ఈ మధ్యకాలంలో ప్రజాకవి గోరటి వెంకన్నతో కలిసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశాను. నేను రాసిన ‘పిట్టవాలిన చెట్టు’ పుస్తకాన్ని వారికి అందజేశాను. ఆ సందర్భంలో తెలంగాణ జల వనరుల మీదికి చర్చ మళ్లింది. నల్లమల నట్టడవిలో గద్దరాసి వాగు ఉన్నది. కనీసం ఆరు నెలలు పారుతుంది. మూడు నెలలు నిండుగా ప్రవహిస్తుంది. అడవిలో సెలయేర్లు, వాగులు, వంకలతో కలిసి చివరికి కృష్ణా నదిలో కలుస్తుంది. నాకు తెలిసి చెంచులకు మినహా జన దృష్టానికి అంతు దొరకని వాగు ఇది. కానీ, ఈ వాగును కేసీఆర్ ప్రస్తావించటం చూసి ఆశ్చర్యపోయాను. గద్దరాసి గుండ్ల దగ్గర కట్టేస్తే.. నీళ్లు ఆగుతయి. అమ్రాబాద్, అచ్చంపేట మండలాలకు నీళ్లు అందుతయి కానీ, అటవీ శాఖ అనుమతించదని చెప్పటం చూసి నోరెళ్లబెట్టాను. ఇది తెలంగాణ జల వనరుల మీద కేసీఆర్‌కు ఉన్న పట్టు.
Telangana | ఏ నీళ్లు ఎక్కడ ఉన్నయి? ఏ జలరాసుల పారగమ్యత పదునెంత? ఎరగని నేతలు అదను మీద పంట చేలకు నీళ్లిస్తారనుకోగలమా? ఈ అవగాహన రాహిత్యంతోనే కదా.. మేడిగడ్డలో తలెత్తిన లోపాన్ని ఏదో ఉపద్రవ విభ్రమకులోనై యావత్తు కాళేశ్వరం విధ్వంసానికి పూనుకున్నది. రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టునే పడావు పెట్టినంత పనిచేసింది. కాళేశ్వరం ఏమైనా ఆషామాషీ ప్రాజెక్టా? ప్రపంచంలోనే సంక్లిష్ట, ఉత్కృష్టమైన మహా జల భాండాగారం.
ఇక గోదావరినైతే ఇంచు ఇంచు కొలత పెట్టినట్టే చీలే పాయలు.. పారే వాగులు.. కలిసే కాల్వలు.. దునికే జలపాతాలు ఇలా ఆయన ఒడిసిపట్టని నీటి చుక్క లేదు. ‘తుమ్మిడిహెట్టి’ ప్రాణహిత పుట్టిల్లు. వైన్‌గంగా, వార్ధా నదులు కలిస్తే అది ప్రాణహిత. అటు గడ్చిరోలి జిల్లా ఇటు ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుకు కచ్చితంగా కొలత పెట్టినట్టే కట్టుబడి 113 కిలోమీటర్ల ఇరుకు ప్రవాహం. అట్లా వచ్చి కాళేశ్వరం వద్ద 170 అడుగుల వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిం చే వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టం లెక్కల ప్రకా రం గోదావరి నదిలో ప్రవహించే నీటిలో ప్రాణహిత నది వాటా 34.87 శాతం. గోదావరి పరీవాహక ప్రాంతం విస్తీర్ణం 3.13 లక్షల చదరపు కిలోమీటర్లు కాగా.. అందులో 1.10 లక్షల చదరపు కిలో మీటర్లు ప్రాణహితదేనని అనర్గళంగా చెప్తూనే ఉన్నారు.
వేమ్నూరు బండల వాగు, మంథని బొక్కల వాగు, దామెరకుంట పెద్ద వాగు, ఉండెడ పిట్టిపోలి వాగు, పెద్దంపేట బండ వాగు, అన్నారం బండ్ల వాగు ఇట్లా గోదావరిలో కలిసే తీరొక్క వాగుల పేర్లు, వాటి ప్రవాహ జల సామర్థ్యం వివరిస్తుంటే.. కోటి ఎకరాల మాగాణి పచ్చబడ్డ సాదృశ్యం కండ్లముందు కదలాడింది.
కాలచక్రం తిరిగింది. రెండు నెలలు ముందుకు సాగింది. వికారాబాద్ జిల్లా పూడూర్ వద్ద నేవీ రాడార్ స్టేషన్‌కు భూమిపూజా కార్యక్రమం. ఇప్పటి తెలంగాణ సీఎం మైకు అందుకున్నారు. ‘మన నగరానికి, మన రాష్ర్టానికి మూడు వైపులా సముద్రం ఉన్నది. బంగాళఖాతం, అరేబియా మహా సముద్రం’ అని ప్రసంగిస్తుంటే..! తీరం ముందు ఆధారం అందని అన్నదాత విషణ్ణ వదనంతో వరదల్లో కొట్టుకు పోతున్నట్టు అనిపించింది. కోటి ఎకరాల మాగాణి తడి తప్పి సత్తెనాశినం కాబోతున్నట్టు తోచింది. ఏ నీళ్లు ఎక్కడ ఉన్నయి? ఏ జలరాసుల పారగమ్యత పదునెంత? ఎరగని నేతలు అదను మీద పంట చేలకు నీళ్లిస్తారనుకోగలమా? ఈ అవగాహన రాహిత్యంతోనే కదా.. మేడిగడ్డలో తలెత్తిన లోపాన్ని ఏదో ఉపద్రవ విభ్రమకులోనై యావత్తు కాళేశ్వరం విధ్వంసానికి పూనుకున్నది. రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టునే పడావు పెట్టినంత పనిచేసింది. కాళేశ్వరం ఏమైనా ఆషామాషీ ప్రాజెక్టా? ప్రపంచంలోనే సంక్లిష్ట, ఉత్కృష్టమైన మహా జల భాండాగారం. ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఏటేటా నిర్వహణ, నిర్మాణ చిక్కులు ఉత్పన్నం కావటం అతి సహజం. నీళ్ల బరువు బాధ్యతలు తెలిసిన పాలకులైతే జలరంగ నిపుణులతో పరిశీలన చేయించి పరిష్కారాలను అన్వేషిస్తారు. ఇక్కడో సంఘటన గుర్తుచేయాలి.
1996లో ఇదే మేడిగడ్డ వద్ద ఒకేసారి 28 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. మళ్లీ 36 ఏండ్ల తర్వాత అంటే.. 2022లో గోదావరి చరిత్రలోనే అంతటి హయ్యస్ట్ ఫ్లడ్ వచ్చింది. రికార్డు స్థాయిలో 28.40 లక్షల క్యూసెక్కుల వరద పారింది. ఇంతకు మించిన ఉగ్ర గోదావరి రూపం మన తరం చూడలేదు. అంతటి మహోగ్ర గోదారమ్మకే అడ్డం నిలబడిన కాళేశ్వరం రైతాంగానికి నీళ్లందించింది. జల యుద్ధంలో కాళేశ్వరం గాయపడ్డ మాట నిజం. కట్టుగడితే నయమైపోయే చిన్న గాయాలకే ప్రాజెక్టును గొంతు నులుమ జూడటం.. మూడు సముద్రాల ముచ్చట చెప్పటం రెండూ ఒక్కటే. అవగాహన రాహిత్యపు తాను ముక్కలే.
నదుల అనుసంధానాన్ని కేంద్రం వేగవంతం చేసింది. గోదావరిలోని తెలంగాణ వాటాలో 530 టీఎంసీల నీళ్లను ఆంధ్రకు, తమిళనాడుకు తరలించాలని ప్రణాళిక రూపొందించింది. ఒడిశా రాష్ట్రంలోని మహానదిలో 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీలు మొత్తం కలిసి 890 టీఎంసీల మిగులు జలాలున్నాయని కేంద్ర జలసంఘం లెక్కలు చెప్తున్నది. మహానదిని గోదావరితో కలిపి, గోదావరిని కృష్ణా నది మీదుగా కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కావేరి నదికి అనుసంధానం చేయాలనేది ప్రతిపాదన. తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉండగా.. నిర్మించిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం కలిపి 684 టీఎంసీల జలాలే వాడుకుంటున్నారని, మిగిలిన 270 టీఎంసీల నీళ్లు మిగులు జలాలే అని కేంద్ర జల సంఘం చెప్తున్నది. మాకు మిగులు జలాలు లేవు, మీ లెక్కలు తప్పు అని కేంద్రంతో కొట్లాడే దమ్ము ఇప్పటి పాలకులకు ఎవరికి ఉంది? చంద్రబాబు పంపిన జల సలహాదారుడు ఆయన్ను కాదని మనకు సలహాలు ఇస్తారా? తీరమేదో.. పరీవాహకం ఏదో ఎరుక లేని నేతలు కేంద్రంతో పోటీ పడి మన నీళ్లు మనకు నిలుపగలరా? ఈ నీతిహీనమైన లెక్కలకు పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు వత్తాసు.
రాజోలి బండ నీళ్లు ఆంధ్రకు మళ్లించి, తెలంగాణలో రక్తం పారించిన చరిత్ర ఆయనది. ఆయనకు మన ప్రస్తుత పాలకులు లాలూచీ. కృష్ణా నదిలో 79 శాతం పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే ఉన్నది. అంటే, ముప్పావు వంతు జలాల వాటా తెలంగాణకు దక్కాలే. కృష్ణా నది నీటి లభ్యత 811 టీఎంసీలు. ఈ లెక్కన కనీసం 600 టీఎంసీలు తెలంగాణకు రావాలే. కానీ, అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం తెలంగాణకు 161 టీఎంసీలు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ వాటాను 111కు కుదించింది. పోయిన నీళ్లు ఎలాగూ పోయాయి, కనీసం ఉన్న గోదావరి జలాలనైనా పొతం చేసుకుందామని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిద్ర లేని రాత్రుల్లో కసరత్తులే చేసిండు. అందులోంచి రూపం పోసుకున్నదే కాళేశ్వరం… మహా జళేశ్వరం.
కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టాలనేది కేంద్రం కుట్ర. దాన్ని ఆనందంగా అమలు చేస్తున్నది మన పాలకులు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోదావరి జలాల వినియోగం పక్కాగా డిజైన్ చేశారు. నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టు కింద 433.04 టీఎంసీలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద 475.79 టీఎంసీలు, చేపట్టబోయే ప్రాజెక్టుల కింద 45.38 టీఎంసీలు మొత్తం కలిపి 954 టీఎంసీల జలాలను సంపూర్ణంగా వినియోగించుకునేటట్టు పటిష్ఠ ప్రణాళిక చేసి పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నంతకాలం గోదావరిలో మన వాటాను దాటి చుక్క నీళ్లు బయటికి జారవు. అందుకే, కేంద్రం గుర్రు మీదున్నది. ప్రాజెక్టు కూలాలనే చూస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే జల రంగ సంస్థలు రేప్పొద్దున కాళేశ్వరంను బూచిగా చూపినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు కుంగిన సాకు నేపథ్యంలో కేంద్ర జల రంగ సంస్థ ఒకటి నాణ్యతా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నది. వాస్తవానికి ఈ సంస్థకు సంబంధించిన పూర్తి నివేదిక డిసెంబర్ లేదా జనవరి మాసాల్లో వస్తుంది. కానీ, అప్పుడే ఆ సంస్థ నుంచి లీకులు బయటికి వస్తున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బరాజులు కూడా సీకెంట్ పైల్ ఫౌండేషన్ పరిజ్ఞానంతో కట్టినవే కాబట్టి, ఒకదాంట్లో పిల్లర్లు కుంగిపోయాయి కాబట్టి, నీళ్లు నిల్వ చేస్తే మూడు బరాజుల్లో కూడా అదే తీరు ప్రమాదం జరగవచ్చని మీడియా లీకులు వదులుతున్నది. ఈ లీకుల వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉన్నది. కాళేశ్వరం కూలిపోతే.. ఇచ్చంపల్లి వద్ద ఇంకో ప్రాజెక్టు కట్టి, అక్కడినుంచి గోదావరి నదిని మళ్లించి కృష్ణకు కలపాలనేది అసలు పన్నాగం. దీనికోసం అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి సంయుక్తంగా ఎత్తులు వేస్తున్నారు. ఈ కపట నాటకాన్ని పసిగట్టేది ఎవరు? ఆపేదెవరు? మన పాలకులకు జల పరిజ్ఞానం ఉండి ఉంటే.. ఏ నది జలాలైనా ప్రస్తుత, సమీప భవిష్యత్తు పరీవాహక ప్రాంత అవసరాలను తీర్చాలి. అంటే కేవలం ఇప్పటికి మాత్రమే కాదు, మరో 30 ఏండ్ల నాటికి పెరుగనున్న జనాభా, వారికి అవసరమైన నీటి పరిమాణాన్ని నిర్ధారించి లెక్కగట్టినంకనే మిగులు జలాలను అంచనా వేయాలని వాదించేవాళ్లు. రెండు పండ్లు విరిగినట్టున్న మేడిగడ్డకు కట్టుగట్టి కాపాడుకునేవారు. కానీ, కేసీఆర్ కాకుండా ఇంకెవరికైనా ఇది సాధ్యమా? బాపుకున్న నెమ్మితనం బయటోళ్లకు ఉంటదా? ‘మంది మాటలు వట్టి మార్వానం పోతే మల్లొచ్చేసరికి ఇల్లు ఆగమైనటు’్ట అయింది తెలంగాణ జనం సంగతి.
నీళ్ల సంగతి అటుంచి నియామకాలు చూద్దామంటే.. ఏమన్న సక్కదనం ఉన్నదా? బడుగు బలహీన బహుజన పిల్లలకు పెద్ద ఉద్యోగాలు అందకుండా జీవోలు తెచ్చింది ఎవరు? ఈ జీవోలు తేవటం కోసమా మనం ఓట్లేసింది. మా కొలువులు మాకు కావాలని కొట్లాడుతున్న మన పిల్లలను హైదరాబాద్ పోలీసులు గుత్ప కర్రలందుకొని గొడ్డును బాదినట్టు బాదుతుంటే.. చూ స్తూ గుండెలు బాదుకోవటం మినహా ఏం చేయగలుగుతున్నం. పాలిచ్చే ధేనువు తల్గిడిసి మన మేం బావుకున్నట్టు? ఇవా.. మనం కోరుకున్న బతుకులు? జనం, విద్యావంతులు ఒక్కసారి ఆలోచన చేయాలె. బంగారు తున్క తీరు ఆకుపచ్చ తెలంగాణ ఆగం పాలైపోతంది. పంట పొలానికి నీళ్లు నింపే నీరటి ఎవరో? పొట్ట మీది చేనుకు తడి తప్పించే తలారి ఎవరో? మనకు మనమే అంచనా వేసుకోవాలె. నీళ్ల కాడ, నియామకాల కాడ వాచ్ డాగ్ తీరుగా ఉండి కొట్లాడి నిలబెట్టిన నేత మీదికే రాళ్లు విసిరితిమి. ఇదేమంటే.. అహం అంటగడితిమి. దగాకోరు మాటలకే పట్టం గడితిమి. ఇప్పుడు గోస పడుతుంటిమి. ఇంకనైనా కండ్లు తెరిసి కర్తవ్యబోధ చేసుకోవద్దా?
వర్ధెల్లి వెంకటేశ్వర్లు