‘అనుభూత్యనుభవాలు అక్షర పుష్పాలైతే ఆ పుష్పాలను ఒక సమీకరణ సూత్రంలో గుచ్చి, కూర్చి ముచ్చటగా పుస్తక రూపంలో ఉన్న సరస్వతీ దేవికి అలంకరించిన పచ్చల పతకమే గ్రంథాలయం’ స్వాతంత్రోద్యమానికి మూలం ఏదని ఆలోచిస్తే చరిత్రలో దొరికే సాక్ష్యం గ్రంథాలయాలే.
నిజాం వ్యతిరేక ఉద్యమంలో ముందున్నది గ్రంథాలయాలే. ప్రజల ఆశలకు, ఆశయాలకు, ఉద్యమాలకు, ఉత్తేజానికి ఊపిరిపోశాయి. అలాంటి గ్రంథాలయాలు వలస పాలనలో శిథిలావస్థకు చేరాయి. పాత భవనాల్లో తడిసిన పుస్తకాలు, విరిగిన కుర్చీలు, బల్లలతో నిస్తారంగా మారాయి. నేడు స్వరాష్ట్రంలో గ్రంథాలయాలు ఆధునికతను సంతరించుకుంటు న్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పౌర గ్రంథాలయాలు విద్యార్థులకు విజ్ఞానదాయక తాజా సమాచారం అందిస్తున్నాయి. భవిష్యత్తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన విధానాలతో అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి.
పౌర గ్రంథాలయ చట్టం కోసం ఎందరో గ్రంథాలయోద్యమ నేతలు ఉద్యమించారు. వారి కృషి ఫలితంగా 1960 ఏప్రిల్ 1న గ్రంథాలయ చట్టం అమల్లోకి వచ్చింది. ఆ చట్టం ప్రకారం ప్రతి జిల్లాకో గ్రంథాలయ సంస్థ, జిల్లా కేంద్ర గ్రంథాలయం ఏర్పాటుచేయాలి. అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం 1960 పౌర గ్రంథాలయ చట్టాన్ని దత్తత తీసుకొని 2015 డిసెంబర్ 21న కొత్త పౌర గ్రంథాలయ చట్టాన్ని అమల్లోకి తీసుకుచ్చింది. తద్వారా రాష్ట్ర ప్రజలకు సమగ్రమైన పౌర గ్రం థాలయ సేవలందించటానికి ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలకు మౌలిక సదుపాయాలు, సొంత భవనాలు, పుస్తకాలు, పత్రికల సరఫరాను మెరుగు పరిచింది. అధునాతన హంగులను సమకూర్చింది. దీంతో గ్రంథాలయాలు పూర్తిస్థాయిలో పాఠకులకు సేవలందిస్తూ, పుస్తక ప్రియులను ఆకర్షిస్తూ నిత్య కల్యాణం, పచ్చ తోరణంగా వెలుగొందుతున్నాయి.
గత వలస పాలనలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు ప్రభుత్వ
చట్టాలను అనుసరించి ప్రజల నుంచి గ్రంథాలయ పన్ను వసూలు చేసేవి. అలా వసూలు చేసిన
మొత్తాలను తమ అవసరాలకు వాడుకొని తిరిగి గ్రంథాలయ అవసరాలకు ఇచ్చేవారు కాదు.
కానీ ఇవాళ మన ప్రభుత్వం వసూలు చేసిన సొమ్మును గ్రంథాలయ సంస్థకు జమ చేస్తున్నది.
పోటీ పరీక్షలకు గ్రంథాలయాలు వారధిగా పనిచేస్తున్నాయి. నేడు స్టేట్, సెంట్రల్ లైబ్రరీ మొదలుకొని సిటీ, జిల్లా, మండల, గ్రామస్థాయి గ్రంథాలయాలు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. గ్రంథాలయాలకు వచ్చే పాఠకుల అవసరాలకు అనుగుణంగా, వారు కోరిన పుస్తకాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నాయి.
అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల మౌలిక వసతులను ఏర్పా టుచేసింది. పాఠకులు తమ సొంత పుస్తకాలను కూడా తెచ్చుకొని గ్రంథాలయాల్లో చదువుకోవడానికి వీలుగా ఎలాంటి ఆంక్షల్లేకుండా ప్రత్యేకంగా రీడింగ్ హాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నెట్ సేవలూ అందుబాటులోకి వచ్చాయి. రోజు వందలాది మంది విద్యార్థులతో గ్రంథాలయాలు సందడిగా కనిపిస్తున్నాయి. సెలవు దినాల్లో కూడా గ్రంథాలయాలు తెరిచే పరిస్థితి వచ్చి నాటి గ్రంథాలయోద్యమాన్ని తలపిస్తున్నది. హైదరాబాద్ వంటి నగరాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకొనే వారికోసం జీహెచ్ఎంసీ, కొంతమంది దాతలు, సామాజికసంస్థలు రూ.5 భోజనం, కొన్నిచోట్ల ఉచిత భోజ నం ఏర్పాటు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించి చిన్న జిల్లాలు ఏర్పడిన తర్వాత పౌర గ్రంథాలయాలు నూతన భవనాలతో అలరారుతున్నాయి. ఆధునిక సౌకర్యాలతో మాడల్ గ్రంథాలయాలు చూడముచ్చటగా ఉండి నిత్యం పాఠకులతో కళకళలాడుతున్నాయి.
పౌర గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తూ బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్నది. అన్ని సౌకర్యాలున్న సుందరమైన గ్రంథాలయాలు తెలంగాణలో ఉండటం మనకు గర్వకారణం. గ్రంథాలయాలను పవిత్ర యజ్ఞశాలలుగా అంకితభావంతో నిర్వహించాలి. ఇదే కనుక జరిగితే గ్రంథాలయ ఉద్యమానికి తమ జీవితాలను అంకితం చేసిన సురవరం, వట్టికోట, దాశరథి, కాళోజీ, కోదాటి, ఎస్ఆర్ రంగనాథన్ల కృషికి మనం నిజమై న నివాళులు అర్పించినవారమవుతాం.
(వ్యాసకర్త : డాక్టర్ ఎస్ఆర్రంగనాథన్ గ్రంథాలయ వ్యవస్థాపక సభ్యులు, మహబూబాబాద్)
రుద్రారపు వీరేందర్, 98486 61374