అంత వ్యవసాయ భూమిని పాడు చేశాక, ఇతర ప్రాంతాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చెయ్యాలి కదా! క్వాంటమ్ వ్యాలీ కంటే పోలవరం ముఖ్యం. 1941లో తమిళ నాయకులు సూచించిన ఆ ప్రాజెక్టు ఆవశ్యకత తెలిసి కూడా ఆంధ్ర రాజకీయ నాయకులు నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయిన టి.అంజయ్య 1980లో ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు. అప్పుడు దాని వ్యయం రూ.129 కోట్లు మాత్రమే. మరి 1956 నుంచి 2014 దాకా ఉమ్మడి రాష్ర్టానికి 51 1/2 సంవత్సరాల పాటు ఆంధ్రా నాయకులే ముఖ్యమంత్రులుగా పని చేసినా, ఆ ప్రాజెక్టుపై ఎవరూ శ్రద్ధ పెట్టలేదు. తెలంగాణకు చెందాల్సిన నదీ జలాలు ఆంధ్రాకు అక్రమంగా పారించడమే కానీ, ఎవరూ ఆంధ్ర ప్రజల అవసరాలను పట్టించుకోలేదు.
అసలు 1953 నుండి ఆంధ్ర రాజకీయ నాయకులు ఏనాడూ వారి ప్రాంతం గురించి పట్టించుకోలేదు పాపం! 1920 నుండీ ఉద్యమం చేసి దాదాపు 33 ఏండ్ల తరువాత రాష్ట్రం ఏర్పడినా, వారి స్వంత ప్రాంత అవసరాలు ఏమిటని వారెవరూ ఆలోచించలేదు. అదే ఆ ప్రజల దురదృష్టం. స్వోత్కర్ష (స్వంత డబ్బా) ఎక్కువగా చేసే చంద్రబాబు హైదరాబాదుని ఉద్ధరించేశాడని.. ఆయన చెప్పిన అబద్ధాలు నమ్మి 2014లో ఆయనకు పట్టం కట్టారు ఆంధ్ర ప్రజలు. అసలు ఒక్క నగరాన్ని ఈ 57 ఏండ్లలో ఆంధ్రాలో అభివృద్ధి చేసినా, వారికి ఒక రాజధాని ఏర్పడేది కదా! లేక 10 ఏండ్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాదులోనే మర్యాదగా ఉండి, మంచి ప్రాంతంలో ప్రభుత్వ భవనాలు నిర్మించుకుని ఉంటే ఎంత హుందాగా ఉండేది!
2004లో వైఎస్ఆర్ మళ్లీ జల యజ్ఞం అని మొదలు పెట్టినా అది ధన యజ్ఞం కింద ముగిసింది. మరి 2014లో రాష్ట్రమూ, కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లో ఉన్నా ఈ ప్రపంచ విజనరీ(చంద్రబాబు నాయుడు) ఎందుకు ఐదేండ్లలో పోలవరం పూర్తి చేయలేదు? తెలంగాణలో ఏ ప్రాజెక్టుకు సహాయం చేయని కేంద్రం, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి సుమారు రూ.19 వేల కోట్ల సహాయం చేసి, ఆ ప్రాజెక్టును తాము పూర్తి చేస్తామని మాట ఇచ్చినా, చంద్రబాబు దాని గురించి ఎందుకు నిర్లక్ష్యం వహించాడు? తెలంగాణకు చెందిన ఏడు మండలాలు లాక్కున్నాక కూడా, దాన్ని పూర్తి చేసి ఆంధ్ర రైతులకు సాగునీరివ్వాలని ఈ విజనరీకి ఎందుకు అర్థం కావడం లేదు ?
ఈ రకంగా అటు అమరావతి పేరుతో పంట భూములు వేల ఎకరాల్లో నాశనం చేసి, ఇటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఇంకా ఈ విజనరీ ముఖ్యమంత్రి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? దీని గురించి ఆ రాష్ట్ర ప్రజానీకం ఆలోచించుకోవాలి. తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఇప్పుడు ఈయన ఏమంటున్నారో చూడండి ‘వరి పండించకండి, తినకండి, చక్కెర వ్యాధి వస్తుంది’ అని. వరి తింటే డయాబెటిస్ రాదు, వచ్చాక తినకూడదు అని శాస్త్రజ్ఞులు చెప్తారు. ఈ విజనరీ అపరిచితుడి లాగా పోలవరం కాఫర్ డ్యామ్ కూలిపోయినా పట్టించుకోకుండా, బనకచర్ల-నల్లమల సాగర్ గురించి మాట్లాడుతున్నారు. అవి అలవి కాని ప్రాజెక్టులు. వాటికి ఏ అనుమతులూ లభించవు. ఇదీ ఆంధ్రా వ్యవసాయ రంగం వ్యథ!
రాజధాని అంశం: 2009 తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత ఆంధ్రాకు రాజధాని ఏదీ అంటూ చాలా చర్చలు జరిగాయి. ఉమ్మడి రాజధాని అంశం, హైదరాబాద్ నగరాన్ని కేం ద్ర పాలిత ప్రాంతం చేసి, తెలంగాణ నుండి వే రు చేయడం మొదలైన మోసపూరిత ప్రతిపాదనలు చాలానే చేశారు ఆంధ్రా రాజకీయ నాయకులు. జేసీ దివాకర్ రెడ్డి తన అతి తెలివితో ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదన తీసుకొచ్చాడు. అంటే తెలంగాణతో రాయలసీమ 4 జిల్లాలు కలిపి, ఆంధ్రాను విడి చేయమని! ఎం దుకంటే 1937లోనే ఆంధ్ర, రాయలసీమ మ ద్రాస్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పెట్టిన ‘శ్రీబాగ్ ఒడంబడిక’ను ఆంధ్రా నాయకులు కొంచెం కూడా పట్టించుకోలేదు, అమలు చేయలేదు.
వెనుకబడిన రాయలసీమ జిల్లాలు వర్షా భావంతో కరవు జిల్లాలుగా కూడా అల్లాడాయి. కానీ తమ ఆంధ్రా ప్రాంతాన్నే పట్టించుకోని రాజకీయ నాయకులు సీమ కష్టాల్ని కూడా పట్టించుకోలేదు. కానీ రాయల తెలంగాణ అంటే మా లాంటి వాళ్ల గుండెల్లో రాయి పడింది. ఎందుకంటే 27 1/2 ఏండ్లు ముఖ్యమంత్రులుగా ఉన్న సీమ నాయకులు – నీలం సంజీవ రెడ్డి నుండి కిరణ్ కుమార్ దాకా తెలంగాణ సంపదను దోచుకున్నారే కాని ఒక్కనాడు ఈ ప్రాంతానికి ఏ న్యాయం చేయలేదు.
మరి వారు తెలంగాణతో కలవడమంటే, ‘దుంగ వదలి, మొద్దు ఎత్తుకున్నట్టే!’ తెలంగాణ అమాయకపు ఆడ పిల్ల ఆంధ్ర మొగుడికి విడాకులిచ్చి, సీమ ఆడబడుచు సంసారం సాకినట్టే’ ఉంటుందని భయపడిపోయాం! ఇక మద్రాసుని అడిగినట్టే హైదరాబాద్ నగరాన్ని కూడా తమ హక్కు లాగా శాశ్వత ఉమ్మడి రాజధాని కావాలని బెదిరింపులు మొదలుపెట్టారు ఆంధ్ర రాజకీయ నాయకులు. అసలు పదేండ్లు కూడా అన్యాయం అనిపించింది మాకు.
అయిదేండ్లలో కాస్త ప్రభుత్వ స్థలం ఎక్కువగా ఉన్న చోట గట్టి నేలలో రాయలసీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అనువుగా ప్రభుత్వ భవనాలు నిర్మించి ఉంటే ఈ 12 సంవత్సరాల్లో అది పెరిగి చాలా అనుకూలంగా ఉండేది. నిష్పాక్షికంగా చూస్తే ముఠా నాయకుడి లాగానే ప్రవర్తించినా, పెద్ద మేధావి కాకపోయినా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆచరణాత్మక పథకాలు పెట్టి వాటిని పూర్తి చేశాడు. తెలంగాణకు అన్యాయం జరిగినా పులిచింతల, పోతిరెడ్డి పాడు ప్రాజెక్టులు పూర్తి చేశాడు. అంతేకాదు, ముందుచూపుతో ఆంధ్ర విడిపోతే రాజధాని కట్టుకోవడానికి వినుకొండ, ఒంగోలు మధ్యలో ఉన్న ప్రభుత్వ భూమిలో 10 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించాలని భావించాడు. ఆ చుట్టుపక్కల ఇంకో 10 వేల ఎకరాలు తాను, తన స్నేహితులు, బంధువులతో కొనిపించాడు. అటువంటి చర్యలు ఆంధ్ర నాయకులకు అలవాటే కాబట్టి వదిలేద్దాం! ఆ నేల గట్టి నేల, గడ్డి కూడా మొలవదు. ఇటు కృష్ణా నది నుండి, అటు నెల్లూరు నుండి మంచి నీరు, వాడుక నీరు వసతి ఏర్పాటు చేసుకొనుంటే రెండు, మూడేండ్లలో ప్రభుత్వ భవనాలు తయారైపోయేవి. దేవేంద్రుడి అమరావతి కాకపోయినా కనీసం ఆంధ్ర ప్రజలకు గర్వ కారణంగా ఒక రాజధాని ఉండేది.
పాపం కుప్పం బాబు తొందరపడి ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, ఆంధ్ర పారిపోవాల్సి వచ్చినా, అక్కడ తన మొదటి టర్మ్‌లో రాజధానిని నిర్మించి ఉంటే, రెండోసారి కూడా 2019లో ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉండేది. అయినా పంజాబ్, హర్యానాకు కలిపి మధ్యలో ఉన్న చండీగఢ్ ఇరు రాష్ర్టాల రాజధానిగా ఉంది. దాని విస్తీర్ణం 28 వేల ఎకరాలు మాత్రమే! మరి హడావిడిగా ఆంధ్ర వెళ్ళిపోయినప్పుడు, దశాబ్దాల తరబడి వారి స్వంత రాజధాని లేని ఆంధ్ర ప్రజలకు ముందు ఒక అనువైన రాజధానిని అమర్చవలసింది కదా ఈ విజనరీ బాబు! కులీ కుతుబ్ షా ఆత్మ శోకించేటట్టు కేవలం తొమ్మిది ఏండ్లలో తానే హైదరాబాద్ నిర్మించానని చెప్పే చంద్రబాబు అయిదేండ్లలో శాసన సభ, శాసన మండలి, హైకోర్టు భవనాలైనా అమరావతిలో కాని, విజయవాడ, గుంటూరు మధ్య కాని నిర్మించి ఉంటే అక్కడి రైతులకు, ప్రజలకు సంతోషంగా ఉండేది కదా!
చంద్రబాబు నిజమైన విజనరీ అయితే, 1995లో మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయి, 1999లో కూడా బీజేపీ పొత్తుతో ఎన్నికలు గెలిచి 2004 దాకా తొమ్మిదేండ్లు ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా! 1995 నుండే ఆయన నియంతృత్వ పోకడలతో తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతమైంది. అప్పుడైనా ఆయన ఆంధ్రలో ఒక్కటంటే ఒక్క నగరం కూడా తయారు చేసుకోలేదెందుకు? విడిపోయాకే కాదు, కలిసి ఉన్నా ఆంధ్ర ప్రాంతం కూడా అభివృద్ధి కావాలి కదా! స్కూలుకి వెళ్లడం ఇష్టం లేని కుర్రాడిలా హైదరాబాదులోనే ఉండి పాలన సాగించాడు చంద్రబాబు!
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కేసీఆర్ కేవలం ఉద్యమం, ఎన్నికల్లో గెలుపులతో తృప్తి పడి కూర్చోలేదు. తెలంగాణలోని అన్ని రంగాల అభివృద్ధి గురించి, ఈ ప్రాంత పునర్నిర్మాణం గురించి నిపుణులతో చర్చలు జరిపారు. అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజల అవసరాలు తెలుసుకున్నారు. 13 ఏండ్ల పాటు ఒక పరిశోధకుడి లాగా పనిచేశారు. అదీ ఒక నిజమైన కార్యసాధకుడు చేయాల్సిన పని. అటు అతి స్వల్ప కాలంలో అర్ధ శతాబ్దపు విధ్వంసాన్ని సరిదిద్ది, దండగ అన్న వ్యవసాయాన్ని పండగలా తీర్చిదిద్దారు కేసీఆర్! అంతేకాదు, అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిని జోడెద్దుల లాగా సాగించి, ప్రజా జీవన విధానాన్ని అభివృద్ధి చేశారు. వ్యవసాయంతో అటు పల్లెలు, చిన్న పరిశ్రమలతో ఇటు పట్టణాలను అభివృద్ధి చేయడమే కాకుండా, హైదరాబాదుని విదేశీ నగరాలకు దీటుగా అభివృద్ధి చేశారు. తమిళ నటుడు రజనీకాంత్ హైదరాబాదుని చూసి ఆశ్చర్య చకితుడై న్యూయార్క్ నగరంలా ఉందని పొగిడారు! మెట్రో రైలు, ఫ్లై ఓవర్లు, వరద నీటి కట్టడి, బస్తీ దవాఖానాలు సామాన్య ప్రజలకు వసతులే కాక, తొమ్మిదేండ్లలో సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసి రూ.68 లక్షల ఆదాయాన్ని రూ.2.50 కోట్ల వరకు తీసుకెళ్లారు. 23 లక్షల ఉద్యోగాలు కల్పించారు. అదీ మేధస్సు అంటే!
-కనకదుర్గ దంటు