రాష్ట్రంలో మన భారత రాజ్యాంగ పీఠిక అభాసు పాలవుతున్నది. పౌరుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వేదన కలిగిస్తున్నది. బాధ్యతాయుత ప్రభుత్వం చేయాల్సిన పని ఇలా కానే కాదు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలన కాళరాత్రులను ప్రజల జీవితాల్లోకి ప్రవహింప చేస్తున్నది. చట్టం ముందు అందర్నీ సమానంగా చూస్తామని, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పిస్తామని ప్రమాణం చేసిన నాయకులు వాటిని గాలికొదిలేస్తున్నరు. ఎవ్వరూ చెప్పినా.. ఎంత చెప్పినా.. ప్రజల గగ్గోలు పెడుతున్నా… గోడు గోడమని గోస పడుతున్నా కనీసం కనికరించడం లేదు. ఎప్పుడు ఎవరి ఇండ్లు కూల్చేస్తారో తెలియదు. ఎప్పుడు ఎక్కడ హైడ్రాపేరుతో బుల్డొజర్లు వస్తాయో తెలియని భయానక వాతావరణం నేడు రాష్ట్రంలో కన్పిస్తూ ఉన్నది.
ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రజల ముందు ఉంచింది. ఏడో గ్యారెంటీగా భావప్రకటనా స్వేచ్ఛను కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రజల ఆస్తులు కూలుస్తామని ఎనిమిదో గ్యారెంటీని చెప్పకుండా దాచుకున్నది. ఇప్పుడు తమ రహస్య ఎజెండాను అమలు చేస్తున్నదనే అనుమానం ప్రజల్లో కలిగేలా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ వ్యవహార శైలి గురించి మరింత నిర్దుష్టంగా చెప్పాలంటే భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హామీ అయిన ఆర్టికల్ 19, 21తో పాటు చట్టబద్ధమైన ఆస్తి హక్కును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తున్నది. తమ జీవన భద్రతకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. 1973లో సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. అదే కేశవానంద భారతీ కేసుగా చరిత్రకెక్కింది. పౌరుల హక్కుల కంటే పార్లమెంట్, అసెంబ్లీ చేసిన చట్టాలు మహోన్నతమైనవి ఏమీ కాదని చెప్పింది. హైడ్రాపై అసెంబ్లీ ఆమోదముద్ర వేయించుకున్నంత మాత్రాన ప్రజల ఆస్తులను, వారి గౌరవ ప్రదమైన జీవితాలను ధ్వంసం చేసేహక్కు చట్టసభలకు ఉంటుందా? ప్రజల జీవితాలకు రక్షణ లేకుండా చేయాలని చట్టాలు చెప్తున్నాయా.? ప్రభుత్వం వహరిస్తున్న తీరు ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధం కాదా?
1960-80 మధ్య కాలంలో భారత రాజ్యాంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న సందర్భం. ఎస్ఆర్ బొమ్మై కేసు, కేశవానంద భారతి కేసుతోపాటు చాలా కేసుల్లో న్యాయస్థానాలు చొరవ తీసుకోవడం వల్ల భారత ప్రజాస్వామ్య సజీవతకు బీజం పడింది. అంతేకాదు పౌరులు గౌరవప్రదంగా, నిర్భయంగా జీవించే ధైర్యాన్ని కూడా న్యాయస్థానాలు కల్పించాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కోర్టులు మొట్టికాయలు వేసినా తన తీరు మార్చుకోవడం లేదు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీ రాగానే కూల్చివేతలు మొదలు పెట్టింది. ఇది ఇటీవల పరాకాష్టకు చేరింది. ఖమ్మం జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న వెలుగుమట్లలో పేదలకు చెందిన వందలాది నివాసాలను ధ్వంసం చేసింది. ప్రజల పట్ల ప్రేమ లేకపోవడమే ఇందుకు కారణమా? లేకపోతే చట్టాల పట్ల గౌరవం లేకపోడమే కారణమా? తమను ఎవ్వరూ ఏమీ చేయలేరని అనుకుంటున్నారా?
కాంగ్రెస్ పార్టీ తమది ప్రజాస్వామ్యయుత నేపథ్యం అని చెప్పకుంటుంది. కానీ చర్యలు మాత్రం దానికి భిన్నంగా ఉంటాయి. భవిష్యత్తు అభివృద్ధి కోసమని గడిచిన ఏడు దశాబ్దాలుగా ఇక్కడి పేదలకు జీవనాధారమైన భూములు కోల్పోయారు. ఎక్కడెక్కడి వారో ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు. స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడి వారు మాత్రం మౌలిక సదుపాయాల కోసమని, నైట్మార్కెట్ కోసమని నివాసాలను, భూములను కోల్పోతున్నారు. మన రాజ్యాంగం ఇచ్చిన హామీ ప్రకారం ఎవరైనా ఎక్కడైనా జీవించొచ్చు, వ్యా పారాలు చేసుకోవచ్చు. నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఇతరుల కోసం తరాలకు తరాలు ఆస్తులు కోల్పోవడాన్ని రాజ్యాంగం సమర్థిస్తుందా? ఇక్కడి పేదలను నిలువునా ముంచుతామని అంటే నిర్దేశిత చట్ట నియామాలు మౌనంగా ఉంటాయా? ఎలాంటి అభివృద్ధి అయినా సరే విధ్వంసం, విస్తాపనకు ప్రత్యామ్నాయాలు లేనే లేవా? ఈ తీరులో పాలకులు ఎందుకు ఆలోచించడం లేదు?
మూసీ సుందీకరణ కోసం సుమారు యాభై కిలోమీటర్ల మేర లక్షలాది నివాసాలను ధ్వంసం చేస్తామని అంటే ఎట్లా ఊరుకోవాలి? చిన్నచిన్న పనులు చేసుకొని పొట్ట పోసుకుంటున్న బడుగు జీవుల గూళ్లను చెదరగొడ్తామంటే ఎట్లా? మధ్యతరగతి వారి జీవితపు కలం సొంత ఇల్లు. బ్యాంకు లోన్లు తీసుకొని ఏండ్లకు ఏండ్లు కిస్తీలు కట్టుకుంటున్న వారి ఆశలను అడియాశలు చేస్తామంటే ఎట్లా? ప్రైవేటు రంగంలో జీవన భద్రతకు గ్యారెంటీ లేదు. అప్పుల మధ్యనే జీవితం సాగుతూ ఉంటుంది. అలాంటి వారికి రేపటి నుంచే మీ ఇండ్లు ఉండవు పోండి! అంటే వారు ఎక్కడ తలదాచుకోవాలి? జీవితం అల్లకల్లోలం అవుతున్నట్టే కదా? తాజాగా సంగారెడ్డిలో హైడ్రా కూల్చివేతల గురించి మీడియాలో వీడియోలు చూస్తే భయాందోళనలు కలుగుతున్నాయి. కూల్చే యంత్రానికి హృదయం లేదు.
కానీ పైనుంచి ఆదేశాలిచ్చే వారికి, వాటిని అమలు చేసే వారికి హృదయం ఉంటుంది కదా? అది పనిచేయడం లేదు ఎందుకు? లేకపోతే అధికారానికి కండ్లు ఉండవు, సంపదకు ఆత్మ ఉండదనే నానుడిని నిజం చేస్తున్నారా? ఎవరెట్లా అనుకున్నా తాము అనుకున్న విధంగా ముందుకెళ్తామనే ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారా? కాంగ్రెస్ పాలనలో కూల్చడం తప్పా నిర్మించడం ఎక్కడైనా ఉన్నదా? కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమున్నదని భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. అంతా తమ ఇష్టం అనే భావనతో పాలకులు ఉంటే గనుక ముమ్మాటికీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్టే, పౌరుల జీవన భద్రతను గాలికి వదిలేసినట్టే.. భారత రాజ్యాంగ పీఠికకు తూట్లు పొడుస్తున్నట్టే. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలక పెద్దలు తప్పును సరిచేసుకోకుంటే చరిత్ర అస్సలు క్షమించదు.
(వ్యాసకర్త: న్యాయవాది)
-వొద్యారపు రవికుమార్