‘ఇంకేముంది బీఆర్ఎస్ పనైపోయింది. అందరూ మా వైపు వచ్చేస్తున్నారు. ఖేల్ ఖతం దుక్నం బంద్’ అంటూ అధికారంలోకి వచ్చిన కొత్తలో కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టారు. వారన్నట్టే ఓ పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జారుకున్నారు. ఆ వలస అంతటితో ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం చూశాక తెలిసి తెలిసి ఆ పార్టీలో చేరడానికి ఎవరూ సాహసించడం లేదు. ఆశల రెక్కలొచ్చి ఎగిరిపోయిన ఎమ్మెల్యేలు సైతం స్థానిక కాంగ్రెస్ కుంపట్ల వేడి ఉక్కపోత భరించలేక సతమతమవుతున్నారు. కాంగ్రెస్ కండువాలు కప్పుకొన్న ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు తామింకా బీఆర్ఎస్సే అని బుకాయిస్తున్నారే కానీ, ధైర్యంగా ‘మేం కాంగ్రెస్’ అని చెప్పలేకపోతున్నారు. కొందరు తిరిగి సొంతింటికి రావడానికి ముహూర్తాలు చూసుకుంటున్నారు.
రైతులు, విద్యార్థులు, యువత తమ సమస్య ల పరిష్కారం కోసం, ఎన్నికల హామీల అమలు కోసం ఉద్యమిస్తున్నారు. తులం బంగారం ఏద ని తల్లులు ప్రశ్నిస్తున్నారు.ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఏకంగా పోలీసులే వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మత వైషమ్యాల ప్రమాదం మళ్లీ పొంచి చూస్తున్నది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పదవిలో కొనసాగుతారా? లేక అనర్హత వేటుకు గురవుతారా? అన్న డోలాయమాన పరిస్థితి సద్దుమణిగిన తర్వాత కొత్త పీసీసీ అధ్యక్షుడు మళ్లీ పాత రాగాన్ని అందుకున్నారు. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారని, వారిలో కేటీఆర్ సన్నిహితులు కూడా ఉన్నారని అరిగిపోయిన పాత రికార్డునే ఆయన మళ్లీ వినిపించారు. నిత్యం బీఆర్ఎస్ను బలహీనపరచాలనే యావ తప్ప, ఆవగింజంతైనా ప్రజలు కోరుకున్న పరిపాలన అందించాలనే ఆలోచన కాంగ్రెస్‌కు లేకపోవడం విడ్డూరం.
చీలికలు, ఫిరాయింపులు అంటూ పదే పదే గొంతు చించుకుంటున్న కాంగ్రెస్ వ్యవహారశైలి చూస్తుంటే గురివింద సామెత గుర్తుకొస్తున్నది. వాస్తవానికి, కాంగ్రెస్ పార్టీలో వచ్చినన్ని చీలికలు, జరిగినన్ని ఫిరాయింపులు ఇతర ఏ పార్టీల్లో చోటుచేసుకోలేదు. ఆ దిశగా కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. కేంద్రంలో, రాష్ర్టాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకం సజావుగా ఉంటే దేశంలో ఇన్ని పార్టీలు పుట్టి ఉండేవి కాదు. ఒకప్పుడు మన దేశాన్ని ఆసేతుహిమాచల పర్యంతం ఎదురులేకుండా ఏలిన కాంగ్రెస్ చివరికి ఉనికి కోసం చిన్నాచితక పార్టీల గుమ్మాల ముందు సాగిలపడే దుస్థితి ఉండేది కాదు. ప్రధానులు చరణ్‌సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, ఐకే గుజ్రాల్ నాడు కామరాజ్, బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ మొదలుకొని నేటి శరద్ పవార్, చంద్రబాబు, మమతాబెనర్జీ వరకు దేశవ్యాప్తంగా ఎందరో అతిరథ మహారథులు గత ఆరు దశాబ్దాలలో కాంగ్రెస్ పార్టీకి దూరమైపోయినవారే.
నెహ్రూ హయాంలో కాంగ్రెస్ సంక్షోభాలు ఎదుర్కోలేదు. కానీ, ఇందిరమ్మ రంగప్రవేశం తర్వాతే కాంగ్రెస్ పార్టీ చీలికలు పీలికలైంది. దేశ చరిత్రలో తొలిసారిగా 1969లో అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి నీలం సంజీవరెడ్డి గెలువగలిగిన సంఖ్యాబలం కేంద్రంలో, రాష్ర్టాలలో పుష్కలంగా ఉండి కూడా ఓడిపోవడానికి సొంత పార్టీకి చెందిన ప్రధాని ఇందిరమ్మ అంతరాత్మ ప్రబోధం పేర జరిగిన క్రాస్ ఓటింగ్ కారణమైంది. ఇందిరమ్మపై బహిష్కరణ వేటు పడింది. పర్యవసానంగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా పార్టీ నిలువునా చీలిపోయింది. అంతవరకు కాంగ్రెస్ పార్టీకున్న కాడెద్దుల ఎన్నికల గుర్తు కామరాజ్ నిజలింగప్ప వర్గానికి, కొత్తగా ఆవు దూడ గుర్తును ఇందిరమ్మ వర్గానికి ఎన్నికల కమిషన్ కేటాయించింది. కాంగ్రెస్ నిట్టనిలువునా రెండు ముక్కలైంది. 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు దశాబ్దాల జైత్రయాత్రకు బ్రేక్‌పడింది. ప్రధాని ఇందిర, ఆమె తనయుడు సంజయ్‌గాంధీ సహా కాంగ్రెస్ ఘనాపాటీలెందరో ఓడిపోయారు. ఎన్నికల్లో ఒక ప్రధాని ఓడిపోవడం, ఆ ప్రధాని సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో 85కు 85 సీట్లలో పార్టీ ఓడిపోవడం అదే తొలిసారి. తన వెంట నడిచిన నాయకులతో ఇందిరమ్మ 1978లో కొత్తగా మరో పార్టీ కాంగ్రెస్ (ఐ)ని స్థాపించి, చెయ్యి గుర్తుతో రంగంలోకి దిగారు. దీంతో కాంగ్రెస్ మరోసారి నిలువునా చీలిపోయింది.
కాడెద్దుల కాంగ్రెస్, ఆవు దూడ కాంగ్రెస్, హస్తం కాంగ్రెస్ పరస్పరం ఎన్నికల్లో సుదీర్ఘకాలం తలపడ్డాయి. చీలికలు, ఫిరాయింపుల వల్ల కాంగ్రెస్ ఎన్నికల గుర్తులు రెండు కూడా (కాడెద్దులు, ఆవు దూడ) కనిపించకుండాపోయాయి. డజన్ల కొద్దీ పిల్ల కాంగ్రెస్‌లు పుట్టుకొచ్చాయి. అధికారం పెనుగులాటలో పేకముక్కలు మార్చినట్టు ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులు మార్చిన కాంగ్రెస్ వైపరీత్యాలకు మిగతా రాష్ర్టాల మాదిరిగానే సమైక్య ఆంధ్రప్రదేశ్ కూడా సాక్ష్యంగా నిలిచింది. అంతెందుకు ఎన్నికలై ఏడాదిన్నర అయ్యిందో, లేదో పక్కనే ఉన్న కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఉద్వాసన పలికే అంకానికి తెరలేచింది. తెలంగాణలో కూడా మంత్రులు, స్వపక్షీయులే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గోతులు తవ్వుతున్నట్టు సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించిన విషయం గమనార్హం.
ఐదున్నర దశాబ్దాలుగా బహిష్కరణలు, చీలికలు, వర్గాలు, కలహాలతో కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్‌తో పోల్చుకుంటే బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావం నుంచి శతధా, సహస్రధా పటిష్ఠంగానే ఉంది. ఐక్యంగానే ఉంది. ఏనాడూ పార్టీలో చీలిక రాలేదు. ఎన్నికల గుర్తులేమీ మారలేదు. అదే కారు గుర్తు. అదే కేసీఆర్ నాయకత్వం. ఆయన మాటే శిలాశాసనం. ఏ పొత్తులు లేకుండానే రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. పదేండ్ల పాటు కేసీఆరే ముఖ్యమంత్రిగా పనిచేశారు. సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వంటి హేమాహేమీలు శతవిధాలా ప్రయత్నించినా టీఆర్ఎస్ ప్రస్థానాన్ని అడ్డుకోలేకపోయారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 26 మంది టీఆర్ఎస్ సభ్యుల్లో పది మందిని నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి లాక్కున్నా, 2008 ఉప ఎన్నికల్లో, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగిలినా తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో సత్తాచాటింది.
ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని యథావిధిగా ముందుకు నడిపించి రాష్ర్టాన్ని సాధించింది. 2014, 2018లో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. ఈ కాలక్రమంలో వేళ్ల మీద లెక్కపెట్టగలిగేవాళ్లు వెళ్లిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ బలం చెక్కుచెదరలేదు. నేడైనా అంతే.
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకొని ఫిరాయింపులను వ్యతిరేకిస్తుంటే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహించడం గమనార్హం. ఫిరాయింపులకు చోటే లేదని గత ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఏకంగా ఫిరాయింపుదారులను ఎలా శిక్షించవచ్చునో విడమర్చి మరీ చెప్పారు. ఫిరాయింపుదారులు అసెంబ్లీ గేటు తాకడానికి వీల్లేదని సభల్లో నినదించారు. కానీ, నిత్యం ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ ఖాళీ అన్నట్టు మాట్లాడుతుంటే.. వారికి చరిత్ర తెలియదనుకోవాలా? లేక ఒక వికృత మానసిక క్రీడకు ఒడిగట్టారని భావించాలా? పిల్లి శాపాలకు ఉట్టి తెగదు కదా? కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు ఒక హెచ్చరికగా భావించకుండా పదే పదే ఫిరాయింపు జపం చేయడం వెనుక ప్రజల దృష్టిని పక్కదారిపట్టించే కుట్ర దాగి ఉంది. అందుకు కారణం లేకపోలేదు. కాంగ్రెస్ గద్దెనెక్కిన నాటి నుంచి రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఎన్నికల హామీల అమలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది.
రైతులు, విద్యార్థులు, యువత తమ సమస్య ల పరిష్కారం కోసం, ఎన్నికల హామీల అమలు కోసం ఉద్యమిస్తున్నారు. తులం బంగారం ఏద ని తల్లులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఏకంగా పోలీసులే వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మత వైషమ్యాల ప్రమాదం మళ్లీ పొంచి చూస్తున్నది. పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యలు గాలికొదిలి మంత్రులు అధ్యయనం పేరిట విదేశీ పర్యటనల్లో తలమునకలై ఉన్నారు. ఏ ప్రభుత్వ హయాంలోనైనా గత ప్రభుత్వమే బాగుండేదని, ఆ రోజులే బాగుండేవని గుర్తుచేసుకుంటూ ప్రజలు పశ్చాత్తాపపడ్డారంటే అది వర్తమాన ప్రభుత్వ వైఫల్యాలకు పరాకాష్ఠ. ఆ దుస్థితిని కప్పిపుచ్చడానికి ఎప్పటికప్పుడు బూతులో, బుల్డోజర్లో, అక్రమ కేసులో, అభాండాలో ఏవైతేనేం.. ఒక అలజడి, ఒక సంచలనం సృష్టించడం ద్వారా ప్రజల దృష్టిని మరల్చి ఉపశమనం పొందవచ్చన్న ధ్యాస కాంగ్రెస్ అధికారగణంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. అందులో భాగంగానే పదే పదే ఫిరాయింపు పునరుక్తి దోషానికి ఆ పార్టీ పాల్పడుతున్నది. ఆకులు రాలినంత మాత్రాన చెట్టు మోడువారదు. మళ్లీ చిగురిస్తుంది. బీఆర్ఎస్ కూడా అంతే.
-డాక్టర్ అయాచితం శ్రీధర్
98498 93238