‘తెలంగాణలో ఉన్న 95 శాతం చిన్న, సన్నకారు రైతులకు ఉన్న రెండు, మూడు ఎకరాల భూమికి 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదు, ఒక్క ఎకరాన్ని ఒక గంటలో పారించవచ్చు. దీనికి మూడు గంటల విద్యుత్తు చాలు, అయినా రైతులకు ఉచితం అనేది అనుచితం, ఉచిత విద్యుత్ పేరిట విద్యుత్ సంస్థలు తీవ్రమైన రుణాల్లో కూరుకుపోతున్నాయి’ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి తన అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలివి.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఆయన వాడిన భాష, అందులోని పదాలను ప్రత్యేకంగా చర్చించవలసిన అవసరం ఉన్నది. ఆయన వ్యాఖ్యలను సామాజిక కోణంలోనూ చూడాలి. దేశవ్యాప్తంగా కొంతమంది రాజకీయ నాయకులకు, పార్టీలకు, పాలసీ మేకర్లకు, ఉన్నతాధికారులకు, తాము మాత్రమే పన్ను చెల్లిస్తున్నామని భ్రమించే కొంతమంది సంపన్నవర్గాలకు వ్యవసాయరంగ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతుల పట్ల, వారికి అందుతున్న ప్రభుత్వ సహాయం పట్ల, సబ్సిడీల పట్ల తీవ్రమైన వ్యతిరేక భావం నెలకొన్నది. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కూడా ఈ కోవలోకి చెందినవే. రేవంత్ రెడ్డి గతంలో జరిగిన గర్జనసభలో మాట్లాడుతూ… ‘10 నుంచి 15 ఎకరాల భూమి ఉంటేనే, సమాజంలో అగ్రవర్ణాల మాట చెల్లుబాటవుతుంది’ అన్న మాటల వెనుక దాగి ఉన్న ఆధిపత్య భావజాలం నుంచి వచ్చినవే ఉచిత విద్యుత్తుకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు. అంటే ఆయన దృష్టిలో భారీ ఎత్తున భూ కమతాలు ఉన్నవాళ్లే రైతులు, మిగిలినవాళ్లంతా కూలీలు.
శతాబ్దాల తర్వాత ఇప్పుడిప్పుడే భూములను అందిపుచ్చుకొని, వ్యవసాయంతో కుస్తీ పడుతూ, సవాళ్లను ఎదుర్కొంటూ సంపద సృష్టిస్తున్న పేద, బడుగు, బలహీనవర్గాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధి చెందుతున్నాయి. ఇదిచూసి ఓర్వలేకనే రేవంత్‌రెడ్డి ఉచిత కరెంటుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా భూమి లేక కూలీలుగా ఉన్న రైతులు గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాల చొరవతో, సమాజంలో పెరుగుతున్న ఆర్థిక వెసులుబాటు అభివృద్ధి వల్ల భూములను పొందారు. వ్యవసాయం ద్వారా తమ జీవితాలను బాగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి బాటమ్ ఆఫ్ పిరమిడ్‌లో ఉన్న వారి సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన, ప్రథమ ఎజెండాగా ఉండాలి. ఆ దిశగానే భారత రాష్ట్ర సమి తి వ్యవసాయరంగ సానుకూల ప్రభుత్వం ఆధ్వర్యంలోని అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే ఉచిత, నాణ్యమైన 24 గంటల నిరంతర విద్యుత్తును అందిస్తున్నది.
బోరుబావుల ద్వారా వ్యవసాయం చేస్తున్న లక్షలాది రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఒక వరం. గతంలో ఉచిత విద్యుత్తు పేరుతో ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని… అర్ధరాత్రో, అపరాత్రో వచ్చే విద్యుత్తు వల్ల రైతన్న కుటుంబం పూర్తిగా, ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి పంటలు పండించే దీనమైన పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు వ్యవసాయరంగంలో యాంత్రీకరణ పెరిగిన తర్వాత రైతు పంటసాగుపై 24 గంటల సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భంలో 24 గంటల పాటు నిరంతర విద్యుత్తు అందిస్తే రైతు వ్యవసాయరంగంతో పాటు వ్యవసాయ అనుబంధ లేదా ఇతర రంగాల్లో తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొనే వెసులుబాటు కల్గుతున్నది. వ్యవసాయరంగాన్ని ఇతర రంగాలతో లేదా ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి వ్యవసాయ అనుబంధ రంగాలతో అనుసంధానం చేసినప్పుడే స్థూలంగా వ్యవసాయం లాభసాటిగా మారుతుందన్నది ప్రపంచవ్యాప్తంగా అందరూ నమ్ముతున్న ప్రాథమిక సత్యం. ఇలాంటి సందర్భంలో రైతుల శక్తిసామర్థ్యాల రెక్కలు తెంపేలా మూడు గంటల కరెంటు చాలని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తెలంగాణ వ్యవసాయరంగంపై సాగుతున్న కుట్రలో భాగమే.
వ్యవసాయానికి అందిస్తున్న నిరంతర ఉచిత విద్యుత్తు అనుచితం అనే వ్యాఖ్యలు రైతులపై, వ్యవసాయ రంగంపై రేవంత్ రెడ్డికి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రైతుల పట్ల గల చిన్న చూపు, ద్వేష భావానికి నిదర్శనం. 24 గంటలు విద్యుత్తు అందుతున్న గృహ, పారిశ్రామికరంగాలు వాడుకునే విద్యుత్తుపై వ్యతిరేకంగా ఒక్క మాటయినా మాట్లాడే ధైర్యాన్ని రేవంత్‌రెడ్డి లాంటి నాయకులు చేయగలుగుతారా? రైతులు అగ్గువకు దొరికిర్రా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు మొదలుకొని వ్యవసాయరంగ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, రైతు సంక్షేమ పథకాల వల్ల తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతున్నది. దేశానికే తెలంగాణ మాడల్‌గా నిలుస్తున్నది. ఒకప్పుడు కరువు కాటకాలతో తల్లడిల్లిన మహబూబ్‌నగర్ లాంటి ప్రాంతాలు నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. తెలంగాణ అత్యధిక వరి ధాన్యాన్ని పండిస్తున్న రాష్ర్టాల్లో మొదటిస్థానంలో నిలుస్తూ దేశానికి అన్నపూర్ణగా మారింది. గత పదేండ్లుగా తెలంగాణ రైతాంగం క్రమంగా కోలుకుంటూ సంక్షోభం నుంచి సమృద్ధి దిశగా పయనిస్తున్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతు, ఉచితంగా నిరంతరంగా అందుతున్న విద్యుత్తు వల్లనే వ్యవసాయ మోటర్ కనెక్షన్లు 2014 నుంచి పోలిస్తే ఇప్పుడు భారీగా పెరిగాయి. ఒక్క ఎకరం ఒక గంటలో పారుతుందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ద్రోహపూరితమైనవి. తెలంగాణ రాష్ట్రంలో బోరుబాయి కలిగిన ఏ రైతయినా ఒక్క గంటలో ఒక ఎకరం పండించే పరిస్థితి లేదు. కాబట్టి వ్యవసాయరంగాన్ని గౌరవించే వ్యక్తులు, రైతులు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఆ పార్టీ విధానాన్ని ఎండగట్టాల్సిన తరుణం ఇది
-డాక్టర్ మహేశ్ మాణిక్య
76809 01901