తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణకు కాంగ్రెస్ రూపంలో ఒక బ్రేక్ పడింది.
కేసీఆర్ అద్భుత పాలనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో, దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశించి ప్రకంపనలు సృష్టిస్తున్న తరుణంలో… కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ ధర్మాన్ని, సిద్ధాంతాలను వదిలి చీకట్లో ఒప్పందాలు చేసుకొని కేసీఆర్‌ను గద్దెదించేందుకు కలిసి పనిచేశాయి. ప్రజలకు ఇబ్బడి ముబ్బడిగా హామీలను కురిపించి, సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేశాయి. అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమని నమ్ముతారనే సూత్రాన్ని అమలుచేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రాంతంపై నిర్దిష్టమైన, కనీస అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ ముఖ్యమంత్రి అయిన నాటినుంచి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో తిరోగమనం మొదలైంది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని జల భాండాగారంగా మార్చేందుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును లేకుండా చేసే కుట్ర చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఆయనకు కాళేశ్వరం ప్రాజెక్టుపై కనీస అవగాహన ఉన్నదా అంటే లేదనే చెప్పాలి. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కి.మీ. ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. కానీ, కుంగిన రెండు పిల్లర్లను పట్టుకొని కుళ్లిన మెదళ్లతో ఇంత పెద్ద ప్రాజెక్టును బద్నాం చేసే కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు ఆడినంత ఈజీగా ప్రకృతి అబద్ధాలు ఆడదు. ఇటీవల కాంగ్రెస్ మంత్రులు కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ గుండా నీటిని విడుదల చేసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. మరి కాళేశ్వరం కూలిపోతే ఈ నీళ్లెక్కడివి? ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆ కాళేశ్వర ముక్తేశ్వరుడే కాంగ్రెస్ కళ్లు తెరిపిస్తాడు.
కేసీఆర్ మీద ద్వేషంతో కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేసి పంటలను ఎండబెట్టే కుట్ర చేస్తున్నది. ముమ్మాటికీ ఈ కుట్రను కేసీఆర్ సహించరు. మేడిగడ్డలో సమస్య ఉంటే కన్నెపల్లి పంప్‌హౌజ్ దగ్గర గోదావరి నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉంది. తద్వారా చెరువులు, కుంటలు రిజర్వాయర్లను నింపే అవకాశం ఉన్నది. అది చేయకపోగా ప్రాజెక్టు పాడైపోయిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలాడుతున్నది. ఈ కుట్రలను గ్రహించిన కేసీఆర్ మరో పోరాటానికి సిద్ధమయ్యారు.
తెలంగాణ రైతాంగం కోసం తాను పోరాడి సాధించిన నీళ్లను భూములకు మళ్లించకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని, వారి కుట్రలను ప్రజల ముందు ఎండగట్టేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ సోయికి వచ్చి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి. లేకుంటే, రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
కాళేశ్వరంపై చర్చను కాస్త పక్కనపెట్టి, ఒకసారి బనకచర్ల విషయానికి వద్దాం. తెలంగాణ నీళ్లను చంద్రబాబుకు ధారాదత్తం చేసేందుకు సీఎం రేవంత్ సిద్ధమయ్యాడు. బనకచర్ల పేరుతో చంద్రబాబు గోదావరి జలాలను మళ్లించుకుపోయే కుట్రలు చేస్తుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చంద్రబాబుకు భజన చేయడం విడ్డూరంగా ఉన్నది. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు తెలంగాణకు ఇచ్చి ఎన్ని నీళ్లయినా ఏపీకి తీసుకుపో అంటూ చంద్రబాబుకు రేవంత్ ఆఫర్ చేయడం అతని అవగాహనారాహిత్యానికి నిదర్శనం. గతంలో కేసీఆర్ గోదావరిలో 2,918 టీఎంసీల నీళ్లు తెలంగాణకు కావాలని అడిగారు. కృష్ణాలో 763 టీఎంసీలు కావాలని కేసీఆర్, న్యాయవాదులు పోరాటం చేస్తున్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాత్రం కృష్ణాలో 573 టీఎంసీలు చాలని మాట్లాడటం చూస్తుంటే వీరికి తెలంగాణ సాగునీటి రంగంపై ఏపాటి అవగాహన ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
వరద జలాలను మాత్రమే వాడుకుంటామని చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అసలు గోదావరిలో నికరజలాల లెక్కే తేలలేదు, మరి వరద జలాలు ఎక్కడినుంచి వచ్చాయో చంద్రబాబు, అతని శిష్యుడు రేవంత్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఉద్యమ కాలం నుంచి తెలంగాణ నీటి కోసం రాజీలేని పోరాటం చేసింది కేసీఆర్. తెలంగాణ ప్రయోజనాలకు ఎక్కడా భంగం కలుగకుండా కేంద్ర ప్రభుత్వంతో కూడా కొట్లాడింది కేసీఆర్. కానీ, నేడు పదవీ కాంక్షనో లేక తనపై ఉన్న కేసుల భయమో.. ప్రధాని మోదీ, ఏపీ సీఎం బాబు చేతిలో సీఎం రేవంత్ పావుగా మారాడు. అందుకే, తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ తన స్వప్రయోజనాలకు భంగం కలుగకుండా చూసుకుంటున్నాడు. కానీ, వారి ఎత్తులు పారవు. కాంగ్రెస్ కుట్రలను ప్రజల్లో చర్చ పెట్టి నీళ్లు ఎత్తుకుపోవాలని చూస్తున్న బాబు ఎత్తులను కేసీఆర్ తప్పకుండా చిత్తు చేస్తారు.
తెలంగాణ నీళ్లపై, తెలంగాణ ప్రయోజనాలపై, తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ చేస్తున్న విద్వేష పు కుట్రలను బీఆర్ఎస్ పార్టీ తిప్పికొట్టి మరోమా రు అధికారంలోకి వస్తుంది. తెలంగాణను అగ్రభాగాన నిలబెడుతుంది. ఆరు నూరైనా.. నూరు ఆరైనా తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష.
-తెలంగాణ విజయ్
94919 98702