నియంత రాజ్యాలు, నియంతృత్వ పాలన ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. పుటలను తిరగేసి చూస్తే చరిత్ర మనకు చెప్పేది ఇదే. ప్రపంచ రాజకీయాలను ఒకసారి పరికించి చూస్తే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ పాలన సాగిస్తున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ పదవి నుంచి దిగిపోవలసి వచ్చింది. ఇప్పుడు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వంతు వచ్చింది. అంతెందుకు మన దేశంలోనే ఇలాంటి ఉదాహరణలు అనేకం. ప్రజాతీర్పును కాలరాస్తూ దేశాన్ని ఎమర్జెన్సీ కూపంలోకి నెట్టిన ఇందిరాగాంధీ చిత్తు చిత్తుగా ఓడిపోయిన ఉదంతాన్ని ఈ దేశం కండ్లారా చూసింది.
దేశ ప్రజలను పీడించడమే తన పీఠానికి పునాదిగా చేసుకొని పాలించిన ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకులు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని వాగ్దానం చేశారు. వారు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకపోయినా ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామన్న వాగ్దానాన్ని మాత్రం నెరవేర్చారు. కాంగ్రెస్ పాలకులు తీసుకొస్తామన్నది ‘గరీబీ హఠావో’ ఇందిరమ్మ రాజ్యమని ప్రజలు అనుకున్నారు. కానీ, వాస్తవానికి వారు తీసుకొచ్చింది ఎమర్జెన్సీ కాలం నాటి ‘జైల్ భరో’ ఇందిరమ్మ రాజ్యం. నాడు దేశంలో జరిగినట్టే.. రేవంత్ పాలనలోని నయా ఇందిరమ్మ రాజ్యంలో పేదల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. విధ్వంసం తారస్థాయికి చేరుకున్నది. కుట్రలు, కుతంత్రాలు, దాడులు, నియంతృత్వం, నిర్బంధాలను పంచ సూత్రాలుగా చేసుకొని పాలిస్తున్న రేవంత్‌రెడ్డి నాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీని ఎప్పుడో మించిపోయారు. ఆయన పాలనలో సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష నేతలు, విపక్ష పార్టీల కార్యాలయాలు కూడా దాడులకు వేదికలుగా మారుతున్నాయి.
పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలని, అడుగడుగునా నిలదీయాలని గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి నీతులు చెప్పారు. కానీ నేడు సీఎం హోదాలో ఆయనే స్వయంగా ప్రతిపక్ష నేతలకు కండువాలు కప్పుతున్నారు. అదేమిటని నిలదీస్తే.. ప్రశ్నించిన వారిపైనే తిరిగి దాడులు చేయిస్తున్నారు.
తమరు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారని అడిగినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పార్టీ ఫిరాయించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు మరో అడుగు ముందుకేసి కౌశిక్‌రెడ్డిపై అక్రమ కేసు బనాయించి రాత్రంతా జైల్లో నిర్బంధించారు. గతంలోనూ ఇలాగే ప్రశ్నించినందుకు ఫిరాయింపు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రౌడీ మూకల్ని వెంటబెట్టుకుని వెళ్లి మరీ కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి దిగారు. ప్రశ్నించిన వారిపై దాడి చేయడమే కాకుండా బీఆర్ఎస్పైనే నిందలు వేయడం హేయం. కాంగ్రెస్ పార్టీది మొదటి నుంచి దాడుల సంస్కృతి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు. లక్షల మంది ప్రతిపక్ష నేతలు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులను జైల్లో నిర్బంధించారు. ఇందిరాగాంధీ హత్య అనంతరం ఆమె కుమారుడు రాజీవ్‌గాంధీ ఏకంగా ఒక జాతినే నిర్మూలించాలని చూశారు. 2,800 మంది అమాయక సిక్కులను ఊచకోత కోయించారు. అయినా కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా నిస్సిగ్గుగా సమర్థించుకున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని వారిని మించి నియంతృత్వ పాలన సాగిస్తున్న రేవంత్‌రెడ్డి సర్కార్ నుంచి ఇంకేం ఆశించగలం.
రేవంత్ పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో దాడుల సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది. రైతు రుణమాఫీ పూర్తి అయిందో, లేదోనని తెలుసుకునేందుకు సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దుశ్శాసన పర్వానికి తెరతీశారు. అయినా రేవంత్ ఖండించలేదు. ఒకవేళ రుణమాఫీ పూర్తి చేసి ఉంటే ఆడబిడ్డలను సాదరంగా ఆహ్వానించి కాంగ్రెస్ నాయకులే దగ్గరుండి అన్ని వివరాలు చెప్పి ఉండేవారు. పూర్తి కాలేదు కాబట్టే వారిపై దాడులకు తెగబడ్డారు. అదే గ్రామ మాజీ సర్పంచ్ ఒకరు రేవంత్ సోదరుల అరాచకాలకు బలయ్యారు. రేవంత్ ప్రోద్బలంతో హైదరాబాద్ నడిబొడ్డున ప్రముఖ సినీ నటుడి ఇంటిపై ఓయూ జేఏసీ ముసుగులో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ముఖ్యమంత్రిని విమర్శించిన పాపానికి ఇటీవల భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నేతలు విధ్వంసం సృష్టించారు. ఇలా చెప్పుకుంటూ పోతే రేవంత్‌రెడ్డి 13 నెలల పాలనలో జరిగిన దాడులు, దారుణాలకు అంతే లేదు.
అధికారం శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులే శాశ్వతంగా నిలిచిపోతాయి. అలాంటి ఒక్క పని అయినా ఇప్పటివరకు చేశారో, లేదో వెనక్కి తిరిగి రేవంత్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ నేల ఎప్పుడు పీడనను సహించదు. నిజాం రాజుల నుంచి సమైక్య పాలకుల వరకు తరిమికొట్టిన చరిత్ర తెలంగాణది. రేవంత్ పాలనలో విసిగి వేసారిపోయిన పీడిత ప్రజలతో ఇప్పటికే రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. నిరసనలు, ఆందోళనలు చేసి పాలకులను గద్దె దించే సంస్కృతిని మనం ఇప్పటివరకు విదేశాల్లోనే చూశాం. రేవంత్ సర్కార్ దాడుల పుణ్యమాని త్వరలోనే ఆ సంస్కృతిని తెలంగాణలో చూస్తామని అనిపిస్తున్నది.