భారత రాష్ట్ర సమితికి వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు పట్టం కడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ తొమ్మిదేండ్ల సమయంలో చేసిన అభివృద్ధి పథకాలే మళ్ల్లీ బీఆర్ఎస్కు శ్రీరామరక్ష . దేశంలో కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ర్టాల ప్రభుత్వాలు కూడా చేయలేని ఎన్నో పనులను తెలంగాణ ప్రభుత్వం చేసి చూపెట్టింది. తొమ్మిదేండ్ల స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ స్థిరమైన ఆర్థిక ప్రగతిలో మెరుగైన రాష్ట్రంగా అవతరించింది.
నేడు దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉన్నది. అలాగే తలసరి విద్యుత్తు వినియోగంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ధాన్యం కొనుగోళ్లలోనూ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది . నిరంతర ఉచిత విద్యుత్తు , రైతుబంధు , రైతుబీమా , రైతు రుణమాఫీ వంటి వినూత్న పథకాలు , విప్లవాత్మక సంస్కరణలతో వ్యవసాయరంగం సుసంపన్నమైంది. దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా నిలిచింది. విద్య , వైద్యరంగాల్లోనూ ముందంజలో తెలంగాణ ఉన్నది .
ఈ తొమ్మిదేండ్ల స్వల్పకాలంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మన విజయాలెన్నో కంటిముందు కనిపిస్తాయి. నేడు కరెంటు కష్టాలను అధిగమించి 24 గంటల విద్యుత్ సరఫరా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ , మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా , రైతు రుణమాఫీ , మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ , రైతుబంధు , రైతుబీమా , సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం , దళిత బంధు , డబుల్ బెడ్రూం ఇండ్లు , చేప పిల్లల పెంపకం , గొర్రెల పంపిణీ , సెలూన్లు , దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్ , గురుకుల విద్యాలయాల ఏర్పాటు వంటి పథకాలు , కేసీఆర్ కిట్ , బస్తీ దవాఖానాలు , పల్లె / పట్టణ ప్రగతి , టీఎస్ – ఐపాస్ , భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయి.
ఉద్యోగ కల్పనలో భాగంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఖాళీలను భర్తీ చేశారు. ఎనిమిదేండ్లలో పారిశ్రామిక , ఐటీ రంగాలు పరుగులు తీసి , తెలంగాణ మేటిగా నిలిచింది. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు మన రాష్ట్రం గమ్యస్థానంగా నిలిచింది. అంకుర సంస్థల వేదికలైన టీహబ్, వీహబ్ దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన యాపిల్ , గూగుల్ , అమెజాన్, మైక్రోసాఫ్ట్ , ఫేస్బుక్ తమ కార్యకలాపాలను విశ్వ నగరమైన హైదరాబాద్‌లో విస్తృతపరిచాయి. సేల్స్ ఫోర్స్ , ఉబర్ , మైక్రాన్ , స్టేట్ స్ట్రీట్ , ఫియట్ క్రిజ్లర్ , మాస్ , ఇంటెల్ , ప్రావిడెన్స్ , యూబీఎస్ , ఎంఫసిస్ , పెప్సీ , లీగాటో , ఎఫ్-5 లు కూడా తెలంగాణలో ఏర్పాటయ్యాయి. ప్రభు త్వం నాస్కామ్ భాగస్వామ్యంతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా హైదరాబాద్నిలిచింది . వరంగల్ , ఖమ్మం , కరీంనగర్ , నిజామాబాద్ , నల్గొండ, సిద్దిపేట వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు ప్రభు త్వం ఐటీ పరిశ్రమను విస్తరింపజేసింది. తెలంగాణ ఐటీ ఎగుమతుల మొత్తం విలువ రూ .7,78,522 కోట్లు . 2021-22 గణాంకాల మేరకు కొత్తగా దాదాపు 7,78,125 మంది ఈ రంగంలో పనిచేస్తున్నారు.
నీటిపారుదల రంగానికి వస్తే ప్రపంచంలోని ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో అతి పెద్దదైన కాళేశ్వరం భారీ ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రభు త్వం రికార్డు సమయంలో నిర్మించింది. కల్వకుర్తి, నెట్టెంపాడు , కోయిల్‌సాగర్ , భీమా , ఎల్లంపల్లి , మిడ్‌మానేరు, దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేసింది. నాగార్జునసాగర్ , శ్రీరామసాగర్ , నిజాం సాగర్ తదితర పాత ప్రాజెక్టుల కాల్వలను ప్రభుత్వం ఆధునికీకరించింది. మిషన్ కాకతీయతో దాదాపు 46,531 చెరువులను పునరుద్ధరించగా 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. వైద్య , ఆరోగ్య రంగంలోనూ రాష్ట్రం గణనీయమైన పురోగతిని సాధించింది. ఆరోగ్యశ్రీని ప్రభుత్వం మరింత అందుబాటులోకి తెచ్చి , రాష్ట్ర రాజధాని నలుమూలలా సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి శ్రీకారం చుట్టి , హైదరాబాద్‌లో 256 బస్తీ దవాఖానాలను ప్రారంభించి వాటిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది.
దళితులను ఆర్థికంగా బలోపేతం చేసి,సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కలిగించాలని , దళితులంతా స్వశక్తితో , స్వావలంబనతో జీవించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగా సమాజంలో అనాదిగా అణగారిన దళితజాతి అభ్యున్నతికి పాటుపడటమే ధ్యేయంగా, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా, తెలంగాణ రాష్ట్రం దళితబంధు పథకాన్ని ప్రారంభించి అమలు పరచి, ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నది.
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో రికార్డు స్థాయిలో 11 విడుతలలో రైతుబంధు సాయాన్ని నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేసిన ధీశాలి ప్రభుత్వం కేసీఆర్‌ది. రైతు బంధు పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్య 68,99,076. మట్టిని నమ్ముకున్న రైతులకు మలిద ముద్దలాగా ఏడాదికి రెండుసార్లు రైతుబంధు ఇవ్వడం, అన్నం పెట్టే రైతన్నకు రెండు పర్యాయాలు లక్ష రూపాయల రుణమాఫీ చేయడం కేసీఆర్ ఘనత.
ఈ విధంగా పలు నూతన సంక్షే మ పథకాలు, విధానాలకు ప్రారంభించి, విజయవంతంగా అమలు పరుస్తూ ప్రజల అన్ని వర్గాల మన్ననలు అందుకుంటున్న బీఆర్ఎస్ను కాదని ఇతర పార్టీలకు పట్టం గట్టే ఆలోచనలో ప్రజలు లేరు. తెలంగా ణ ప్రభుత్వం అమలు పరచిన విధానాలు , పథకాలు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు శ్రీ రామ రక్ష.
-గుగులోత్ రాజేష్ నాయక్
96035 79115