భారత ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ప్రత్యేకమైనది. కానీ, మన దేశంలో 2014 తర్వాత ప్రతిపక్ష పాత్ర క్రమంగా బలహీనపడుతూ వస్తున్నదన్న విమర్శలు ప్రస్తుతం విస్తృతంగా వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎంత కీలకమో, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్షం కూడా అంతే కీలకం.
2023 శాసనసభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయగా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షానికి ఉండాల్సిన బాధ్యతను నిర్వర్తించడంలో బీఆర్ఎస్ ఇటీవలి కాలంలో స్పష్టమైన ముద్ర వేస్తున్నది. అంతేకాదు, ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై వ్యక్తిగతంగా కాకుండా విధానపరమైన కోణంలో విమర్శిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉన్న నిజమైన అర్థాన్ని తెలియజేస్తున్నది. ఫార్మా పరిశ్రమల కోసం లగచర్లలో ప్రభుత్వం ప్రతిపాదించిన భూ సేకరణ అంశం ఇందుకు ఉదాహరణ. ఇప్పటికే ఉన్న ఫార్మాసిటీని విస్మరించి ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం వల్ల స్థానిక రైతులు, గ్రామీణ ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందనే అంశాన్ని ప్రజల ముందుకు బీఆర్ఎస్ తీసుకువచ్చింది. రైతుల ఆందోళనలకు మద్దతుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమించింది. లగచర్ల ఉద్యమం ఉధృతమైన నేపథ్యంలో చివరికి ప్రభుత్వమే వెనక్కి తగ్గే పరిస్థితి వచ్చింది. ఈ విజయం కచ్చితంగా ప్రతిపక్ష బీఆర్ఎస్దే అని చెప్పడంలో సంశయం అక్కర్లేదు.
‘హైడ్రా’ పేరుతో నియమ నిబంధనలను తుంగలో తొక్కి పేదల ఇండ్లను కూల్చివేసేందుకు ప్రభుత్వం కాలుదువ్వింది. ఈ దుందుడుకు వైఖరిని బీఆర్ఎస్ న్యాయస్థానంలో సవాలు చేసింది. పేదల హక్కుల పరిరక్షణ కోసం చేసిన ఈ న్యాయపోరాటం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఉన్న బాధ్యతను గుర్తుచేస్తున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చం ద్రశేఖర్రావు ప్రతిపక్ష నాయకుడిగా సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల విషయంలో రాష్ట్ర రైతాంగానికి జరుగుతున్న అన్యాయాలను మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. వ్యక్తిగత విమర్శలకు దూ రంగా ఉండి, వాస్తవాలు, రాష్ట్ర హక్కులపై దృష్టిసారించడం ఆయన రాజనీతిజ్ఞతకు నిదర్శనం. ఈ అంశాలపై ప్రజల్లో చర్చ పెద్ద ఎత్తున జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర నుంచి మేల్కోక తప్పలేదు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చించడానికి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నది. ఒక ప్రతిపక్ష నాయకుడి మీడియా సమావేశానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంతో ప్రభుత్వం భయపడ్డది. వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. బహుశా ఇది దేశ చరిత్రలో అరుదైన విషయమై ఉంటుంది!
పభుత్వాన్ని కూల్చడానికి కాదు, ప్రభుత్వ విధానాలను సరిదిద్దడానికి ప్రతిపక్షం ్రఉంటుందన్న మౌలిక ప్రజాస్వామ్య సూత్రాన్ని తెలంగాణ రాజకీయాలు మరోసారి గుర్తుచేస్తున్నాయి. బలమైన, బాధ్యతాయుతమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం సమతుల్యతను సాధిస్తుంది.
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఈ సత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. బీఆర్ఎస్ చేస్తున్న ప్రజా పోరాటం జాతీయ రాజకీయాలకు ప్రజాస్వామ్య పాఠంగా నిలుస్తున్నది.
ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒక పెద్ద ప్రశ్నను ముందుకుతెస్తున్నాయి. ఒకవేళ జాతీయస్థాయిలో బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉండి ఉంటే ఏం చేసేదోనని ప్రజలను ఆలోచింపజేస్తున్నది? ఒకవేళ కేంద్రంలో బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉండి ఉంటే.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్లో రాష్ర్టాల హక్కులు దెబ్బతింటున్న ప్రతీ సందర్భంలో బీఆర్ఎస్ గళం మరింత బలంగా వినిపించేది. నోట్ల రద్దు వంటి ఏకపక్ష నిర్ణయం దేశ ఆర్థికవ్యవస్థకు గుదిబండగా ఎలా మారిందో పార్లమెంట్ వేదికగా ప్రభుత్వాన్ని ఎండగట్టేది. కేంద్ర ప్రభుత్వం సాధారణ బిల్లులను, ఆర్థిక బిల్లులుగా లోక్సభలో ప్రవేశపెట్టి రాజ్యసభ హక్కులను హరిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధానం ద్వారా సమాఖ్య వ్యవస్థ ఎలా బలహీనమవుతుందో న్యాయస్థాన వేదికగా కేంద్రానికి వివరించేది. కేంద్ర ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేసి, ప్రజాపక్షాన నిలిచేదనటంలో సందేహం లేదు.
-బక్కోళ్ల శ్రీకర్
96769 02286