Dalitha Bandhu | ఏడు దశాబ్దాల తర్వాత కూడా వివిధ వర్గాల నుంచి రిజర్వేషన్లపై డిమాండ్లు వినిపించడమంటే రిజర్వేషన్ల వల్ల ఆశించిన ప్రయోజనం సిద్ధించనట్టే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తొలుత పదేండ్ల పాటు రిజర్వేషన్లు అమలుచేస్తే సమాజంలో అంతరాలు తగ్గిపోతాయని భావించారు. ఏడు దశాబ్దాల తర్వాత సగర్వంగా ఈడబ్ల్యూఎస్ అంటూ ఇతర వర్గాలకు కూడా రిజర్వేషన్ల అమలును సగర్వంగా ప్రకటించుకుంటున్నామంటే మనం వెనక్కు వెళ్తున్నామా? ముందుకు వెళ్తున్నామా? అనే అనుమానం కలుగుతున్నది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినరోజు, ఆ తర్వాత చాలామంది మిత్రులతో జరిగిన సంభాషణలో ‘దళితబంధు’ ప్రస్తావన వచ్చింది. ఒక రాజకీయ పక్షం ఓటమికి, గెలుపునకు అనేక కారణాలుంటాయి. అనేక అంశాల ఆధారంగా ఓటరు నిర్ణయం తీసుకుంటారు. ఈ కారణం వల్లనే ఓటమి, ఈ కారణం వల్లనే గెలుపు అని ఎవరికి వారు విశ్లేషణ చేయడం సహజం. అయితే ఓటరు కేవలం తనకు నచ్చిన పార్టీకి ఓటు వేస్తాడు తప్ప బ్యాలెట్ బాక్స్‌లో ఓటరు ఈ కారణం వల్ల ఒక పార్టీని గెలిపించాడు, ఒక పార్టీని ఓడించినాడనే కారణాలు ఉండవు. ఫలితాల తర్వాత ఎవరి విశ్లేషణ వారిది.
‘దళితబంధు’ మీద ఆసక్తితో చాలామంది నుంచి ఈ పథకం గురించి అభిప్రాయాలు విన్నాను. పదేండ్లలో సమాజంలో మార్పు వస్తుందని అంబేద్కర్ ఆశిస్తే, 70 ఏండ్ల తర్వాత కూడా రిజర్వేషన్ల అవసరం ఉన్నదంటే ఆశించిన స్థాయిలో మార్పు రాలేదు. మార్పు అసలే రాలేదని చెప్పలేం కానీ, ఆశించిన స్థాయిలో అంతరాలు తగ్గిపోలేదు. ముస్లింల స్థితిగతులపై కమిషన్ ఏర్పాటు చేసినట్టు షెడ్యూల్డ్ కులాలపై కూడా అధ్యయనం చేసేందుకు కమిషన్‌ను నియమిస్తే దేశవ్యాప్తంగా వారి స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది.
దేశమంతా అధ్యయనం సంగతి ఎలా ఉన్నా కొన్ని గ్రామాలకు వెళ్లి చూస్తే తెలుస్తుంది. కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించి వారి కుటుంబ స్థితిగతులు మారాయి. కానీ, ఎక్కువ మంది గ్రామీణుల స్థితి సగటు కన్నా తక్కువగానే ఉన్నది. షెడ్యూల్డ్ కులాలలో రిజర్వేషన్ల వల్ల ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనే భావనతో కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉద్దేశం మంచిది. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు మేలు చేయడం ద్వారా వారి మద్దతుతో తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. ఇందిరాగాంధీ కాలం నుంచి నేటివరకు ఏ పథకం లక్ష్యమైనా ఆ వర్గానికి మేలు చేయడంతోపాటు, ఆ మేలు వల్ల తమ పార్టీకి ప్రయోజనం కలగాలని కోరుకుంటారు. కానీ ఒక పథకం ప్రారంభించి, నిధులు వెచ్చించి భారీ వ్యతిరేకత కొనితెచ్చుకున్న పథకం దళితబంధు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ పథకం గురించి చాలామందితో మాట్లాడినప్పుడు కలిగిన అభిప్రాయం.
రాజకీయ నాయకులు, మేధావులు ఎవరైనా మైకుల ముందు దళితుల పట్ల చూపించేంత ప్రేమ వాస్తవంలో ఉండదు. పైగా వ్యతిరేకత ఉంటుంది. అందరూ అని చెప్పలేం కానీ, చాలామంది పైకి వ్యక్తం చేయరు కానీ వ్యతిరేకత ఉంటుంది. దళితులందరూ చదువుకొని ఉద్యోగాలు చేయలేరు. చదువుకున్నవారైతే ఉద్యోగాలు పొందేందుకు రిజర్వేషన్లు ఉపయోగపడొచ్చు. కానీ, వీరి సంఖ్య కన్నా గ్రామాల్లో, పట్టణాల్లో ఏదో ఒక పని చేసుకొని జీవించేవారే ఎక్కువ. కులం పేరుతో వీరు గతంలో వివక్షకు గురైనా వీరికేం రిజర్వేషన్ల ఫలాలుండవు. ఇలాంటి వారు కూడా అభివృద్ధి చెందేందుకు కేసీఆర్ ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని తీసుకువచ్చింది. పథకం ఉద్దేశం మంచిదే. దీనిద్వారా ఆ వర్గాలు ప్రయోజనం పొందడంతో పాటు తమ పార్టీకి కూడా ప్రయోజనం కలుగుతుందని ఆశించింది. కానీ, ఆచరణకు వచ్చేసరికి వ్యతిరేక ఫలితాలను ఇచ్చింది ‘దళితబంధు’ పథకం.
నిజానికి ఇదిప్పుడే బయటపడ్డ విషయమేమీ కాదు. హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిచినప్పుడే ఈ విషయం బయటపడింది. ‘దళితబంధు’ అమలుచేసిన గ్రామాల్లో కూడా బీజేపీకి మెజారిటీ వచ్చిందని అప్పుడు వార్తలు కూడా వచ్చాయి. ఉప ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత, దళితబంధు వ్యతిరేక ప్రభావం చూపుతుందని గ్రహించి ఈ పథకం అమలును నిలిపివేస్తారనిపించింది. నిలిపివేస్తే రాజకీయంగా ప్రయోజనం కలిగేదేమో. కానీ, మరింత ఉధృతంగా అమలుచేశారు. ఇందిరాగాంధీ హయాం నుంచి షెడ్యూల్డ్ కులాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండేవి. ఇతర పార్టీలు అన్నీ కూడా కాంగ్రెస్ నుంచి ఆ వర్గాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తమ తమ స్థాయిలో తీవ్రంగా ప్రయత్నించాయి.
షెడ్యూల్డ్ కులాల్లోని రెండు కులాలను రెండుగా విభజించి ఒక కులాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఎన్టీఆర్ హయాం నుంచి ప్రయత్నాలు జరిగాయి. మాలలు కాంగ్రెస్ వైపు ఉన్నారని ఎన్టీఆర్ మాదిగ వర్గాన్ని తమ పార్టీ వైపు వచ్చేట్టు చేశారు. తర్వాత చంద్రబాబు రిజర్వేషన్ల వర్గీకరణ అమలుచేసి మాదిగలను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకున్నారు. సుప్రీంకోర్టు కొట్టివేయడంతో వర్గీకరణ మళ్లీ మొదటికొచ్చింది. ఎం.వెంకయ్యనాయుడు శాసనసభ్యునిగా ఉన్నకాలం నుంచి బీజేపీ వర్గీకరణకు మద్దతుగా నిలిచింది. ఏకంగా మందకృష్ణ నాయకత్వంలో వర్గీకరణ కోసం ఉద్యమిస్తామని ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బహిరంగసభలోనే ప్రకటించారు. తెలంగాణలో వీరిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్రయత్నం.
‘దళితబంధు’ ద్వారా షెడ్యూల్డ్ కులాల్లో అందరి మద్దతు పొందుతామని బీఆర్ఎస్ ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. కానీ, ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాన్ని పొందింది. మహానగరంలో పక్కింటివారి పేరు తెలియదు. అపార్ట్మెంట్లో ఒకరి గురించి ఇంకొకరికి తెలియదు. ఎవరి జీవితం వారిది. పక్కింటి వ్యక్తి కోటి సంపాదించినా ఐతే నాకేంటి అనుకుంటాం. కానీ, గ్రామాల్లో పరిస్థితి అలా ఉండదు. అప్పటివరకు పేదరికంలో బతికిన కుటుంబానికి ఒక్కసారిగా ‘దళితబంధు’ కింద 10 లక్షలు వస్తే తేలిగ్గా తీసుకోరు.
ఓ గ్రామంలో ఉదాహరణకు వెయ్యి కుటుంబాలున్నాయనుకుంటే.. ఐదు కుటుంబాలకు ‘దళిత బంధు’ ఇస్తే మిగిలినవారిలో వ్యతిరేక ప్రభావం చూపుతుంది. పోనీ గ్రామంలో ఉన్న దళిత కుటుంబాలన్నీ సానుకూలంగా స్పందిస్తాయా? అంటే ఫలితాలు చూస్తే అలా కనిపించడం లేదు. వారికే ఇచ్చారని మిగిలిన కులాల్లో వ్యతిరేకత. ఐదు కుటుంబాలకే ఇచ్చారని షెడ్యూల్డ్ కులాల్లోని ఇతర కుటుంబాల్లో వ్యతిరేకత.
మరోవైపు ‘దళితబంధును తమవారికే కేటాయించుకున్నారని, అవినీతికి పాల్పడ్డార’నే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఫలితాలు వచ్చినరోజు… ‘మాకేమో జీతాలు ఆలస్యంగా ఇస్తూ బంధులు అంటూ డబ్బులు పంచిపెట్టారు, వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఎందుకుంటాం’ అంటూ ప్రభుత్వ ఉద్యోగులు మార్నింగ్ వాక్‌లో కామెంట్. మొత్తం మీద భారీ ఎత్తున నిధులు కేటాయించి వ్యతిరేకత కొనితెచ్చుకున్నారు. ఎవరికీ ఇవ్వకపోయినా ఏమీ కాదు. కానీ, ఐదుగురికి ఇస్తే మిగిలిన 95 మందిలో వ్యతిరేకత వస్తుంది. ఇది మనిషి సహజ గుణం.
దళితబంధు సక్రమంగా అమలుచేస్తే సమాజంలో మార్పు తీసుకువచ్చేదేమో కానీ, రాజకీయంగా నష్టం కలిగించి తీరుతుంది. ఇప్పుడైనా ఎప్పుడైనా… ఎందుకంటే మనుషులకు మైకుల ముందు మాట్లాడేంత విశాల హృదయం ఉండదు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
బుద్దా మురళి
98499 98087