‘సస్యశ్యామల దేశం /అయినా నిత్యం క్షామం…/ఉప్పొంగే నదుల జీవజలాలు/ ఉప్పు సముద్రం పాలు/ యువకుల శక్తికి భవితవ్యానికి/ ఇక్కడ తిలోదకాలు..’
సినీ కవి ఆరుద్ర 1971లో పవిత్రబంధం సినిమా కోసం రాసిన ఈ పాట తెలంగాణ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లయినా దేశంలోని వర్షాధార (పెనిన్సులార్) నదుల్లో కనీసం సగం జలాలను కూడా సాగుకు మళ్లించకుండా సముద్రంపాలు చేస్తున్న నది గోదావరి, ఆ రాష్ట్రం పేరు తెలంగాణ! దేశంలో ప్రవహించే వర్షాధార జీవనదులన్నీ వేసవిలో ఎండిపోయి తమ ‘సజీవ’ స్వభావాన్ని కోల్పోయి వెక్కిరిస్తున్నా ‘మనకు అండగా ఉన్నా’నంటూ కోట్లాది బతుకులకు భరోసా ఇస్తూ మహోధృతంగా ప్రవహించే గోదావరిని చూసి గర్వపడదామా? శతాబ్దాలుగా తలాపున పారుతున్న గోదారి నీళ్లను ఎండుతున్న మన చేనూ, చెలకలకూ మళ్లించుకోనందుకు సిగ్గుపడదామా? దశాబ్దాలుగా గోదారి జలాలు సముద్రం పాలవుతుంటే దిక్కులేక లక్షలాది ప్రజల దారి మాత్రం దుబాయి, బొంబాయి, బొగ్గుబాయి లేదా బస్తర్ అడవులకు.
గోదావరి జలాల వినియోగానికి తొలి ప్రయత్నాలు: గత శతాబ్దిలో ఒకే ఒక్కడు.. అప్పటి పాలకుని అండదండలు పుష్కలంగా ఉన్న గొప్ప ఇంజినీర్ మీర్ అహ్మద్ అలీ అలియాస్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహద్దూర్ (ఆయన జన్మదినమే తెలంగాణకు ఇంజినీర్స్ డే). ఆయన నిర్మించిన ప్రాజెక్టులు, పథకాలు, ప్రణాళికలు, మరమ్మతులు, చేసిన పనులు పరిశీలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. గోదావరి ఉపనది అయిన మంజీరా జలాలను మెతుకు సీమ బీళ్లకు మళ్లించడానికి తొలి ప్రయత్నమే ఘణపురం ఆనికట్. దీన్ని నిర్మించి మహబూబ్‌నగర్, ఆసిఫ్‌నగర్ కాల్వలతో వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేశారు. అదే మంజీరా నదిపై ఆసియా ఖండంలోనే ఎక్కడాలేని టెక్నాలజీని జర్మనీ వంటి దేశాల నుంచి తెప్పించి రెండు లక్షల డబ్బు అయిదు వేల ఎకరాలకు నీరిచ్చే నిజాంసాగర్‌ను వందేండ్ల క్రితమే నిర్మించారు. అవే మంజీరా జలాలతో పోచారం ప్రాజెక్టుకు ప్రాణం పోశారు. మంజీరాలో ఇంకా మిగిలిన నీళ్లను సాగుకు మళ్లించడానికి 38 టీఎంసీల దేవునూరు బహుళార్థ సాధక ప్రాజెక్టుకు ప్రణాళికను సిద్ధం చేశారు. నిజాంసాగర్ వంటి గొప్ప ప్రాజెక్టుకు ఇసుక కొట్టుకురాకుండా నివారించాలనే గొప్ప సంకల్పం ఈ దేవునూరు ప్రాజెక్టు వెనుక ఉన్నది.
అతిపెద్ద గోదావరి ప్రాజెక్టు: గోదావరిలో లభ్యమవుతున్న అపారమైన జలరాశిని తెలంగాణలో అప్పటి ఎనిమిది జిల్లాల్లో ఆరు జిల్లాలకు మళ్లించడానికి 28 లక్షల ఎకరాలకు సాగునీరివ్వడానికి మూడు డ్యాములు, పలు కాల్వలు, ఆనికట్లతో గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టుకు ప్రాణం పోయాలనుకున్నారు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమే పోచంపాడు ప్రాజెక్టు (ప్రస్తుత శ్రీరాంసాగర్).
నిర్మాణంపై కేఎల్ రావు అనుమానం: మద్రాసులోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్’ సమావేశంలో 1958 ఆగస్టులో ప్రముఖ ఇంజినీర్ కె.ఎల్.రావు మాట్లాడారు. ‘ఇరుగు పొరుగు ప్రాంతాల కన్నా తెలంగాణ అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతం. నీటిపారుదల వసతి పంజాబ్‌లో 32 శాతం, యూపీలో 25 శాతం ఉండగా తెలంగాణలో 10 శాతమే. దీనిలో కూడా కాల్వల కింది సాగు అతి స్వల్పం. నీటి వసతికి గొప్ప ఆధారం (గోదావరి, కృష్ణా) ఉండి, సారవంతమైన భూములుండి, తగినంత వర్షాపాతం ఉన్నా బీడు పడి తెలంగాణ పేదరికంలో మగ్గుతున్నది. ఈ వనరులేవీ ప్రజలకు ఉపయోగపడటం లేదు. బీడు భూములను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయగల సమగ్రమైన పోచంపాడు ప్రాజెక్టు నిర్మించకుండా తెలంగాణ అభివృద్ధి సాధ్యపడదు. ప్రస్తుతం దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న తెలంగాణ పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణంతో భారతదేశానికే అతిగొప్ప ధాన్యాగారంగా విరాజిల్లుతుంది’ అని ఆయన అన్నారు.
మరో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా కె.ఎల్.రావు చేశారు. ‘భారతదేశ వికాసానికి, తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి గోదావరి లోయలోని అన్ని ప్రాజెక్టులలోకెల్లా పోచంపాడు అత్యంత ప్రాధాన్యం కలది. 1794లో కావేరీ నదిపై ప్రస్తుతం ఉన్న కృష్ణరాజసాగర్ స్థలంలో ఒక డ్యాం నిర్మాణాన్ని మొదలుపెట్టిన సందర్భంగా టిప్పు సుల్తాన్ (అక్కడి రాజు) ఏ ‘నమ్మకాన్ని’ వ్యక్తపరిచాడో మనం అదే నమ్మకాన్ని ఏర్పరచుకుందాం. ‘ప్రారంభం మాత్రం నా చేతిలో ఉన్నది. కానీ, దీన్ని పూర్తిచేసే బాధ్యత దేవునిపై ఉన్నది’ అంటూ పోచంపాడు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు కె.ఎల్.రావు (ఆధారం: తెలంగాణ రీజినల్ కమిటీ అంచనాల కమిటీ రిపోర్ట్ 1969-70, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ).
అలీనవాజ్ జంగ్ గోదావరి జలాల వినియోగం కోసం ప్రతిపాదించిన ప్రాజెక్టులలో లోయర్ పెన్‌గంగా, ప్రాణహిత కూడా ఉన్నాయి. రెండు వేల టీఎంసీల ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఆధునిక తెలంగాణ రూపశిల్పి సర్ సాలార్జంగ్ బ్రిటిష్ మిలిటరీ ఇంజినీర్ ఆర్థర్ కాటన్‌తో కలిసి నిర్మాణ పనులు ప్రారంభించి, విష జ్వరాలతో అడవిలో ఫ్రెంచ్ ఇంజినీర్లు మరణించడంతో 1858లో అర్ధాంతరంగా వదిలేసిన ఇచ్చంపల్లి బహుళార్థ సాధక ప్రాజెక్టు (136 మీటర్ల ఎత్తు, రెండు వేల టీఎంసీల నీటి నిల్వ) పథకం ఫైళ్లను బయటికి తీశారు. 1947లో నిజాంతో చర్చించి సముద్ర మట్టానికి 370 అడుగుల ఎత్తులో 295 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు అప్పుడు నీటిపారుదల కార్యదర్శిగా ఉన్న అలీ నవాజ్ జంగ్ బహద్దూర్.
తెలంగాణలో నదీజలాల వాటా కోసం వెల్లోడి కృషి: తెలంగాణలోని ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు పొందడానికి 1951 జూలై 27, 28 తేదీల్లో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ప్రణాళికా సంఘం నిర్వహించిన అంతర్రాష్ట్ర నదీజలాల సమావేశానికి తానే స్వయంగా హాజరై గోదావరిలో తెలంగాణకే 845.70 టీఎంసీల (మొత్తం కలిపి వెయ్యి టీఎంసీలు) గోదావరి జలాల కేటాయింపులను పొందినారు అప్పటి హైదరాబాద్ ముఖ్యమంత్రి ఎం.కె.వెల్లోడి (ఐసీఎస్ అధికారి). అప్పటికే మరో 150 టీఎంసీల గోదావరి జలాలను తెలంగాణ ప్రాంతంలో శతాబ్దాల క్రితం నిర్మించిన చెరువులు, కుంటల ద్వారా వినియోగిస్తున్నారు. సుమారు వెయ్యి టీఎంసీల గోదావరి జలాలను తెలంగాణలో వినియోగించే ప్రయత్నం నిజాం పాలనలోనే మొదలుకాగా ఆ పథకాలను, ప్రణాళికలను, అలీ నవాజ్ జంగ్, నిజాం కన్న కలలను, కోటి తెలంగాణ రైతుల ఆశలను, భవిష్యత్తును బూడిదపాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
– (వ్యాసకర్త: చైర్మన్, భారత వర్షాధార నదీ పరీవాహక ప్రాంతాల కౌన్సిల్)
వి.ప్రకాశ్