గుక్కెడు నీళ్ల కోసం చాంతాడు, బొక్కెన పట్టుకొని కోసుల దూరం నడిచిపోయి బిందెలల్లో తెచ్చుకునే రోజులను చూసినం. సర్కారు నల్లాల దగ్గర ఒకటెన్క ఒకటి బిందెనో, బకీటో పెట్టి నీళ్లు వచ్చే టైం కోసం ఎదురుచూసేది. లైన్లో బిందె ఇటో అటో అయిందంటే, బిందెలతోనే కొట్టుకున్న రోజులున్నయి. ఆ రోజులు గుర్తుకొస్తేనే వామ్మో.. నీళ్ల కోసం పడ్డ తిప్పలు కండ్లముందు కనవడ్తున్నయి!
ఓసారి భారత దేశాధ్యక్షుడు అబ్దుల్ కలాం గ్రామాల సర్పంచులందరికీ నీళ్లను మనం పొదుపుగా వాడుకోకుంటే ఎంత నష్టం జరుగుతుందో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేసి, సీడీలను విడుదల చేశారు. మనకు లభ్యమయ్యే నీళ్లను యథేచ్ఛగా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ఖర్చుజేస్తూ పోతే రాబోయేతరానికి మనం నీళ్ల కరువు, కాటకాలను మాత్రమే కానుకగా ఇచ్చినవాళ్లమవుతాం. రాబోయేతరం వాళ్ల కోపానికి మనం బలి కావలసిందే. వారి అసాధారణ, అనారోగ్య పరిస్థితికి మనమే బాధ్యులమవుతాం. వర్షాల ద్వారా వచ్చే నీళ్లను ఒడిసిపట్టి ఏదో విధంగా, భద్రంగా, దాచుకుంటూ, విరివిగా ఖర్చుచేయకుండా పొదుపు చేసుకుంటూ వాడుకోవాలి. లేకుంటే చిన్న చిన్న కుంటల దగ్గర కూడా సైనికులను పహారా పెట్టి కాపాడుకోవలసిన పరిస్థితి వస్తుందని అబ్దుల్ కలాం చెప్పారు.
వచ్చే తరంలో మనుషులు 30, 40 ఏండ్లు వచ్చేసరికే, మనం 70, 80లల్లో ఎలా ఉంటామో అలా ఉంటారట. ఆడవాళ్లందరూ, బట్టతలలతోనే ఉంటారట, నీళ్లు సమృద్ధిగా ఉండవు కాబట్టి. ఇండ్లను, ఇంటిముందు వాకిలిని, స్కూటర్లను, కార్లను ఇప్పుడు మనం పైపుతో కడగడం విని.. ‘ఇంత విలువైన నీళ్లను మీరెలా వృథా చేశార’ని మన పిల్లలే మనల్ని ప్రశ్నించి అసహ్యించుకుంటారట. నా చిన్నప్పుడు ‘ఢిల్లీలో ఒక గ్లాసు నీళ్లకు ఐదు పైసలట’ అని విని నీళ్లను అమ్ముకుంటారా ఎవరైనా అని ఆశ్చర్యపోయాను. అబ్బో అక్కడి ప్రజలూ ఎలా బతుకుతున్నారో అనుకునేది. ఇప్పుడు మనం వంద రూపాయలు పెట్టి కూడా కొంటున్నాం. నీళ్లను కూడా కొనవలసి వస్తుందని అనుకున్నామా?రాన్రాను, బకెట్ నీళ్లకు పదివేల రూపాయలైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడు దాదాపు అందరికీ జీతభత్యాలు పెరిగి ఉండవచ్చు. ఆ ధీమాతోనే పది వేలైనా సరే కొనుక్కోగలుగుతమేమో. కానీ, నీళ్లే లేకుంటే? ఒకసారి ఆలోచించాలి.
కాబట్టి ఎన్ని నీళ్లు మనం సముద్రంలో కలవకుండా, అన్ని నీళ్లను నిల్వ చేసుకుంటే, వర్షం కురిసినప్పుడు ప్రతి నీటి చుక్కను ఎంత ఆదా చేసుకుంటే అంత మంచిది. లక్ష పెట్టి నాలుగు బిందెలు కొందామన్నా, నీళ్ల లభ్యత ఉంటే గదా, అది సాధ్యమయ్యేది అన్నది ఆలోచించాలి. అందువల్ల నీటి మట్టం, భూగర్భ జలాలు పెరిగేటట్టు ఎన్నివిధాలు/ మార్గాలుంటే అన్ని మార్గాలు అన్వేషించి అమలు పరచవలసిందే. దీని గురించి అందరమూ ఆలోచించాల్సిందే, సహకరించాల్సిందే, కలిసి పనిచెయ్యాల్సిందే.
దీన్ని దృష్టిలో ఉంచుకొని నీళ్ల కొరత వల్ల ఎన్ని కష్టాలో, నష్టాలో తెలిసే, రాష్ట్రం సాధించిన తర్వాత మున్ముందు తరాలకు నష్టం కలుగకుండా ఉండేందుకు నీటికే ప్రాధాన్యం ఇచ్చి, నలభై వేలకు పైగా చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యాంలు కట్టడం, కాళేశ్వరం ప్రాజెక్టులు, పలు రిజర్వాయర్లు నిర్మించడం మొదలైన కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం నీటి నిల్వలు పెరిగేట్టు చూస్తున్నది. అందువల్లనే ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి గడ్డుగా లేదని, కొంత మెరుగుపడిందని ఇటీవలే విడుదల చేసిన సీడబ్ల్యూసీ గణాంకాలు చెప్తున్నాయి. ఈ ఏడాది తగిన వర్షాలు లేకు న్నా, గత పదేండ్ల సగటు కంటే ఎక్కువగా నీటి నిల్వలున్న రాష్ర్టాల్లో తెలంగాణ మొదటి రాష్ట్రంగా నిలిచిందని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) పేర్కొనడం మహా ఆనందాన్నిచ్చే విషయం.
పదేండ్ల సగటు నీటి నిల్వల కంటే ఎక్కువున్న రాష్ర్టాల సంఖ్య 5 మాత్రమేనని చెప్పుకోవడం సిగ్గుచేటు. తెలంగాణలో 68.3 శాతంగా నమోదైతే, 14.6 శాతంతో తర్వాతి స్థానాన్ని గుజరాత్ సాధించింది. 12.1 శాతంతో 3వ స్థానంలో ఉత్తరాఖండ్, మిగతా రెండు రాష్ర్టాలు సింగిల్ డిజిట్‌తోనే సరిపెట్టుకోవడం విషాదం. తెలంగాణ పొరుగు రాష్ర్టాల్లో పదేండ్ల సగటు నిల్వల కంటే తక్కువగా కర్ణాటక మైనస్ 28.6 శాతం, మహారాష్ట్ర మైనస్ 8.9 శాతం, ఒడిశా మైనస్ 13.9 శాతంగా నమోదు చేసుకున్నాయి.
దేశంలోని 24 రాష్ర్టాలు పదేండ్ల సగటు మైనస్‌లో ఉండటం, ఉంచడం చాలా విచారకరం. నీటి నిల్వల సామర్థ్యం పెంచుకోకుంటే ఎంత అనర్థమో, పెంచుకుంటే ఎంత ఆనందదాయకమో, ప్రయోజనకరమో, ఎంత అత్యావశ్యకమో పైన చెప్పుకొన్నాం. ఈ విషమ పరిస్థితి గమనించి అన్ని రాష్ర్టాల నాయకులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ప్రణాళికాబద్ధంగా తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తరాలు మనల్ని నిందించకుండా ఉండాలంటే వారికి సమృద్ధిగా నీళ్లు లభ్యమయేట్టు చూడవలసిన బాధ్యత మనందరిది. ఆ దిశగా అడుగులు పడాలని ఆశిద్దాం.
వాణీ మనోహర్