బతుకు బండి సాఫీగా సాగడానికి భార్యాభర్తలిద్దరి జోడి, సరుకుల బండి ప్రయాణం సజావుగా సాగి గమ్యం చేరడానికి జోడెద్దులు ఎంతో అవసరం. అంటే ఏ ప్రయాణానికైనా సరైనజోడి ఉంటే ఇక ఆ పనికి తిరుగే ఉండదు.అలాగే కోట్లాది మంది జీవితాలతో ముడిపడి ఉన్న రాష్ట్రం సరైన దారిలో నడవడానికి గొప్ప జోడి కావాలి. ఉద్యమం ద్వారా సాకారమైన తెలంగాణకు కూడా అలాంటి జోడి ఉన్నది. అందుకే తొమ్మిదేండ్లలోనే గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ఆ జోడి ఎవరోకాదు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.
ముఖ్యమంత్రి కేసీఆర్ అనుభవానికి ప్రతీకగా, కేటీఆర్ నవ తరానికి దిక్చూచిగా ఉంటూ కలిసి పాలన సాగించడం వల్లనే దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యున్నత స్థానంలో ఉన్నది. ఏండ్లుగా కరెంట్ వెతలు తెలిసిన మనకు కండ్ల ముందే ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. రోజుల తరబడి కరెంట్ లేని రోజులు, క్రాప్ హాలిడేల్లాగ ఇండస్ట్ట్రీయల్ హాలిడేలు చూశాం. రోజులో4గంటలు ఉంటేనే మురిసిపోయాం. పల్లెల్లో అయితే పగలంతా ఇవ్వకుం డా కేవలం రాత్రుళ్లు అదీ లో ఓల్టేజ్తోనే, మరి ఇప్పుడో 24 గంటలు పల్లెల్లో కూడా నాణ్యమైన విద్యుత్తు లభించడం మనం చూస్తున్నాము.
కరెంటు కోతలనే మాటనే మరచిపోయాం.తలసరి ఆదాయంలోనైతే దేశంలోనే మనం టాప్, జీడీపీలోగాని, నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో, మిషన్ కాకతీయ ద్వారా పెరిగిన ఆయకట్టులో గాని మనదే ఉన్నత స్థానం. మిషన్ భగీరథతో తీరిన మహిళల మంచి నీటి కష్టాలు, అలాగే పలు అభివృద్ధి సూచికలలో అన్నింటా నెంబర్‌వన్‌గా మారిన మాట సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక నివేదికలు తెలుపుతున్నాయి. అలాగే నీతి ఆయోగ్ రిపోర్ట్లలోనూ తెలుస్తున్నది.
ఈ విధంగా అభివృద్ధి చెందడంలో జోడెద్దుల ప్రయాణమే ముఖ్య కారణం. కాస్త లోతుగా గనుక మనం చూస్తే, తెలంగాణ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలు విషయమే చూద్దాం. నీళ్ల విషయంలో ఎంత లభ్యత, ఎంత అవసరం, ఎన్ని టీఎంసీలు అం దుబాటులో ఉన్నాయో, మన రాష్ట్ర వాటా ఎంతో కొట్టిన పిండి మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు. అందుకే కదా గత 75 ఏండ్లలో జరుగని నీటి ప్రాజెక్ట్‌ల అనుమతులు, మంజూరు, నిర్మాణం రికార్డ్ స్థాయిలో పూర్తి కావడం ప్రభుత్వవిజయాలు.
సమైక్యరాష్ట్రంలో బీళ్లుగా మారిన తెలంగాణ పంట పొలాలు పచ్చగా మారడం. కేసీఆర్ అనుభవం, దూరదృష్టి వల్లనే కదా సాధ్యమైంది. తరువాత వ్యవసాయం విషయానికొద్దాం తాను స్వయంగా వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టడం, అలాగే స్వయాన రైతు కావడం వల్లనే అందులోని కష్టనష్టాలు తెలిసిన వాడవటం వల్లనే వ్యవసాయానికి ప్రపంచంలోనే ఏ ప్రభుత్వాలు కనీసం ఆలోచన చేయని విధంగా సాయం చేయడం ఆయనకే సాధ్యమైంది, రైతుబంధు, రైతుబీమా, 24 గంటలు నాణ్యమైన కరెంట్, పొలం వద్దనే పంట కొనుగోళ్లు లాంటి సాయాలు ఈరోజు మనం చూస్తున్నాం. రైతుల బతుకు మారడంతో పాటు రైతు ఆత్మహత్యలు కూడా గణనీయంగా తగ్గాయి. మిషన్ కాకతీయవల్ల భూగర్భ జలాలు పెరిగి, ఆయకట్టు పెరిగింది. కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే కనీవినీ ఎరుగని ఎత్తిపోతల పథకం ద్వారా సేద్యానికి సాగునీరు, తాగునీరు లభించింది. వరిసాగు పెరగటం మనం కండ్లారా చూస్తున్నదే.
అంతేగాక గ్రామీణ జీవన విధానంలో పెరిగిన వ్యక్తి గనుకనే పేదల కష్ట నష్టాలు తెలిసినందున, అనేక సంక్షేమ పథకాల రూపకల్పనకు నాంది పడింది. కల్యాణలక్ష్మి వల్ల పేద పిల్లలకు యుక్తవయస్సు వచ్చాక పెండ్లిళ్లు జరుగడం ఒక విప్లవాత్మక మార్పు. ఎన్నో చట్టాల వల్ల సాధ్యం కాని పని దీని వల్ల జరిగిం ది. ఆసరా పింఛన్ల వల్ల వృద్ధులకు అర కొరగా కాకుండా నిజమైన సరిపోయే సాయం అంది వారి కుటుంబాల్లో వారికీ గౌరవం పెరిగి, మర్యాద అందుతోంది.
కేసీఆర్ కిట్ వల్ల అనవసర సర్జరీలు తగ్గి సహజ ప్రసవాలు జరుగుతున్నాయి. పల్లెల్లో పెరిగినవాడు గనుక ఊర్లపై శ్రద్ధకు నిదర్శనం పరిశుభ్రత, పల్లె ప్రకృతి వనాలు, చివరికి చావు కూడా గౌరవంగా సాగాలనే ఆయన ఆలోచనలో నుంచి పుట్టినవే వైకుంఠ దామాలు. పచ్చదనంలోనైతే ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 27 శాతంగా ఉన్న అటవీ ఇప్పుడు హరితహారం ద్వారా కోట్లాది మొక్కల పెంపకం విజయవంతమై అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇవన్నీ ఒక తరం వారధి అయిన కేసీఆర్ ఉండడం వల్లనే జరిగాయనటంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు.
ఇదంతా అభివృద్ధికి ఒక వైపు. ఇక రెండవ వైపు చూద్దాం. హైదరాబాద్ విశ్వనగరంగా మారడంలో కేటీఆర్ కృషి ఎంతో ఉన్నది. అభివృద్ధిలోనైతే అమెరికాను తలపిస్తున్నది మన నగరం. నేడు హైదరాబాద్ ఎన్నో అంతర్జాతీయ సమావేశాలకు వేదికైంది. ఆమెజాన్, గూగుల్ లాంటి సంస్థలు ఇక్కడ ప్రపంచంలోనే పెద్ద ప్రాంగణాలు ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం.
వీటన్నింటి వల్ల కొత్తగా కొన్ని లక్షల ఉద్యోగాలతోపాటు మన రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఐటీహబ్, టీఎస్, ఐ పాస్ వల్ల ఎన్నో పరిశ్రమలు ఏర్పడి మన యువత పారిశ్రామిక వేత్తలుగా మారుతున్నది మనం చూస్తు న్నాం. ఇండస్ట్రీయల్ పాలసీలో భాగంగా అన్ని రకాల అనుమతులు ఏకకాలంలో లభించి శీఘ్రగతిన పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభం అవుతున్నాయి. కేటీఆర్‌కు ఐటీ రం గం పైన ఉన్న పట్టు వల్లనే అగ్రశ్రేణి కంపెనీల సీఈవోలను ఒప్పించడం సాధ్యం అవుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనే ఆహ్వానాలు రావడం సామాన్య విషయం కాదు. రావడంతోనే సరికాదు వాటిని సద్వినియోగం చేసుకుని వారిని కన్విన్స్ చేయడం వల్లనే ఇన్ని కంపెనీలు రావడం, ఉపాధి అవకాశాలు పెరుగడం, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరగడం వల్లనే కదా కేసీఆర్ చేపట్టే పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చుకోగలుగుతున్నాం.
ఈ విధంగా తెలంగాణ రాష్ర్టానికి జోడెద్దుల్లాంటి కేసీఆర్, కేటీఆర్‌ల శక్తియుక్తుల వల్ల అభివృద్ధిపథంలో రాష్ట్రం దూసుకుపోతున్నది. ఇప్పుడు ప్రజలు మనసుపెట్టి ఆలోచించాల్సిన సమయం. ప్రతి పక్షాల మోసపూరితమైన మాటలకు గనుక పడిపోయామో మళ్లీ పదేండ్లు వెనక్కుపోతుంది రాష్ట్రం. ఇలాంటి రెండు బలమైన నాయకత్వాలు రాష్ట్రంలో కాంగ్రెస్‌కుగాని, బీజేపీకిగాని ఉన్నాయా? అనేది మొదటి ప్రశ్న, ఇక రెండవది కేసీఆర్‌లాంటి విషయ పరిజ్ఞా నం, కేటీఆర్‌లాంటి నేటితరం తెలివితేటలు గల నాయకులు కాగడా పెట్టి వెతికినా ప్రతిపక్షాల్లో కానరారు. ఆ పార్టీల రాష్ట్ర అధ్యక్షుల్లో ఒకరికేమో తెలుగే సరిగా రా దు. ఇంకొకరికి తెలుగు తప్ప ఇంకొక భాష రాదు వీళ్ళు రేపు ఈ విశ్వనగరానికి ఎలా ప్రతినిధులవుతారో ఆలోచించాలి. తిట్లు, సిగపట్లు తప్ప ప్రజెంటేషన్ అంటే తెలియ ని దద్దమ్మలే మన ముందున్నారు. అలాం టి వారి చేతిలో రాష్ర్టాన్ని పెడితే ఎన్నేండ్లు వెనక్కు వెళతామో ఆలోచించండి. కేసీఆరే మన శ్రీరామరక్ష
బీ నర్సింహులుగుప్త్తా