రాఘవ కన్స్ట్రక్షన్స్ మైనింగ్ అక్రమాల మీద బీఆర్ఎస్ శాసనసభా పక్షం ఉప నేత హరీశ్‌రావు పక్కా ఆధారాలు సభ ముందు పెట్టారు. సంగతేందో తేల్చమని పట్టుబట్టారు. అనివార్యంగా అవినీతి నిజమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా ఆయన మంత్రివర్గం ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్రమ మైనింగ్‌ను తామే మొదట గుర్తించామని, దానికి ఫైన్ విధించామని కప్పిపుచ్చుకొనే ప్రయత్నంలో కాంగ్రెస్ సర్కార్ ఇరుక్కపోయింది. ఈ పెనుగులాటలో ప్రభుత్వం హరీశ్‌రావు పేనిన ఉచ్చులో మరింత చిక్కుతున్నది. రాఘవ కన్స్ట్రక్షన్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిది కాదని, ఆయన బంధువుల కంపెనీ అని సభా సాక్షిగాబుకాయించి ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం సెల్ఫ్ గోల్ వేసుకున్నది. ఆ తరువాత మంత్రులంతా మూకుమ్మడిగా హరీశ్‌రావును చుట్టుముట్టి ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా ఫలితం లేకుండా పోయింది.
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా దళితబంధు తెచ్చారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. అధికారిక నివేదికల ప్రకారం 50 వేల దళిత కుటుంబాలకు ఈ పథకం బంధువు అయింది. ఇంకో 1.25 లక్షల మందికి దళితబంధు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే దళిత జన జాతుల జీవితాలు మరింత ప్రగతిపథంలో పయనించేవి.
హౌస్ కమిటీ వేస్తే ఇబ్బంది పడతామని ఆలోచన చేసిన సీఎం చేజారిపోయిన పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకోవటం రాజకీయ ఆసక్తిని కలిగించింది. హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టగా..తమ పరిధిలో ఉండే సీబీసీఐడీ విచారణ వేస్తామనే ప్రకటన సభ ముందు పెట్టారు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. ఇందులో రెండు ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ప్రతిపక్షాల డిమాండ్‌ను తిప్పికొట్టి పొంగులేటిని రక్షించడాకి చూస్తున్నట్టు కలరింగ్ ఇవ్వటం ఒక ఎత్తైతే..దాన్ని అడ్డం పెట్టుకొని మంత్రి జుత్తు చేతిలో పట్టుకోవటం మరొక ఎత్తు అన్నది చర్చ. సంకల్పం..చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వమైతే ప్రజాస్వామ్య వేదిక మీద సమగ్ర చర్చకు ఆహ్వానించాలి. అవినీతి మూలాల మీద సంవాదనలు, సమాలోచనలు జరుగాలి. తప్పులు సరిదిద్దుకొని ప్రతిపక్షం మీద ప్రభుత్వం పైచేయిగా నిలబడాలి. అదీ పద్ధతి. కానీ ఆశ్చర్యంగా అగ్రకులాధీశుల అవినీతి మీద జరుగుతున్న చర్చలోకి కులవివక్షను చొప్పించారు. దళిత బహుజన ఎమ్మెల్యేలను వివాదంలోకి లాగి డైవర్షన్ రాజకీయ నాటకాన్ని తెర మీదకు తెచ్చారు.
చిన్న రాష్ర్టాలు ఏర్పడితేనే చిన్న కులాలకు గౌరవం పెరుగుతుందని డా. బీఆర్ అంబేడ్కర్ భావించారు. ఈ ఒక్కమాట మీదనే కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవం తీరు సచివాలయాన్ని రూపొందించి, దానికి అంబేద్కర్ అని నామకరణం చేశారు. 125 అడుగులతో ఆదర్శమూర్తి విగ్రహాన్ని సాగరం ఒడ్డున తీర్చిదిద్దారు. ఈ సచివాలయం, ఆ విగ్రహం నిర్మాణాలు కాదు.. తెలంగాణ విప్లవ మాతృకలు. ఎత్తు, పొడుగు ఆకారాలకు ప్రతీకలు కాదు..తెలంగాణ ఆకాంక్షను సాకారం చేసే దృష్టి దీపికలు. నిత్యం సచివాలయానికి వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేద్కర్‌ను చూస్తూ ప్రభావితం కావాలి. ఆయన సిద్ధాంతం, ఆచరణ కండ్లలో మొదలాడాలనేది కేసీఆర్ ఆంకాంక్ష. ఆఆకాంక్ష తోనే దళితున్ని ఉప ముఖ్యమంత్రిని చేశారు.
తెలంగాణ కోసం కొట్లాడిన దళితబిడ్డలు గోరటి వెంకన్న, రసమయి బాలకిషన్ లాంటి సృజనకారులు, క్రాంతి కిరణ్, గాదరి కిశోర్, బాల్క సుమన్ లాంటి దళిత యువతను చట్టసభల్లోకి తీసుకవచ్చారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంలో కేసీఆర్ ఇంకో ప్రతిపాదన కూడా చేశారు.
దళిత గిరిజన బిడ్డలు ఒక్కసారి మననం చేసుకోవాలి. అంబేద్కర్ పేరిట దేశంలోనే ప్రతిష్టాత్మక అవార్డులు ఇవ్వాలని సంకల్పించారు. అవార్డుల కోసం రూ.51 కోట్లు డిపాజిట్ చేస్తే ఏడాదికి రూ.3 కోట్ల వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ సొమ్ముతోనే రాష్ట్రంతో పాటు దేశవాప్తంగా వివిధ
రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి అంబేద్కర్ జయంతి రోజున అవార్డులు ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా దళితబంధు తెచ్చారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. అధికారిక నివేదికల ప్రకారం 50 వేల దళిత కుటుంబాలకు ఈ పథకం బంధువు అయింది. ఇంకో 1.25 లక్షల మందికి దళితబంధు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే దళిత జన జాతుల జీవితాలు మరింత ప్రగతిపథంలో పయనించేవి.
రాజకీయ పార్టీలు గెలుస్తాయి..ఓడుతాయి. గెలుపు ఓటముల లెక్క ఎప్పటికీ ఉండేదే. కానీ ప్రజలు గెలిచే రాజకీయం రావాలి. దళిత బహుజనులను గెలిపించే రాజకీయం చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి ముందు పదేండ్ల ముందు కాంగ్రెస్ రాజ్యం చేసింది. అప్పుడు తిప్పితిప్పి కొడితే దళితుల అభివృద్ధి కోసం ఖర్చు చేసింది రూ.16 వేల కోట్లే. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల హయాం తరువాత ఈ రెండున్నరేండ్ల నుంచి మళ్లీ కాంగ్రెస్ రాజ్యమే. ఈ కాలంలో దళిత జాతి కోసం చేసిన ఖర్చు రూ.79 కోట్లు. కానీ కేసీఆర్ ఒక్కరే దళితుల ఆర్థిక సాధికారికత గురించి ఆలోచన చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి పీఠం నుంచి కేసీఆర్ దిగిపోయే నాటికి దళిత సంక్షేమం కోసం రూ.92,640 కోట్లు, గిరిజన సంక్షేమ కోసం రూ.43,936 కోట్లు ఖర్చు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో పేదరికం 21.92 శాతం ఉండేది. 2023 డిసెంబర్ నాటికి అది 5.8 శాతానికి తగ్గింది. 16.12 శాతం పేదరికం పోయింది.
ఎస్సీ, ఎస్టీలకు చెందిన ప్రత్యేక నిధులు ల్యాప్స్ కావద్దని, ఏదైనా ఏడాదిపాటు ఖర్చు పెట్టకపోతే దాన్ని క్యారీ ఫర్వార్డ్ చేయాలన్న చట్టాన్ని తొట్టతొలిసారి తెచ్చిందే కేసీఆర్. ఆ చట్టాన్ని 10 రాష్ర్టాలు అడాప్ట్ చేసుకొన్నాయి. దేశమే ఇప్పుడా చట్టం వైపు చూస్తున్నది. ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. దళితబంధుకు కేసీఆర్ రూ.10 లక్షల మాత్రమే ఇస్తున్నారు, తాము అధికారంలోకి వస్తే రూ.12 లక్షలు ఇస్తామని స్వయంగా ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జునఖర్గే ప్రకటించారు. ఆయన అటుపక్క అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి, అప్పటి సీఎల్పీ నేత హోదాలో ఉన్న నేటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నరు.
అన్ని ప్రభుత్వ పనుల్లో 26% శాతం ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామన్నరు. దళిత, గిరిజనులు ఇండ్లు నిర్మించుకుంటే రూ.6 లక్షలు అన్నరు. కానీ అధికారంలోకి వచ్చాక ఇప్పటిదాకా ఏదీ లేదు. దళితబంధు పోయింది. దళిత క్రాంతి పోయింది. దళిత ప్రత్యేక నిధులు పోయినయి. రాష్ట్రంలో ఉన్న అపురూప చెంచు జాతి గిరిజనులను ఉద్ధరించాల్సిన మన్ననూరు ఐటీడీఏ మూలనపడ్డది. ఒకే ఒక ఉద్యోగితో అంపశయ్య మీద మూలుగుతున్నది. వీటి మీద చర్చను వదిలేసి, రాజకీయ చదరంగంలో దళిత బహుజన బిడ్డలను పావులుగా వాడుకునే వ్యూహాలు, ఎత్తుగడలతో సభ నడపటం శోచనీయం. పొలిటికల్ అవినీతి మీద జరుగుతున్న చర్చను డైవర్ట్ చేయడానికి దళిత కార్డును ప్రయోగించటం గర్హనీయం.
దళిత కార్డు అయిపోయింది. ఇక రంగనాయకసాగర్ మీద పడ్డరు. లక్ష ఎకరాల మాగాణికి నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు. దీన్ని పడావు పెట్టి సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాను ఎండబెట్టాలని ప్రభుత్వం చూసింది. హరీశ్‌రావు పట్టుబడితే నీళ్లు వదిలిండ్రు. రేపో, ఎల్లుండో అక్కడి చెరువులు మత్తళ్లు దుంకుతాయి. పొట్ట మీదున్న పంట చేనుకు ప్రాణం పోస్తయి.
ఈ అద్భుత జలదృశ్యం మీద సర్కార్ పాడు దృష్టి పడ్డది. ప్రాజెక్టు పునరావాసం, పునఃస్థాపన ప్యాకేజీ మీద రేవంత్ సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈనెల 7లోగా రికార్డులు అన్నీ పంపాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్‌కు ఆదేశాలు పంపింది. రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమాల గురించి నిలదీస్తే..పాత మైనింగ్ మీద ప్రభుత్వం సీఐడీ వేసింది. వీటితోని హరీశ్‌రావు దూకుడుకు పాలకులు అడ్డుకట్ట వేస్తారట. ఆయన్ను బంధించటానికి సర్కార్ పన్నిన పద్మవ్యూహం తీరు ఉచ్చులట. ప్రభుగణం మిడిసిపడుతున్నది కానీ, పసలేని పాశాలకు చిక్కుకోవటానికి హరీశ్‌రావు ఏమైనా బాల అభిమన్యుడా! పోరులో ఆరితేరిన అర్జునుడు. పద్మవ్యూహం ఏమో! కానీ నాదర్గుల్లో పేల్చిన రూ.7 వేల కోట్ల విలువైన భూ కుంభకోణం కార్చిచ్చయి అంటుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వణికిస్తున్నది.వర్ధెల్లి వెంకటేశ్వర్లు