మన దేశంలో గవర్నర్లు వివాదాస్పదంగా వ్యవహరించడం కొత్తేమీ కాదు. ఏదో ఒక రాష్ట్రంలో గవర్నర్లు తరచూ వివాదాల్లో చిక్కుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో రాజకీయంగా విభేదిస్తున్న కేరళ, తమిళనాడు, తెలంగాణ, బెంగాల్ వంటి రాష్ర్టాల్లో. మరీ ముఖ్యంగా తెలంగాణలో గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు లేని విషయం తెలిసిందే. తాజాగా కౌన్సిల్ సభ్యుల నియామక విషయంలో గవర్నర్ చర్య వివాదాస్పదమైంది. దీనికి కారణం ఎవరు?
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి అదే పనిగా అడ్డంకులు సృష్టించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపటంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరంగా గవర్నర్ ఆమోదం కోసం పంపే సాధారణ ప్రతిపాదనలను ఆమోదించటంలో గానీ రాజ్‌భవన్ నుంచి అనేక అవరోధాలు ఎదురుకావడం తెలంగాణలో తరచూ చూస్తున్నాం. గతంలో నరసింహన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కానీ, అప్పుడు లేని ఆటంకాలు ఇప్పుడు ఎందుకు ఏర్పడుతున్నాయి? అంటే మారింది ప్రభుత్వ దృక్పథం కాదు; గవర్నర్ వ్యవహార శైలి.
గతంలో గవర్నర్లుగా ఉన్నవారు ప్రజాస్వామ్య రాజకీయాల్లో అనుభవం ఉన్నవారు గనక రాజ్యాంగం గురించి ఉన్న అవగాహన మేరకు హుందాగా నడచుకొనేవారు. ఎవరి పరిమితికి లోబడి వారు నడుచుకొనేవారు. అప్పుడు ఏ సమస్యా లేదు. అయితే 1980 తర్వాత గవర్నర్ల నియామకం విచక్షణారహితమై పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్నది. అందుకు తగినట్టే ఉన్నది గవర్నర్ల నడవడిక కూడా. ఇది రామ్‌లాల్ విషయంలో పరాకాష్ఠకు చేరింది.
కానీ, ఎప్పుడూ ఏ ఎన్నికలోనూ పాల్గొననివారు, గెలవనివారు, ఒక పార్టీ తరపున క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నవారు హఠాత్తుగా రాజ్యాంగపరమైన గవర్నర్ పదవిలో ఉంటే వచ్చే చిక్కులు మనం నేడు ముఖ్యంగా తెలంగాణలో చూస్తున్నాం! రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటా కింద కౌన్సిల్ సభ్యులుగా నియామకానికి ఇద్దరి పేర్లను సిఫారసు చేస్తే గవర్నర్ ఆ పేర్లను తిరస్కరించారు. అయితే గవర్నర్ లేవదీసిన అభ్యంతరాలు రాజ్యాంగపరమైనవి కాకుండా రాజకీయ అభ్యంతరాలుగా కనిపిస్తున్నాయి పండితులకు, పామరులకు. ఎవరైనా పరిమితి దాటి వ్యవహరిస్తేనే సమస్య. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది అదే. రాజ్యాంగం లోని ఆర్టికల్ 71 (5) ప్రకారం గవర్నర్ కౌన్సిల్‌కు నియమించే వారు సాహిత్యం, సైన్స్, కళలు, సహకార రంగం, సంఘసేవలో ప్రవీణులై ఉండాలి. ఈ నిబంధన ప్రకారం ప్రభుత్వం రెండు పేర్లను సామాజిక సేవ చేసినవారుగా గుర్తించి గవర్నర్‌కు సిఫారసు చేసింది.
గవర్నర్ వారిద్దరూ రాజకీయ నేపథ్యం ఉన్నవారే కానీ రాజ్యాంగంలో పేర్కొన్న విషయాల్లో ప్రవీణులై ఉన్నవారు కాదని వారిని తిరస్కరించారు. పైగా రాజకీయాలతో సంబంధం లేని వారిని మాత్రమే పరిశీలించాలని కూడా ఆదేశించారు. ఇది పూర్తిగా అర్థరహితమైన ఆలోచన. రాజ్యాంగంలోని 71(5) అధికరణం రాజకీయాలతో సంబంధం ఉండకూడదని చెప్పలేదు. అదే ఇక్కడ వివాదానికి హేతువు. ఈ అధికరణంలో పేర్కొన్న రంగాల్లో ప్రవీణులనడానికి ప్రాతిపదిక ఏమిటి? దాంట్లో ఏమి చేసి ఉండాలి? ఉద్యమం అంటే పోలీసు కేసులు గట్రా నమోదై ఉండాలా? స్వాతంత్య్ర సమరయోధులు అంటే జైలుకు పోయినవారే కదా? రాజకీయంలో ఉన్నవారు సంఘసేవ చేయడం లేదా? రాజకీయ రంగంలో పనిచేస్తూ నేత అనే గుర్తింపు పొందిన వారి వద్దకు రోజూ అనేక మంది వస్తుంటారు ఏదో ఒక సహాయం కోసం.
తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన వారిని కానీ, ఉద్యమానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించిన వారిది సంఘసేవ కాదా? రాజకీయరంగంలో ఉన్నారు గనక వారు సంఘసేవ చేసిన వారు కాదనటం అర్థరహితమైన కవాతు. రాజ్య సభకు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నవారిని ఎప్పటి నుంచో నియమిస్తున్నారు. ప్రస్తుతం రాజ్య సభలో నామినేటెడ్ కేటగిరీలో 10 మంది ఉన్నా రు. అందులో అయిదుగురు బీజేపీకి చెందినవారే. దీనికి రాష్ట్రపతిని నిలదీయాలా లేక సిఫారసు చేసిన మోదీ ప్రభుత్వాన్ని నిలదీయాలా?
రాజ్యాంగబద్ధ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించటం విచారకరం. గవర్నర్ చర్య రాజ్యాంగస్ఫూర్తికి భిన్నంగా ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు. దీన్ని ఏ విధంగా చూడాలనేది ప్రధాన సమస్య. చట్టానికి నిర్దిష్టమైన అర్థం లేదు ప్రపంచంలో ఎక్కడా! వక్రభాష్యం చెప్పవచ్చు, సక్రభాష్యమూ చెప్పవచ్చు. రాజ్యాంగం జాతికి ఒక ప్రాథమిక చట్టం, ప్రమాణ పత్రం. అందువల్ల రాజ్యాంగం ఏం చెప్తుందీ అనే విషయంలో ప్రజలకు ప్రాథమికంగా చాలావరకు అవగాహన ఉంటుంది. రాజ్యాంగాన్ని రక్షిస్తానని ప్రమాణం చేసినవారే దాని ఉల్లంఘిస్తే, ప్రజాస్వామ్య ప్రక్రియకు అర్థమేమిటి? రాజ్యాంగ ప్రక్రియకు పరమార్థమేమిటి? చట్టసభల ఆవశ్యకత ఏమిటి? రాజ్యాంగానికి రక్షణ ఏది?
మన రాజ్యాంగం గవర్నర్‌కు కొన్ని సందర్భాల్లో విచక్షణాధికారాలు కట్టబెట్టిందనేది వాస్తవం. అయితే, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం జరిపే పరిపాలన రాజ్యాంగబద్ధంగా ఉండేలా చూడటమే గవర్నర్ ప్రథమ బాధ్యత. ఈ ప్రక్రియలోనే విచక్షణను ఉపయోగించాలి. అంతేకానీ, పరిపాలన ప్రక్రియ అంతా తన కనుసన్నల్లోనే జరగాలంటూ గవర్నరే రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా వ్యవహరిస్తే, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ప్రజల తీర్పునకు విలువ ఏముంటుంది?అయినదానికీ కానిదానికీ గవర్నర్ విచక్షణ పేరుతో పాలనలో స్తబ్ధత ఏర్పడితే ఇటువంటి ఆలోచన రాజ్యాంగాన్ని అవహేళన చేయటమే కదా. కంచే పైరును మేస్తే ఇహ చేనుకు భద్రత ఏముంటుంది?
మంత్రిమండలి సలహాలూ, సూచనల ప్రకారమే గవర్నర్ నడుచుకోవాలని రాజ్యాంగంలో లేని మాట వాస్తవం. గవర్నర్ విధి నిర్వహణలో తన విచక్షణ మేరకు నడుచుకోవాల్సిన అంశాల్లో ఆ మేరకు వ్యవహరించటం రాజ్యాంగబద్ధమే. ఈ వెసులుబాటు గవర్నరుకు పై అధికారి అయిన రాష్ట్రపతికి లేదు! 42వ రాజ్యాంగ సవరణ రాష్ట్రపతికి విధించిన నిబంధన గవర్నర్లకు ఎందుకు విధించలేదు? మన రాజ్యాంగంలో ఇది ఎప్పటికీ ప్రశ్నగా మిగిలిపోయే అంశమే.
క్రియాశీలక రాజకీయాల్లో వ్యవహరించిన వ్యక్తులను రాజ్‌భవన్‌లో కూర్చోబెడితే వారు హఠాత్తుగా మునులై పోతారా? చాలాకాలంగా గవర్నర్ల నియామకం రాజ్యాంగస్ఫూర్తికి భిన్నంగా జరుగుతూ ఉంది. రాజకీయాలకతీతంగా ఉండే మేధావులు, విద్యావంతులు, మాజీ సైనికాధికారులు, మాజీ సివిల్ సర్వెంట్లు గవర్నర్లైతే రాజ్‌భవన్‌కు రావలసిన గౌరవం వస్తుంది. కానీ వాస్తవంగా జరుగుతున్నదేమిటి? ఉదాహరణకు ఒక రాష్ట్రంలో రాజకీయ పార్టీకి నేతగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మరో రాష్ట్రంలో గవర్నర్‌గా నియమిస్తే ఆ వ్యక్తులు రాజకీయాలకతీతంగా వ్యవహరించగలరా? గతం లో ఎటువంటి పబ్లిక్ ఆఫీసూ నిర్వహించిన అనుభవం లేనివారికి రాజ్యాంగం మీద సమగ్ర అవగాహన సాధ్యమేనా?
ఇప్పుడున్న గవర్నర్లు చాలా మంది క్రియాశీల రాజకీయ నేపథ్యం ఉన్నవారే. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందినవారే. అలాంటివారు హఠాత్తుగా రాజకీయాలకతీతంగా ఎదగడం చాలా కష్టం. ఎందుకంటే గవర్నర్ పదవికి ఏమాత్రం రాజ్యాంగ భద్రత లేదు. కేంద్రంలో పెద్దలు కావాలనుకుంటే దారినపోయే దానయ్యను గవర్నర్‌ను చేయవచ్చు, ఒక్క పెన్నుపోటుతో ఎంత పేరున్న గవర్నర్నైనా ఇంటికి పంపించవచ్చు. గవర్నర్లకు పదవీ భద్రత లేదు. అందుకే వారు ఢిల్లీ పెద్దల మన్ననల కోసం ఆరాటపడతారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంటే, ఆ రాష్ర్టాల్లో గవర్నర్‌కు మంత్రివర్గానికి మధ్య ఎలాంటి సమస్య లేదు.
ఎక్కడైతే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని విభేదించే పార్టీ అధికారంలో ఉంటుందో, అలాంటి రాష్ర్టాల్లోని ప్రభుత్వాలతోనే గవర్నర్లు విభేదిస్తారు, వివాదాలు సృష్టిస్తారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, వంటి రాష్ర్టాలలో గవర్నర్‌కు ముఖ్యమంత్రికి ఎటువంటి విభేదాల్లేవు. అంతా సవ్యంగా సాగుతుంది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు అధికారంలో ఉన్న కేరళ, తమిళనాడు, తెలంగాణ, బెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ర్టాల్లోనే గవర్నర్లకు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య తరచూ వివాదాలు ముసురుతూ ఉంటాయి. ఇది కేవలం రాజకీయ కారణాల వల్లనే. ఈ దుష్ట సంస్కృతి నేటిది కాదు. ఇది కాంగ్రెస్ హయాంలో ఊపిరి పోసుకున్నది. ఇప్పుడు బాగా బలపడింది. అదే తేడా.
మన ప్రధానమంత్రి సీఎంగా ఉన్నప్పుడు రాజకీయ నేపథ్యం ఉన్నవారిని గవర్నర్లుగా నియమించకూడదని కరాఖండీగా చెప్పారు. మరి వారే ప్రధాని అయ్యాక రాజకీయ నేపథ్యం లేనివారిని ఎంతమందిని గవర్నర్లుగా నియమించారు? ఏటికి ఆవలి ఒడ్డున ఉన్నప్పుడు ఒక మాట ఇవతల ఒడ్డున ఉన్నప్పుడు దానికి భిన్నమైన మాట మాట్లాడటం మన రాజకీయ నేతలకు పరిపాటి అయింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ విలువలను గురించి ఏ నేత అయినా మాట్లాడటం హాస్యాస్పదమే. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? రాజ్యాంగానికి అర్థం చెప్పే హక్కు తమకే ఉన్నదని నొక్కి వక్కాణించే కోర్టులు మౌనంగా ఉన్నంతకాలం జాతికి తిప్పలు తప్పవు.
-గుమ్మడిదల రంగారావు