2 శాతం అనేది స్వల్ప తేడా కావచ్చు. కానీ, అధికారపక్షం, ప్రతిపక్షం అనే తేడా చాలా పెద్దది. ఒక్క సెకన్ తేడాలోనే ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం రజతంగా మారుతుంది. ఈ ఒక్క క్షణం తేడా కోసం దశాబ్దాల కృషి ఉంటుంది. అలాగే రాజకీయాల్లో 2 శాతం తేడా కోసం ఐదేండ్ల రాజకీయం ఉంటుంది.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39 శాతం ఓట్లు వస్తే బీఆర్ఎస్కు 38 శాతం ఓట్లు వచ్చాయి. రెండు పార్టీల మధ్య 2 శాతం ఓట్ల తేడా. ఇంకా కచ్చితమైన అంకె చెప్పాలంటే కాంగ్రెస్‌కు 39.89 శాతం ఓట్లు వస్తే బీఆర్ఎస్కు 38.08 శాతం ఓట్లు వచ్చాయి. రెండు పార్టీల మధ్య తేడా 1.81 శాతం. ఏపీలో 2014 ఎన్నికల్లో దాదాపు ఇదేవిధంగా టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య స్వల్ప తేడానే ఉన్నది. అదే 2018లో జరిగిన ఎన్నికల్లో లభించిన ఓట్ల శాతం చూస్తే అప్పటి టీఆర్ఎస్కు 46.9 శాతం ఓట్లు వస్తే, కాంగ్రెస్‌కు 28.4 శాతం ఓట్లు వచ్చాయి. రెండు పార్టీల మధ్య అప్పుడు 18 శాతం ఓట్ల తేడా ఉన్నది. అప్పుడు 18 శాతం ఓట్ల తేడా వల్ల టీఆర్ఎస్కు 88 సీట్లలో విజయం లభిస్తే కాంగ్రెస్‌కు 19 సీట్లు లభించాయి. 2014 కన్నా టీఆర్ఎస్కు 25 సీట్లు పెరిగితే కాంగ్రెస్‌కు 2 సీట్లు మాత్రమే తగ్గా యి. బీజేపీ ఒక సీటుకే పరిమితమైంది.
ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో 2 పార్టీల మధ్య 2 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉన్నా కాంగ్రెస్‌కు 45 సీట్లు పెరిగాయి. బీఆర్ఎస్కు 49 సీట్లు తగ్గాయి. 92,35,792 ఓట్లు కాంగ్రెస్‌కు లభించగా 87,53,924 ఓట్లు బీఆర్ఎస్కు లభించాయి. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 4,81,868 ఓట్లు. 2018-2023ని పోలిస్తే బీఆర్ఎస్ ఓట్లు గణనీయంగా తగ్గాయి. అదేస్థాయిలో కాంగ్రెస్ ఓట్లు పెరిగాయి. 2018లో 46 శాతం ఓట్లు తెచ్చుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు 38 శాతం ఓట్లు తెచ్చుకుంది. 2018 ఎన్నికలను చూస్తే 2 పార్టీల మధ్య 18 శాతం ఓట్ల తేడా ఉన్నది. ఇది భారీ తేడా కానీ, అంచనాలకు అందనివిధంగా ఆ లోటు పూడ్చటమే కాకుండా మెజారిటీ సీట్లు సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. రెండు సీట్ల బీజేపీ విజయవంతంగా కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చి, మూడోసారి అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసుకుంది. 5 రాష్ర్టాలకు ఎన్నికలు జరిగితే 3 రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలమనే భావం బలపడ్డది. 3వ సారి అధికారంలోకి వస్తుందని స్టాక్ మార్కెట్ కూడా సానుకూలంగా స్పందించింది. ఈ రోజు ఒక్కరోజే స్టాక్ మార్కెట్ నిఫ్టీ 350 పాయింట్లు పెరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కనీసం ఒక్క రాష్ట్రంలో బీజేపీ గెలిచినా మార్కెట్ సానుకూలంగా స్పందిస్తుందని స్టాక్‌మార్కెట్ విశ్లేషకులు చెప్తే ఒకటి కాదు, మూడు రాష్ర్టాల్లో విజయం సాధించింది. దానితో ఈ రోజు మార్కెట్ పరుగులు తీసింది.
కర్ణాటకలో విజయం తర్వాత కాంగ్రెస్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. కర్ణాటక విజయం ప్రభావం తెలంగాణపై కూడా చూపించింది. అయితే 5 రాష్ర్టాల్లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఒక్క తెలంగాణలోనే విజయం సాధించగా బీజేపీ మూడు రాష్ర్టాల్లో విజయం సాధించింది. మూడు రాష్ర్టాల ఎన్నికలు కాంగ్రెస్ కన్నా బీజేపీకే ఎక్కువ ప్రయోజనం కలిగించాయి. కాంగ్రెస్‌కు తెలంగాణలో విజయం వల్ల తెలంగాణలో ఉత్సాహాన్ని నింపినా మూడు రాష్ర్టాల్లో బీజేపీ విజయం కాంగ్రెస్‌ను కొంత నిరుత్సాహపరిచింది. తెలంగాణలో లభించిన విజయం కాంగ్రెస్‌ను కొంతవరకు భవిష్యత్తుపై ఆశలు నిలబడేట్టు చేసింది. తెలంగాణలో విజయం సాధించి ఉండకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా నష్టం కలిగించేది.
రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించిన తర్వాత రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ గెలిచిన 2వ రాష్ట్రం తెలంగాణ. తొలుత కర్ణాటకలో గెలిచారు. అయితే గెలిచిన రెండు రాష్ర్టాలు దక్షిణాదిలోనివే. ఉత్తరాదిలో మత ప్రభావం, బీజేపీ ప్రభావం ఎక్కువ. మూడు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని చూస్తే ఉత్తరాదిలో బీజేపీ తన పట్టు కోల్పోలేదని అర్థమవుతున్నది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ గెలిస్తే పార్లమెంట్లో మరో పార్టీ గెలవడం ఆనవాయితీ. ఈసారి కూడా అలాగే జరిగితే దక్షిణాదిలోనూ బీజేపీ ఎంతో కొంత ప్రభావం చూపినట్టవుతుంది.
పార్లమెంట్ ఎన్నికల కోసం దక్షిణాదిపై సైతం బీజేపీ మరింతగా దృష్టిసారించే అవకాశం ఉన్నది. ప్రజలు అందించిన విజయాన్ని తెలంగాణలో కాంగ్రెస్ నిలుపుకొంటుందా? ప్రజలు పెట్టుకున్న ఆశలను నిలబెట్టుకుంటుందా? వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్‌లో పెద్దగా కీచులాటలు కనిపించలేదు. దాదాపు ప్రాంతీయ పార్టీ నాయకుడిగా వైఎస్సార్ పాలించారు. అంతకుముందు కాంగ్రెస్ అంటే కీచులాటలు, ముఖ్యమంత్రుల మార్పు అనేది సర్వసాధారణం. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. పదేండ్ల విరామం తర్వాత మరోసారి కాంగ్రెస్ రాజకీయాలను చూడబోతున్నాం. నమ్మిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా? లేదా చూడాలి. నాలుగు నెలల్లో వచ్చే పార్లమెంటు ఎన్నికలు అటు కాంగ్రెస్‌కు ఇటు బీఆర్ఎస్కు అగ్ని పరీక్ష.
బుద్దా మురళి