Telangana | తెలంగాణ అంటే ఒక చైతన్యం, తెలంగాణ అంటే అస్తిత్వం, తెలంగాణ అంటే ఆత్మగౌరవం… ప్రజల చిరకాల వాంఛ అయిన ఈ తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ చావు అంచులదాకా వెళ్లి సాధించారు. తెలంగాణ ప్రజలను ఏకం చేసి, పదవులను తృణప్రాయంగా వదిలి, పద్నాలుగేండ్ల సుదీర్ఘ ఉద్యమంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. ఇది చరిత్ర. చెరిపేస్తే చెరిగిపోని చారిత్రక వాస్తవం.
తెలంగాణ ఉద్యమంలో వందల మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వేలాది మంది ఉద్యమకారులు జైలు గోడలను ముద్దాడారు. లక్షలాది మంది ప్రజలు లాఠీ దెబ్బలు తిన్నారు. కోట్లాది మంది ప్రజలు రోడ్ల మీదికి వచ్చారు. తత్ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ రాష్ర్టానికి ఉద్యమ నేత కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గత పదేండ్ల స్వల్పకాలంలో 60 ఏండ్ల దుర్భిక్షాన్ని పారద్రోలి తెలంగాణను అన్నపూర్ణ చేశారు. ఆకలిచావులు లేవు, ఆత్మహత్యలు లేవు. కేసీఆర్ దేశంలోని అన్నిరంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టారు. పాలనకు దిక్సూచిగా, పథకాలకు ఆదర్శంగా తెలంగాణను తయారుచేశారు. తాగు, సాగునీళ్లు, గురుకుల పాఠశాలలు, కల్యాణలక్ష్మి ఇలా, ఒకటా రెండా? వందల సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలయ్యాయి. రాష్ట్రంలో సంక్షేమం అందని ఇల్లు లేదు, అభివృద్ధి జరుగని ఊరు లేదు.
మీడియాతో కలిసి విపక్షాలు కేసీఆర్ మీద, ఆయన కుటుంబం మీద విషాన్ని విరజిమ్మాయి. ఫలితంగా వ్యతిరేక తీర్పు వచ్చింది. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభు త్వం కేవలం ఉచిత బస్సు హామీని అమలుచేస్తూ ఊరేగుతున్నది. కేసీఆర్ గద్దె దిగిన ఆరు నెలల్లో 24 గంటల కరెంటు మాయమైంది. సాగునీళ్లు లేక వ్యవసాయం కుంటుపడ్డది. పంటలు కొనే నాథుడు లేడు రైతు కంట నీరు తీస్తున్నాడు.
అమరులారా మన్నించండి. మీ అమరత్వంతో సాకారమైన తెలంగాణ ఇప్పుడు మానసిక వైకల్యంతో తప్పటడుగులు వేస్తున్నది. ఇది తాత్కాలిక సంక్షోభం. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను ముందంజలో నిలబెడతాం. మీ ఆశయాలు సాధిస్తాం.
–ఎస్వీ రమణారెడ్డి 99492 99699