వైద్యవృత్తి, ఇంజినీరింగ్ అంటేనే కలగా ఊహించుకున్న పేద విద్యార్థులెందరో. ఆసక్తి, నైపుణ్యాలున్నా ఆదరించి ప్రోత్సహించేవారు లేక ఆశల మొగ్గలను తుంచుకున్న సరస్వతీ పుత్రులెందరో. కానీ ఇప్పుడు తెలంగాణ సర్కారు దన్నుతో సీఎం కేసీఆర్ నెలకొల్పిన గురుకులాలు పేదింటి బిడ్డల కలలను సాకారం చేస్తున్నాయి. ఆ అట్టడుగువర్గాల పిల్లలే ఒంటిపై ఆప్రన్ తొడిగి.. చేతిలో స్టెత్ పట్టుకొని సమాజ నాడిని చూస్తున్నారు. డ్రాఫ్టర్ పట్టుకొని అందమైన నిర్మాణాలకు, అద్భుతమైన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఉన్నత స్థానాలకు ఎగబాకుతున్నారు. ఇదీ తెలంగాణ సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం. గురుకులాల విజయ ప్రస్థానానికి చిహ్నం.
‘విద్య లేకపోవడం అజ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఆర్థికలేమి సమాజంలో గుర్తింపును మాయం చేస్తుంది’. ఇవీ మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు. కానీ స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచినా బడుగు, బలహీనవర్గాలు ఇంకా ఆశించిన స్థాయిలో విద్యావంతులు కావడం అటుంచితే ఆ దిశగా ఏ ప్రభుత్వమూ పేరుకు కంటితుడుపు చర్యలు చేపట్టినా బలమైన పునాదులు వేసిన దాఖలాల్లేకపోవడం శోచనీయం. కానీ, ఇప్పుడు దేశంలో ఎక్కడాలేని విధంగా, ఏ ప్రభుత్వమూ, ఏ పాలకుడూ ఆలోచించని రీతిలో అంబేద్కర్, ఫూలే చూపిన మార్గంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతుండటం ముదావహం. ఉమ్మడి పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి తెలంగాణ విద్యారంగంపై ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించి సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. అట్టడుగువర్గాలకు కేజీ టు పీజీ వరకు ఉచితంగా, నాణ్యమైన విద్యనందించాలని సంకల్పించడంతోపాటు గత పదేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా మొక్కవోని దీక్షతో కృషి చేస్తుండటం అభినందనీయం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణవ్యాప్తంగా కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర అన్ని కలిపి 288 గురుకులాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులోనూ కేవలం 5 నుంచి 10వ తరగతి వరకు మాత్రమే తెలుగు మాధ్యమ విద్య. ఇక వేళ్ల మీద లెక్కపెట్టుకునే సంఖ్యలో ఇంటర్ కాలేజీలు ఉండగా, డిగ్రీ గురుకుల కళాశాలల ఊసే లేదు. ఆయా గురుకులాల్లో వసతులూ నామమాత్రమే. హాస్టళ్లున్నా విద్యార్థుల్లేక అవి బోసిపోయే దుస్థితి.
స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగ అభివృద్ధికి దేశంలో ఏ పాలకుడూ, ఏ రాష్ట్ర సర్కారు ఇవ్వని ప్రాధాన్యాన్ని ఇవ్వడం ఆనందదాయకం. సామాజిక, ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు.. ఇలా వర్గాలవారీగా గురుకుల పాఠశాలలను 2016-17 నుంచి క్రమానుగుతంగా విస్తరించుకుంటూ వస్తున్నారు. తొలుత నియోజకవర్గానికి ఒకటి చొప్పున నెలకొల్పి ఆ తర్వాత 2019లోనూ మరోసారి హాస్టళ్ల సంఖ్యను పెంచారు. మొత్తంగా ఎస్సీ గురుకులాలను 268కి, ఎస్టీలవి 183, మైనారిటీలవి 204కు, బీసీల రెసిడెన్షియల్ పాఠశాలలను 327కు విస్తరించింది. 37 జనరల్ గురుకులాలను కలుపుకొంటే ప్రస్తుతం మొత్తంగా రాష్ట్రంలో గురుకులాల సంఖ్య 1,019కు పెరగడం విశేషం. ఇప్పటివరకు ఏర్పాటుచేసిన మొత్తం గురుకుల పాఠశాలల్లో అన్నింటినీ ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేసి ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన ఉచిత విద్యనందిస్తున్నది. ఇక ఉమ్మడి పాలనలో కేవలం ఒకే ఒక గురుకుల డిగ్రీ కళాశాల అందుబాటులో ఉండగా, నేడు 70 డిగ్రీ కళాశాలలను నెలకొల్పడం విశేషం. సగటున ఒక్కో గురుకులం ద్వారా 640 మంది చొప్పున ఏటా దాదాపు 6.50 లక్షలకు మందికిపైగా విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనంతో పాటు, మెరుగైన శిక్షణను అందిస్తుండటం గర్వకారణం. ఒక్కో విద్యార్థిపై 1.25 లక్షలను ఖర్చుచేస్తుండటం అభినందనీయం. ఇక గురుకుల విద్యలోనూ అందరికంటే ఎక్కువగా బాలికలకు ప్రాధాన్యం ఇవ్వడం సర్కారు చిత్తశుద్ధికి నిదర్శనం.
తెలంగాణ ప్రభుత్వం గురుకులాల్లో మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా, సత్వరమే ఉపాధి అవకాశాల పొందగల నూతన సాంకేతిక కోర్సులను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. గురుకులాల్లో ఎక్స్‌లెన్స్ సెంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటుచేసి ఐఐటీ, జేఈఈ, నీట్‌తో పాటు జాతీయ, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ఉచితంగా, కార్పొరేట్‌కు దీటుగా తర్ఫీదునిస్తుండటం అభినందనీయం. అంతేకాదు సైనిక్ స్కూల్, ఆర్మ్డ్ ఫోర్సెస్, లా తదితర ప్రత్యేక గురుకులాలను సైతం నెలకొల్పుతూ ఆయా దిశగా బడుగులకు ఊతమిస్తుండటం సర్కారు కృషికి దర్పణం. గురుకులాల్లో మెరుగైన విద్యను అందించడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సైతం తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. విదేశాల్లో ఉన్నత విద్యకు సైతం సర్కారు బాసటగా నిలుస్తుండటం గమనార్హం. ఇటీవలనే దేశీయంగా ఉన్న 200లకు పైగా ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివే బీసీ విద్యార్థుల ఫీజును చెల్లించాలని నిర్ణయించడం చరిత్రాత్మక నిర్ణయం.
తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టిన గురుకుల విద్యావ్యవస్థ సత్ఫలితాలను ఇవ్వడం అప్పుడే ఆరంభమైంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, ఆలిండియా హయ్యర్ ఎడ్యుకేషన్ సర్వే, యూ డైస్ నివేదికలే ప్రబల సాక్ష్యం. వేలాది మంది పేదింటి బిడ్డలు ఎన్ఐటీ, ఐఐటీలు, ఐఐఎంలు తదితర దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థల్లోకి ప్రవేశిస్తున్నారు. వైద్యవృత్తిలోకి అడుగిడుతున్నారు. అందుకు జేఈఈ, నీట్ ఫలితాలే నిదర్శంగా నిలుస్తున్నాయి. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, మాస్ మ్యూచువల్స్ ఇండియా వంటి ప్రముఖ సంస్థలు ఏకంగా కళాశాలకే వచ్చే ప్రాంగణ నియామకాలను నిర్వహిస్తుండటం అందుకు నిలువెత్తు నిదర్శనం. డిగ్రీ పట్టా చేతికి వచ్చిరాగానే లక్షల ప్యాకేజీతో కొలువుల్లో పేదింటి బిడ్డలు చేరుతుండటం గర్వకారణం. తెలంగాణ గురుకులాలు సాధిస్తున్న విజయం. ఈ ఘనత కచ్చితంగా సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది.
(వ్యాసకర్త: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు)
-దుండ్ర కుమారస్వామి
99599 12341