బీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కాగల అవకాశాలపై దృష్టి ఎంత అవసరమో, సంస్థాగతంగా, పాలనాపరంగా స్వయంగా తనలో చోటుచేసుకున్నాయనుకునే లోటుపాట్లను సవరించుకోవటం కూడా అంతే అవసరం. ప్రజలు ఈ రెండింటినీ గమనిస్తారు. కాంగ్రెస్ తన హామీలు అమలుపరుస్తున్నదా లేదా? పరిపాలన సజావుగా సాగుతున్నదా లేదా? అని ఒక కంట చూస్తారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో దిద్దుబాటుకు సంబంధించి జరుగుతున్నదేమిటో కూడా మరో కంట గమనిస్తారు. కనుక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వైఫల్యాలుంటే వాటిని ఎత్తిచూపుతూనే, తనను తాను సరిదిద్దుకోవటం ద్వారా మాత్రమే ప్రజల విశ్వాసం తిరిగి పొందగలదు.
కాంగ్రెస్ కుప్పలుతెప్పలుగా ఇచ్చిన హామీల అమలు అసాధ్యమని, అందుకు అవసర మైన ఆర్థిక వనరులు రాష్ర్టానికి లేవనే మాట నిపుణుల నుంచి బలంగా వినవస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల అమలుకే నిధులు బొటాబొటిగా ఉండేవి. కాగా, కాంగ్రెస్ పార్టీ ఆ పథకాలను కొనసాగించటమే గాక వాటిలో కొన్నింటి కోసం మరింత ఖర్చు చేయగలమని చెప్పింది. ఉదాహరణకు రైతుబంధు. అదిగాక అనేక కొత్త పథకాలు ప్రకటించింది. ఉదాహరణకు వ్యవసాయ కూలీలకు సొమ్ము. ఆరు గ్యారంటీలు కాక మరికొన్ని డిక్లరేషన్లు కూడా ఉన్నాయి. ఇట్లా అన్నింటికి కలిపి అయ్యే మొత్తం అసలు రాష్ట్ర బడ్జెట్‌నే మించిపోగలదని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదంతా విఫలమైనట్టయితే ప్రజల్లో అసంతృప్తి తీవ్రస్థాయిలో ఏర్పడగలదని ఎవరైనా చెప్పగలరు. ఇదంతా గాక కాంగ్రెస్‌లో గ్రూపు కలహాలు, రాజకీయ అస్థిరత అన్నది మరొక అంశం. అందువల్ల పరిపాలనపై ప్రభావం ఉన్నా లేకపోయినా, ప్రజలు మెచ్చుకోగల పరిస్థితి కాదది. వారు దానిని ఇంతకాలం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండిన స్థితితో పోల్చి చూస్తారు. అయినా వారికి హామీల అమలు, అభివృద్ధే ప్రధానమవుతాయి.
కనుక బీఆర్ఎస్ పార్టీ ఈ పరిస్థితులను గమనిస్తూ, అందులో ప్రజలకు, రాష్ర్టానికి నష్టం చేయగలవాటిని, కాంగ్రెస్ హామీల రీత్యా ప్రజలను నిరాశపరచగలవాటిని ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతుండ వలసిందే. ఇదంతా ఒక చేత చేసే ఒక కర్రసాము. అయితే గుర్తించవలసిందేమంటే, కేవలం ఒక కర్రసాము వల్ల బీఆర్ఎస్కు తిరిగి గెలుపు లభించటం కష్టం. పరిస్థితులు అంతగా కలసివస్తే, నెగెటివ్ ఓటు గణనీయంగా పెరిగితే సాధ్యం కావచ్చు. కానీ, తేలిక కాదు. ఎందుకంటే, ప్రజలు బీఆర్ఎస్ గురించి, ‘వీళ్లు మాత్రం మారిందేమిటి?’ అన్నా అనవచ్చు. అటువంటి భావన ఏర్పడితే, కాంగ్రెస్‌పై గల నెగెటివ్ ఆలోచన అదృశ్యం కాకున్నా కొంత తగ్గే అవకాశం ఉంటుంది.
కాంగ్రెస్ విఫలమైతీరుతుందని, అప్పుడు అవకాశం తిరిగి తమకు ఆటోమేటిక్‌గా రాగలదని బీఆర్ఎస్లో కొందరు ఆశిస్తుండవచ్చు. పైన చెప్పినవన్నీ ముఖ్యంగా వారు ఆలోచించవలసిన విషయాలు. రాగలకాలంలో జరగవలసింది, కాంగ్రెస్ వైఫల్యాల మాట ఎట్లున్నా ఎట్లుండకపోయినా, మౌలికంగా బీఆర్ఎస్ పటిష్ఠంగా మారి, లోటుపాట్లను తొలగించుకొని, తిరిగి ప్రజల విశ్వాసాన్ని వెనుకటి స్థాయిలో పొందటం. అది రెండవ చేతితో చేసే రెండవ కర్రసాము అవుతుంది. అట్లా కాకుండా కేవలం కాంగ్రెస్ వైఫల్యాలపై దృష్టిపెట్టి అది జరిగితేనే తిరిగి అధికారానికి రావాలనుకోవటం పెద్ద తప్పు అవుతుంది.
ఈ సారి ఎన్నికల ఫలితాలను యథాతథంగా పరిశీలించినప్పుడు, బీఆర్ఎస్కు లభించిన ఓట్లు, సీట్లు గణనీయమైనవే. అదెంత వాస్తవమో అవి 2018తో పోల్చినప్పుడు బాగా తగ్గాయన్నది కూడా అంతే వాస్తవం. ఇది ఒకటి కాగా పార్టీ గెలుపోటములతో నిమిత్తం లేకుండా ముఖ్యమంత్రి స్థానానికి కేసీఆరే ఇప్పటికీ అందరికన్న అర్హుడని, తన పరిపాలన సంతృప్తికరమని ప్రజలు అన్ని సర్వేలలో పోలింగ్‌కు ముందు, తర్వాత సైతం చెప్పిన మాటలు గమనార్హం. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఈ స్థాయి గౌరవప్రదమైన ఓట్లు, సీట్లతో పాటు, అంతకన్న ముఖ్యంగా నాయకుడు కేసీఆర్ పట్ల, ఆయన ప్రభుత్వ పాలన పట్ల, ఈ ఓటమిలోనూ ఈ స్థాయిలో గల సానుకూల ప్రజాభిప్రాయం పెద్ద బలాలు. ఇంత ఉండినా పార్టీ ఎందుకు ఓడిందన్న ప్రశ్నకు ఆయా సర్వేలలో ప్రజలే వివరణ ఇచ్చినందున ఇక్కడ తిరిగి రాయనక్కరలేదు. జరగవలసింది అక్కడినుంచి ఆరంభించి ఇంటి గోడలను, నేలను తిరిగి మెత్తుకోవటం. రెండవ చేత చేసే రెండవ కర్రసాము ఇదే.
ఈ రెండింటినీ చేయటంలోనే సరైన రాజకీయ విజ్ఞత ఉంటుంది. ఇందులో రెండవ పని ఇప్పటినుంచే జరగాలి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల కోసం వేచి చూడనక్కరలేదు. ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం తనకు తాను వంద రోజుల గడువు పెట్టుకున్నది. ఆరు నెలల దాకా వేచి చూద్దామన్నారు కేసీఆర్. కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త బడ్జెట్ వచ్చి, ఆయా అభివృద్ధి, సంక్షేమాల విషయమై ప్రభుత్వ విధానాలు, కేటాయింపులు ఏమిటో స్పష్టత వచ్చి, వాటి అమలు మొదలయ్యేది ఏప్రిల్ నుంచి గనుక, తర్వాత మరొక రెం డు నెలలు కలిపి ఆరు నెలలని కేసీఆర్ అన్నారేమో చెప్పలేం. అదే అనుకుంటే, ప్రభుత్వానికి ఇచ్చే ఈ ఆరు మాసాల కాలాన్ని ప్రభుత్వానికి ఇచ్చినా, ఈ కాలమంతా బీఆర్ఎస్కు సెలవు కాలం కానక్కరలేదు.
పైన చెప్పుకొన్న రెండవ చేతికర్ర సామును పార్టీ కోసం ఇప్పటినుంచే మొదలు చేయవచ్చు. అది పార్టీ విషయాల పరిశీలన, లోటుపాట్ల సవరణ, సంస్థ బలోపేతం. ఒకవైపు ఈ పనిచేస్తూనే ఈ కాలంలో ప్రభుత్వ పనితీరును గమనించటం సహజంగా జరిగే పని. ఆరు నెలల తర్వాత ఇంకొక చేతి సాము ప్రభుత్వ వైఫల్యాలపై మొదలవుతుంది. ఈ రెండు సాములు ఏ విధంగా మొదలై సాగుతాయ నే దృశ్యాలు ప్రజలకు అప్పటినుంచి కనిపిస్తాయి. ప్రభుత్వం పనితీరు గురించి ప్రజలకు 2024 ద్వితీయార్థం నుంచి ఆరంభించి మాటలు, గ్యారంటీలు, మ్యానిఫెస్టోలకు ఆవల వాస్తవమైన, ఆచరణపూర్వకమైన పాలన ఏ విధంగా ఉండేదీ అనుభవానికి వస్తుందన్న మాట. ఆ వేళకు బీఆర్ఎస్ పార్టీ తనను తాను గరిష్ఠ స్థాయిలో లోప రహితం, శక్తివంతం చేసుకొని సిద్ధంగా ఉండవలసి ఉంటుంది.
నిజానికి ఇటువంటి లోపాలు పార్టీ నిర్మాణపరంగా, నిర్వహణ పరంగా ఉన్నందువల్లనే ఇతర పార్టీలు గాని, కొందరు మేధావులు గాని చేసిన అనేక అసత్య ప్రచారాలకు సకాలంలో, సమర్థవంతంగా బీఆర్ఎస్ సమాధానాలు చెప్పలేకపోయింది. అదే విధంగా ప్రభుత్వం చేసిన మంచి పనులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించలేకపోవటం, ప్రజల సందేహాలను, ఫిర్యాదులను తెలుసుకొని వారిని సమాధాన పరచలేకపోవటం వంటివన్నీ చివరికి నష్టాలను కలిగించాయి. ఇప్పుడు పైన చర్చించిన తరహా కార్యక్రమం జరిగినట్టయితే ఆ క్రమంలో భాగంగా ఇటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది.
పోతే, బీఆర్ఎస్ ప్రభుత్వం తన పదేండ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమాలకు సంబంధించి కొన్ని బెంచ్ మార్క్‌లను నెలకొల్పింది. వాటిని ప్రస్తుత ప్రభుత్వమైనా వీలైతే ఇంకాముందుకు తీసుకుపోవలసి ఉంటుంది తప్ప తిరుగుముఖం పట్టించటం వీలయ్యే పనికాదు. ఉదాహరణకు వ్యవసాయరంగంలో స్వయం సమృద్ధి. అందుకు అవసరమైన నీటి వనరుల కల్పన, విద్యుత్తు సరఫరా, సాగు పెట్టుబడి సమకూర్చటం, ఎరువులకు, విత్తనాలకు కొరత లేకుండా చూడటం, ధాన్యం మొత్తం రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయటం వంటివి. అదేవిధంగా పారిశ్రామిక, ఐటీ రంగాలలో సాధించిన గణనీయమైన అభివృద్ధి. ప్రభుత్వ రాబడి పెరుగుదల. గ్రామీణ, పట్టణ వికాసంలో నెలకొల్పిన జాతీయ రికార్డులు, మౌలిక వసతుల కల్పన. మంచినీటి సరఫరా, వైద్య వసతులు, తలసరి ఆదాయా లు, మానవాభివృద్ధి సూచికలు మొదలైనవి.
సంక్షేమ విషయంలో దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు, వివిధ గ్రామీణ వృత్తుల వారి స్వయం పోషకత వంటివి. ఈ బెంచ్ మార్క్‌లను కొత్త ప్రభుత్వం కొనసాగించక తప్పదు. వీలైతే ఇంకా మెరుగుపరచటం తప్ప, రద్దు చేయాలనుకున్నా, తగ్గించినా ప్రజలు ఎంతమాత్రం ఆమోదించబోరు. అవి ఏ ప్రభుత్వపు బెంచ్‌మార్క్‌లో ప్రజలకు తెలుసు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ రాగల కాలంలో వీటికి వాచ్‌మన్‌గా కూడా ప్రజల తరపున వ్యవహరించవలసి ఉంటుంది. ఇవన్నీ ఒక ఫెడరల్ పార్టీ తమ ప్రజల కోసం, ప్రాంతం కోసం నిర్వర్తించవలసిన కర్తవ్యాలు కూడా. ఆ ప్రజలకు ఫెడరలిజమే అన్నింటికి మించిన భద్రత. తెలంగాణకు గల ఏకైక, నిజమైన ఫెడరల్ పార్టీ బీఆర్ఎస్ మాత్రమే.
టంకశాల అశోక్