బ్రిటిష్ సైన్యాన్ని, రజాకార్లను ఎదిరించిన కాకతీయ రాజులు ప్రజలకు సుపరిపాలన అందించారు. ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న కాకతీయుల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆంధ్రా పెత్తందారుల కబంధ హస్తాల నుంచి తెలంగాణ ప్రాంతాన్ని విముక్తం చేశారు. సంక్షేమ పథకాలతో ప్రజలకు స్వర్ణయుగం అందించి తెలంగాణను అగ్రభాగాన నిలిపారు. అలాంటి పాలనపై బురదజల్ల చూస్తున్న కాంగ్రెస్ను ప్రజలు చీదరించుకుంటూ మళ్లీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారు.
దేనికైనా ఓ హద్దు ఉంటుంది. కానీ, కాంగ్రెస్ ఆశకు మాత్రం హద్దు లేదు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్కు పాలనా పగ్గాలు అప్పగిస్తే ఇష్టారీతిన పాలిస్తూ ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం దొంగ 420 హామీలను అమలు పరుస్తామని చెప్పింది. కానీ, ఇప్పుడు ఇచ్చిన మాట తప్పింది. నాటి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉచిత పథకాలను సైతం అమలు చేయలేక కేవలం ఏడాదిరన్నర పాలనలోనే రేవంత్ సర్కార్ చేతులెత్తేసింది. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే, ప్రజా పాలన, ప్రజా సభలు అంటూ సీఎం రేవంత్ తన భజనలు తానే చేసుకుంటూ అమితానందం పొందుతుండటం శోచనీయం.
ఇటీవలి బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అభివృద్ధి జరగడం లేదంటూ వాపోతున్నారు. కనీసం రైతులకు సాగునీరైనా అందించండి మహాప్రభో అంటూ నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ప్రస్తుత రేవంత్రెడ్డి సర్కార్లో 20 శాతం కమీషన్ల వాటా నడుస్తున్నది. ‘నీకెంత, నాకెంత, అధికారికెంత’ అంటూ పంచుకోవడాలు తప్పితే అభివృద్ధి శూన్యం. ఆర్భాటం మాత్రం అదరహో. రేవంత్ ఇప్పటివరకు 40 సార్లు ఢిల్లీకి పోయాడే తప్ప, గ్రామాలల్లో మాత్రం నాలుగు సార్లు కూడా తిరగలేదు. కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసి, వారి ఆర్థిక పరిపుష్టి కోసం వడ్డీ లేని రుణాలను మంజూరు చేసింది. మహిళలు స్వశక్తిగా ఎదిగేలా చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నది.
కనీసం ఆశ వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్యపు ప్రభుత్వపు మాటలను ఎలా నమ్మేదని మహిళలు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ సారథ్యంలో దేశంలో రాష్ట్ర జీడీపీ ప్రథమ స్థానంలో ఉండేది. కానీ అది ఇప్పుడు ఎక్కడికో పోయింది. రాష్ట్రంలో అధికారం చేపట్టడం కోసం గొంతు చించుకొని మరీ, రూ.2 లక్షల వరకు రుణమాఫీ అంటూ. రూ. 2 లక్షలపైన తీసుకున్న రైతులు కూడా వెంటనే పై డబ్బులు చెల్లిస్తే నేరుగా రైతు ఖాతాలో రూ.2 లక్షలు జమ చేస్తామని స్వయానా సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. ఆ మాయమాటలు నమ్మి రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతుబంధు రాకున్నా, కనీసం రుణమాఫీ అయినా వస్తుందని అప్పు చేసి మరి రూ.2 లక్షల పైనున్న డబ్బులను బ్యాంకుల్లో చెల్లించారు. అప్పు తెచ్చి పై డబ్బులు కడితే సాక్షాత్తూ వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీ వేదికగా ‘రూ.2 లక్షల లోపే రుణమాఫీ అంటూ’ చేతులెత్తేశాడు.
ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎమర్జెన్సీ రాజ్యం. అందుకే ఎక్కడచూసినా పోలీసుల పెత్తనం నడుస్తున్నది. అంతేకాదు, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే ఉన్నతాధికారుల కుర్చీల్లో కూర్చుంటూ జబర్దస్తీ చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ప్రజాపాలన ఎంత మేర దిగజారిందో మనకు అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే.. భారత ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభమైన మీడియా గొంతును సైతం నొక్కే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నది. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై, పాలకుల వైఫల్యంతో సాగునీరు అందక ఎండుతున్న పొలాలపై ప్రశ్నిస్తున్న రైతుల మీద, మీడియా మీద పోలీసు జులుం ప్రదర్శించడం ఆందోళనకరం. పోలీసుల మాట వినకుంటే వారిని జైలు పాలు చేయడం లాంటి దుశ్చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్నది. కాంగ్రెస్ నాయకుల అహంకారానికి, అరాచకత్వానికి బుద్ధి చెప్పాలంటే త్వరలో రాబోయే స్థానికసంస్థల ఎన్నికల్లో కర్రు కాల్చి వాతపెట్టాల్సిన అవసరం ఉన్నది.
– (వ్యాసకర్త: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే)
పెద్ది సుదర్శన్ రెడ్డి