తెలంగాణలో హైడ్రా సృష్టించిన గందరగోళం అంతా ఇంతా కాదు. దానికి మించిన సమస్య ఒకటి ప్రస్తుతం ఉద్భవించింది. రిజిస్ట్రేషన్ చట్టం,సెక్షన్ 22ఏ (నిషేధిత జాబితా) కారణంగా వేలాది మంది స్థిరాస్తిదారులు, భూస్వాములు తమ సొంత స్థలాలు, ఇండ్లు, ఫ్లాట్లను విక్రయించుకోలేక, తాకట్టు పెట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది మామూలు సమస్య కాదు. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ అనేది ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ/వక్ఫ్ ఆస్తులు, సీలింగ్ మిగులు భూములు, భూదాన్ భూములను అక్రమ రిజిస్ట్రేషన్ల నుంచి కాపాడటానికి రూపొందించారని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. కానీ ఆ భూముల్లో ఇరుక్కున్నవాడి గతి ఏమిటి? ఏం చేయాలి? అన్నదే సమస్య.
ప్రభుత్వ లేదా నిషేధిత భూమి ఒక సర్వే నంబర్లో కొంత భాగం (ఉదాహరణకు కొన్ని గుంటలు) మాత్రమే ఉన్నప్పటికీ, రెవెన్యూ అధికారులు సరిహద్దులు స్పష్టంగా గుర్తించకుండా మొత్తం సర్వే నంబర్‌ను సెక్షన్ 22ఏ కింద నమోదు చేశారు అనుకుందాం. ఇక పట్టాదారులకు తిప్పలే. దీనివల్ల ఆ సర్వే నంబర్ పరిధిలోని చట్టబద్ధమైన ప్రైవేట్ పట్టా భూములు, లేఅవుట్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్తాయి. నిజానికి ఈ అంశాలన్నీ రిజిస్ట్రేషన్ సమయాల్లోనే వెలుగులోకి వస్తుంటాయి. బాధితులు తమ స్థలాన్ని అమ్మడానికి లేదా తాకట్టు పెట్టడానికి సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లినప్పుడే తమ భూమి నిషేధిత జాబితాలో ఉన్నదని తెలిసి దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
పాత భూ రికార్డులు, రికార్డుల లోపాలున్నాయి. క్షేత్రస్థాయి విచారణ లేకుండా పాత రికార్డుల ఆధారంగా నివేదికలు ఇస్తున్నారు. వీటిని మార్చకుండా పాతవే చూపుతూ ఉంటారు. దానికితోడు అధికారుల సమన్వయ లోపం సరేసరి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్శాఖల మధ్య సరైన డాటా సమన్వయం లేకపోవడం మరో సమస్య. ఇటువంటి సమస్యలు వచ్చిప్పుడు ప్రభుత్వ అధికారులు ఏం చేయాలో వారికే అర్థం కాదు, అర్థమైనా చెప్పరు. చెప్పినా న్యాయంగా సమస్య పరిష్కరించడానికి ప్రయత్నించరు.
సగటు మనిషికి కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థిక అత్యవసరాలు ముఖ్యం. పెండ్లిళ్ల్లు, వైద్య ఖర్చులు, వ్యాపారాల కోసం ఆస్తులు అమ్ముదామని అనుకునే మధ్యతరగతి ప్రజలు, రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఉదాహరణకు మల్కాజిగిరి జిల్లాలో 124 దరఖాస్తులు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 1500 పైగా దరఖాస్తులు, రాష్ట్ర వ్యాప్తంగా 24,813 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తున్నది. ఇవన్నీ కూడా తహసీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్ల కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
కలెక్టర్ల లాగిన్లలో 9 వేల దరఖాస్తులను పరిష్కరించడంలేదు. ఏ నిర్ణయాలు తీసుకోవడంలేదు. దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ భూముల్లో కోర్టు వివాదాలు, అర్బన్ ల్యాండ్ సీలింగ్, వక్ఫ్‌బోర్డ్, దేవాదాయశాఖ, అటవీశాఖ వివాదాలతో ముడిపడినవే అధికంగా ఉన్నాయి. కీలకమైన పరిధిలో ప్రభుత్వం లేఅవుట్లు వేసి విక్రయించిన ప్లాట్లలోనూ ఒకే సర్వే నంబరులో కొంత భూమిపై అర్బన్ ల్యాండ్ సీలింగ్ వివాదం ఉంటే గతంలో విక్రయించిన భూములను కూడా 22ఏలో ఇరికించారు. ఇటీవల ఓ వ్యక్తి 20 ఏండ్ల క్రితం ప్రభుత్వ వేలంపాటలో స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నాడు. ప్రస్తుతం అది 22ఏ జాబితాలో ఉన్నదని విక్రయానికి రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు ఒప్పుకోవడం లేదు. గత రెండు నెలలుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన పత్రాలన్నీ చూపించినా రిజిస్ట్రేషన్ చేయలేమని అధికారులు అంటున్నారు. రాజీవ్‌నగర్, కల్యాణ్‌నగర్, మోతీనగర్ పరిధిలో ఈ తరహా కేసులు అధికంగా ఉన్నాయి.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో 1983లో లేఅవుట్ అయిన ఎన్జీవో కాలనీ 43 ఏండ్ల తర్వాత ప్రొహిబిటెడ్లో పడింది. కమలానగర్, సాకత్నగర్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. కానీ, ఎవరి ఇల్లు నిషేధిత జాబితాలో ఉన్నదో తెలియదు. అత్యవసరాలకు రుణాల కోసం బ్యాంకులకెళ్తే మీ ప్లాటు ప్రొహిబిటెడ్లో ఉన్నదని, రుణం మంజూరు చేయలేమని బ్యాంకు అధికారులు అంటున్నారు. వీటికి ఎన్వోసీలు దొరుకడంలేదు. ఇక అధికారుల లంచగొండితనం తప్పదు. అన్నిటికీ వాయిదాలు, ఆలస్యాలు. నిషేధిత జాబితా నుంచి పేరు తొలగించుకోవడానికి లేదా క్లారిఫికేషన్ ఎన్వోసీ పొందడానికి కలెక్టరేట్లు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరుగాల్సి రావడం నరకం. బ్యాంకులు రుణాలు నిరాకరించడంతో, అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సిరావడం మరీ దయనీయం.
ఇటీవల ఈ సమస్య పరిష్కారానికి రెవెన్యూశాఖ భూమి చట్టాల నిపుణులు పలు కీలక సూచనలు చేశారు. హైకోర్ట్ ఆదేశాల ప్రకారం, సెక్షన్ 22ఏ కింద వచ్చిన దరఖాస్తులను 45 రోజుల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. జిల్లా కలెక్టర్లే దీనిపై తుది సమీక్ష నిర్వహించి అర్హులైన పట్టాదారులకు న్యాయం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్గాల వారీగా పరిష్కారం సాధించాలని అంటున్నారు. వివాదాల తీవ్రత ఆధారంగా ఒకేసారి కాకుండా దశలవారీగా సమస్యను పరిష్కరించాలి.
ఉదాహరణకు 1956 కంటే ముందు కేటాయించిన భూములు, వ్యవసాయేతర ప్లాట్లు, హెచ్ఎండీఏ డీటీసీపీ ఆమోదం పొందిన లేఅవుట్లను ముందుగా సమీక్షించి క్లియరెన్స్ ఇవ్వడం. అసలు సమస్య అధికారుల ఆడిట్ ఉండదు. పారదర్శకత లేకపోవడం, సమాచార హక్కు చట్టం పనికివస్తుందో లేదో అర్థం కాదు. ప్రతి గ్రామం లేదా వార్డు పరిధిలోని నిషేధిత భూముల జాబితాను గ్రామ పంచాయతీలు /వార్డు ఆఫీసుల్లో ప్రదర్శించడం చాలా అవసరం. ప్రజల నుంచి అభ్యంతరాలు, ఆధారాలు స్వీకరించి క్షేత్రస్థాయిలో నిజమైన పట్టా భూములను జాబితా నుంచి త్వరితగతిన తొలగించాలి. ఆన్లైన్ ట్రాకింగ్, సాంకేతిక వ్యవస్థను ప్రవేశ పెట్టాలి.
ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకున్న బాధితులకు ఆన్లైన్ ట్రాకింగ్, ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్లు అందించే పారదర్శక వ్యవస్థను అమలు చేయాలి. ’టైటిల్ గ్యారెంటీ’ కావాలని వినిపిస్తున్న డిమాండ్లకు ప్రభుత్వం జవాబు ఇవ్వడంలేదు. ప్రస్తుతం మన వద్ద ఉన్న ’డీడ్స్ రిజిస్ట్రేషన్’ స్థానంలో భూమి హక్కుకు పూర్తి భరోసానిచ్చే ’టైటిల్ రిజిస్ట్రేషన్’ విధానం వైపు దీర్ఘకాలికంగా మారాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ ప్రజా ఆస్తులను కాపాడటం ఎంత ముఖ్యమో, చట్టబద్ధంగా కొనుగోలు చేసిన సామాన్య పౌరుల ప్రైవేట్ ఆస్తుల హక్కులను కాపాడటం కూడా అంతే ముఖ్యం. ’భూభారతి’ చట్టం ఆన్లైన్లో సరిదిద్దే ప్రక్రియల ద్వారా ఈ సెక్షన్ 22ఏ చిక్కుముడులను ప్రభుత్వం కాలపరిమితితో త్వరగా పరిష్కరించాలి.
(వ్యాసకర్త: ప్రముఖ న్యాయనిపుణుడు)
-మాడభూషి శ్రీధర్