ప్రపంచ మానవాళి ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ప్రకృతి విధ్వంసం. పర్యావరణ మార్పుల ద్వారా ఎదురవుతున్న సమస్యలు, అకాల వర్షాలు, వరదలు, విపరీతమైన ఎండలు, మారుతున్న రుతువులు ఇదీ ప్రస్తుతం ప్రపంచ పరిస్థితి. ఎడారుల్లో వరదలు వస్తున్నాయి, హిమాలయాల్లో మంచు మాయమవుతున్నది. ఓ వైపు నగరాలు మునిగిపోతున్నాయి. మరోవైపు గ్రామాలు నీటి కోసం అల్లాడుతున్నాయి. రుతువులు గతి తప్పుతున్నాయి. కరోనా వంటి కొత్త జబ్బులు భయపెడుతున్నాయి. వీటన్నింటికీ మూలం అంతరిస్తున్న అడవులు, కనుమరుగవుతున్న పచ్చదనం.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కృషి హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరింది. 2020 సంవత్సరానికిగాను హైదరాబాద్ మహానగరం ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా గుర్తింపు పొందింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనాభా విపరీతంనైజేషన్, అర్బోర్ డే ఫౌండేషన్ సంయుక్తంగా హైదరాబాద్‌కు ఈ పురస్కారాన్నిచ్చాయి.
Joginapally Santoshkumar | జనాభా పెరగటమే కాదు, పెరుగుతున్న ప్రజల అవసరాల కోసం జరుగుతున్న అభివృద్ధి ప్రకృతికి గొడ్డలిపెట్టు అవుతున్నది. సహజ వనరులను విచక్షణారహితంగా వాడుతున్నా రు. మరి ఈ విధ్వంసానికి అంతం లేదా, పౌరులుగా మన బాధ్యత ఎంతన్నది ఒక్కసారి ప్రతీ ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన వంతుగా ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ఎలా నడుం బిగించామన్నది ముఖ్యం. ప్రతీ ఒక్కరు తమ వంతు బాధ్యతగా పర్యావరణ హితానికి పాటుపడాలి.
నడిచే ప్రకృతి పాఠశాల: పద్మశ్రీ జాదవ్ పయంగ్ సమాజ హితాన్ని కోరుతూ చేసే నిస్వార్థ ప్రయత్నం ఆలస్యంగానైనా గమ్యాన్ని ముద్దాడుతుంది. పద్మశ్రీ, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన జాదవ్ మొలాయ్ పయంగ్ ప్రయాణమే ఇందుకు తిరుగులేని ఉదాహరణ. పర్యావరణ మార్పులు తద్వారా ఎదురయ్యే సమస్యలపై ఎవరూ మాట్లాడని సమయంలోనే ఆయన ఆచరణ మొదలుపెట్టారు. దేశానికి ఈశాన్య ప్రాంతం మజులీలో ఆయన చేసిన ప్రకృతి యజ్ఞం ఓ అడవినే సృష్టించింది. ఫలితం గురించి ఆశించకుండా ప్రయత్నాన్ని మాత్రమే కొనసాగించారు. ఈ అవిరళ శ్రమలో ఆయన ఎక్కడా ఫలితంపై ఆశ వీడలేదు, గుర్తింపును ఆశించలేదు. పనిచేస్తూ వెళ్తే వాటంతటవే అవార్డులు వచ్చాయి.
అమాయకపు మొఖం, బోసి నవ్వుతో కనిపించే అరువై నాలుగేండ్ల పయంగ్ ఆశయాల ప్రయాణం బ్రహ్మపుత్ర నది అంతటి విశాలమైనది. ఇటీవల నా అసోం పర్యటనలో ఆయనతో కొంత సమయం గడపటం, అత్యంత స్ఫూర్తిదాయకమైన ఆయన అనుభవాలు పంచుకోవటం అదృష్టంగా భావిస్తున్నా. స్వయంగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొని మమ్మల్ని జాదవ్ పయంగ్ ఆశీర్వదించటం మా భవిష్యత్ కార్యక్రమాలకు ఆక్సిజన్‌లా భావిస్తున్నాం.
నలభై ఐదేండ్ల కింద ఆయన యుక్త వయస్సులో ఉన్నప్పుడు అసోం మజులీ తీరంలో కొన్ని పాములు, ఇతర నీటి జంతువులు చనిపోయి ఉండటాన్ని గుర్తించిన పయంగ్ అప్పుడే ప్రమాదాన్ని పసిగట్టారు. తీరం కోతకు గురికావటం, జంతువులు, సరీ సృపాలకు నిలువ నీడలేదని గుర్తించి కొన్ని వెదురు మొక్కలు నాటి సంరక్షించారు. అలా పెరిగిన వెదురువనం క్రమంగా చిన్న జంతువులకు ఆవాసంగా మారింది. ఇది గుర్తించిన జాదవ్ క్రమంగా బ్రహ్మపుత్ర నదీతీరం వెంట మొక్కలు నాటుతూ వెళ్లారు. అలా ముప్ఫై ఏండ్ల పాటు ఏకంగా 1,360 ఎకరాల్లో అడవిని పెంచారు. అనతికాలంలోనే సమీప మైదాన ప్రాంతాలన్నీ పచ్చదనం పరుచుకోవటం మొదలైంది. కొన్నేండ్ల తర్వాత అటుగా వచ్చిన అటవీ అధికారులే ఆశ్చర్యపోయారు. జాదవ్ కృషిని గుర్తిస్తూ ఆయన పేరు పైనే మొలాయ్ అడవిగా (మొలాయ్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్) అధికారికంగా నామకరణం చేశారు. జాదవ్ పెంచిన చిట్టడవి క్రమంగా చిక్కటి అడవిలా విస్తరిం చింది. ఉడతలు, జింకలు, రైనోలు, ఏనుగులు, బెంగాల్ టైగర్లతో పాటు వందలాది రకాల పక్షులు, జంతు జాలానికి ఆవాసంగా మారింది. ఏటా సీజన్లో వందకు పైగా ఏనుగుల గుంపు మొలాయ్ అటవీ ప్రాం తంలో కొన్ని నెలల పాటు సేద తీరుతాయి. అసోం అడవుల్లో వేటగాళ్ల బుల్లెట్లకు బలవుతున్న రైనోలు ఇక్కడ మాత్రం స్వేచ్ఛగా విహరిస్తాయి. దివంగత అబ్దుల్ కలాం చెప్పినట్టు ఉడతను పెంచుకుంటే వెళ్లిపోతుంది, పక్షిని పెంచుకుంటే ఎగిరిపోతుంది. కా నీ, చెట్టును పెంచితే ఆ రెండూ మన ఆవరణలోనే వచ్చి చేరుతాయనే నానుడి మొలాయ్ అడవితో నిజమైంది.
ఒంటరి ప్రకృతి సైనికుడిలా జాదవ్ పయంగ్ చేసిన కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2015లో దేశంలోనే అత్యున్నత 4వ పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది. మాతో గడిపిన సమయంలో ఆయన జీవన పయనాన్ని నెమరువేసుకున్నారు. బ్రహ్మపుత్ర నది, అసోం, మజులీ, అడవితో తన అనుబంధాన్ని పంచుకున్నారు. పర్యావరణ మార్పులు, మానవాళికి పొంచి ఉన్న ముప్పుపై ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించాలని అన్నారు. పర్యావరణ విద్యను తప్పనిసరి చేయటమే కాదు, ప్రకృతి పాఠాలు తరగతి గది నుంచి బాహ్య ప్రపంచానికి మారాలని ఆకాంక్షించారు. కేవలం పుస్తకాల్లో ఉన్నది బోధించకుండా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని నేటి పౌరులకు అర్థమయ్యేలా చేయాలని జాదవ్
పయంగ్ చెప్తున్నారు.
ప్రకృతి పునరుజ్జీవనం అనేది ఎవరో చేసేది కాదని, ప్రతీ పౌరుడూ విధిగా అనుసరించాల్సిన బాధ్యత అని అన్నారు. పెరుగుతున్న జనాభాను, వారి అవసరాలను తీర్చే అభివృద్ధిని ప్రస్తుత పరిస్థితుల్లో కాదనలేమని, కానీ, అడవులు, సహజ వనరులపై పడుతున్న భారాన్ని మాత్రం తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వనరులను కాపాడుతూనే అభివృద్ధి చేసే ప్రత్యామ్నాయ మార్గాలపై పరిశోధనలు జరగాలని తెలిపారు. ఈశాన్య హిమాలయాలకు పొంచి ఉన్న ముప్పుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వరదలు, రుతువుల్లో మార్పులు, అనూహ్య వ్యాధులకు ప్రకృతి ప్రకోపమే కారణమని జాదవ్ అంటున్నారు. మన రాష్ట్రంలో వనజీవి రామయ్య వంటివారున్నారు. జాదవ్‌ను చూస్తే మన రామయ్య గుర్తుకువచ్చారు. ప్రకృతి కోసం పరితపించే ఇలాంటి మనుషులు ఇంకా పెరగాలి. ఇది కేవలం ఏ ఒక్కరి బాధ్యతనో కాదు. మనందరి సమష్టి బాధ్యత.
అడవుల విధ్వంసం- పర్యావరణహిత చర్యలు: గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ నివేదిక ప్రకారం భారతదేశం 2000-23 మధ్య 2.33 మిలియన్ హెక్టార్ల (57,57,555 ఎకరాల) అటవీ భూమిని కోల్పోయింది. విచక్షణారహితంగా కొనసాగుతున్న అడవుల నరికివేతకు తోడు, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో మళ్లించిన అటవీ భూమి కూడా ఇందులో ఉన్నది. అయితే, ప్రకృతి సంపదకు నిలయమైన ఐదు ఈశాన్య రాష్ర్టాలు అసోం, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్‌లో ఈ అటవీ విధ్వంసం ఎక్కువగా ఉండటం మాత్రం ఆందోళన కలిగించే విషయం.
మిగతా ప్రాంతాలతో పోలిస్తే అసోం 2050 నాటికల్లా 330 శాతం ఎక్కువ పర్యావరణపరమైన ప్రమాదాలను ఎదుర్కోబోతున్నది. రాష్ట్రం లో 60 శాతం జిల్లాలపై ఈ ప్రభావం పడుతుం ది. అలాగే దేశవ్యాప్తంగా అడవుల నరికివేత ద్వా రా జరుగుతున్న ప్రకృతి విధ్వంసం ఏటా 51 మిలియన్ టన్నుల కార్బన్‌డై ఆక్సైడ్ విడుదలకు సమానం. అంటే నిత్యం వివిధ కారణాలతో వెలువడే కర్బన ఉద్గారాలకు ఇది అదనం అన్నమాట. ఈ పర్యావరణ దుష్పరిణామాల వల్ల ఎదురౌతున్న భౌగోళిక పరిస్థితులను ఇప్పుడు మనమంతా ఎదుర్కొంటున్నాం. వేగంగా మారుతున్న వాతావరణం, విపరీతమైన వేడి, అకాల వర్షాలు, వరదలు, సీజన్ల మార్పు ఈ కోవలోకే వస్తాయి. ైక్లెమెట్ సెంట్రల్ నివేదికను ఒక్కసారి గమనిస్తే… ఈ సీజన్లో 21 రోజులు అత్యధిక వేడి రోజులు నమోదయ్యాయి. గడిచిన 55 ఏండ్లలో ఎన్నడూ ఈ స్థాయిలో వేడి రోజులు నమోదు కాలేదు. అలాగే ఏపీలో ఇదే సీజన్లో 14 రోజులు వేడి రోజులుగా నమోదయ్యా యి. అంటే, సగటును మించిన వేడిని మనం ఈ సీజన్లో ఎదుర్కొన్నాం. ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతం. మనం ఇప్పటికైనా మేల్కోవాలి.
అందుకే మన పరిసరాల్లో ప్రకృతిని కాపాడటం ఒక ఎత్తు అయితే, కోల్పోయిన పచ్చదనాన్ని తిరిగి వీలున్నంతగా సాధించటం మరో ఎత్తు. అదే సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, హిమాలయాలతో పాటు నదుల కాలుష్యం తగ్గింపు, నీటి వనరులను కాపాడుకోవటం, చిత్తడి నేలల అభివృద్ధి, పెట్రోల్, డీజిల్ వాడకం నియంత్రిస్తూ ఈవీ వాహనాలను ప్రోత్సహించటం ఇవన్నీ కూడా ప్రకృతి పునరుజ్జీవనానికి తోడ్పాటునందించే చర్యలే. అడవులపై ఆధారపడి జీవించేవారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు, అటవీ సేకరణ ఉత్పత్తులకు తగినంత ఆదాయం ఉండేలా చేయటం నరికివేతను తగ్గించే మార్గాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తోడు ప్రతీ పౌరుడూ విధిగా బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.
గ్రీన్ లీడర్‌గా యువరాష్ట్రం-తెలంగాణకు హరితహారం: 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ కే.చంద్రశేఖరరావు సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యాన్నిస్తూ నివాసయోగ్యమైన పరిసరాల కల్పనపై దృష్టిపెట్టింది. అందుకే, 2015లోనే తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. రానున్న తరాలకు మెరుగైన వాతావరణం అందించటం మన బాధ్యత అంటూ కేసీఆర్ చేపట్టిన హరితహారం పదేండ్లలో అద్భుత ఫలితాలను సాధించింది. సుమారు 280 కోట్ల మొక్కలు రాష్ట్రవ్యాప్తంగా నాటడంతో పచ్చదనం 24 నుంచి 31 శాతానికి పెరిగింది. (ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం) రాష్ట్ర రహదారులు పూల బాటలయ్యాయి.
అడవుల పునరుజ్జీవనంతో కొత్త కళను సంతరించుకున్నాయి. పెద్ద సంఖ్యలో అభివృద్ధి చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కులు పౌరులకు సహజ ఆక్సిజన్ వనరులుగా (లంగ్ స్పేస్‌లుగా) రూపాంతరం చెందాయి. కేసీఆర్ దూరదృష్టి, హరితహారం కార్యక్రమమే ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ మొదలు పెట్టేందుకు స్ఫూర్తిగా నిలిచింది. తెలంగాణ ఫలితాలను దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూడాలనే సంకల్పమే ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు శ్వాసగా నిలిచింది.
హరిత భారత్- గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాత్ర: హరిత భారత స్వప్నాన్ని ఆకాంక్షిస్తున్న ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం దశలవారీగా విస్తరిస్తున్నది. ప్రకృతిని కాపాడాలి, పచ్చదనం పెంచాలనే హరిత భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయటమే మా కార్యక్రమాల లక్ష్యం. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటాలి, మరో ముగ్గురికి హరిత సవాల్ విసరటాన్ని బలంగా సమాజంలోకి తీసుకువెళ్లగలిగాం. 2018లో ప్రారంభమైన గ్రీన్ ఛాలెంజ్ ఇప్పటివరకు తెలంగాణతో పాటు వివిధ రాష్ర్టాలకు విస్తరించింది. ఏడు విడతల్లో సుమారు 19.50 కో ట్ల మొక్కలు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ద్వారా నాటాము. పలు రంగాలకు చెందిన ప్రముఖులను, సెలబ్రిటీలను భాగస్వామ్యం చేయటం ద్వారా వారి ని అనుసరించే అభిమానులు అందరూ ‘గ్రీన్ ఇండి యా ఛాలెంజ్’లో భాగమయ్యేలా చేయగలిగాం.
అడవుల దత్తత కార్యక్రమాన్ని మొదలుపెట్టి తెలంగాణలోని కీసర, ఖాజీపల్లి, బొంతపల్లి, చెంగిచెర్ల, హరిణ వనస్థలి రక్షిత అటవీ ప్రాంతాల్లో క్షీణించిన అటవీ పునరుద్ధరణలో గ్రీన్ ఇండియా భాగస్వామ్యమైంది. హైదరాబాద్‌తో పాటు ముంబై, ఢిల్లీ, భువనేశ్వర్లలో పలు కార్యక్రమాలు చేపట్టాం. వీటన్నింటిలో భాగస్వామ్యులైన లక్షల మందికి వినమ్రపూర్వక కృతజ్ఞతలు. కానీ, ఈ హరిత యజ్ఞం మరింతగా కొనసాగాలి, హరిత భారత్ స్వప్నం సాకారం కావాలనేది మా బలీయమైన ఆకాంక్ష. ఈ ఏడాది అసోంలో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ మొదలుపెట్టాం. అందమైన అసోంలో పచ్చదనం క్షీణించటం, ప్రకృతి విలయాలు పెరగటం బాధాకరం. అందుకే పద్మశ్రీ జాదవ్ పయంగ్ స్ఫూర్తితో ఆయనతో కలిసి పనిచేస్తు న్నాం.
జాదవ్ మార్గనిర్దేశంలో 2030 కల్లా అసోంలో కోటి మొక్కలు నాటి సంరక్షించాలనే బృహత్ కార్యాన్ని మొదలుపెట్టాం. దీనిలో స్థానిక సంస్థలు, ఎన్జీవోలు, పౌరులను భాగస్వామ్యం చేస్తున్నాం.ఇందులో అన్నివర్గాలనూ భాగస్వామ్యం చేస్తాం, కలిసివచ్చే చేతులతో మొక్కలు నాటిస్తాం. పార్టీలు, వర్గాలు, ప్రయోజనాలకతీతంగా ‘హరిత భారత్’ లక్ష్యంగా పనిచేయాలనేదే మా సంకల్పం. ఇటీవల అసోంలో జరిగిన కార్యక్రమంలో తముల్పూర్ ఎమ్మెల్యే జోలెన్ దోయినరీ స్వయంగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొని మొక్కలు నాటడంతో పాటు, మా కృషిని కొనసాగించమని ఆహ్వానించటం అభినందనీయం.
హరిత విప్లవం మొదలుపెట్టినపుడు జాదవ్ పయంగ్ ఒక్కరే, కానీ ఆయన సాధించిన ఫలితాలు మాత్రం ప్రపంచ గుర్తింపును పొందాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, లాటిన్ అమెరికా దేశాలు ఆయనను స్వయంగా ఆహ్వానించి అస్సామీ, హిందీలో కొనసాగే ఆయన ప్రసంగాలను, క్షేత్ర అనుభవాలను తమ భాషల్లోకి అనువాదం చేసుకొని మరీ వింటున్నాయి. అలాగే హరితహారంతో కేసీఆర్ లాంటి స్ఫూర్తి ప్రదాతలు ఎక్కడినుంచో రారు, మన మధ్యే ఉంటూ మార్గనిర్దేశం చేస్తారు. ఇలాంటివారు వేసిన హరిత బాటల్లో నడవటం, భరతమాతను హరితదేశంగా మలుచుకోవటం మన ముందున్న కర్తవ్యం. భవిష్యత్ తరాలు మనను నిందించకముందే మేల్కొందాం. ప్రకృతి రక్షణకు, పచ్చదనం పెంపునకు పునరంకితమవుదాం.
(వ్యాసకర్త: మాజీ రాజ్యసభ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు)
-జోగినపల్లి సంతోష్‌కుమార్