పరిపాలనా పరమైన సమర్థత, అసమర్థతలు ఆ తర్వాత. ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తికి మొదట సభ్యత, సంస్కారం తగినంత పరిజ్ఞానం ఉండాలి. వాటిని బట్టి ముఖ్యమంత్రిగా ఆ నాయకునికే కాదు, ఆ రాష్ర్టానికి కూడా అంతటా తగు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కానప్పుడు తను అవమానాలకు గురవుతాడు. ఆ రాష్ట్రం సిగ్గుతో తలవంచుకోవలసి వస్తుంది. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విషయం అదే విధంగా ఉన్నది. రెండేండ్ల క్రితం ఆయన చేసిన బిహారీ డీఎన్ఏ వ్యాఖ్యతో మొదలైన ఆయన ఘనమైన అప్రతిష్ట, ఇప్పుడు హిట్లర్ తనకు స్ఫూర్తి అని ప్రకటించటంతో దేశవ్యాప్తంగా సుస్థిరమైపోయింది.
భారతదేశం స్వతంత్రమైనప్పటి నుంచి తెలుగు వారికి మొత్తం 21 మంది ముఖ్యమంత్రులయ్యారు. రేవంత్‌రెడ్డి 22వ నాయకుడు ఈ జాబితానంతా ఒకసారి పరికించి చూస్తే, రేవంత్‌రెడ్డి వలె వ్యవహరించి తన పరువును, తెలుగువారి పరువును తీసిన వారు మరొకరు కనిపించరు. ఒకసారి ఇతర ముఖ్యమంత్రుల జాబితాను చూద్దాము. వారితో ఆయనను పోల్చి ఎవరి అభిప్రాయానికి వారు రావచ్చు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి 1953లో ఆంధ్రప్రాంతం విడివడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 1956లో హైదరాబాద్ రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ అయింది. ఆ మధ్య కాలంలో ఆంధ్రకు ముఖ్యమంత్రులైన వారు ఇద్దరు. టంగుటూరు ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి. మరొకవైపు హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం విలీనం వరకు హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (1956-2014) ముఖ్యమంత్రులు 16 మంది. వారు నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రామారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, చంద్రబాబు నాయుడు, నాదెండ్ల భాస్కరరావు, నేదురుమల్లి జనార్దనరెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కె.రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి. ఉమ్మడి రాష్ట్రం 2014లో విడిపోయిన తర్వాత తెలంగాణలో కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు, జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రులయ్యారు. ఈ జాబితా అంతా రాయటం ఎందుకంటే, అందరికీ అన్ని పేర్లూ గుర్తుండకపోవచ్చు.
అందువల్ల, పోల్చి చూడటానికి సులభంగా ఉంటుందని అన్ని పేర్లను పేర్కొంటున్నాము. ఇప్పుడు ఆలోచించి చూడండి. సభ్యత, సంస్కారం, తగినంత పరిజ్ఞానం విషయంలో ఎవరేమిటో. ఇతర ముఖ్యమంత్రులలో స్వాతంత్య్ర పోరాటయోధులు, రాజకీయ దురంధరులు, గొప్ప అభివృద్ధి సాధకులు, మేధావులు, దేశ విదేశాల్లో పేరు పొందినవారు పలువురు ఉన్నమాట నిజమేగాని రేవంత్‌రెడ్డిని వారితో పోల్చటం లేదు. అది సరికాకపోవచ్చు కూడా. అదే విధంగా, తగిన అప్రతిష్టను సంపాదించుకున్న నాదెండ్లతోనూ ఆ తరహా విషయాలలో పోల్చనక్కరలేదు. కాని, మొదట అనుకున్న విధంగా సభ్యత, సంస్కారం తగినంత పరిజ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నామిక్కడ.
ముఖ్యమంత్రి ఎవరు అయినప్పటికీ అధికారం కోసం ఎవరి రాజకీయం వారు చేయటం సహజం. అభివృద్ధి, సంక్షేమాలు ఎవరెంత చేశారు, అందుగురించి వివిధ ప్రజావర్గాల అభిప్రాయాలేమిటి అనేది కూడా ఒకే విధంగా ఉండదు. అది ఒక అంతులేని చర్చ. కాని ఆ స్థాయిని దాటి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి ఎవరైనా కనీస స్థాయిలో ఆశించేది తగిన సభ్యత, సంస్కారం,తగినంత పరిజ్ఞానం. అవి లేనప్పుడు ప్రజల దృష్టిలో, మొత్తం దేశం దృష్టిలో ఆ అవమానం తనదే కాదు, మొత్తం రాష్ర్టానిది అవుతుంది.
రేవంత్‌రెడ్డి ఈ రాష్ట్రం, ఈ దేశ భౌగోళికాది సమాచారాల గురించి ప్రదర్శించే పరిజ్ఞానం తెలిసిందే. పోతే, హిట్లర్ వల్ల స్ఫూర్తి తరహా ఉదంతం ఏదో ఒకసారి జరిగితే, పొరపాటున నోరుజారి ఉండవచ్చునని ఉపేక్షించవచ్చు. కానీ తరచూ జరుగుతుంటే అది మౌలికంగానే తన వ్యక్తిత్వమన్న అభిప్రాయమే ఎవరికైనా కలుగుతుంది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రెండున్నర సంవత్సరాలకు, పలు ఉదంతాలను చూసి అటువంటి అభిప్రాయమే అంతటా స్థిరపడింది. ఆయన తన రాజకీయ ప్రత్యర్థులను పేగులు తీసి మెడలో వేసుకుంటా, గుడ్లు పీకి గోటీలు ఆడుతా, తొక్కుకుంటూ పోతా, లాగుల్లో తొండలు వదులుతా వంటి హెచ్చరికలతో భయపెట్టజూడటం తెలుగువారి రాజకీయ చరిత్రలోనే ఎప్పుడూ వినిపించని పాశవిక అసభ్యత, అనాగరికత. ఆయనను అందుకు ఇక్కడి సామాన్య ప్రజలు కూడా అసహ్యించుకొని ఇప్పటికే అలసిపోయినట్టున్నారు.
ఏదన్నా జరిగితే అందులో కొత్తేముంది అంటున్నారు. కానీ తన అదృష్టం ఏమంటే, ఈ ఘనమైన భాష రెండు తెలుగు రాష్ర్టాలతోపాటు, తెలుగు వారు ప్రపంచమంతటా ఎక్కడున్నా వారి మధ్యనే మిగిలిపోయింది. జాతీయ స్థాయిలో గాని, ఇతర రాష్ర్టాల వారిలో గాని తెలియరాలేదు. విమర్శల నుంచి నేర్చుకునే లక్షణం తనకు లేనందున, ఈ పరిధిలో ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన మారకపోవటమే గాక, ఆ విమర్శలు తన పరాక్రమానికి గుర్తింపు అన్నట్టుగా ఎప్పటికప్పుడు మరింత రెచ్చిపోతూనే వస్తున్నారు. అది కూడా హీనసంస్కార లక్షణాల్లో ఒకటన్నది ఆయనకు సహజంగానే తెలిసి ఉండకపోవచ్చు. తన చుట్టూ గలవారు అధికారం కోసం, ధనం కోసం ఆశ్రయించేవారు గనుక ఆయన ఎట్లాపోతే మనకెందుకు అనుకుంటుండవచ్చు. లేదా చెప్పేందుకు జంకుతుండవచ్చు.
ఇదంతా అట్లుంచితే, మొత్తానికి పైతరహా బజారు భాషా సంపద గురించిన చర్చ తెలుగువారి మధ్య మిగిలిపోయింది. కాని కొన్ని విషయాలు జాతీయ స్థాయికి ఎక్కటం రేవంత్‌రెడ్డికి సమస్యగా మారింది. అది సమస్య అని ఆయన అనుకుంటున్నారో లేదో తెలియదు గాని, కనీసం మనకు అట్లా తోస్తున్నది. ఈ క్రమంలో జరిగిన కొన్నింటిని మాత్రం ఉదాహరణగా పేర్కొందాము. తెలంగాణలోని బీహార్‌కు చెందిన ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఆయనకు ఎందువల్ల నచ్చలేదో గాని, వారిని ఉద్దేశించి ఒక సారి బీహార్ డీఎన్ఏ అంటూ కించపరిచి వ్యాఖ్యానించారు. అది ఈ డిజిటల్ యుగంలో వెంటనే ఢిల్లీ, బీహార్ సహా అంతటా వ్యాపించింది. దానిపై విమర్శలు వచ్చినా ఆయన ఎటువంటి వివరణ ఇవ్వలేదు. తర్వాత ఎన్డీటీవీ కాంక్లేవ్‌లో ఓటుకు నోటు కేసు ప్రస్తావన రాగా, అందుకు నిర్భయంగా జవాబిస్తూ అది నాకు మెడల్ వంటిది అన్నారు. ఆ మాట విన్న నిర్వాహకులు నిర్ఘాంతపోవటం కనిపించింది. ఇటీవల ద హిందూ పత్రిక కార్యక్రమంలో ఆ పత్రిక గ్రూప్ చైర్మన్ ఎన్.రామ్ హైడ్రా గురించి ప్రశ్నించగా, ఆ పేరును తాను హిట్లర్ స్ఫూర్తితో తీసుకున్నానని అన్నారు. ఆ సమాధానం విన్న రామ్ హావభావాలను వర్ణించటం కూడా కష్టం. ముఖ్యమంత్రి అంతటితో ఆగలేదు. హైడ్రా అన్నది హిట్లర్ కోర్ టీమ్ అని, అది ఎవరినైనా వధిస్తుందని అంటూ, హైడ్రా కూల్చివేతలను గాజా విధ్వంసంతో పోల్చి మాట్లాడారు. కావాలంటే గూగుల్‌లో వెతికి చూసుకొమ్మన్నారు.
ఇవి ఉదాహరణలు మాత్రమే. దీనిపై వేరే భాష్యాలు కూడా అక్కరలేదు. ఇప్పుడు పైన రాసిన ముఖ్యమంత్రుల జాబితా మరొకమారు చూడండి. ఏ ఒక్కరైనా రేవంత్‌రెడ్డితో పోల్చగల విధంగా కనీసం ఒక్కటంటే ఒక్కసారైనా మాట్లాడి ఉంటారా. తెలుగు ప్రాంతాల నుంచే కాదు, మనకు తెలిసినంతవరకు మొత్తం ఈ సువిశాల భారతదేశంలోనే ఎవరూ మాట్లాడి ఉండరు. ఆ విధంగా ఆయనది ఒక విలక్షణమైన రికార్డు అవుతుంది.
ఆ రికార్డుకు మరింత వన్నెలు అద్దుతున్నది ఏమంటే, తన సభ్యత, సంస్కారం, పరిజ్ఞానాల ప్రతిఫలనాలను ఆయన అద్దంలో చూసి మరింత గర్విస్తున్నట్టు అనుమానం కలుగుతున్నది. వ్యక్తులకు తాము పెరిగిన తీరు వల్ల ఒక మానసికత రూపు తీసుకుంటుంది. ఈ విధంగా గర్వించే మానసికత ఏర్పడటం అటువంటిదే. కనుక, రాగల కాలంలోనైనా ఆయన మారగలరని ఆశించలేము.
చివరగా ప్రశ్నలు రేవంత్‌రెడ్డి వంటి వ్యక్తిని ఏరికోరి నాయకునిగా ఎంపిక చేసి, ఇన్నిన్ని జరుగుతున్నా మిన్నకుంటున్న కాంంగ్రెస్ పార్టీ ఢిల్లీ నాయకత్వం వైపు తిరుగుతాయి. ఎంతో గౌరవనీయమైన వ్యక్తిత్వం గల సోనియాగాంధీ ఆరోగ్య సమస్యల వల్ల కొంతకాలం నుంచి క్రియాశీలంగా లేరు. పార్టీకి మకుటం లేని మహారాజుగా మారిన వారసుడు తాను నిజంగానే ‘పప్పూ’ అని ఎప్పుడో రుజువు చేసుకున్నారు. వరుసగా మూడు సార్లు ఓడినా ఆయన కేంద్రంలో అధికారానికి రాగల ఆశలు కనుచూపుమేరలో లేవు. అటువంటి స్థితిలో ఏదో ఒకటి చేసి ఎవరో ఒకరు, ఏదో ఒక రాష్ట్రంలో పార్టీని అధికారానికి తేగలిగితే అదే మహా ప్రసాదం. అట్లా తేగలిగిన వ్యక్తి ప్రజలకు ఎన్నెన్ని అబద్ధపు హామీలిచ్చినా, ఆ వ్యక్తి వ్యవహరణ ఎంత హీనంగా ఉన్నా, ఆ పప్పూ నేతకు పరవాలేదు. ఆ వ్యక్తిని దారిలో పెట్టజూసే ధైర్యం కూడా తనకుండదనాలి. కనుక, తిరిగి ఎన్నికల వరకు భరించకతప్పదు.
-టంకశాల అశోక్