రాష్ట్రంలోని పట్టణాల సమగ్రాభివృద్ధికి నిబద్ధతతో కూడిన ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్ల్లుగా కొనసాగిస్తున్నది. అదే నేడు తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో నిలిపింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు పట్టణాల్లో అభివృద్ధి జోరందుకున్నది. పరిపాలనా సంస్కరణలు, నూతన చట్టాలు, నిరంతరం నిధుల వంటి అనేక పద్ధతుల్లో పట్టణాలను అభివృద్ధికి చిరునామాగా మారుస్తున్నది.
కేం ద్ర ప్రభుత్వం నిర్వహించే సర్వేల్లో ఎం పిక కాబడే ఉత్తమ గ్రామ పంచాయతీ లు, ఉత్తమ పట్టణాలు, ఉత్తమ జిల్లాలన్నీ తెలంగాణలోనే ఉంటున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో కేంద్రం చేపడుతున్న సర్వేలో రాష్ట్రంలోని నగరాలు అగ్రగామి గా నిలుస్తున్నాయి. పట్టణీకరణలో దేశంలోనే తెలంగాణ ఐదవ స్థానంలో ఉన్నదంటే నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఎవరూ కాదనలేని సత్యం. పట్టణాభివృద్ధి శాఖ చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయం టూ పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సైతం ప్రశంసించడం విశేషం.
దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా పట్టణాభివృద్ధి సవాలుతో కూడుకున్నది. ఈ దిశగా ప్రభుత్వాలు, ప్రభుత్వాధికారులు వినూత్నమైన ఆలోచనలతో ముందు కు వస్తేనే శీఘ్రమైన పట్టణాభివృద్ధి సాధ్యమవుతుం ది. సీఎం కేసీఆర్ ఆలోచనలు, మంత్రి కేటీఆర్ మార్గదర్శకం, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఆచరణాత్మకంలో రాష్ట్ర పట్టణ ప్రగతి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తొమ్మిదేండ్ల కాలంలోనే దేశంలోని ఇతర రాష్టాలతో పోలిస్తే ఎన్నో అంశాల్లో గణనీయమైన అభివృద్ధి సాధ్యమైంది. తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన మున్సిపల్ చట్టం-2018 తీసుకొచ్చి పలు సంస్కరణలను చేపట్టింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 68 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు, పలు పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పా టుచేశారు. అంతేకాదు, భవన నిర్మాణ అనుమతు లు, లే అవుట్ అనుమతుల్లో వేగం, పారదర్శకత కోసం తీసుకొచ్చిన టీఎస్ బీపాస్ వంటి చట్టాలు దేశానికి మార్గదర్శకంగా మారాయి. టీఎస్ బీపాస్ ద్వారా 2.45 లక్షల దరఖాస్తులకు అనుమతులు ఇచ్చింది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పచ్చదనం గణనీయంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం అటవీ విస్తీర్ణం పెరగడానికి దోహదపడింది. గతం కంటే 7 శాతం అదనంగా పచ్చదనం పెరిగినట్టు ‘ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా’ ప్రకటించింది.
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు హెచ్ఎండీఏ పరిధి లో చేపట్టిన అర్బన్ గ్రీన్ కవర్ ఆపరేషన్ సక్సెసయ్యిం ది. ఏకంగా వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు-2022 హైదరాబాద్‌కు దక్కింది. పట్టణాల్లో ప్రకృతి వనాలు వెలిశా యి. నగర శివారులో 60 వేల ఎకరాల్లో 59 అర్బన్ ఫారెస్టు బ్లాక్స్ ఉండగా, ఇందులో నగరవాసులకు అనువుగా 16 బ్లాక్‌లను అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు గల నగరంగా మార్చడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది.
హైదరాబాద్ మహా నగరంలో రోజూ ఉత్పత్తయ్యే మురుగు నీటిని జలమండలి ఇప్పటికే శుద్ధి చేస్తున్నది. దీన్ని మరింత విస్తరించేందుకు మరో అడుగు ముం దుకేసింది. నగరంలోని పలుచోట్ల రూ.3,866.41 కోట్ల వ్యయంతో కొత్తగా 31 మురుగు నీటి శుద్ధి కేం ద్రాలు (ఎస్టీపీ) నిర్మిస్తున్నది. వీటిని 3 ప్యాకేజీల్లో 5 సర్కిళ్లలో నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం ద్వారా పరీవాహక ప్రాంతాల్లో మురుగు ప్రవాహాన్ని నిరోధించ డం, 100 శాతం మురుగును శుద్ధిచేయడం, ఆ నీటి ని చెరువులు ఇతర వనరులకు పంపించి వాటిని పరిరక్షిస్తారు. అంతేకాకుండా భూగర్భ జలాలు కలుషి తం కాకుండా.. పర్యావరణం, ప్రజారోగ్యంపై ఎ లాంటి దుష్ఫలితాలు ఉండకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. వీటి ద్వారా రోజూ 1,282 మిలియన్ లీట ర్ల మురుగునీటిని శుద్ధి చేయవచ్చు.
కృష్ణా, గోదావరి నదుల నీటిని నగరానికి తీసుకురావడంతో తాగునీటి ఇబ్బందులు తీరాయి. ప్రస్తుత అవసరాలే కాకుండా రానున్న 40 ఏండ్ల భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా మౌలిక వసతులు ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో, ఎండీ దానకిశోర్ ఆధ్వర్యంలో వాటర్‌బోర్డు ఈ తొమ్మిదేండ్లలో కీలక ఘట్టాలకు నాంది పలికింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు… నగరవాసులకు నెలకు 20 వేల లీటర్ల వరకు తాగునీటిని ఉచితంగా అందిస్తున్నది. ఇప్పటికే ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్-1 పనులు పూర్తిచేయగా, రూ.1200 కోట్లతో ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్-2 ద్వారా పనులు వేగవంతం చేసింది. సుంకిశాల ఇంటెక్వెల్ ద్వారా హైదరాబాద్ అర్బన్ అగ్లామరేషన్ (హెచ్‌యూఏ) ప్రాంతంలో తాగునీటికి భరోసా దక్కనున్నది.
శతాబ్దాల ఘనమైన వారసత్వం ఉన్న మహానగ రం.. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నది. రోడ్లు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాల నుంచి పార్కుల అభివృద్ధి, సుందరీకరణ పనులు నేడు సత్ఫలితాలను ఇస్తున్నా యి. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌లో చేపట్టిన ఫ్లై ఓవర్లు వరుసగా అందుబాటులోకి వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణంలో ఎస్ఆర్డీపీ కీలకపాత్ర పోషిస్తున్నది. జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపీ కింద రూ.333.55 కోట్లతో నిర్మించిన షేక్‌పేట్ ఫ్లై ఓవర్ అతిపెద్దది. ఎస్ఆర్డీపీలో భాగంగా ఇప్పటివరకు రూ.3248 కోట్లతో 35 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు పూర్తయ్యాయి. మరో 13 నిర్మాణంలో ఉన్నాయి.
రోడ్ల విస్తరణతోపాటు ఎల్బీనగర్,మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి లాంటి రద్దీ ప్రాంతాల్లో ఆకాశ మార్గాల నిర్మాణాలు చేపట్టడంతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరికొంది. వాహనదారులతోపాటు పాదచారుల కోసం ప్రభుత్వం.. ట్రాఫిక్ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి 40 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నది. రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఏండ్లుగా కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజల వెతలను తీర్చేలా చర్యలు చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగాన్ని హైటెక్ సిటీకే పరిమితం చేయకుండా.. నగరం నలువైపులా విస్తరింపజేస్తున్నది. అభివృద్ధికి దూరంగా ఉన్న ఓల్డ్సిటీలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పూర్తిచేసింది. శతాబ్దాలుగా గంగా జమునా తెహజీబ్ సుసంపన్న సంస్కృతికి క్షేత్రంగా ఉన్న నగరం ఆ వారసత్వాన్ని పదిలంగా కాపాడుకుంటూ అంతర్జాతీయ నగరంగా అడుగులు వేస్తున్నది. జీహెచ్ఎంసీ రోడ్లు, భవనాల వంటి కొత్త ప్రాజెక్టులపైనే రూ.7,644.55 కోట్లు వెచ్చించింది. కొత్త రాష్ట్రం ఏర్పాటుతో జీహెచ్ఎంసీ దేశంలోనే మొదటిసారి ఈ-ఆఫీస్ విధానానికి శ్రీకా రం చుట్టింది.
పౌరుల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా చెట్ల పెంపకం, థీమ్ పార్కుల అభివృద్ధి, కొత్తగా పార్కుల అభివృద్ధి, కాలనీల్లో వీడీసీసీ రోడ్లు, శ్మశానవాటికల్లో ఆహ్లాదకర వాతావరణం వంటి ఇతరత్రా పనులను జీహెచ్ఎంసీ చేపట్టింది. చేపల మార్కెట్లు, మున్సిపల్ మార్కెట్లు, జంతు వధశాలలు, చారిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణ, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు (సీపీపీ)లో భాగంగా చుట్టూ ఉన్న రోడ్ల ఆధునీకరణ, వీధి కుక్కల సమస్య పరిష్కారానికి జంతు సంరక్షణ కేంద్రాల నిర్మాణం, బస్తీల కోసం ఆదర్శ మార్కెట్లను జీహెచ్ఎంసీ చేపట్టింది.
ప్రతి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, మిషన్ భగీరథ, వైకుంఠధామాల నిర్మాణం, గ్రీన్‌బడ్జెట్ అమలుచేయడం, అధునాతన ధోబీ ఘాట్ల ఏర్పాటు, డంప్‌యార్డుల బయోమైనింగ్, మానవ వ్యర్థ్ధాల శుద్ధి వంటి కీలకమైన అంశాల్లో సమగ్రమైన అభివృద్ధి జరిగేలా పట్టణాభివృద్ధి శాఖ కృషిచేస్తున్నది. రాష్ట్రంలో 144 పురపాలక పట్టణాలుంటే అందులో 42 ఓడీఎఫ్ ప్లస్ హోదా సాధించడం అద్భుతమైన విషయం. సఫాయి కర్మచారి, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు తెలంగాణకు ఏటా వస్తున్నాయి. సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్ విభాగంలో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వితీయ బహుమతితో నాలుగు కోట్ల ప్రైజ్ మనీ గెలుపొందింది. పట్టణాభివృద్ధిలో భాగంగా నేడు 150 వార్డుల్లో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నది.
(వ్యాసకర్త: అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ,పట్టణాభివృద్ధి పరిశోధకులు, ఓయూ)
-డాక్టర్ ఎన్.యాదగిరిరావు
97044 05335