మార్చి 26న అసెంబ్లీలో సాగునీటి శాఖ పద్దులపై చర్చ సందర్భంగా తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ చెప్పిన అంశం మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మధ్య వాదోపవాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. ఉత్తమ్ కుమార్‌రెడ్డి 165 టీఎంసీల నీరు ఉందని సీడబ్ల్యూసీ చెప్పిందని, భవిష్యత్తులో 165 టీఎంసీలు లభ్యం కావని సీడబ్ల్యూసీ చెప్పిందని హరీశ్‌రావు వాదించారు. ఆ లేఖలోని వాక్యాలను చదివి వినిపించడానికి హరీశ్‌రావు ప్రయత్నం చేసినా అధికారపక్షం ఆయనకు అవకాశం ఇవ్వకుండా అడ్డుపడింది. అయితే గతంలో ఈ అంశంపై హరీశ్‌రావు సీడబ్ల్యూసీ ప్రాణహిత చేవెళ్ల చీఫ్ ఇంజినీర్‌కు 2015 మార్చి 4న రాసిన లేఖలో తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై వారు వెలిబుచ్చిన కామెంట్స్ చదివి వినిపించారు. మార్చ్ 29న శ్రీధర్‌రావు దేశ్‌పాండే రాసిన ‘తుమ్మిడిహట్టి- నీటిలభ్యత.. నిజానిజాలు’ శీర్షికతో రాసిన వ్యాసంలో ఈ వాక్యాలను యథాతథంగా ఉల్లేఖించారు. అందువల్ల ఆ అంశం జోలికి పోదలుచుకోలేదు.
అయితే ఆ వాదోపవాదాల్లో సందెట్లో సడేమియా లాగా సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఈ చర్చలో దూరి అధికారపక్షం వైపు నిలబడి ‘తుమ్మిడిహట్టి వద్ద నీరు లేదని సీడబ్ల్యూసీ చెప్పినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాసుకుంటానని, గుండు కొట్టించుకుంటానని’ శపథాలు చేయడం మాత్రం అందరినీ విస్మయానికి గురిచేసింది. తుమ్మిడిహట్టి బ్యారేజీ కట్టకుండా ప్రాజెక్టును తమ ప్రాంతం నుంచి మేడిగడ్డకు లాక్కుపోయారని ఆయన ఆవేదనలో నుంచే ఈ ఆవేశం పొడుచుకువచ్చిందనుకోవచ్చు. వాస్తవాలు తెలిసినట్టయితే ఆయన అంత ఆవేశానికి లోనయ్యేవాడు కాదని, ప్రభుత్వ పక్షం వహించేవాడు కాదని నా అభిప్రాయం. అయితే పాల్వాయి హరీశ్ గుర్తించవలసిన అంశాలు ఇవీ…
తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మించకుండా నిర్లక్ష్యం చేసిందెవరు? 2004-14 వరకు పదేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాదా? 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించకుండానే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులను 28 ప్యాకేజీలుగా విభజించి అన్ని ప్యాకేజీ పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం పనులకూ ప్యాకేజీ 3 కింద టెండర్లు పిలువడం జరిగింది. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపనీ (హెచ్‌సీసీ) ఈ టెండర్లను దక్కించుకున్నది. పనులు మాత్రం మొదలుకాలేదు. మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించలేమని ప్రభుత్వానికి తెలియని విషయం కాదు. సంప్రదింపులు జరిపి 152 మీటర్ల ఎత్తు వరకు బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించడంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. జలయజ్ఞంలో ప్రారంభించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచే పనిలో, తెలుగు గంగ, శ్రీశైలం కుడికాలువ, హంద్రీనీవా, వెలిగొండ, తదితర రాయలసీమ ప్రాజెక్టులను, పులిచింతల ప్రాజెక్టును పూర్తిచేయడంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మునిగిపోయి ఉంది.
వారికి తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలంటే మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవాలని సోయి ఉండిందా? అధికారుల స్థాయిలో కొన్ని ప్రయత్నాలు జరిగి ఉంటాయి. కానీ, ఆ సమస్య రాజకీయ సంప్రదింపులతో తప్ప అధికారుల స్థాయిలో చర్చల ద్వారా పరిష్కారమయ్యేది కాదు. అయినా కూడా ఈ దిశగా ప్రభుత్వ పెద్దలు దృష్టిపెట్టనే లేదు. దశాబ్దం గడిచినా బ్యారేజీ పనులు మొదలుకాలేదు.
2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాతనే కేసీఆర్ ప్రభుత్వం సంప్రదింపులు మొదలుపెట్టింది. 152 మీటర్ల ఎత్తువరకు బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించడానికి నాటి సాగునీటి మంత్రి హరీశ్‌రావు, సీఎం కేసీఆర్ ఎంత ప్రయత్నించినా కొన్ని నెలలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తమ మొండివైఖరిని వీడలేదు. 4 మీటర్ల ఎత్తు తగ్గించాలని వారు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. 2004-14 దశాబ్దం ఎంత అనుకూలమైన కాలం! కేంద్రంలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నకాలం.
సోనియా గాంధీ తలచుకుంటే మహారాష్ట్రను ఈ విషయంలో ఒప్పించగలిగేదే. కానీ, ఆమె సహాయం తీసుకోవాలన్న సోయి ఉమ్మడి ప్రభుత్వానికి ఉంటే కదా! వారికి ప్రాణహిత చేవెళ్ల ఒక ఎన్నికల ప్రాజెక్టు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఉద్దేశించిన ప్రాజెక్టే తప్ప నీరు పారిచ్చే లక్ష్యంతో తలపోసిన ప్రాజెక్టు కాదు. అందుకే, ఆ అనుకూల వాతావరణాన్ని కూడా వినియోగించుకోలేక వృథా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మహారాష్ట్రతో చర్చలతో కాలయాపన చేయదలచుకోలేదు. గోదావరి జలాలను తెలంగాణ పంట పొలాలకు పారిచ్చి తెలంగాణలో సాగునీటి సంక్షోభాన్ని నివారించి రైతాంగానికి సాగునీటి భరోసాను ఇవ్వాలనుకున్నది. కాబట్టే, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీ ఇంజినీరింగ్ చేసి నాలుగేండ్లలోనే బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు కలిపితే సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దశాబ్ద కాలంలో మహారాష్ట్రను ఒప్పించి తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ పనులు ప్రారంభించి 50 శాతమో, 60 శాతమో పూర్తిచేసి ఉంటే కేసీఆర్ ప్రభుత్వానికి రీ ఇంజినీరింగ్ చేసే అగత్యం ఏర్పడి ఉండేది కాదు. కేసీఆర్ ప్రభుత్వానికి రీ ఇంజినీరింగ్ చేసే అగత్యం కల్పించింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న సంగతి పాల్వాయి హరీష్ గుర్తించి ఉంటే ఆయన ఆ రకంగా కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకు పడి ఉండేవాడు కాదేమో!
2013లో అప్పటి కాంగ్రెస్ సీఎం పృథ్వీరాజ్ చవాన్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినా, నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని కాలక్షేపం చేసినా నాటి ప్రభుత్వ పెద్దలు ఇవ్వాళ కేసీఆర్ ప్రభుత్వం రీ ఇంజినీరింగ్ పేరు మీద గ్రావిటీ ప్రాజెక్టును వదిలేసి భారీ ఎత్తిపోతలను చేపట్టిందని విమర్శలు చేయడం సమంజసమా?
పాల్వాయి గత ప్రభుత్వంపై విరుచుకుపడటం కంటే ఇప్పటి ప్రభుత్వాన్ని అడుగవలసిన ప్రశ్నలు.. ఉమ్మడి ఏపీలో ఎనిమిదేండ్లు తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదెందుకు? కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇక్కడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్న అనుకూల కాలంలోనూ 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాధినేతలు ఎందుకు ఒప్పించలేకపోయారు? 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో కాలువల డిజైన్లు పూర్తిచేసి టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగించిన ప్రభుత్వ పెద్దలు తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎఫ్‌ఆర్‌ఎల్‌పై మహారాష్ట్రను ఒప్పించాల్సిన అవసరాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు?
2013లో అప్పటి కాంగ్రెస్ సీఎం పృథ్వీరాజ్ చవాన్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసిన, నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని కాలక్షేపం చేసినా నాటి ప్రభుత్వ పెద్దలు ఇవ్వాళ కేసీఆర్ ప్రభుత్వం రీ ఇంజినీరింగ్ పేరు మీద గ్రావిటీ ప్రాజెక్టును వదిలేసి భారీ ఎత్తిపోతలను చేపట్టిందని విమర్శలు చేయడం సమంజసమా? తుమ్మిడిహట్టి బ్యారేజీని నిర్మించి తీరుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ పెద్దలు గడిచిన 15 నెలల్లో చేసిందేమిటి? హరీష్ సంధించాల్సిన ప్రశ్నలు ఇవి కదా! పాల్వాయి హరీష్ కొంత తెలిసి, ఎక్కువ తెలియక గత ప్రభుత్వం మీద విరుచుకుపడటం అందరినీ విస్మయానికి గురిచేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి చెట్టాపట్టాలు వేసుకొని పని చేస్తున్నాయని చెప్పడానికి పాల్వాయి హరీష్ ‘సందట్లో సడేమియా’ ఉదంతం ఒక సాక్ష్యంగా నిలిచింది.
2014-23 వరకు పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తు నిర్మించడానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నప్పటికీ తుమ్మిడిహట్టి బ్యారేజీని ఎందుకు నిర్మించలేకపోయిందన్న ప్రశ్న ఉంది. 148 మీటర్ల ఎత్తు వద్ద కూడా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించడానికి సాంకేతిక సమస్యలతో పాటు, పెరిగే ఖర్చు, చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అడ్డంకులుగా ఉన్నాయి.
15 నెలలు గడిచినా తుమ్మిడిహట్టి బ్యారేజీ కట్టితీరుతామని బీరాలు పలుకుతున్న రేవంత్ ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేకపోవడానికి కారణాలివే. ఏ ఎత్తుకు బ్యారేజీ కడతామన్న అంశంపై కూడా వారికి స్పష్టత ఉన్నట్టు లేదు. 152 మీటర్ల ఎత్తుకు కట్టాలంటే మహారాష్ట్రతో ఒప్పందం తప్పనిసరి. ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నది దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం. గతంలోనే ఒప్పుకోని ఫడ్నవీస్ ఇప్పుడు ఒప్పుకుంటాడా? 148 మీటర్ల వద్ద తుమ్మిడిహట్టి బ్యారేజీలో ఉండే స్టోరేజీ 1.5 టీఎంసీలు మాత్రమే. ఉమ్మడి రాష్ట్రంలోనే తవ్విన కాలువలోకి నీరు గ్రావిటీతో తరలించడం కుదరదు.
మరొక చిన్న లిఫ్ట్ పెట్టి నీటిని ఎత్తిపోయవలసి ఉంటుంది. బ్యారేజీ నిర్మాణ స్థలం వార్ధా, వైన్ గంగ సంగమం కాబట్టి రెండు నదులకు అడ్డంగా సుమారు 6 కిలో మీటర్ల పొడవైన బ్యారేజీ సుమారు 110 గేట్లతో నిర్మించాలి. ఇప్పటి ధరలతో లెక్క వేస్తే భూ సేకరణ సహా బ్యారేజీ ఖర్చు సుమారు 3 వేల కోట్లు. బ్యారేజీని నదీ ప్రవాహానికి 40 డిగ్రీల కోణంలో(Skew) నిర్మించాలి. ఇటువంటి బ్యారేజీలు మన దేశంలో కానీ, ప్రపంచంలో మరెక్కడా లేవు. ఇవన్నీ మధింపు వేసుకొనే కేసీఆర్ ప్రభుత్వం వార్ధా నదిపై బ్యారేజీని ప్రతిపాదించింది. పైన పేర్కొన్న అన్ని సమస్యలు వార్ధా బ్యారేజీలో సమసిపోతాయి. కేసీఆర్ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టు పేరుతో రూ.4,550 కోట్లతో డీపీఆర్ తయారుచేయించి కేంద్ర జల సంఘానికి పంపించింది.
అనుమతుల ప్రక్రియ కొనసాగుతుండగానే అధికార మార్పిడి తర్వాత సీడబ్ల్యూసీ డీపీఆర్‌ను వాపస్ చేసింది. మార్చి 26న కూడా అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతామని ప్రకటించారు. అంతకు కొన్ని రోజుల ముందు మార్చి 17న కౌన్సిల్లో కోదండరాం అడిగిన ప్రశ్నకు ఇతర ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నామని రాత పూర్వకంగా జవాబిచ్చారు. మరి వారేం చేస్తారో కాలమే నిర్ణయిస్తుంది.
– (వ్యాసకర్త: తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్)వి.ప్రకాష్