అమెరికాలో భారతీయుల జనాభా 50 లక్షలు దాటిపోయింది. అమెరికా జనాభాలో ఇది సుమారు ఒకటిన్నర శాతం. చేసే పని పట్ల క్రమశిక్షణతో కూడిన జీవన విధానం ఈ పెరుగుదలకు కారణమైందని చెప్పవచ్చు. ఈ పరిమాణాత్మకమైన మార్పు గుణాత్మకమైన మార్పుగా పరిణమిస్తుండటం విశేషం. ఉద్యోగ, వ్యాపార రంగాలే కాకుండా అమెరికా ప్రధాన స్రవంతి రాజకీయాల్లోనూ పెరుగుతున్న భారతీయుల ప్రాబల్యమే ఇందుకు నిదర్శనం. ఈ దృష్టితో గమనిస్తే ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికలు చరిత్రాత్మకమైనవే కాదు, భారతీయతకు సంబంధిం చి చాలా రకాలుగా ప్రాముఖ్యం కలవిగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది విడుదలైన ‘ఇండియన్ జీనియస్: ది మిటియోరిక్ రైజ్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ అమెరికా’ వంటి పుస్తకాలు ఈ అభ్యున్నతికి అద్దం పడుతున్నాయి. భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ అత్యున్నత పదవికి పోటీ పడటం, హోరాహోరీగా పోరాడి ఓడిపోవడం ఓ చరిత్ర. మరెందరో భారత సంతతి వ్యక్తుల పేర్లు ఎన్నికలకు ముందు, తర్వాత ప్రముఖంగా ముందుకురావడం విశేషం. మారుతున్న అమెరికా రాజకీయ ముఖచిత్రాన్ని ఇది సూచిస్తున్నది.
రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ కొత్త ప్రభుత్వం కోసం జరుపుతున్న నియామకాల్లో భారతీయులకు సింహభాగం దక్కుతుండటం విశేషం. రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం పోటీపడిన వివేక్ రామస్వామి కీలక పదవిలో నియమితులయ్యారు. ప్రభుత్వ నిర్వహణా వ్యయం తగ్గింపు కోసం ఏర్పాటు చేస్తున్న కమిషన్‌లో ఆయన పారిశ్రామిక దిగ్గజం ఎలాన్ మస్క్‌తో పాటు బాధ్యతలు పంచుకోబోతున్నారు. ఆంతరంగిక భద్రతా సంస్థ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాశ్ పటేల్ పేరు ట్రంప్ ప్రకటించారు. జయ్ భట్టాచార్య జాతీయ ఆరోగ్య సంస్థల డైరెక్టర్ పదవి దక్కించుకున్నారు. హర్మీత్ ధిల్లోన్ న్యాయశాఖలోని పౌరహక్కుల విభాగం అధిపతి కాబోతున్నారు. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వాన్స్ సతీమణి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి అన్నది తెలిసిందే. అవకాశాలు కలిసి వస్తే ఆమె ప్రథమ మహిళ స్థానాన్నీ ఆక్రమించవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే ట్రంప్ ప్రభుత్వంపై భారతీయ ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.
భారతీయతతో మాత్రమే కాకుండా భారతదేశంతో ట్రంప్‌కు ప్రత్యేక రాజకీయ అనుబంధం ఉన్నది. గత అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అసాధారణమైన రీతిలో ట్రంప్‌తో రాజకీయ ర్యాలీ జరిపారు. కానీ, ట్రంప్ ఓటమితో ఆ ప్రయత్నమంతా నిరర్థకమైపోయింది. వ్యక్తిగత స్థాయిలో సాన్నిహిత్యం మాత్రం పెరిగింది. మొన్న గెలిచిన తర్వాత ట్రంప్ ఆ సంగతి పదే పదే ప్రస్తావించడం గమనార్హం. బుష్ హయాంలో అమెరికా-భారత్ అణు ఒప్పందం కుదరడం వెనుక భారత సంతతి ప్రముఖుల కృషి ఉన్నదని ఇప్పటికీ చెప్పుకొంటారు. ఇప్పుడు అక్కడి భారతీయం పైపైకి ఎగబాకింది. పలుకుబడి మిన్నంటింది. కానీ రెండు దేశాల సంబంధాలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. దిగుమతి సుంకాలు, డాలరు మారకం, తదితర అంశాల్లో పొరపొచ్చాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమస్యల పరిష్కారంలో భారత సంతతి అమెరికన్లు ఏ మాత్రం సహాయకార్ పాత్ర పోషించినా రెండు దేశాల సంబంధాలకు ఎంతో దోహదంచేసినవారవుతారు.