ఎస్సీల సంక్షేమ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు ఏడాదిన్నర పాలనా కాలంలో ఎస్సీల సంక్షోభ రాష్ట్రంగా మార్చింది. తరతరాలుగా వెంటాడుతున్న వివక్ష, అణచివేత, అసమానత, అందుబాటులో లేని విద్య వెరసి సామాజిక, రాజకీయ, ఆర్థికరంగాల్లో ఎస్సీలు వెనుకబాటుతనానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి, సంక్షేమం కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలుగా పోరాటాలు సాగాయి.
ఉమ్మడి ఏపీలో ఎస్సీ సబ్‌ప్లాన్ అడుగు ముందుకు పడని దుస్థితి. పేరుకే బడ్జెట్లో కొండంత నిధుల కేటాయింపులున్నా, ఆచరణలో అవి రవ్వంతైనా ఖర్చుకాకపోయేటివి. పైగా ఆ నిధులను పక్కదారి పట్టించేవాళ్లు. ఖర్చంతా కేవలం కాగితాలపైనే. దళితులపై ప్రేమంతా మాటల్లోనే. ఇదీ… ఎస్సీలను నాటి పాలకులు వంచిస్తూ వచ్చిన తీరు! అదే ఆనవాయితీని ఇప్పుడున్న రేవంత్ సర్కార్ కొనసాగిస్తున్నది! 2023 నవంబర్‌లో ఎస్సీల గురించి చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్సీల అభివృద్ధికి చేపట్టబోయే కార్యక్రమాలపై హామీ ఇచ్చారు. పాలనలోకి వచ్చి సుమారు ఏడాదిన్నర పూర్తవుతున్నా నేటికీ ఎస్సీ అభివృద్ధి శాఖకు కనీసం మంత్రిని కూడా నియమించని దుస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధుల చట్టం 2017 పూర్తిగా విస్మరించిన ముఖ్యమంత్రి ఆ శాఖలను తన దగ్గరే పెట్టుకొని ఈ ఏడాది కాలంలో ఏ ఒక్కరోజు కూడా సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించలేదు. ఎస్సీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌కు ఉన్న ప్రేమను తెలియజేస్తున్నది.
ఇది ప్రజా ప్రభుత్వమని గొప్పలకు పోతున్న ముఖ్యమంత్రి అటు అధికారులతో, ఇటు ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలతో సమీక్షించడం పూర్తిగా మర్చిపోయి సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చివేసిండు. 2024-25 బడ్జెట్లో ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కాంగ్రెస్ ప్రభుత్వం రూ.33,127 కోట్లు కేటాయించింది.
డిసెంబర్ నెలాఖరు నాటికి రూ.9,824 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇంకా రూ.23,303 కోట్లు మిగిలిపోయాయి. ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌కు రూ.17,056 కోట్లు కేటాయించగా, డిసెంబర్ నెలాఖరు నాటికి రూ.6,766 కోట్లు ఖర్చుచేసింది. రూ.10,299 కోట్లు మిగిలిపోయాయి. ఆ మిగిలిన నిధుల సంగతిని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో వెల్లడించలేదు. ఖర్చు చేయంగా మిగిలిన నిధుల సంగతేమిటని ఎస్సీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
2025-26 బడ్జెట్లో రూ.40,232 కోట్లు కేటాయించినట్టు గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ అసలు కేటాయించిన నిధులు రూ.26,615 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులపై నిజాలు దాచి దళితులను మోసం చేసింది. 2024-25 బడ్జెట్లో దళిత బంధు పథకానికి కేవలం 2 కోట్లు కేటాయించి, దళిత డిక్లరేషన్‌లో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అభయ హస్తం’ ద్వారా ప్రతి దళిత కుటుంబానికి ఇస్తామన్న రూ.12 లక్షలు ఏ విధంగా ఇస్తారో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పాలి. 2025-26 బడ్జెట్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అభయహస్తం ఊసే లేదు! 15 నెలల నుంచి కార్పొరేషన్లో ఎలాంటి నిధులు లేవు. రాష్ట్రంలో అన్ని విభాగాల నుంచి ఎన్ని నిధులు ఖర్చయ్యాయి. మరి ఎందుకు ఎస్సీల నిధులు మిగతా శాఖల నిధుల కంటే ఎందుకు తక్కువనో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల పథకం ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదో తెలుస్తుంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 15 నెలల నుంచి పాలనలో మా ఎస్సీ వర్గాల ప్రజలు గుర్తుకురాలేదా?
తెలంగాణ ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉద్దేశించిన నిధులు ఇతర పథకాలకు మళ్లించకుండా రక్షణ కల్పించారు. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఆ నిధులు పూర్తిగా ఖర్చుగాని పక్షంలో ఈ చట్టం ప్రకారం వాటిని తర్వాతి సంవత్సరానికి కచ్చితంగా బదలాయింపు చేసేలా నిబంధనలు తీసుకువచ్చారు. ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా సత్వర అభివృద్ధిని సాధించేందుకు తనదైనరీతిలో పాలన కొనసాగించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు భద్రత పొందడమే లక్ష్యంగా, గత చట్టానికి భిన్నంగా తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక అభివృద్ధి (ప్రణాళిక, కేటాయింపు, ఆర్థిక వనరుల వినియోగం) చట్టం 2017ను పకడ్బందీగా రూపకల్పన చేశారు. ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరం రాష్ట్రం మొత్తం ప్రగతి పద్దు వ్యయంలో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు నిధులను కేటాయిస్తున్నది. నిధుల ఖర్చుకు గత చట్టంలో 10 ఏండ్ల కాల పరిమితి ఉండగా, తెలంగాణ చట్టంలో దానిని తొలగించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.1,08,754.54 కోట్లను ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కేటాయించడం మరో విశేషం. అక్షరాలా లక్ష కోట్లు.. ఎస్సీల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసింది!
చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని దళిత కుటుంబానికి రూ.10 లక్షల సహాయం నూరు శాతం గ్రాంట్‌గా అందించింది. దీనిని లబ్ధిదారులు తిరిగి చెల్లించనవసరం లేదు. ఈ గ్రాంట్ దళితులు తమకు నచ్చిన, ఇష్టం వచ్చిన ఉపాధిని ఎంచుకొని, ఆత్మగౌరవంతో జీవించడానికి ప్రభుత్వం అండదండగా నిలిచింది. ఈ క్రమంలో వేలాది కుటుంబాలకు దళితబంధును మంజూరు చేసింది. మరో 1.30 లక్షల మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల హామీల్లో భాగంగా దళితబంధును రూ.12 లక్షలకు పెంచి అమలు చేస్తామని ప్రకటించింది. కానీ, గత బడ్జెట్లో కాని, ఈ బడ్జెట్లో కాని దళిత బంధుకు నిధులు కేటాయించకపోవటంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దళిత బంధు పథకం కింద కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకూ 50 వేల మంది లబ్దిదారులకు 5 వేల కోట్ల రూపాయలను అందించింది. బడ్జెట్లో ఈ పథకానికి 17,700 కోట్లు కేటాయించింది. రెండవ విడత లక్షా 30 వేల మందికి దళిత బంధు పథకం అందించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం దళితబంధు పథకాన్ని అమలుచేసింది. ప్రభుత్వం ఇచ్చే లైసెన్స్‌లలో దళితులకు 15 శాతం రిజర్వేషన్లు కూడా అమలుచేసింది. ఫర్టిలైజర్ షాపుల కేటాయింపులో, హాస్పిటల్ హాస్టల్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో, మెడికల్ షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్ అమలుచేసింది. రాష్ట్రంలో కేటాయించిన 2,616 వైన్ షాపుల్లో 261 షాపులు దళితులకు కేటాయించింది.
కేసీఆర్ ప్రభుత్వం రూ. 147 కోట్లు ఖర్చు చేసి ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని’ నెలకొల్పింది. దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ కింద రూ.20 లక్షల ఆర్థికసాయం అందించింది. దళితుల గృహావసరాల కోసం 101 యూనిట్ల వరకూ విద్యుత్తును ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసింది. షెడూల్డ్ కులాలు, తెగల అభివృద్ధికి ప్రత్యేక ప్రగతినిధి చట్టాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమలుపరిచింది. కేసీఆర్ పదేండ్ల పాలనలో అన్ని వర్గాలు సుభిక్షంగా వర్ధిల్లాయి. కానీ, నేడు ఆ పరిస్థితి కనుమరుగైంది.