‘కూడుబెట్టకున్నా కోపం రాదు కానీ కడుపు కొట్టబట్టె కదా’ అంటూ అల్తాఫ్ హుస్సేన్ కాంగ్రెస్ సర్కార్ రెండేండ్ల ఏలుబడిని గద్గద స్వరంతో ఈసడించుకుంటూ జూబ్లీహిల్స్ కూడా ఎలా అగాథంలోకి జారిపోతున్న భావనలో ఉన్నదో వివరిస్తుంటే ఆశ్చర్యమేసింది.
ఐదున్నర దశాబ్దాల కిందటే జహీరాబాద్ నుంచి బతుకుదెరువు కోసం పట్నమొచ్చిన అల్తాఫ్ ఇందిరా నగర్ బస్తీలో ఎగుడు దిగుడు, ఏటవాలు ఇరుకు రోడ్డుకు ఓ మూలన దర్జీ దుకాణం నడుపుకొంటున్నాడు. ఎన్నికల ప్రచార ర్యాలీ ముందుకు కదలగానే, అతనిని కదిలిస్తే దోస్త్ మక్బుల్ సాబ్తో పాటు మరో 10 మంది బస్తీ బంధువులను కూడా పిలిచి ఎన్నో ఇక్కట్లు పంచుకున్నాడు.
యాభై ఏండ్ల నగర నడకలో అడుగులేసిన అల్తాఫ్‌కు హైదరాబాద్ కథంతా తెలుసు. ఇప్పటి కాంక్రీట్ కీకారణ్యాలు అనేకం ఆనాడు అడవిలా ఎలా భయపెట్టేవో వర్ణిస్తూ, భవంతుల విస్తారానికి పునాదులుగా బస్తీలెలా, ఎక్కడెక్కడ వెలిశాయో కలవరిస్తున్నట్టు వివరిస్తూనే పోతున్నడు. పేదల కష్టాలు, సర్కార్ల విన్యాసాలు కలిపి వర్ణిస్తూ మధ్యలో ఒక్క క్షణం ఆగి కేసీఆర్ గడప లోపలికి వచ్చినట్టు ఏ ముఖ్యమంత్రి రాలే బేటా అన్నడు. అంతేకదా.. షాదీ ముబారక్, పిల్లలకు హాస్టళ్లు, ఇమామ్‌లకు, అమ్మలకూ ఆసరా ఎవరైండ్రూ, ఎన్నడైండ్రూ..?. కేసీఆర్‌ను తలవని కుటుంబమే లేదిప్పుడంటూ మక్బుల్ మాట్లాడుతుంటే ఆశ్చర్యమేసింది.
‘మా బస్తీలు బాగానే ఆలోచనచేసి ఓట్లేసినం మీ ఊర్లల్లనే..?’ అని కాసింత కోపంతో బస్తీ పెద్ద మనిషి సమద్ భాయ్ మాట ఆపగానే మనసు చంచలమైపోయింది. నిజమే ప్రేరేపిత, కృత్రిమ తాత్కాలిక భావోద్వేగాల ఊబిలో పల్లెలు కాలుపెట్టకపోయి ఉంటే నేడు తెలంగాణ మళ్లీ ఇలా ఎందుకు తల్లడిల్లేది..? సమద్ భాయ్ అడిగిన ప్రశ్నకు ఏ సమాధానమివ్వలేక బయటనుంచి వెళ్లినవాళ్లం ఒకరి మొహాలు ఒకరు చూసుకొని బిక్కచచ్చిపోయాం. ఇంతలోనే మక్బుల్ ‘ఇగో మీకొకటి యాది చేస్తా కేసీఆర్ ఇచ్చిన షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ చెక్కులు పేద కుటుంబాల పెళిళ్లకు ఆసరా కావడమే కాదు, మాలాంటి బస్తీ టైలర్ దుకాణాలకు కూడా గిరాకీ పెంచినయ’ని చెప్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాల లబ్ధి లక్షిత వర్గాలకే పరిమితం కాకుండా అనేక వర్గాలకు ఆదెరువును ఎలా చూపించాయో అర్థమైంది.
ఇలా ఎంతోమంది ఎన్నో అనుభవాలను వివరిస్తూ, బీఆర్ఎస్ను బలపరుస్తున్నారు. ‘మన పాలమూరు పచ్చబడుతదని, భూముల ధరలకు రెక్కలొస్తయని యాభై ఏండ్ల కిందట ఏమెరుక? తెలంగాణ వస్తదని, కేసీఆర్ లాంటి సీఎం వస్తడని కలగంటమా కొడుకా..! తెలుసుంటే బోర్లు పడక, పడావు పెట్టలేక, ఉన్నదంతా అగ్గువకమ్మి టిప్పర్ డ్రైవర్‌గా పట్నం వచ్చి ఈ వినాయకనగర్ బస్తీల పడుతనా?’ అని ఏనాడో కొత్తకోట పక్కన పల్లె నుంచొచ్చేసిన వెంకటరామిరెడ్డి నిరాశను వెలిబుచ్చాడు.
‘అవునన్న కల్వకుర్తి లిఫ్ట్ పనులు, పాలమూరు ఎత్తిపోతల కింద నార్లపూర్ పంపు, చెరువులు బాగై, రైతుబంధు ఇట్ల ఎన్నో కేసీఆర్ చేయబట్టే మా కొల్లాపూర్ తాలూకాల కూడా పైసలాడని ఇళ్లు లేకుండైనయ’ని కోడేరు నుంచి వచ్చి రహమత్‌నగర్ డివిజన్లోని శివగంగ నగర్ బస్తీలో సొంత ఇల్లు కట్టుకొని స్థిరపడ్డ దాసు మా మీదబడ్డట్టే గబగబా చెప్పుకొచ్చాడు. ఆధునికీకరణలో జీవితావసరాలను తీర్చే అవకాశాలను వెతుక్కున్న ఇలాంటి వేలమంది తెలంగాణ గతం, వర్తమానాన్ని బేరీజు వేసుకోకుండా ఉండనేలేరు కదా..? పనికిరాని మాటలతో పొద్దుపుచ్చుడు తప్ప, పైసా పనన్నా చేసిందా కాంగ్రెస్ సర్కార్ తమ్మీ? అంటూ ఆరోగ్యనగర్ గడ్డమీద టీ స్టాల్ నడుపుకుంటున్న కళావతక్క ఛాయ్ తాగుతూ మాటలు కలిపిన మమ్మల్నే ఎదురు ప్రశ్నలు వేసింది. ఇలా ఎంతోమంది ఎన్నో కోణాల్లో పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ పనితీరును, రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ ద్రోహ తరహాను బహిరంగంగానే విశ్లేషిస్తున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహమత్‌నగర్ డివిజన్లో మాత్రమే కాదు, అన్ని డివిజన్ల పరిధిలోని కాలనీలు, బస్తీలు అన్నింటిలోనూ ప్రజల అభిప్రాయం పైవిధంగానే ఉన్నదనేది స్పష్టంగా కనిపిస్తున్నది. అందువల్లనే షేక్‌పేట్ డివిజన్లో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదలైన కేటీఆర్ రోడ్‌షోలో కనుచూపు మేర రోడ్లన్నీ జన సమూహంగా మారిపోయాయి. వాస్తవానికి 1963లో మొదలైన జూబ్లీహిల్స్ ఆలోచన, మద్రాస్‌లో అనేక కాలనీలను అభివృద్ధి చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఐఏఎస్ అధికారి చలగల్ల నరసింహ తొలి ఇంటిని నిర్మించుకొని 1967లో కాలనీ సంఘ అధ్యక్షుడిగా దాని విస్తారానికి దారులేశాడు. 1963లో జూబ్లీహిల్స్ మొదలైనా, వెయ్యేండ్ల కిందటే కాకతీయులు నిర్మించిన గోల్కొండ కోట (1000-1321)తో నేటి హైదరాబాద్ విశ్వ నగరానికి బీజం పడింది. శతాబ్దాల చారిత్రక నేపథ్యం, భౌగోళిక వైవిధ్యం, సాంస్కృతిక వైభవం కలిగిన హైదరాబాద్ భారతదేశంలోని జనాలందరినీ కాలం పొడువునా ఆకర్షిస్తూ, ఆహ్వానిస్తూనే ఉన్నది. శతాబ్దాల చారిత్రక ప్రయాణంలో నగరం నలుమూలల పెరగడమే కాదు, విభిన్న అనుభూతులనూ సంపాదించుకున్నది.
స్వరాజ్యం నుంచి స్వంత రాష్ట్రం దాకా పాలకుల్లోని పార్శ్వాలెన్నింటికో మహానగరం వేదికైంది. చక్రవర్తులు, ముఖ్యమంత్రుల వైవిధ్యమైన పనితనాలను పట్నం ప్రజలు రుచి చూశారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడమే ఒక నగర మౌలిక లక్ష్యమని అరిస్టాటిల్ అన్నట్టు హైదరాబాద్ మహానగరం ప్రతి మలుపులో దేశంలోని అన్ని ప్రాంతాల వారికి మెరుగైన అవకాశాల కేంద్రంగానే నిలిచింది. అయితే, శతాబ్దాల శోభకు ఆరు దశాబ్దాల పాలనా నమూనా ఎలా కీడును తలపెట్టిందో నగర ప్రజలకు తెలియనిదేం కాదు. అభివృద్ధికి ఉండాల్సిన సుస్థిర స్వాభావికతను చంపేసి, వెలుగు జిలుగుల ఆర్థికవ్యవస్థనే వాస్తవమైనదని మహానగరాన్ని నిత్యం నమ్మించి మాయలో ఓలలాడించేందుకే ఎత్తులు వేశారు. పైగా కుర్చీ కోసం కొట్లాటలకు అల్లర్లు, దందాలకు, బెదిరింపులకు, బాంబు పేలుళ్లకు, తుపాకీ చప్పుళ్లకు నగరంలో వీధులను స్థావరాలుగా మార్చేశారు. రాజకీయ పార్టీలే వీధికొక రౌడీని ప్రోత్సహించి పనులు చక్కబెట్టుకునే పాశవిక సంసృ్కతిని తీసుకొచ్చారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరే నాటికి వందల పేకాట క్లబ్బులు, వేల మట్కా, గుట్కా కేంద్రాలు అన్నట్టుగా నగరం భీతిగొల్పేలా తయారైంది.
కానీ పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలకు శతాబ్దాల హైదరాబాద్ వైభవాన్ని, వైవిధ్యాన్ని, నగరంపై తెలంగాణ ప్రజలకే కాదు, దేశ వాసులందరికీ ఉన్న విశ్వాసాన్ని జోడించి అమలుచేయడం వల్ల, స్టార్టప్‌ల గమ్యంగా హైదరాబాద్ మారిపోయింది. 2014 నుంచి 2023 వరకు 21 వేల కోట్ల పెట్టుబడులతో తెలంగాణ రాష్ట్రం భారతదేశ స్టార్టప్‌ల పవర్ హౌజ్‌గా మారిపోయింది. ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా ఇలా అనేక రంగాల్లో లక్షల కోట్ల పెట్టుబడులు, నూతన పరిశ్రమలు హైదరాబాద్‌కు తరలివచ్చాయి.
పదేండ్లలో ఒక్క ఐటీలోనే 5.82 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. నూతనంగా 19 వేలకు పైగా పరిశ్రమలు ఏర్పడ్డాయి. రియల్ ఎస్టేట్ రంగంతో పాటు అనేక రంగాలు సంపద సృష్టిలో పోటీ పడ్డాయి. ఈ చారిత్రక ప్రగతికి వేదికగా హైదరాబాద్‌లో రోడ్లు, అండర్‌పాస్‌లు, తాగునీరు ఇంకా ఇతరేతర అనేక మౌలిక సదుపాయాలకు లోటులేకుండా హైదరాబాద్ మహానగరాన్ని కేసీఆర్ మార్గదర్శనంలో కేటీఆర్ వాస్తవ విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు సర్వశక్తులూ ధారపోసి శ్రమించారు. దానివల్ల తెలంగాణకే కాదు దేశానికీ హైదరాబాద్ భరోసాను కల్పించే స్థాయికి ఎదిగింది.
కానీ రెండేండ్లలో కాంగ్రెస్ సర్కార్ మహానగర భవితవ్యం పైకి బుల్డోజర్ ఎక్కించేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్టు హైదరాబాద్ ‘మొహబ్బత్ కా మకాన్’ అయితే కాంగ్రెస్ అంటే ‘ధోకే కా దుకాన’ అనే అందరూ ఈసడించుకుంటున్నారు. రెండేండ్లుగా మైనారిటీలను మోసం చేస్తూ ఉప ఎన్నికల కోసం కేవలం అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన, దిగజారి ముంబై వెళ్లి బతిమిలాడి బిగ్‌బాస్ షూటింగ్లో సల్మాన్‌ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో దిగి వదిలినంత మాత్రాన మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ వలలో పడరు. పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల కోసం వేస్తున్న విన్యాసాలు, జూబ్లీహిల్స్ ఓటర్లకే కాదు, రాష్ట్రవ్యాప్తంగా జనాలకు జుగుప్సను కలిగిస్తున్నాయి. ప్రజలను పదే పదే ఏమార్చడం రేవంత్ ప్రభుత్వానికి సాధ్యపడదు.
– (వ్యాసకర్త: రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్) డాక్టర్ ఆంజనేయ గౌడ్