్రశ్నించుకునే సమయం. పరీక్షించుకునే అవకాశం ఇది!