తెలంగాణ ఆడపడుచు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యావత్ మహిళ లోకం గురించి పోరాటం చేశారు. ఈ తెలంగాణ బతుకమ్మ దేశంలోని అన్ని పార్టీలను మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఆలోచింపజేశారు. ఆకాశంలో సగం, భూమిలో సగం, అధికారంలో సగం కావాలని దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. తన మాటలతో మహిళా లోకాన్ని మేల్కొల్పారు. స్త్రీ శక్తిని ఏకం చేసి చివరకు తన లక్ష్యాన్ని ముద్దాడారు.
పార్లమెంటులో మా అక్క చెల్లెళ్లకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడితే.. నేడు బతుకమ్మ పేర్చినంత సంబురంగా ఉంది. బతుకమ్మ పేర్చాలంటే మన ఆడబిడ్డలు ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి మన కవితక్క ఎంతో కష్టపడాల్సి వచ్చింది. పార్లమెంటులో ప్రశ్నించడం, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం, రౌండ్ టేబుల్ సమావేశం, అన్ని పార్టీల అధ్యక్షులకు లేఖ రాయడం, కేంద్రాన్ని నిలదీయడం వీటన్నింటిని దాటాకే నేడు పార్లమెంట్ ముందుకు మహిళా బిల్లు వచ్చింది. నేడు కవితక్కతో పాటు దేశంలోని ఆడపడుచుల కండ్లల్లో ఆనందం చూస్తే సద్దుల బతుకమ్మ నెల రోజుల ముందే వచ్చిందా అనిపిస్తుంది.
మహిళా బిల్లు ఇష్టంలేని కేంద్ర సర్కార్ తనపై తప్పుడు కేసులు పెట్టినా సరే కవిత ధైర్యంగా ఎదుర్కొన్నారు. యావత్ మహిళా లోకంలో స్ఫూర్తి నింపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై తన గళమెత్తారు. తాను పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నప్పటి నుంచి మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, పాలనలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని ఎంతో కృషి చేశారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఈ ఏడాది మార్చి నెలలో మహిళా రిజర్వేషన్ల బిల్లు గురించి అన్ని రాష్ర్టాల నుంచి మహిళా ప్రతినిధులను పిలిచి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కవిత ధర్నా చేశారు. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం, ఇటీవల 47 రాజకీయ పార్టీలకు లేఖలు రాయడం వంటి వాటి వల్ల ఇప్పటికే అనేక ముఖ్యమైన రాజకీయ పార్టీల మద్దతును కవిత కూడగట్టారు. ఆమె ఒత్తిడితో తాజాగా కాంగ్రెస్ పార్టీలో కదలిక వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తారని తెలిసి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి తెలిపిన తర్వాతే హైదరాబాద్ రావాలని కవిత డిమాండ్ చేశారు. ఇక తప్పని పరిస్థితుల్లో ఎక్కడ దేశ మహిళా లోకం ఎదురు తిరుగుతారోనని భయపడ్డ హస్తం పార్టీ నేతలు హైదరాబాద్‌లో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో మహిళా బిల్లును పార్లమెంట్ ఆమోదించాలని తీర్మానం చేసింది.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి తొమ్మిది అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోనియాగాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని ప్రస్తావించకపోవడాన్ని కవిత తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ఒత్తిడితోనే మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడానికి దోహద పడిందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఏనాడు మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడని కాంగ్రెస్ పార్టీ.. వర్కింగ్ కమిటీలో తీర్మానం చేయడం కవిత కృషేనని చెప్తున్నారు. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మొదటి నుంచి కవిత తన బాధ్యతను గుర్తు చేస్తూనే ఉన్నారు. యూపీఏ హయాంలో 2010లో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత నాలుగేండ్ల పాటు అధికారంలో ఉన్న యూపీఏ సర్కారు లోక్‌సభలో మాత్రం ఈ బిల్లుకు ఆమోదం తీసుకురాలేకపోయింది.
2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలేదు. ఈ విషయాలను పదేపదే ఎమ్మెల్సీ కవిత ఎండగట్టడంతో కాంగ్రెస్‌లో చలనం మొదలైంది. మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపచేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కవిత ఇచ్చిన పిలుపునకు అనేక రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాయి. ప్రభుత్వం బిల్లును పవేశపెడితే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం, శివసేన తదితర ముఖ్యమైన పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ చేరింది. మహిళా సాధికారతకు కవిత ఎనలేని కృషి చేస్తున్నారని పలు మహిళా సంఘాలు, జాతీయ మీడియా ప్రశంసిస్తున్నది. కవిత పార్లమెంటు సభ్యురాలిగా 2014 నుంచి 2019 వరకు లోక్‌సభలో అనేక సందర్భాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు మహిళా సాధికారతపై మాట్లాడారు.
దేశంలోని అన్ని పార్టీలకు లేఖలు రాసి మహిళా బిల్లుపై ఆలోచింపజేశారు. చివరకు మహిళా రిజర్వేషన్ల బిల్లును తాజా పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టక తప్పని పరిస్థితిని బీజేపీకి కల్పించారు. దీంతో అత్యవసరంగా కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించి సోమవారం మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపింది. మంగళవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది. మొత్తానికి తెలంగాణ గుండె ధైర్యం ఎన్నో అటుపోట్లను అధిగమించి… కేంద్రం కుట్రలను చేధించి.. మహిళామణులకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా తమ దృఢ సంకల్పాన్ని చాటుకున్నారు. (వ్యాసకర్త: చైర్మన్, తెలంగాణ ఫుడ్స్)
-మేడె రాజీవ్‌సాగర్