హైడ్రా ఏర్పడిన నాటి నుంచి అది సమాజంలోని అట్టడుగువర్గాల బతుకులను ఎక్కువగా ప్రభావితం చేసిందనే అభిప్రాయం గణనీయంగా పెరిగింది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రా అసలు లక్ష్యమేమిటన్న విషయమై స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొన్నది. హైడ్రాపై ప్రజల్లో అప నమ్మకం ఏర్పడింది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. తాము కూల్చబోయే ఇండ్ల యజమానులకు సమయం ఇవ్వబోమని, అలా సమయమిస్తే వారు కోర్టును ఆశ్రయించి, స్టే తెచ్చుకుంటారని చెప్పడం విడ్డూరం. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కును హరించివేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని దీన్నిబట్టి అర్థమవుతున్నది.
హైదరాబాద్ కూల్చివేతలపై ఇటు ప్రజల నుంచి, అటు ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి నోటీసులు లేకుండానే ఇండ్లను నేలమట్టం చేస్తున్నారని, అదీ కాకుండా సామాన్యుల ఇండ్ల నే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నా యి. ఇండ్లు కోల్పోయిన పేదలు.. అధికారుల కాళ్లపై పడి అభ్యర్థిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ద్వారా హైడ్రా ఉనికిలోకి వచ్చింది. సంబంధిత ఆర్డినెన్స్‌కు ఇటీవల గవర్నర్ ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీతో పాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌గా పిలుచుకునే రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఓఆర్ఆర్కు ఆనుకొని ఉన్న ప్రాంతాల వరకు దీని పరిధి విస్తరించి ఉన్నది. నగరంలో విపత్తులను నివారించడం, చెరువులు, కుంటల వంటి ప్రజా ఆస్తుల ను పరిరక్షించడానికి హైడ్రాను ఏర్పాటుచేసినట్టు జీవో ద్వారా తెలుస్తున్నది.
ఏదేమైనా హైడ్రా కూల్చివేతలు చట్టబద్ధమైన పాలనకు కట్టుబడకుండా వ్యవహరించే పోలీసుల తీరును పోలి ఉన్నది. సంపన్నుల ఆస్తులను లక్ష్యంగా చేసుకొని, ఆ ముసుగులో పేదల గూళ్లను కూలగొట్టడం, పౌరులను అసమానంగా చూడటం లాంటి దాని వివాదాస్ప ద చర్యల పట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సీఎం సోదరుడు, ఓ బడా రియల్ వ్యాపారికి ముందస్తుగా నోటీసులిచ్చి, నెలకు పైగా సమయమివ్వ డం, ఎలాంటి నోటీసులు లేకుండానే పేదల ఇండ్లను కూలుస్తున్నారనే ఆరోపణలు వినవస్తుండటమే అందుకు నిదర్శనం.
పైసా పైసా కూడబెట్టుకొని, తమ కుటుంబాల నీడ కోసం పేదలు కట్టుకున్న ఇండ్లను కూల్చడమంటే.. ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును హరించివేయడమే. రాజ్యాంగం ప్రకారం ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాకపోవచ్చు కానీ, ఆర్టికల్ 300 ఏ ప్రకారం అది చట్టపరమైన హక్కు. నోటీసులు లేకుండా ఇండ్లను కూల్చడమంటే ఈ చట్టపరమైన హక్కును కాలరాయడమే.
కూల్చివేతల కంటే ముందు సమగ్రంగా సర్వే చేసి, బాధితులకు పునరావాసం కల్పించాలని సుధమా సింగ్ VS ఢిల్లీ సర్కార్ కేసులో న్యాయస్థానాలు నొక్కిచెప్పా యి. తద్వారా ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులో ఆశ్రయం పొందే హక్కు కూడా భాగమని న్యాయస్థానాలు గుర్తించాయి. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి పేద ప్రజలపై దాని ప్రభావం ఆస్తి నష్టం కంటే ఎక్కువగా ఉన్నందున, వారి మనుగడకే ముప్పు పొంచి ఉన్నది.
భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో చట్టాలు రూపొందించే సర్వాధికారాలు చట్టసభలకే ఉంది. హైడ్రాను చట్టసభల ద్వారా కాకుండా, జీవో ద్వారా ఏర్పాటుచేయడాన్ని బట్టి, రాష్ట్ర చట్టసభలు తమ అధికారం విషయంలో రాజీ పడ్డాయని తెలుస్తున్నది. ప్రాతినిధ్య హక్కు, అప్పీల్ చేసుకునే హక్కు, దోషిగా నిరూపితమయ్యే వరకు నిర్దోషిగానే భావించాలనే పునాదులపై ఆధునిక న్యాయ వ్యవస్థలు నిర్మితమయ్యాయి. ఇలా ఆకస్మిక కూల్చివేతలు చేపట్టడమంటే న్యాయవ్యవస్థ ప్రజలకు కల్పించిన రక్షణలను విస్మరించినట్టే. ఏదైతేనేం, తక్షణ న్యాయం కొంతమేరకు సంతృప్తికరంగా అనిపించవచ్చు. కానీ, పాలనాపరంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో అది పనికిరాదు. విపత్తు నిర్వహణ, వాతావరణ పరమైన సమస్యలకు ఈ విధానం మాత్రం దివ్యౌషధం కాదు. ఆర్థికంగా, నైతికంగా, రాజ్యాంగపరంగా.. ఏ రకంగా చూసుకున్నా ఇది ప్రజా వ్యతిరేక చర్యగానే మిగిలిపోతుంది.
(‘ది వైర్’ సౌజన్యంతో..)
-పొట్టెపాక సందీప్‌కుమార్
బోడపుంటి వినీత్‌కుమార్