పాకిస్థాన్ ప్రేరేపిత కశ్మీరీ జీహాదీలు పహల్గాంలో 26 మందిని ఊచకోత కోసిన రెండు వారాలకు భారత్ స్పందించింది. ఏప్రిల్ 22న కశ్మీర్ మారణకాండ జరిగితే, మే 7న భారత సైనిక దళాలు పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలను దాడులతో ధ్వంసం చేశాయి. అనంతరం పాక్ భూ భాగంలోని లాహోర్ సహా అనేక ప్రాంతాలపై భారత సైన్యం దాడులు చేసి పాక్ ఆర్మీపై పైచేయి సాధించింది.
దాయాది దేశంతో యుద్ధం నెలల పాటు కొనసాగాలని ఏ ఒక్క పౌరుడూ కోరుకోడు. 1962, 1965, 1971 యుద్ధాలు భారతదేశాన్ని ఎంతగా దెబ్బతీశాయో ప్రజలకు తెలియనిది కాదు. మనది కాని భూభాగాన్ని తన నియంత్రణలో దీర్ఘకాలం ఉంచుకోవడం ఎంత కష్టమైన పనో ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా ప్రాంతాలు నిరంతరం రుజువు చేస్తున్నాయి. అలాంటిది కొందరు భారతీయులు చెబుతున్నట్టు ఈ యుద్ధాన్ని ముందుకు సాగదీసి లాహోర్ సహా అనేక పాక్ ప్రాంతాలను శాశ్వతంగా భారత అధీనంలో ఉంచడం కుదిరే పని కాదు. యుద్ధం ఆపించాలంటూ అమెరికా శరణుజొచ్చిన పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు, రాయితీలు పొందకుండా యుద్ధం ఎందుకు ఆపేశారు? అని ప్రజలు అడుగుతున్నారు.
1999 కార్గిల్ పోరు తర్వాత ఇండియా-పాకిస్థాన్ మధ్య 26 ఏండ్లకు జరిగిన యుద్ధం నాలుగు రోజులకే మే 10న ముగిసిపోయింది. ఉభయ దేశాలూ కాల్పుల విరమణ పాటించనున్నట్టు మొదట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం మధ్యాహ్నం ప్రకటించడంతో యుద్ధం ముగిసిందనే వార్త భారత ప్రజలకు చేరింది. రెండు దాయాది దేశాల మధ్య పోరు ఆగిందనే సమాచారం ప్రపంచ ఏకైక అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందనే విషయం తర్వాత చర్చించవచ్చుగాని, ఇంత హడావుడిగా ఉరుము ఉరిమినట్టు యుద్ధం నిలిపివేయడానికి భారత ప్రభుత్వం ఎందుకు అంగీకరించాల్సి వచ్చిందో ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులు, విదేశాంగ కార్యదర్శి వంటి ఉన్నతాధికారులు ఇంతవరకు వెల్లడించలేదు.
కిందటి బుధవారం భారత వైమానిక దళం పాకిస్థాన్ పంజాబ్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు జరిపి వాటికి ఎనలేని నష్టం కలిగించి ధ్వంసం చేశాక యుద్ధం తీవ్రమయ్యే దిశగా సాగింది. రెండు భారత ఉపఖండ దేశాల మధ్య యుద్ధం 1971 భారత-పాక్ యుద్ధం మాదిరిగా 13 రోజులకే ముగుస్తుందా? లేక నెల రోజులు సాగుతుందా? అనే ప్రశ్నలు దేశ ప్రజలను ఆలోచనల్లో పడవేశాయి.
140 కోట్ల మందికి పైగా ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన పహల్గాం ఊచకోత తర్వాత భారత సర్కార్ పాకిస్థాన్‌పై ఎట్టకేలకు సైనిక చర్య తీసుకోవడం సబబేననే అభిప్రాయం మెజారిటీ జనానికి కలిగింది. అయితే, నాలుగు రోజుల యుద్ధంలో అన్నివిధాలా భారత్ తిరుగులేని ఆధిక్యం సాధించడం భారతీయులకు ఎంతగానో గర్వకారణమైంది. పాక్ గగనతలం నుంచి దూసుకువస్తున్న డ్రోన్లు, ఇతర విధ్వంసక క్షిపణులను భారత గగన రక్షణ వ్యవస్థ తిప్పికొట్టడం చూసి ఇండియా సైనిక దళాల ఆధునికీకరణ ఇంత బాగా జరిగిందా? అనే ఆలోచన భారత ప్రజలను ఆనందింపజేసింది.
36 గంటల్లో భారత్ దాడి చేస్తుందని చెప్పిన పాక్‌లో లేని యుద్ధ సన్నద్ధత: పహల్గాం మారణకాండ జరిగిన వారానికి పాక్ మంత్రులు, ఉన్నతాధికారులు మరో 36 గంటల్లో ఇండియా తమ దేశంపై దాడి చేయబోతోందని భయాందోళనలు వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేశారు. దేశ ఆవిర్భావం నుంచీ పెత్తనం చేస్తున్న పాకిస్థాన్ ఆర్మీ యుద్ధానికి సన్నద్ధం కాలేదు. ఒకవేళ భారత సేనలు తమపై దాడికి సాహసం చేసినా అవి సర్జికల్ స్ట్రయిక్స్ పేరుతో పిలిచే మెరుపు దాడులకు పరిమితమౌతాయనే భ్రమల్లో పాక్ అధికారులున్నారు. భారత సైనిక దళాల దాడులు పాక్ ఆక్రమిత కశ్మీర్ వరకే సాగుతాయనే ధీమా పాక్ ఆర్మీలో వ్యక్తమైంది. ఇండియా మాదిరిగానే పాకిస్థాన్ కూడా అణ్వాయుధాలున్న దేశం కాబట్టి తమపై భారీ స్థాయిలో దాడికి భారత రక్షణ దళాలు ముందుకురావనే మితిమీరిన నమ్మకం ‘పాక్ కమాండర్ల’లో ఎప్పటి నుంచో ఉన్నది. ఆ నమ్మకమే పాకిస్థాన్ నేరుగా భారత్‌పై యుద్ధం చేయకుండా తన చెప్పుచేతుల్లో ఉండే జీహాదీల ద్వారా భారతీయులను గాయపరిచే పనులు చేస్తున్నది. పేరుకే ప్రజాస్వామ్యం ఉన్న ఈ ఇస్లామిక్ రిపబ్లిక్లో ఎన్నికైన నాయకులను కీలుబొమ్మలను చేసి పాక్ ఆర్మీ ఆడిస్తున్నది. పాక్లోఅనేక మంది ప్రధానులు, అధ్యక్షులు ఎన్నికల్లో ఓడిపోవడం ద్వారా గాక ఆర్మీ ఆదేశాలతో పదవీచ్యుతులవడం ఇటీవల చరిత్రే.
1947 ఆగస్టు మధ్యలో ఇండియాతోపాటే స్వాతంత్య్రం సంపాదించిన పాకిస్థాన్ రాజ్యాంగ రచన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థను వేళ్లూనుకునేలా చేయడంలో విఫలమైంది. 1953లో లాహోర్ వంటి నగరాల్లో ముస్లిం వర్గాల (అహ్మదీయులకు ఇతర ముస్లింలకు) మధ్య జరిగి హింసాత్మక ఘర్షణల్లో అనేక మంది మరణించారు. 1974లో నాటి జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వం ముస్లింలుగా పరిగణించే అహ్మదీయులను ముస్లిమేతరులుగా పార్లమెంట్లో చట్టం ద్వారా ప్రకటించడంతో మరోసారి పాక్ నగరాల్లో అల్లర్లు జరిగాయి. ఇలాంటి ఘర్షణల సమయంలో పాక్ ఆర్మీ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసి శాంతిని పునరుద్ధరించిన సందర్భాలున్నాయి.
అందుకే పాకిస్థాన్‌లో సైనిక పాలన తరచూ విధించడానికి ప్రకటించే మార్షల్ లాను పాక్ జనం దేవుడే తమను సైనిక దళాల జోక్యం ద్వారా కాపాడాడ నమ్మకంతో ‘మాషా అల్లా’ (అల్లా కోరుకున్నదే జరిగింది) అని పిలిచేవారనే కథనాలెన్నో పాక్ మీడియాలో వచ్చాయి. అయితే, మూడు దశాబ్దాలకే దేశం లోపల మంచి పేరును పాక్ ఆర్మీ పోగొట్టుకున్నదని, జనంలో దానిపై పూర్వపు ఆదరాభిమానాలు లేవని 2023 మే ఘటనలు నిరూపించాయి. ప్రస్తుత పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధికారంలో ఉండగా అప్పుడు సైన్యం సాయంతో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని ఆగ్రహించిన పాక్ ప్రజలు పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయం (జీహెచ్‌క్యూ) సహా రావల్పిండి, లాహోర్‌లోని అనేక ఆర్మీ కీలక ఆఫీసులపై దాడులు చేయడం పాక్ సర్కారు సహా ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతపరిచింది. అంటే రాజకీయపక్షాలపై లేని ప్రజావిశ్వాసం కొన్ని దశాబ్దాలపాటు కలిగి ఉన్న పాక్ ఆర్మీ పూర్తిగా జనం నమ్మకం కోల్పోయింది.
1990ల నుంచీ ఆధునికీకరణ లేని పాక్ ఆర్మీ: బ్రిటిష్ ఇండియా సైనిక దళాల్లో పనిచేసిన అనుభవంతో 1947లో పాక్ ఆర్మీలో చేరిన ఉన్నతాధికారులు, ఇతర సైనికులు ఆరంభంలో వృత్తి నైపుణ్యం ఉన్న ‘ఆఫీసర్లు’గా చలామణి అయ్యారు. ప్రజా ప్రభుత్వాలు బలహీనంగా ఉండటం, ఇస్లామిక్ రిపబ్లిక్ పేరిట జనరల్ జియా ఉల్ హక్, జనరల్ పర్వేజ్ ముషారఫ్ వంటి సైనిక పాలకులు సైన్యంలో తాము రూపొందించిన ‘ఇస్లామిక్ ధోరణులు’ ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసీం మునీర్ వరకూ ఇస్లాంను సైనిక, ప్రజా వ్యవహారాల్లోకి చొప్పించి ఆర్మీ పునాదులను బలహీనం చేశారు. ఆర్మీ అనేక ముఠాలుగా చీలిపోవడానికి పూర్వపు ‘వృత్తి నైపుణ్యం’ పోవడానికి కారకులయ్యారు. ఇంతటి బలహీన స్థితికి పాక్ సైనిక దళాలు చేరుకున్నాయి.
పాక్ దగ్గరున్న ఆయుధ సామగ్రి రెండు మూడు వారాల యుద్ధానికి తగినంత లేదనే వార్తలు పాక్ నుంచి మొన్న వచ్చాయి. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో పాక్ ప్రజలు ఇండియాతో పూర్తిస్థాయి యుద్ధం రాబోతోందని తల్లడిల్లిపోయారు. కరాచీ, లాహోర్ సహా అనేక పెద్ద నగరాల్లో ప్రజలు యుద్ధభయంతో వణికిపోయారు. ఎన్నెన్నో ఆయుధాలున్న పాక్ చివరికి డ్రోన్లతోనే ఆ రెండు మూడు రోజుల యుద్ధాన్ని నెట్టుకొచ్చిందంటే పాకిస్థాన్ ఆర్మీ ఎంతటి పతనావస్థకు చేరుకున్నదో అంచనా వేయవచ్చు.
ఆక్రమిత కశ్మీర్, అతి పెద్ద రాష్ట్రమైన పాక్ పంజాబ్‌లోని ఉగ్రవాద తండాల శిక్షణ శిబిరాలపై భారత సేనలు దాడులు జరిపి వాటిని నేలమట్టం చేస్తుంటే పాక్ దళాల నుంచి ఒక మోస్తరు ప్రతిఘటన కూడా లేదంటే పాకిస్థాన్ కేవలం విఫల రాజ్యం, రోగ్ స్టేట్ మాత్రమే కాదు దివాళాకోరు దేశం అని నాలుగు రోజుల పోరాటం తేల్చిచెప్పింది.
చేవ చచ్చిన పాక్‌తో కాల్పుల విరమణకు ఇంత తొందర ఎందుకో!: ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యం, ‘గ్లోబల్ పోలీస్’గా పేరుమోసిన అమెరికా చెప్పగానే భారత ప్రభుత్వం పాక్‌తో ఎందుకు కాల్పుల విరమణకు అంగీకరించింది? అనేది అతి పెద్ద చిక్కు ప్రశ్నగా మారింది. నాలుగు రోజుల కిందటమొదలైన యుద్ధం ఇక ఉధృతంగా ముందుకు సాగుతుందని, తీవ్రస్థాయిలో పోరు ముదురుతుందని వార్తలు వచ్చిన సమయంలో కాళ్ల బేరానికి సిద్ధమౌతున్న పాక్‌తో కాల్పుల విరమణకు ఇండియా ఎందుకు అంగీకారం తెలిపింది? భారత సైనిక దళాల నాయకత్వం ఎప్పుడూ లేని విధంగా ఇంత అర్జంటుగా పోరుకు స్వస్తి పలకడానికి ఎలా సిద్ధమైంది? అనే ప్రశ్నలు వ్యూహాత్మక, రక్షణ వ్యవహారాల నిపుణులనేగాక సామాన్య ప్రజలను కూడా వేధిస్తున్నాయి.
1971 బంగ్లాదేశ్ యుద్ధం’ ముందు ఆ తర్వాత పాక్ విషయంలో ఇండియాకు అంత దూకుడు పనికిరాదనే ధోరణితో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్, ఆ దేశ విదేశాంగ మంత్రి హెన్నీ కిసింజర్ మాటలను నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎలా తిప్పికొట్టారో, అగ్రరాజ్యం నేతల మాటలను పెడచెవిన పెట్టి ఆత్మ ైస్థెర్యంతో ముందుకు సాగారో తెలిసిందే. అలాంటిది పాకిస్థాన్ 77 ఏండ్ల చరిత్రలో అత్యంత బలహీనమైన ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారుతో అత్యంత బలవంతుడిగా, ఇందిర తర్వాత అంతటి శక్తిసంపన్నుడిగా పేరు గడించిన నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం సరైన తక్షణ కారణాలు చూపించకుండానే యుద్ధ విరమణకు ఒప్పుకోవడం భారతీయులకు మింగుడు పడడం లేదు.
ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా కాల్పుల విరమణ కబురును వాయు వేగంతో ప్రకటించారు. ఇక ఈ యుద్ధంలో విజయ పరంపరతో దూసుకుపోతున్న ఇండియా మంత్రులు లేదా అధికారులు ఎలాంటి దాపరికం లేకుండా పారదర్శకంగా కాల్పుల విరమణకు కారణాలు వివరించకపోవడం దేశ ప్రజలను ఆశ్చర్యపరిచింది. దాయాది దేశంతో యుద్ధం నెలల పాటు కొనసాగాలని ఏ ఒక్క పౌరుడూ కోరుకోడు. 1962, 1965, 1971 యుద్ధాలు భారతదేశాన్ని ఎంతగా దెబ్బతీశాయో ప్రజలకు తెలియనిది కాదు. మనది కాని భూభాగాన్ని తన నియంత్రణలో దీర్ఘకాలం ఉంచుకోవడం ఎంత కష్టమైన పనో ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా ప్రాంతాలు నిరంతరం రుజువు చేస్తున్నాయి.
అలాంటిది కొందరు భారతీయులు చెబుతున్నట్టు ఈ యుద్ధాన్ని ముందుకు సాగదీసి లాహోర్ సహా అనేక పాక్ ప్రాంతాలను శాశ్వతంగా భారత అధీనంలో ఉంచడం కుదిరే పని కాదు. యుద్ధం ఆపించాలంటూ అమెరికా శరణుజొచ్చిన పాక్ ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు, రాయితీలు పొందకుండా యుద్ధం ఎందుకు ఆపేశారు? అని ప్రజలు అడుగుతున్నారు. 1971 భారత్-పాక్ యుద్ధం ముగిసినప్పుడు లాహోర్ వరకూ వెళ్లిన బారత సేనలు ఎందుకు వెనక్కి రావాలి? అని మితిమీరిన ‘దేశభక్తి’తో కొందరు అనాలోచితంగా వేసిన ప్రశ్నలు కావివి. 1972 షిమ్లా ఒప్పందం ప్రకారం కశ్మీర్ సమస్యను ఇండియా, పాక్‌లే పరిష్కరించుకోవాలన్న సూత్రాన్ని ట్రంప్ ప్రకటన ఉల్లంఘించలేదా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ప్రభుత్వం ఈ హడావుడి యుద్ధ విరమణపై జనంలో రేకెత్తిన అనుమానాలను ఎంత త్వరగా నివృత్తి చేస్తే అంత మంచిది.
నాంచారయ్య మెరుగుమాల