ఒక విషయం ఎందువల్లనో గాని అంతగా వార్తలకు ఎక్కటం లేదు. చర్చకు అంతకన్నా రావటం లేదు. దాని పేరు ‘ప్రజావాణి’. రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ప్రకటించి ఎనిమిది నెలలు గడిచి పాతబడిపోయినందున ఎక్కువమందికి గుర్తుండకపోవచ్చు. ఆసక్తి తగ్గవచ్చు. కనుక చర్చలోకి వెళ్లేముందు ఆ విషయం ఒకసారి మననం చేసుకోవటం అవసరం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుడు డిసెంబర్ 7వ తేదీన ఏర్పడిన వెంటనే తీసుకున్న తొలి చర్యలలో ఒకటి, గత ప్రభుత్వ పాలనలో నిర్మించిన ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు ఫూలే భవన్‌గా మార్చి, దాని ముందున్న ‘కంచెలను బద్దలు కొట్టి’, ఇకనుంచి ప్రజలు అందులోకి స్వేచ్ఛగా ప్రవేశించి తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేయవచ్చునని ప్రకటించటం. ఆ విధంగా వినతిపత్రాల స్వీకరణ కార్యక్రమానికి మొదట ప్రజా దర్బార్ అనే పేరు పెట్టి, రెండురోజుల తర్వాత ‘ప్రజావాణి’గా మార్చారు. ఈ చర్యలపై సర్వత్రా ప్రశంసలు రాగా, ప్రజలు తమ వినతులతో పోటెత్తటం మొదలైంది. అంతవరకు అంతా బాగున్నది. కానీ, కార్యక్రమం మొదలై ఇప్పటికి ఎనిమిది నెలలు గడిచినా ఏదీ పరిష్కారం కాక, ‘ప్రజావాణి’ కాస్తా అరణ్యరోదనగా మిగిలినట్లు కనిపిస్తున్నది.
ఈ పరిస్థితికి అదనంగా మరికొన్ని చేరాయి. వినతిపత్రాలు ఇచ్చినవారికి నంబర్లు ఇచ్చారు. వాటి పరిస్థితి ఏమిటో చెక్ చేసుకోవటానికి అధికారికంగా పోర్టల్‌లో ఏర్పాట్లు చేశారు. అంతవరకు బాగున్నది. కానీ సామాన్య ప్రజలలో అట్లా చెక్ చేసుకోవాలన్న మాట తెలిసింది కొందరికే.
ప్రజావాణిమొదలైనప్పుడు సామాన్య ప్రజలకు రెండు కారణాల వల్ల ఎనలేని ఉత్సాహం, ఆశలు కలిగాయి. ప్రగతిభవన్‌లో ప్రవేశించి తమ సమస్యలు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చెప్పుకునే అవకాశం లభిస్తున్నదనేది మొదటి కారణం. ఇందుగురించి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలను, అధికారులకు ఇచ్చారంటున్న ఆదేశాలను విన్న మీదట, ఇక తమ వినతిపత్రం సమస్యలు సత్వరమే పరిష్కారం కాగలవన్న ఆశలు కలగటం రెండవది.
మన రాష్ట్రంలో గాని, దేశంలో గాని ప్రజల సమస్యలు నిజమైనవి, ఒకవిధంగా అంతులేనివి అయినందున, పాలకులు ఆ విధమైన హామీలను ఎంతో నమ్మకంగా ఇచ్చినప్పుడు ప్రజలలో ఆశలు కూడా అదేస్థాయిలో కలగటం సహజం. పైగా వారానికి రెండుసార్లు మంగళ, శుక్రవారాలలో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్వయంగా హాజరై దరఖాస్తులను తానే స్వీకరించగలరని ప్రకటించారు. దానితో ఆ రోజులలో ప్రజలు రాష్ట్రం నలుమూలల నుంచి ఒకరోజు ముందుగానే బయల్దేరి రావటం, కార్యక్రమం ఉదయం 10 నుంచి మొదలవుతుంది గనుక తాము వెనుకబడిపోరాదన్న ఆరాటంతో ఇంకా సరిగా తెల్లవారకముందు నుంచే ప్రజాభవన్ వద్ద తండోపతండాలుగా చేరి బారులు తీరటం, ఆ లైన్లు రోడ్డుపైకి కూడా రావడంతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు పడిన శ్రమ వంటివన్నీ మనం చూశాం.
ప్రభుత్వ మార్పు కోసం ఎంతో కృషిచేసిన జెండా మేధావులైతే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయి వ్యాఖ్యానాలు చేశారు. అప్పటినుంచి ఎనిమిది నెలలు గడిచేసరికి ప్రజావాణి అరణ్యరోదనగా మిగులుతుండగా వారెందుకో ఏ వ్యాఖ్యానాలూ చేయటం లేదు. అసలు ఇటువంటి కార్యక్రమం అంటూ ఒకటున్నదనే విషయం వారికి ఇంకా గుర్తున్నదా లేక మరిచిపోయారా అనే సందేహం కలుగుతున్నది.
పైన అనుకున్నట్టు మనవంటి అంతులేని సమస్యల వ్యవస్థలో ప్రజావాణి కార్యక్రమానికి ఎటువంటి అర్జీలు వస్తాయి? ఇది అది అని గాక సకల సమస్యలపైనా వస్తాయి. అందుకు అదనంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల పేరిట పదమూడు హామీలనిచ్చింది. ఆ విధంగా ఇతర సమస్యలు, వాటితో పాటు ఆరు గ్యారంటీలతో ప్రత్యక్ష నిమిత్తం గల సమస్యలతో రోజుకు కొన్ని వేల దరఖాస్తులు రావటం మొదలైంది. ఆ వెల్లువను చూసి కలవరపడినందుకో, సమయం లేనందుకో గాని, ప్రతిసారి రాగలరన్న ముఖ్యమంత్రి అసలు రావటం ఆపివేశారు.
తన స్థానంలో వస్తారన్న మంత్రులు మానివేశారు. వారికి బదులుగా అన్న అధికారులు ఆగిపోయారు. క్లర్కులు మాత్రం మిగిలారు. ప్రతిరోజు అన్నది వారానికి రెండురోజులైంది. దరఖాస్తుల స్వీకరణను కొంతవరకు జిల్లాలకు బదిలీ చేశారు. అక్కడ ఏమవుతున్నదో ఎవరికీ తెలియదు. ఆ క్రమంలో రెండు జరిగాయి. ఒకటి ప్రజలకు ఆశలు, నమ్మకం తగ్గిపోతుండటం. రెండు, అసలు ఆ కార్యక్రమం పట్లనే చాలామందికి ఆకర్షణ లేకుండాపోవటం. పనులు జరగనప్పుడు నమ్మకాలు, ఆకర్షణ ఉండవు కదా.
ఈ పరిస్థితికి అదనంగా మరికొన్ని చేరాయి. వినతిపత్రాలు ఇచ్చినవారికి నంబర్లు ఇచ్చారు. వాటి పరిస్థితి ఏమిటో చెక్ చేసుకోవటానికి అధికారికంగా పోర్టల్‌లో ఏర్పాట్లు చేశారు. అంతవరకు బాగున్నది. కానీ సామాన్య ప్రజలలో అట్లా చెక్ చేసుకోవాలన్న మాట తెలిసింది కొందరికే. చెక్ చేసుకోగలవారు ఇంకా తక్కువ. తీరా చెక్ చేసుకున్నవారికి ఎంతకాలం గడిచినా తమ సమస్య పరిష్కారమైందన్నమాట కన్పించలేదు. దరఖాస్తులో ఫోన్ నంబర్లు ఇచ్చినవారికి ఏ సమాచారాలు లేవు. స్వయంగా అధికారులను కలిసినవారికి వస్తున్న సమాధానం తమకేమీ తెలియదని.
ఇది ఒకటి కాగా, అసలు ప్రభుత్వం వద్ద ఒక నిర్దిష్టమైన, పారదర్శకమైన ఏర్పాట్లు లేవు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయో, ఏ సమస్యకు ఎన్నో, పరిష్కారమైనవి ఏవి ఎన్నో, పరిష్కార క్రమంలో ఉన్నవి ఎన్నో, పరిశీలనలో ఉన్నవి ఎన్నో, తిరస్కరించినవి ఎన్నో నెలకొకసారి లెక్కలు ప్రకటించవచ్చు. ఆయా దరఖాస్తుదారుల ఫోన్లకు మెసేజ్‌లు పంపవచ్చు. ఇటువంటి బాధ్యతాయుత వ్యవహరణ వల్ల పారదర్శకత కలుగుతుంది. ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుంది. ఇంకా తమ పనులు కానివారు కూడా ఆశాభావంతో ఓపికపడతారు. కానీ ప్రభుత్వం ఇవేమీ చేయటం లేదు.
ప్రజావాణి వంటి కార్యక్రమానికి ఒక స్వభావం, ఒక సీరియస్ లక్ష్యం ఉంటాయి. అది కోట్లాది జన సామాన్యపు జీవన సంఘర్షణలకు సంబంధించినది అయినందున దానిని ప్రవేశపెట్టడమంటే తేనెతుట్టెను కదిలించటమే. అంతే తప్ప అది రాజకీయ అవసరాల రొమాన్స్ కాదు. అందులో గ్లామర్ ఉండదు. అందువల్ల, ఒక పాలకునికి సీరియస్‌నెస్, నిజాయితీ ఉంటే ఇవన్నీ ముందుగానే ఆలోచించాలి. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
మధ్యలో సమీక్షలు జరపాలి. కాని ప్రజావాణి కార్యక్రమాన్ని ఎనిమిది నెలల క్రితం ప్రకటించిన పటాటోపపు తీరును చూసినా, తర్వాత ఎనిమిది నెలలుగా అది అమలవుతున్న పద్ధతిని గమనించినా ఇందులో కనీసం రొమాన్స్ అయినా కనిపించటం లేదు. రాజకీయ వంచనా కళ తప్ప. ఈసరికి ఆ కళ సైతం వెలవెలబోతున్నట్టు కనిపిస్తున్నది. ఈ మాటపై సందేహాలున్న జెండా మేధావులు ఒకసారి ప్రజాభవన్‌కు వెళ్లి అక్కడి దరఖాస్తుదారులు చూపించే అద్దంలో తమ మొహాలు చూసుకోవచ్చు.
నిజానికి సీరియస్‌గా ఆలోచిస్తే, దరఖాస్తుదారుల సమస్యల పరిష్కారం ఎంతమాత్రం తేలిక కాదు. అవన్నీ ఎక్కువగా ఇళ్లు, భూములు, ఉద్యోగాలు, ఆరోగ్య సమస్యలు, రెవెన్యూ వివాదాలు, పోలీసు కేసుల వంటి వాటికి సంబంధించినవి. వాటి పరిష్కారం ఏ ప్రభుత్వానికైనా కష్టమే. కొన్ని ఇప్పటికిప్పుడు అసాధ్యం కూడా. వీటిలో అత్యధికం సాధారణ పరిపాలనాక్రమంలో అభివృద్ధి క్రమంలో తేలవలసినవే తప్ప వ్యక్తుల వారీగా కాదు. ఏవో కొన్నింటికి తప్ప గడువులు కూడా వీలు కాదు.
అందువల్ల కావలసింది చిత్తశుద్ధి గల పాలన, అభివృద్ధి. కాని మన రాష్ట్రంలో గాని, ఉమ్మడి రాష్ట్రంలో గాని, దేశంలో గాని మొదటినుంచి గల పరిపాలనా వ్యవస్థలు, ఆర్థిక-రాజకీయ-సామాజిక వ్యవస్థలు, రాజకీయ పార్టీలూ ప్రభుత్వాల స్వభావాలు, స్వప్రయోజనాలు, నిజాయితీరాహిత్యాలు అనేకానేక ప్రజా సమస్యలను పరిష్కరించకుండా అరకొర చర్యలతో మభ్యపెట్టి సాగదీసి దాటవేస్తున్నాయి. పరిష్కారాలు తేలిక కాదని ప్రభుత్వ నాయకులకు, అధికార యంత్రాంగానికి పూర్తిగా తెలుసు. అయినప్పటికీ ‘ప్రజావాణి’ వంటి దాటవేత కార్యక్రమాలతో ప్రజలకు భ్రమలు కల్పిస్తుంటారు. పైన పేర్కొన్న పరిస్థితుల వల్ల, ఆ భ్రమాత్మక కార్యక్రమాలు విఫలమయ్యే పరిస్థితులు కూడా వాటిలో అంతర్నిహితంగా ఉంటాయి. కనుక అది చివరికి అరణ్యరోదనగా మిగలటం అనివార్యమవుతుంది. ఇటువంటి అనుభవాల నెగెటివ్ ప్రభావాలు ప్రజలపై సూక్ష్మస్థాయి (మైక్రోలెవెల్)లో ఉంటాయి.
టంకశాల అశోక్