Hezbollah Israel War | పశ్చిమాసియా మరోసారి ప్రత్యక్ష యుద్ధపు సుడిగుండంలోకి జారుకుంటున్నది. ఓ పక్క ఇజ్రాయెల్, మరోపక్క ఇరాన్ కలబడుతుండటం ప్రపంచాన్ని కలవరపరుస్తున్నది. హిజ్బొల్లా అగ్రనేత నస్రల్లాను వైమానిక దాడిలో ఇజ్రాయెల్ తుదముట్టించినప్పటి నుంచి ఉద్రిక్తతలు కుత కుత ఉడుకుతున్నాయి. తర్వాత ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో భూతల యుద్ధం ప్రారంభించింది. హిజ్బొల్లా స్థావరాలు, నేతలు లక్ష్యంగా దాడులు జరుపుతున్నది. ఇటీవల పలువురు ఇరాన్ సీనియర్ సైనికాధికారులనూ డ్రోన్ దాడుల్లో ఇజ్రాయెల్ చంపేసింది. ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్న ఇరాన్ మంగళవారం రాత్రి సుమారు 200 క్షిపణులతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ఇరాన్ ఇలా ప్రత్యక్ష దాడికి దిగడం పశ్చిమాసియాలో ఇప్పటికే దావానలంలా వ్యాపిస్తున్న విద్వేషాగ్నికి ఆజ్యం పోసినట్టయింది. దీనిని సాకుగా తీసుకొని ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడబోతున్నది. లెబనాన్, యెమెన్‌లో ఇరాన్ అనుకూల గెరిల్లా దళాలు ఈ సరికే ఇజ్రాయెల్‌తో క్షిపణుల యుద్ధం నెరపుతున్నాయి. ఇవన్నీ వెరసి ఎటు దారి తీస్తాయోననే ఆందోళన అంతకంతకూ పెరుగుతున్నది.
ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం వెనుక ఏడు దశాబ్దాలకు పైగా సాగిన పరిణామాల నీడలున్నాయి. పశ్చిమదేశాల ఆధిపత్యవాదం, స్థానికంగా ఉండే మతవాదం, చమురు కలగలిసి మందుగుండుగా తయారైన పరిస్థితి. ఒకప్పుడు పాలస్తీనా సమస్య చుట్టూ పశ్చిమాసియా పరిభ్రమించినా కాలక్రమంలో అరబ్బు దేశాలు దౌత్యపరమైన పరిష్కారం వైపు మొగ్గడం మొదలుపెట్టాయి. యుద్ధోన్మాదం పట్ల ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, ప్రగతి సంక్షేమాల పట్ల పెరిగిన సానుకూలత అందుకు కారణం. ఈ నేపథ్యంలో ఇరాన్ ఒక్కటే పాలస్తీనా మద్దతుదారుగా మిగిలిపోయింది. సిరియా, లెబనాన్, యెమెన్‌లలోని తన మద్దతుదారుల ద్వారా ఇజ్రాయెల్‌పై పరోక్ష యుద్ధం కొనసాగిస్తున్నది. ఇప్పుడది ముదిరిపోయి ప్రత్యక్ష యుద్ధంగా పరిణమిస్తున్నది.
గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేధంలో పదుల వేల సంఖ్యలో జనం చచ్చిపోతున్నారు. లక్షల సంఖ్యలో కాందిశీకులు గూడు చెదిరి అగచాట్లు పడుతున్నారు. మరోవైపు దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెలీ దళాలు భూతల యుద్ధం మొదలుపెట్టాయి. అవి చాలవన్నట్టుగా ఇప్పుడు పులి మీద పుట్రలా యుద్ధం వచ్చి పడుతున్నది. ఇది రెండు దేశాలకు పరిమితమైన యుద్ధంగా ఉండబోదని కచ్చితంగా చెప్పవచ్చు. అదేవిధంగా దీని ప్రభావం ప్రపంచంలోని దేశాలన్నిటిపైనా ఎంతో కొంత ఉండి తీరుతుంది. నిన్నటిదాకా నేల చూపులు చూసిన అంతర్జాతీయ చమురు ధర ఒక్కసారిగా పైపైకి ఎగబాకుతుండటమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా నౌకా రవాణా ఇప్పటికే భయం నీడలో సాగుతున్న సంగతి తెలిసిందే.
పశ్చిమాసియా సంక్షోభమంతటికీ పాలస్తీనా సమస్య కేంద్రబిందువు లాంటిది. ఆ సమస్యకు రెండు దేశాల సూత్రమే ఏకైక పరిష్కార మార్గం. కానీ, యుద్ధంతో శాంతిని కొనుక్కోవాలని ఇజ్రాయెల్ చూస్తున్నది. పాలస్తీనా అస్తిత్వాన్ని అంగీకరించి వారి భూ భాగాన్ని వారికి సంపూర్ణ సార్వభౌమాధికారంతో అప్పగించడమే అసలు సిసలు శాంతికి బాటలు వేస్తుందని ఇజ్రాయెల్ గుర్తించాలి. పాలస్తీనా సమస్య పర్యవసానంగానే ప్రస్తుత యుద్ధం రాజుకుంటున్నది. ఇది ఏ మాత్రం ఉపేక్షించదగిన విషయం కాదు. ఇజ్రాయెల్ అప్రకటిత అణ్వస్త్ర దేశమైతే ఇరాన్ అనుమానిత అణ్వస్త్ర దేశం అనేది ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఈ రెండు దేశాలు కత్తులు దూసుకోవడం ప్రపంచానికి ఏమంత శ్రేయస్కరం కాదు. తక్షణమే ఐక్యరాజ్య సమితి విపత్కర పర్యవసానాలతో కూడిన ప్రస్తుత యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. ఇజ్రాయెల్, అమెరికా చిత్తశుద్ధితో సహకరిస్తేనే శాశ్వత శాంతి సాధ్యమవుతుంది.